ఇనగంటి గాంధీ రూ.3.69 కోట్లు చెల్లించాలంటూ పోలీసులకు ఫిర్యాదు
ఐపీసీ 420 కింద కేసు నమోదు చేసిన పోలీసులు
సీఎంఆర్ విధానంలో అక్రమాలకు పాల్పడిన ఫలితం
అవినీతి అధికారులపై చర్యలేవి?
బాపట్ల టౌన్ : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) విధానం అమలులో అక్రమాలకు పాల్పడిన రైస్‌మిల్లరుపై జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు చర్యలు తీసుకుంది. ధాన్యం తీసుకున్న మిల్లర్లు మర ఆడించి 15 రోజుల్లో పౌరసరఫరాల సంస్థకు బియ్యం ఇవ్వాల్సి ఉంటే, ఆడించిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయించి ప్రభుత్వ ధనాన్ని సొంత వ్యాపారానికి వాడుకున్నారు. నెలల తరబడి ఇలా కొందరు మిల్లర్లు అధికార యంత్రాంగానికి బియ్యం సరఫరా చేయలేదు. అనేక మంది మిల్లర్లకు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతుగా నిలబడటంతో అధికారులు కూడా వారిపై చర్యలు తీసుకోలేకపోయారు. ఈ అక్రమాలపై గత జూలై నెలలో ‘సాక్షి’ ప్రత్యేక కథనాలను ప్రచురించింది. అప్పటి నుంచి మిల్లర్లపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన అధికారులు ఎట్టకేలకు సోమవారం చర్యలకు ఉపక్రమించారు.
బాపట్ల మండలం అప్పికట్లకు చెందిన అనూరాధ రైస్ ట్రేడర్స్ యజమాని ఇనగంటిగాంధీ మర ఆడించడానికి ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా ఆడించి, బహిరంగ మార్కెట్‌లో విక్రయించగా వచ్చిన సొమ్ముతో వ్యాపారం చేసుకున్నారు. ప్రభుత్వానికి రూ. 2.46 కోట్లు చెల్లించలేదు. ఏడెనిమిది నెలలుగా ఆ మిల్లరుతో అధికారులు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. చివరకు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కె.రంగాకుమారి సోమవారం సాయంత్రం బాపట్ల తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ బియ్యం విషయంలో జరిగిన తంతును వివరించి, కేసు నమోదు చేయాలని పోలీస్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వానికి 1178 మెట్రిక్‌టన్నుల బియ్యాన్ని అందజేయాల్సి ఉందని, దానికి గానూ రూ. 2,46,18,206 చెల్లించాలన్నారు. నిర్ణీత సమయంలోగా బియ్యాన్ని అందించలేని పక్షంలో 50 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని గతంలోనే అగ్రిమెంట్ రాసుకోవడం జరిగిందని, దాని ప్రకారం రూ. 1,23,09,103 చొప్పున మొత్తం రూ. 3,69,27,309 చెల్లించాలంటూ తాలుకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఫిర్యాదు మేరకు తాలుకా ఎస్‌ఐ చెన్నకేశవులు ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
సహకరించిన వారిపై చర్యలేవి..?
ఈ అక్రమ వ్యవహారంలో మిల్లరుకు పౌరసరఫరాలశాఖలో కొందరు అధికారులు సహకరించారనే ఆరోపణలు లేకపోలేదు. ఇనగంటి గాంధీ గతంలో కూడా ఇదే విధంగా మర ఆడించిన ధాన్యాన్ని జిల్లా యంత్రాంగానికి సకాలంలో ఇవ్వలేదు. అతని గురించి పూర్తి వివరాలు తెలిసినప్పటికీ, అధికారులు బియ్యం ఆడించి ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. ఈ అనుమతికి అధికారులు అవినీతికి పాల్పడ్డారని, ట్రాక్ రికార్డు సక్రమంగా లేని మిల్లరును ఎంపిక చేయడం వలన ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగిందని, ఇందులో అధికారుల పాపం కూడా లేకపోలేదని జిల్లా యంత్రాంగానికి కూడా తెలుసు. అప్పట్లో జిల్లా జాయింట్ కలెక్ట్ శ్రీధర్ ఈ మిల్లరుతో అనేకసార్లు సంప్రదింపులు జరిపారు. వెంటనే బియ్యం ఆడించి ఇవ్వాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. టీడీపీ పాలకులు అధికార యంత్రాంగంపై వత్తిడి తీసుకువచ్చారు. మన వాడే ఇబ్బందుల్లో ఉన్నాడు. రెండు మూడు నెలల్లో ధాన్యం ఆడించి బియ్యం ఇస్తాడు. అప్పటి వరకు సహకరించండని అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఇంతకాలం ఈ వ్యవహారం కొనసాగింది. దీనికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటే ఇటువంటి అక్రమాలు కొంత వరకు ఆగుతాయనే అభిప్రాయం వినపడుతోంది.
బియ్యం అక్రమార్కులపై.. ఎట్టకేలకు చర్యలు
Published Tue, Dec 29 2015 1:18 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement