మిల్లులపై కొరడా! సీఎంఆర్‌ అక్రమాలపై సర్కారు నజర్‌ | Govt Paying Special Attention To CMR Irregularities In Rice Mills | Sakshi
Sakshi News home page

మిల్లులపై కొరడా! సీఎంఆర్‌ అక్రమాలపై సర్కారు నజర్‌

Published Sun, Nov 27 2022 5:09 AM | Last Updated on Sun, Nov 27 2022 2:59 PM

Govt Paying Special Attention To CMR Irregularities In Rice Mills - Sakshi

సూర్యాపేట జిల్లా కాపుగల్లులో సీజ్‌ చేసిన రైస్‌మిల్లు

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడే రైస్‌మిల్లుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లాలోని 8 మిల్లుల్లో ‘కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)’ కోసం కేటాయించిన ధాన్యం మాయమైన విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. కొందరు మిల్లర్ల తీరు వల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తప్పుబట్టే పరిస్థితి తలెత్తుతున్న క్రమంలో కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. సదరు మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టి, వాటి నుంచి మాయమైన రూ.138.50 కోట్ల విలువైన ధాన్యానికి సమానమైన బియ్యాన్ని వెంటనే రికవరీ చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో గత సీజన్లలో రాష్ట్రవ్యాప్తంగా మిల్లులకు సీఎంఆర్‌ కోసం కేటాయించిన ధాన్యం, మిల్లింగ్‌ చేశాక తిరిగి ఇచ్చిన బియ్యం, ఇంకా మిగిలిన ధాన్యం లెక్కలు తీయాలని అధికారులను పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దీనిపై అప్రమత్తమైన అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులు.. మిల్లుల్లో ధాన్యం లెక్కలు తీసే పనిలో పడ్డారు. 

భారీగా బియ్యం పెండింగ్‌.. 
రాష్ట్రంలో రైతుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా పౌరసరఫరాల శాఖ సేకరిస్తుంది. దాన్ని రైస్‌మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి వచి్చన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ప్రతి క్వింటాల్‌ ధాన్యానికి సుమారు 67 కిలోల బియ్యం వస్తుంది. ఇలా ఇచ్చే బియ్యాన్నే ‘కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)’ అంటారు. మిల్లింగ్‌ చేసి ఇచి్చనందుకు రైస్‌మిల్లర్లకు నిరీ్ణత మొత్తం చార్జీలను చెల్లిస్తారు. ప్రతి సీజన్‌లో పౌరసరఫరాల శాఖ మిల్లుల సామర్థ్యం, గతంలో సకాలంలో సీఎంఆర్‌ ఇచి్చన తీరు వంటి అంశాలను బేరీజు వేసుకుని.. ఆయా మిల్లులకు ధాన్యాన్ని కేటాయిస్తుంది. కానీ గత రెండేళ్లుగా కొందరు మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్‌ చేసి ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం వానకాలం సీజన్‌ ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండగా.. గత సంవత్సరం (2021–22) వానకాలం సీజన్‌లో మిల్లులకు పంపిన ధాన్యాన్నే ఇంకా పూర్తిగా కస్టమ్‌ మిల్లింగ్‌ చేసి ఇవ్వలేదు. ఆ సీజన్‌కు సంబంధించి ఇంకా 14 లక్షల టన్నులకుపైగా బియ్యం ఎఫ్‌సీఐకి అందాల్సి ఉంది. అంటే లెక్కప్రకారం మిల్లుల్లో 20 లక్షల టన్నులకుపైగా ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్టు. 

కొన్ని జిల్లాల్లో సగమే సీఎంఆర్‌.. 
కామారెడ్డి, పెద్దపల్లి, మెదక్, కరీంనగర్, జగిత్యాల, వనపర్తి, సూర్యాపేట, సిరిసిల్ల, యాదాద్రి, నాగర్‌కర్నూల్, మంచిర్యాల జిల్లాల్లో మిల్లర్లు గతేడాది వానాకాలం సీఎంఆర్‌లో 50శాతం కూడా అప్పగించలేదు. వరిసాగు తక్కువగా ఉండే ఆదిలాబాద్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో మాత్రమే 100 శాతం, మిగతా జిల్లాల్లో 80శాతం వరకు సీఎంఆర్‌ పూర్తయింది. ఇక గత యాసంగికి సంబంధించి మిల్లులకు కేటాయించిన 50లక్షల టన్నుల ధాన్యం కస్టమ్‌ మిల్లింగ్‌ చాలా జిల్లాల్లో మొదలేకాలేదు. ఈ ధాన్యం నుంచి 17 లక్షల టన్నులమేర పారాబాయిల్డ్‌ (ఉప్పుడు) పోషక బియ్యంగా మార్చేందుకు అనుమతి లభించినా అంతంత మాత్రంగానే మిల్లింగ్‌ జరుగుతోంది. 
మరోవైపు ఈ ఏడాది వానకాలం ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే 20 లక్షల టన్నులకుపైగా ధాన్యం మిల్లులకు చేరింది. మరో 80 లక్షల టన్నులు వచ్చే 
అవకాశముంది. 

నాణ్యమైనది అమ్ముకుని..! 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉప్పుడు బియ్యం, రారైస్‌ విషయంలో తలెత్తిన వివాదాలను మిల్లర్లు తమకు అనుకూలంగా మలుచుకొని అక్రమాలకు పాల్పడుతున్నట్టు విమర్శలు ఉన్నాయి. కొందరు మిల్లర్లు సీఎంఆర్‌ కోసం వచి్చన ధాన్యంలో మేలురకం ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి బియ్యాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపణలు చాలాకాలం నుంచి ఉన్నాయి. ఇదే సమయంలో రేషన్‌ బియ్యాన్ని, పాత ముతక బియ్యాన్ని కొని రిసైక్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి అప్పగించడం పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట వంటి పలుజిల్లాల్లో సాధారణమేనని పౌరసరఫరాల శాఖ అధికారులే చెప్తున్నారు. ఈ ఆరోపణలపై గతంలో పెద్దపల్లి, మంచిర్యాల, నల్లగొండ, కరీంనగర్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్‌ తదితర జిల్లాల్లో పలుమిల్లులపై ఆంక్షలు విధించినా.. రాష్ట్రస్థాయిలో పైరవీలతో తమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. 

ఎఫ్‌సీఐ ఆగ్రహించి సీఎంఆర్‌ ఆపినా.. 
మిల్లర్లు ఎఫ్‌సీఐకి అప్పగించే సీఎంఆర్‌ విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ కేంద్రం కొన్ని నెలల కింద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్‌సీఐ విధించిన నిబంధనలను తుంగలో తొక్కి రీసైక్లింగ్‌ బియ్యం, పాత బియ్యాన్ని సెంట్రల్‌పూల్‌ కింద ఎఫ్‌సీఐకి ఇవ్వడాన్ని తప్పుబట్టింది. దీనితోపాటు సకాలంలో సీఎంఆర్‌ ఇవ్వకపోవడంపై ఆగ్రహిస్తూ.. జూలైలో సీఎంఆర్‌ బియ్యాన్ని తీసుకోబోమని తేలి్చచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కమలాకర్, అధికారులు పలుమార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపాక.. 45 రోజుల తర్వాత తిరిగి సీఎంఆర్‌కు అనుమతిచ్చింది. అయినా మిల్లర్లు సీఎంఆర్‌ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికార వర్గాలు చెప్తున్నాయి. కాగా సూర్యాపేట జిల్లాలో రూ.67 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్‌ ఇవ్వాల్సిన రెండు మిల్లులపై క్రిమినల్‌ కేసు నమోదు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

మేలురకం అమ్మేసుకోవడంతోనే!
రాష్ట్రంలో పెరిగిన ధాన్యం ఉత్పత్తిని కొందరు మిల్లర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు పౌరసరఫరాల శాఖ గతంలోనే గుర్తించింది. మిల్లులు సీఎంఆర్‌ కోసం అందిన ధాన్యంలో మేలురకం ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి, నాణ్యమైన బియ్యాన్ని అధిక ధరకు అమ్ముకుంటున్నాయని తేల్చింది. తర్వాత నాసిరకం ధాన్యాన్ని రైతుల నుంచి తక్కువ ధరకు కొని ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇస్తున్నాయని అధికారులు  చెప్తున్నారు. ఇందువల్లే సీఎంఆర్‌ అప్పగించడంలో జాప్యం 
జరుగుతోందని అంటున్నాయి. ఈ క్రమంలోనే తనిఖీలు, చర్యలకు ప్రభుత్వం నిర్ణయించిందని వివరిస్తున్నాయి. 

నాలుగు సార్లు గడువు పెంచినా.. 
వాస్తవానికి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుకు చేరిన 45 రోజుల్లోనే బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించాలి. గత ఏడాది వానాకాలం సీజన్‌ ధాన్యం కొనుగోళ్లు డిసెంబర్‌లోనే ముగిశాయి. అంటే ఈఏడాది ఫిబ్రవరి 15లోగా బియ్యాన్ని అప్పగించాలి. కానీ మిల్లులు ఇవ్వలేదు. దీంతో ఎఫ్‌సీఐ మార్చి నెలాఖరు వరకు గడువు ఇచి్చంది. అయినా మిల్లర్లు బియ్యాన్ని సకాలంలో ఇవ్వలేకపోవడంతో తర్వాత జూన్‌ వరకు, మళ్లీ సెపె్టంబర్‌ వరకు, చివరికి నవంబర్‌ 30వ తేదీ వరకు గడువు ఇచి్చంది. అయినా ఇంకా 14 లక్షల టన్నులకుపైగా బియ్యం పెండింగ్‌లోనే ఉండిపోయింది.

ఇదీ చదవండి: పసుపురంగు దేవతావస్త్రం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement