Reported to the police
-
బియ్యం అక్రమార్కులపై.. ఎట్టకేలకు చర్యలు
ఇనగంటి గాంధీ రూ.3.69 కోట్లు చెల్లించాలంటూ పోలీసులకు ఫిర్యాదు ఐపీసీ 420 కింద కేసు నమోదు చేసిన పోలీసులు సీఎంఆర్ విధానంలో అక్రమాలకు పాల్పడిన ఫలితం అవినీతి అధికారులపై చర్యలేవి? బాపట్ల టౌన్ : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) విధానం అమలులో అక్రమాలకు పాల్పడిన రైస్మిల్లరుపై జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు చర్యలు తీసుకుంది. ధాన్యం తీసుకున్న మిల్లర్లు మర ఆడించి 15 రోజుల్లో పౌరసరఫరాల సంస్థకు బియ్యం ఇవ్వాల్సి ఉంటే, ఆడించిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించి ప్రభుత్వ ధనాన్ని సొంత వ్యాపారానికి వాడుకున్నారు. నెలల తరబడి ఇలా కొందరు మిల్లర్లు అధికార యంత్రాంగానికి బియ్యం సరఫరా చేయలేదు. అనేక మంది మిల్లర్లకు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతుగా నిలబడటంతో అధికారులు కూడా వారిపై చర్యలు తీసుకోలేకపోయారు. ఈ అక్రమాలపై గత జూలై నెలలో ‘సాక్షి’ ప్రత్యేక కథనాలను ప్రచురించింది. అప్పటి నుంచి మిల్లర్లపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన అధికారులు ఎట్టకేలకు సోమవారం చర్యలకు ఉపక్రమించారు. బాపట్ల మండలం అప్పికట్లకు చెందిన అనూరాధ రైస్ ట్రేడర్స్ యజమాని ఇనగంటిగాంధీ మర ఆడించడానికి ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా ఆడించి, బహిరంగ మార్కెట్లో విక్రయించగా వచ్చిన సొమ్ముతో వ్యాపారం చేసుకున్నారు. ప్రభుత్వానికి రూ. 2.46 కోట్లు చెల్లించలేదు. ఏడెనిమిది నెలలుగా ఆ మిల్లరుతో అధికారులు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. చివరకు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కె.రంగాకుమారి సోమవారం సాయంత్రం బాపట్ల తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ బియ్యం విషయంలో జరిగిన తంతును వివరించి, కేసు నమోదు చేయాలని పోలీస్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వానికి 1178 మెట్రిక్‌టన్నుల బియ్యాన్ని అందజేయాల్సి ఉందని, దానికి గానూ రూ. 2,46,18,206 చెల్లించాలన్నారు. నిర్ణీత సమయంలోగా బియ్యాన్ని అందించలేని పక్షంలో 50 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని గతంలోనే అగ్రిమెంట్ రాసుకోవడం జరిగిందని, దాని ప్రకారం రూ. 1,23,09,103 చొప్పున మొత్తం రూ. 3,69,27,309 చెల్లించాలంటూ తాలుకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఫిర్యాదు మేరకు తాలుకా ఎస్ఐ చెన్నకేశవులు ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సహకరించిన వారిపై చర్యలేవి..? ఈ అక్రమ వ్యవహారంలో మిల్లరుకు పౌరసరఫరాలశాఖలో కొందరు అధికారులు సహకరించారనే ఆరోపణలు లేకపోలేదు. ఇనగంటి గాంధీ గతంలో కూడా ఇదే విధంగా మర ఆడించిన ధాన్యాన్ని జిల్లా యంత్రాంగానికి సకాలంలో ఇవ్వలేదు. అతని గురించి పూర్తి వివరాలు తెలిసినప్పటికీ, అధికారులు బియ్యం ఆడించి ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. ఈ అనుమతికి అధికారులు అవినీతికి పాల్పడ్డారని, ట్రాక్ రికార్డు సక్రమంగా లేని మిల్లరును ఎంపిక చేయడం వలన ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగిందని, ఇందులో అధికారుల పాపం కూడా లేకపోలేదని జిల్లా యంత్రాంగానికి కూడా తెలుసు. అప్పట్లో జిల్లా జాయింట్ కలెక్ట్ శ్రీధర్ ఈ మిల్లరుతో అనేకసార్లు సంప్రదింపులు జరిపారు. వెంటనే బియ్యం ఆడించి ఇవ్వాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. టీడీపీ పాలకులు అధికార యంత్రాంగంపై వత్తిడి తీసుకువచ్చారు. మన వాడే ఇబ్బందుల్లో ఉన్నాడు. రెండు మూడు నెలల్లో ధాన్యం ఆడించి బియ్యం ఇస్తాడు. అప్పటి వరకు సహకరించండని అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఇంతకాలం ఈ వ్యవహారం కొనసాగింది. దీనికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటే ఇటువంటి అక్రమాలు కొంత వరకు ఆగుతాయనే అభిప్రాయం వినపడుతోంది. -
అసభ్య ప్రవర్తనపై ఫిర్యాదు
సత్యనారాయణపురం : ఓ లాయర్ అసభ్యంగా ప్రవ ర్తించాడని ఒక యువతి సత్యనారాణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథ నం మేరకు.. రెడ్డి నాగలక్ష్మి స్థానిక నాగేశ్వరరావు పంతులు రోడ్డులోని దుర్గా ఆయిల్ మిల్ పైన నివసిస్తోంది. డీలర్ అయిన తల్లి మృతి చెందడంతో నాగలక్ష్మి రేషన్‌డిపో నడుపుతోంది. ఆమె డబ్బు అవసరమై ఇద్దరి వద్ద రూ.3.80లక్షలు అప్పుగా తీసుకుంది. బాకీ తీర్చేందుకు లాయర్ తాతారావు వద్ద రూ.4 లక్షలు తీసుకుంది. అందుకు తన పేరుతో ఉన్న రేకులషెడ్డును అతని పేర జీపీ చేయించింది. ఇంకా బాకీ ఉండడంతో రేకుల షెడ్డును విక్రయించి బాకీలు తీర్చాలని నాగలక్ష్మి భావించి లాయర్‌ను సంప్రదించింది. అయితే తాను ఫోన్లో మాట్లాడతానని చెప్పిన లాయర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. గత నెల 27వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో సత్యనారాయణపురంలోని ఆమె ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయంలో పెద్దమనుషుల వద్ద రాజీకి ప్రయత్నిం చినా ఫలితం లేకపోవడంతో యువతి సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తుచేపట్టారు. -
ఇంకా ఉన్నాయ్!
పనులు చేయకుండా బిల్లులు మాయం కేసు... తవ్వినకొద్దీ వెలుగు చూస్తున్న అక్రమాలు మరో ఇద్దరు కాంట్రాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు కుత్బుల్లాపూర్: పనులు చేయకుండానే బిల్లులు మింగిన బాగోతానికి సంబంధించి తవ్వినకొద్దీ అవినీతి కాంట్రాక్టర్ల జాబితా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా మరో ఇద్దరు ఈ జాబితాలో చేరారు. సికింద్రాబాద్ నార్త్ జోన్ కార్యాలయం వేదికగా రూ.46 లక్షల విలువైన 24 పనులు చేయకుండానే కాంట్రాక్టర్లు నిధులు మాయం చేసిన విషయమై జూలై 6న ‘సాక్షి’లో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన అధికారులు ఆరుగురు కాంట్రాక్టర్లు, సహాయ కాంట్రాక్టర్, ముగ్గురు ఔట్ సోర్సింగ్ సిబ్బంది, నార్త్‌జోన్ కార్యాలయంలో పనిచేసే ఆడిటర్లపై కేసులు నమోదు చేశారు. ముగ్గురు ఔట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు వర్క్ ఇన్స్పెక్టర్లు, ఆడిటర్లను జూలై17న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించి పోలీసులు అరెస్టు చేయకుండా స్టే తెచ్చుకున్నారు. తాజాగా శుక్రవారం అందరికీ బెయిల్ మంజూరైనట్టు తెలిసింది. తాము పనులు చేయకుండా కాజేసిన నిధులను జూలై 31లోగా వెనక్కి ఇస్తామని కోర్టుకు చెప్పిన కాంట్రాక్టర్లలో ఐదుగురు సంబంధిత మొత్తాన్ని వెనక్కి ఇచ్చారు. మరో ఇద్దరు సగం చెల్లించి.. మిగతా మొత్తానికి 15 రోజుల గడువు కావాలని కోర్టును అభ్యర్ధించారు. వెలుగు చూస్తున్న అక్రమాలు పనులు చేయకుండానే బిల్లులు కాజేసిన సంఘటనలో మరో ఇద్దరు పాత్రధారులుగా తేలారు. ఈమేరకు సంబంధిత అధికారులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్వాల్‌కు చెందిన బి.లక్ష్మణ్ జగద్గిరిగుట్ట డివిజన్లో రూ. 2.30 లక్షలు విలువ చేసే పనులను చేయకుండానే బిల్లులు తీసుకున్నట్లు గుర్తించారు. మరో కాంట్రాక్టర్ రూ.62 వేలు తీసుకున్నట్లు జీడిమెట్ల పోలీసులకు తాజాగా ఇంజినీరింగ్ అధికారులు ఫిర్యాదు చే శారు. -
నాపై దుష్ర్పచారం చేస్తున్న దుండగులను వదలొద్దు
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌కు షర్మిల ఫిర్యాదు వెబ్సైట్లు, సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ర్పచారం నన్ను గాయపర్చింది నేనెప్పుడూ కలవని, మాట్లాడని, కనీసం చూడని వ్యక్తితో ముడిపెడితూ వదంతులు సృష్టిస్తున్నారు ఒక్క ఆధారం కూడా లేకుండా పిరికిపందలు నాపై రాతలు రాస్తున్నారు నా సచ్ఛీలతకు భగవంతుడే సాక్షి గుండె లోతుల్లో గూడు కట్టుకున్న అంతులేని క్షోభతో, బాధాతప్తమైన హృదయంతో ఈ ఫిర్యాదు చేస్తున్నాను హైదరాబాద్: సోషల్ నెట్వర్క్ సైట్లలో, పలు వెబ్సైట్లలో తనపై హీనాతిహీనమైన రీతిలో సాగుతున్న దుష్ర్పచారాన్ని తక్షణం అరికట్టాలని, అలా చేస్తున్న పిరికిపందలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిలా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పీఏసీ సభ్యుడు డీఏ సోమయాజులు శనివారం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలసి అందజేశారు. తాను చేస్తున్న ఈ ఫిర్యాదు కేవలం తన గౌరవ మర్యాదలు కాపాడుకోవడం కోసమే కాదని, తాను రాస్తున్నది.. సమాజంలోని ప్రతి తల్లి, ప్రతి భార్య, ప్రతి బిడ్డ గౌరవానికి సంబంధించిందని ఫిర్యాదులో షర్మిల పేర్కొన్నారు. ఎవరో అకారణంగా మోపుతున్న అభాండాలకు వివరణ ఇచ్చుకోవాల్సి రావడం అనేది ఏ మహిళకైనా దుర్భరమైన విషయమని, చాలా మందిలాగే తనను కూడా కొందరు లక్ష్యంగా(టార్గెట్) చేసుకుని దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళల విషయంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే స్థాయికి నేటి రాజకీయాలు పడిపోయాయన్నారు. ‘సినీ నటుడు ప్రభాస్‌కు ముడిపెడుతూ ఇంటర్నెట్లో వదంతులు ప్రచారం అవుతున్నాయి. నేనింత వరకూ ప్రభాస్‌ను కలవలేదు, మాట్లాడలేదు, కనీసం చూడనైనా లేదు... నా గౌరవ మర్యాదలు దెబ్బతీసే దుర్మార్గమైన లక్ష్యంతో అత్యంత క్రూరమైన రీతిలో ఈ దుష్ర్పచారం చేస్తున్నారు. ఇక్కడ నేనొక వాస్తవాన్ని స్పష్టం చేయదల్చుకున్నాను. వందలాది వెబ్సైట్లలో కొనసాగుతున్న ఈ ప్రచారానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారంటే ఈ వదంతులు నిరాధారమైనవని వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు’ అని షర్మిల పేర్కొన్నారు. షర్మిల చేసిన ఫిర్యాదులో ముఖ్యాంశాలివీ.. ఈ ఫిర్యాదుతో మరింత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారని తెలుసు.. న్యాయం కోసం తానిపుడు చేసే పోరాటం ఒక పెద్ద అంశంగా మారుతుందని తెలుసుననీ, తనకు సరైన న్యాయం జరుగుతుందన్న నమ్మకం కూడా లేదని షర్మిల పేర్కొన్నారు. కుసంస్కారులు, నేలబారు వ్యక్తుల అనైతిక కుట్రకు తాను అనవసర ప్రాధాన్యతనిస్తున్నాననే విషయం కూడా తనకు తెలుసుననీ, ఈ విషయంలో తాను పోరాటానికి దిగిన వెంటనే దీని నుంచి కూడా వినోదం పొందాలనుకునే వారు తమపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారని కూడా తెలుసునని ఆమె అన్నారు. ‘అయినప్పటికీ ఇలాంటి అవరోధాలకు ఎదురొడ్డి నిలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీన్ని వైరల్ గ్రోత్తో మరింతగా వ్యాప్తి చేస్తారన్న భయంతో ఇలాంటి పిరికిపందలను వదిలేసి తలదించుకుని మౌనంగా ఉండిపోవడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఈ విష ప్రచారాన్ని ఖండించకుండా ఉంటే ఈ వదంతులే నిజమనుకునే ప్రమాదం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ లక్ష్యాలు నెరవేరాలని నేను నిజాయితీగా మనస్ఫూర్తిగా కోరుకున్నా...అందుకే మా అన్న తరఫున పోరాడా. ఈ విషయంలో ఎవరైనా నాతో విభేదించాలనుకుంటే నా కళ్లలోకి చూస్తూ నా నమ్మకాలను సవాలు చేసి ఉంటే వారి ప్రయత్నాన్ని నేను గౌరవించే దాన్ని, కానీ ఇలా దొంగదెబ్బ తీసేందుకు చేసే కుట్రలను మాత్రం నేను క్షమించలేను’ అని షర్మిల ఘాటుగా స్పందించారు. నేను తప్పుచేయకపోయినా.. ‘‘ఒక భారతీయ మహిళగా నేను విలువలు కలిగిన భార్యను, గౌరవ మర్యాదలు కలిగిన తల్లిని, సంస్కారం నిండిన చెల్లిని, బిడ్డని, నా సచ్ఛీలతకు ఆ భగవంతుడే సాక్షి. నా గౌరవమర్యాదలను దెబ్బ తీసే ప్రయత్నాలను చూసి నేను బాగా క్షోభ చెందాను. నేనే తప్పు చేయకపోయినా నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు బోనెక్కాల్సి రావడం బాధిస్తోంది. మర్యాదగల ఇతర మహిళల మాదిరిగానే నేను గుండె లోతుల్లోంచి బాధతో కుమిలిపోతున్నాను. ఇది కేవలం నా ఒక్కదాని సమస్యే కాదు, ప్రతి మహిళ ప్రతిష్టకూ సంబంధించింది. అందుకే మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోవద్దు’’ అని పోలీసులకు షర్మిల విజ్ఞప్తి చేశారు. నిజమా కాదా అని కనీసం ఆలోచించలేదు.. ఈ రోజు వరకూ నిరాధారమైన తప్పుడు కూతలను వివిధ పోర్టల్స్, వెబ్సైట్లు, డొమైన్లలో బాధ్యతా రాహిత్యంగా ప్రదర్శనకు పెట్టిన వారు, అసలు వీటిలో నిజం ఉందా అని ఆలోచించనే లేదని షర్మిల పేర్కొన్నారు. ఈ దుష్ర్పచారాన్ని వ్యాప్తి చేసిన దుర్మార్గులు వేర్వేరు పోర్టళ్లు, వెబ్సైట్లు, సోషన్ నెట్వర్కింగ్ మీడియాను ఈ తప్పుడు ఆరోపణల వ్యాప్తికి వినియోగిస్తున్నారన్నారు. ఈ విషప్రచారానికి సంబంధించి కొన్ని సైట్లు, లింకులపై వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున మే 1వ తేదీన పార్టీ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదును సమర్పిస్తే కేసు దర్యాప్తును ప్రారంభించారని, ఓ పక్క దర్యాప్తు జరుగుతూ ఉండగానే తాజాగా మరికొందరు వ్యక్తులు నీతిబాహ్యమైన ఆరోపణలతో సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తూనే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఆయా వెబ్సైట్లు, డొమైన్ల ఇన్‌చార్జీలతో ఈ వ్యక్తులు కుమ్మక్కు కావడంతోనే ఆగుకుండా ఈ ప్రచారం సాగుతోందన్నారు. కఠినంగా శిక్షించండి..: ఈ నీతిబాహ్యమైన వ్యవహారం తనను తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేసిందని, ఇలాంటి దుష్ర్పచారంలో సూత్రధారులు, పాత్రధారులు అయిన ప్రతి ఒక్కరిపైనా ఐపీసీలోని 509, 499, 500, 501 సెక్షన్లతోపాటు ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని షర్మిల పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ దుష్ర్పచారాన్ని వ్యాప్తి చేస్తున్న సంస్థలను ప్రోత్సహిస్తూ వారికి వేదికగా నిలుస్తున్న సఫారీ, గూగుల్ సెర్చ్ ఇంజిన్లపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని, తనపేరు టైప్ చేయగానే ఈ ఇంజిన్లు ఈ విషప్రచారాన్ని ప్రముఖంగా ప్రదర్శిస్తున్నాయన్నారు. తనపై నీతిబాహ్యమైన ప్రచారాన్ని ఆపాల్సిందిగా వివిధ సెర్చ్ ఇంజిన్లు, సోషల్ మీడియా పోర్టల్స్‌కు ఆదేశాలు జారీ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.