![Telangana Government Not To Supply Grain For Local Millers - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/26/Untitled-6.jpg.webp?itok=ldRfcPYi)
సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. గత రెండు మూడు సీజన్లలో సకాలంలో సీఎంఆర్ ఇవ్వడంలో విఫలమైన 80% డిఫాల్టర్ మిల్లులకు భవిష్యత్తులో మిల్లింగ్ కోసం ధాన్యాన్ని ఇవ్వకూడదని నిర్ణయించింది. మిల్లర్లకు శ్రమ లేకుండా ఏటా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వమే సేకరించి పంపుతున్నా, దాన్ని సకాలంలో కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) చేసి ఎఫ్‌సీఐకి అప్పగించడంలో వారు నిర్లక్ష్యంగా ఉంటున్నారని భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే వచ్చే వానాకాలం సీజన్ ధాన్యాన్ని రాష్ట్రంలోని మిల్లులకు బదులు పొరుగు రాష్ట్రాల్లోని మిల్లులకు పంపాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఆదివారం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర అధికారులు సమావేశమై ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.
మిల్లుల్లో 75 ఎల్‌ఎంటీల నిల్వలు
ప్రస్తుతం రాష్ట్రంలోని సుమారు 3 వేల రైస్‌మిల్లుల్లో 75 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యం నిల్వ ఉంది. గత వానాకాలం సీఎంఆర్ ఇప్పటివరకు 60 శాతం కూడా పూర్తి కాలేదు. 47 ఎల్‌ఎంటీ సీఎంఆర్‌కు గాను ఇప్పటివరకు 30 ఎల్‌ఎంటీ కూడా ఇవ్వలేదు. ఇంకా 25 ఎల్‌ఎంటీలకు పైగా ధాన్యం నిల్వలు మిల్లుల్లో ఉన్నాయి. అలాగే మొన్నటి యాసంగిలో సేకరించిన 50 ఎల్‌ఎంటీల ధాన్యం కూడా మిల్లుల్లోనే ఉంది.
మరో రెండు నెలల్లో ఈ వానాకాలం ధాన్యం రాబోతోంది. ఈ సీజన్లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా సుమారు 1.30 కోట్ల టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా, ఇందులో కొనుగోలు కేంద్రాలకు సుమారు కోటి టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వచ్చే వానాకాలం ధాన్యాన్ని ప్రైవేట్ గోడౌన్లు వంటి మిడిల్ పాయింట్లలో నిల్వ ఉంచాలని నిర్ణయించింది. ఈ మిల్లుల నుంచి డిఫాల్టర్ మిల్లులకు ధాన్యం పంపకుండా నేరుగా ఇతర రాష్ట్రాలకు తరలించాలని నిర్ణయించింది.
మిల్లర్ల తీరుకు తోడు కేంద్రం వైఖరితో..
రైతులకు మద్దతు ధర చెల్లిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ ధాన్యాన్ని మిల్లులకు అప్పగిస్తోంది. సెంట్రల్ పూల్ కింద ఎఫ్‌సీఐ నేరుగా మిల్లుల నుంచి బియ్యాన్ని (సీఎంఆర్) తీసుకుంటోంది. ఎఫ్‌సీఐకి బియ్యం వెళ్లిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి చెల్లించిన మద్దతు ధరను కేంద్రం రీయింబర్స్‌మెంట్ పద్ధతిలో తిరిగి చెల్లిస్తోంది. అయితే గత రెండేళ్లుగా పెరిగిన ధాన్యం దిగుబడి నేపథ్యంలో మిల్లర్లు సీఎంఆర్ విషయంలో మరింత ఆలస్యం చేస్తున్నారు.
మరోవైపు గడువు ముగిసిన తర్వాత సీఎంఆర్‌ను తీసుకునేందుకు కేంద్రం అంగీకరించడం లేదు. గత వర్షాకాలం సీజన్ సీఎంఆర్‌కు ఈ నెలాఖరు వరకు గడువు కాగా, ఇప్పటివరకు ఎఫ్‌సీఐ గడువు పెంచలేదు. మిల్లర్ల ఆలస్యం కారణంగా 2019–20, 2020–21 యాసంగి సీజన్‌కు సంబంధించి సుమారు రూ. 700 కోట్ల భారం పౌరసరఫరాల శాఖపై పడింది.
ఇలావుండగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ మొదలు బీజేపీ నేతలంతా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ సకాలంలో ఇవ్వడం లేదని, మిల్లర్ల ఆగడాలకు సహకరిస్తోందని విమర్శిస్తూ జాతీయ స్థాయిలో అప్రదిష్టపాలు చేస్తున్నారు. ఇలా వివిధ కారణాలతో సీఎమ్మార్ అందించడంలో మిల్లర్లు ఆలస్యం చేయడం, కేంద్రం సీఎంఆర్ గడువు పెంచే విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మంత్రి సీరియస్
రాష్ట్రంలోని మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరు, తద్వారా ప్రభుత్వం అప్రదిష్ట మూటగట్టుకుంటున్న అంశంపై మంత్రి సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లోని మిల్లులకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని పంపించి, మిల్లింగ్ చేయించి ఎఫ్‌సీఐకి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ మేరకు ఎఫ్‌సీఐ నుంచి అనుమతి పొందినట్లు సమాచారం. సోమవారం జరిగే పౌరసరఫరాల శాఖ ఉన్నతస్థాయి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment