నాపై దుష్ర్పచారం చేస్తున్న దుండగులను వదలొద్దు | ysr-congress-party-leaders-complaint-over-mispropaganda-on-ys-sharmila | Sakshi
Sakshi News home page

నాపై దుష్ర్పచారం చేస్తున్న దుండగులను వదలొద్దు

Published Sun, Jun 15 2014 12:34 AM | Last Updated on Mon, Oct 22 2018 6:35 PM

నాపై దుష్ర్పచారం చేస్తున్న  దుండగులను వదలొద్దు - Sakshi

నాపై దుష్ర్పచారం చేస్తున్న దుండగులను వదలొద్దు

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌కు షర్మిల ఫిర్యాదు
 
వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ర్పచారం నన్ను గాయపర్చింది
నేనెప్పుడూ కలవని, మాట్లాడని, కనీసం చూడని వ్యక్తితో ముడిపెడితూ వదంతులు సృష్టిస్తున్నారు
ఒక్క ఆధారం కూడా లేకుండా పిరికిపందలు నాపై రాతలు రాస్తున్నారు
నా సచ్ఛీలతకు భగవంతుడే సాక్షి గుండె లోతుల్లో గూడు కట్టుకున్న అంతులేని క్షోభతో, బాధాతప్తమైన హృదయంతో ఈ ఫిర్యాదు చేస్తున్నాను

 
హైదరాబాద్: సోషల్ నెట్‌వర్క్ సైట్లలో, పలు వెబ్‌సైట్లలో తనపై హీనాతిహీనమైన రీతిలో సాగుతున్న దుష్ర్పచారాన్ని తక్షణం అరికట్టాలని, అలా చేస్తున్న పిరికిపందలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిలా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పీఏసీ సభ్యుడు డీఏ సోమయాజులు శనివారం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలసి అందజేశారు. తాను చేస్తున్న ఈ ఫిర్యాదు కేవలం తన గౌరవ మర్యాదలు కాపాడుకోవడం కోసమే కాదని, తాను రాస్తున్నది.. సమాజంలోని ప్రతి తల్లి, ప్రతి భార్య, ప్రతి బిడ్డ గౌరవానికి సంబంధించిందని ఫిర్యాదులో షర్మిల పేర్కొన్నారు. ఎవరో అకారణంగా మోపుతున్న అభాండాలకు వివరణ ఇచ్చుకోవాల్సి రావడం అనేది ఏ మహిళకైనా దుర్భరమైన విషయమని, చాలా మందిలాగే తనను కూడా కొందరు లక్ష్యంగా(టార్గెట్) చేసుకుని దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళల విషయంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే స్థాయికి నేటి రాజకీయాలు పడిపోయాయన్నారు. ‘సినీ నటుడు ప్రభాస్‌కు ముడిపెడుతూ ఇంటర్నెట్‌లో వదంతులు ప్రచారం అవుతున్నాయి. నేనింత వరకూ ప్రభాస్‌ను కలవలేదు, మాట్లాడలేదు, కనీసం చూడనైనా లేదు... నా గౌరవ మర్యాదలు దెబ్బతీసే దుర్మార్గమైన లక్ష్యంతో అత్యంత క్రూరమైన రీతిలో ఈ దుష్ర్పచారం చేస్తున్నారు. ఇక్కడ నేనొక వాస్తవాన్ని స్పష్టం చేయదల్చుకున్నాను. వందలాది వెబ్‌సైట్లలో కొనసాగుతున్న ఈ ప్రచారానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారంటే ఈ వదంతులు నిరాధారమైనవని వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు’ అని షర్మిల పేర్కొన్నారు. షర్మిల చేసిన ఫిర్యాదులో ముఖ్యాంశాలివీ..

ఈ ఫిర్యాదుతో మరింత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారని తెలుసు..
న్యాయం కోసం తానిపుడు చేసే పోరాటం ఒక పెద్ద అంశంగా మారుతుందని తెలుసుననీ, తనకు సరైన న్యాయం జరుగుతుందన్న నమ్మకం కూడా లేదని షర్మిల పేర్కొన్నారు. కుసంస్కారులు, నేలబారు వ్యక్తుల అనైతిక కుట్రకు తాను అనవసర ప్రాధాన్యతనిస్తున్నాననే విషయం కూడా తనకు తెలుసుననీ, ఈ విషయంలో తాను పోరాటానికి దిగిన వెంటనే దీని నుంచి కూడా వినోదం పొందాలనుకునే వారు తమపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారని కూడా తెలుసునని ఆమె అన్నారు. ‘అయినప్పటికీ ఇలాంటి అవరోధాలకు ఎదురొడ్డి నిలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీన్ని వైరల్ గ్రోత్‌తో మరింతగా వ్యాప్తి చేస్తారన్న భయంతో ఇలాంటి పిరికిపందలను వదిలేసి తలదించుకుని మౌనంగా ఉండిపోవడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఈ విష ప్రచారాన్ని ఖండించకుండా ఉంటే ఈ వదంతులే నిజమనుకునే ప్రమాదం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ లక్ష్యాలు నెరవేరాలని నేను నిజాయితీగా మనస్ఫూర్తిగా కోరుకున్నా...అందుకే మా అన్న తరఫున పోరాడా. ఈ విషయంలో ఎవరైనా నాతో విభేదించాలనుకుంటే నా కళ్లలోకి చూస్తూ నా నమ్మకాలను సవాలు చేసి ఉంటే వారి ప్రయత్నాన్ని నేను గౌరవించే దాన్ని, కానీ ఇలా దొంగదెబ్బ తీసేందుకు చేసే కుట్రలను మాత్రం నేను క్షమించలేను’ అని షర్మిల ఘాటుగా స్పందించారు.

నేను తప్పుచేయకపోయినా..

 ‘‘ఒక భారతీయ మహిళగా నేను విలువలు కలిగిన భార్యను, గౌరవ మర్యాదలు కలిగిన తల్లిని, సంస్కారం నిండిన చెల్లిని, బిడ్డని, నా సచ్ఛీలతకు ఆ భగవంతుడే సాక్షి. నా గౌరవమర్యాదలను దెబ్బ తీసే ప్రయత్నాలను చూసి నేను బాగా క్షోభ చెందాను. నేనే తప్పు చేయకపోయినా నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు బోనెక్కాల్సి రావడం బాధిస్తోంది. మర్యాదగల ఇతర మహిళల మాదిరిగానే నేను గుండె లోతుల్లోంచి బాధతో కుమిలిపోతున్నాను. ఇది కేవలం నా ఒక్కదాని సమస్యే కాదు, ప్రతి మహిళ ప్రతిష్టకూ సంబంధించింది. అందుకే మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోవద్దు’’ అని పోలీసులకు షర్మిల విజ్ఞప్తి చేశారు.

నిజమా కాదా అని కనీసం ఆలోచించలేదు..

 ఈ రోజు వరకూ నిరాధారమైన తప్పుడు కూతలను వివిధ పోర్టల్స్, వెబ్‌సైట్లు, డొమైన్లలో బాధ్యతా రాహిత్యంగా ప్రదర్శనకు పెట్టిన వారు, అసలు వీటిలో నిజం ఉందా అని ఆలోచించనే లేదని షర్మిల పేర్కొన్నారు. ఈ దుష్ర్పచారాన్ని వ్యాప్తి చేసిన దుర్మార్గులు వేర్వేరు పోర్టళ్లు, వెబ్‌సైట్లు, సోషన్ నెట్‌వర్కింగ్ మీడియాను ఈ తప్పుడు ఆరోపణల వ్యాప్తికి వినియోగిస్తున్నారన్నారు. ఈ విషప్రచారానికి సంబంధించి కొన్ని సైట్లు, లింకులపై వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున మే 1వ తేదీన పార్టీ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదును సమర్పిస్తే కేసు దర్యాప్తును ప్రారంభించారని, ఓ పక్క దర్యాప్తు జరుగుతూ ఉండగానే తాజాగా మరికొందరు వ్యక్తులు నీతిబాహ్యమైన ఆరోపణలతో సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తూనే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఆయా వెబ్‌సైట్లు, డొమైన్ల ఇన్‌చార్జీలతో ఈ వ్యక్తులు కుమ్మక్కు కావడంతోనే ఆగుకుండా ఈ ప్రచారం సాగుతోందన్నారు.

కఠినంగా శిక్షించండి..: ఈ నీతిబాహ్యమైన వ్యవహారం తనను తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేసిందని, ఇలాంటి దుష్ర్పచారంలో సూత్రధారులు, పాత్రధారులు అయిన ప్రతి ఒక్కరిపైనా ఐపీసీలోని 509, 499, 500, 501 సెక్షన్లతోపాటు ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని షర్మిల పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ దుష్ర్పచారాన్ని వ్యాప్తి చేస్తున్న సంస్థలను ప్రోత్సహిస్తూ వారికి వేదికగా నిలుస్తున్న సఫారీ, గూగుల్ సెర్చ్ ఇంజిన్లపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని, తనపేరు టైప్ చేయగానే ఈ ఇంజిన్లు ఈ విషప్రచారాన్ని ప్రముఖంగా ప్రదర్శిస్తున్నాయన్నారు. తనపై నీతిబాహ్యమైన ప్రచారాన్ని ఆపాల్సిందిగా వివిధ సెర్చ్ ఇంజిన్లు, సోషల్ మీడియా పోర్టల్స్‌కు ఆదేశాలు జారీ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement