Grain allocation
-
మిల్లర్లకు ధాన్యం బంద్..!
సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. గత రెండు మూడు సీజన్లలో సకాలంలో సీఎంఆర్ ఇవ్వడంలో విఫలమైన 80% డిఫాల్టర్ మిల్లులకు భవిష్యత్తులో మిల్లింగ్ కోసం ధాన్యాన్ని ఇవ్వకూడదని నిర్ణయించింది. మిల్లర్లకు శ్రమ లేకుండా ఏటా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వమే సేకరించి పంపుతున్నా, దాన్ని సకాలంలో కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) చేసి ఎఫ్‌సీఐకి అప్పగించడంలో వారు నిర్లక్ష్యంగా ఉంటున్నారని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే వానాకాలం సీజన్ ధాన్యాన్ని రాష్ట్రంలోని మిల్లులకు బదులు పొరుగు రాష్ట్రాల్లోని మిల్లులకు పంపాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఆదివారం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర అధికారులు సమావేశమై ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. మిల్లుల్లో 75 ఎల్ఎంటీల నిల్వలు ప్రస్తుతం రాష్ట్రంలోని సుమారు 3 వేల రైస్‌మిల్లుల్లో 75 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం నిల్వ ఉంది. గత వానాకాలం సీఎంఆర్ ఇప్పటివరకు 60 శాతం కూడా పూర్తి కాలేదు. 47 ఎల్ఎంటీ సీఎంఆర్‌కు గాను ఇప్పటివరకు 30 ఎల్ఎంటీ కూడా ఇవ్వలేదు. ఇంకా 25 ఎల్ఎంటీలకు పైగా ధాన్యం నిల్వలు మిల్లుల్లో ఉన్నాయి. అలాగే మొన్నటి యాసంగిలో సేకరించిన 50 ఎల్ఎంటీల ధాన్యం కూడా మిల్లుల్లోనే ఉంది. మరో రెండు నెలల్లో ఈ వానాకాలం ధాన్యం రాబోతోంది. ఈ సీజన్లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా సుమారు 1.30 కోట్ల టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా, ఇందులో కొనుగోలు కేంద్రాలకు సుమారు కోటి టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వచ్చే వానాకాలం ధాన్యాన్ని ప్రైవేట్ గోడౌన్లు వంటి మిడిల్ పాయింట్లలో నిల్వ ఉంచాలని నిర్ణయించింది. ఈ మిల్లుల నుంచి డిఫాల్టర్ మిల్లులకు ధాన్యం పంపకుండా నేరుగా ఇతర రాష్ట్రాలకు తరలించాలని నిర్ణయించింది. మిల్లర్ల తీరుకు తోడు కేంద్రం వైఖరితో.. రైతులకు మద్దతు ధర చెల్లిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ ధాన్యాన్ని మిల్లులకు అప్పగిస్తోంది. సెంట్రల్ పూల్ కింద ఎఫ్‌సీఐ నేరుగా మిల్లుల నుంచి బియ్యాన్ని (సీఎంఆర్) తీసుకుంటోంది. ఎఫ్‌సీఐకి బియ్యం వెళ్లిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి చెల్లించిన మద్దతు ధరను కేంద్రం రీయింబర్స్మెంట్ పద్ధతిలో తిరిగి చెల్లిస్తోంది. అయితే గత రెండేళ్లుగా పెరిగిన ధాన్యం దిగుబడి నేపథ్యంలో మిల్లర్లు సీఎంఆర్ విషయంలో మరింత ఆలస్యం చేస్తున్నారు. మరోవైపు గడువు ముగిసిన తర్వాత సీఎంఆర్‌ను తీసుకునేందుకు కేంద్రం అంగీకరించడం లేదు. గత వర్షాకాలం సీజన్ సీఎంఆర్‌కు ఈ నెలాఖరు వరకు గడువు కాగా, ఇప్పటివరకు ఎఫ్‌సీఐ గడువు పెంచలేదు. మిల్లర్ల ఆలస్యం కారణంగా 2019–20, 2020–21 యాసంగి సీజన్‌కు సంబంధించి సుమారు రూ. 700 కోట్ల భారం పౌరసరఫరాల శాఖపై పడింది. ఇలావుండగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ మొదలు బీజేపీ నేతలంతా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ సకాలంలో ఇవ్వడం లేదని, మిల్లర్ల ఆగడాలకు సహకరిస్తోందని విమర్శిస్తూ జాతీయ స్థాయిలో అప్రదిష్టపాలు చేస్తున్నారు. ఇలా వివిధ కారణాలతో సీఎమ్మార్ అందించడంలో మిల్లర్లు ఆలస్యం చేయడం, కేంద్రం సీఎంఆర్ గడువు పెంచే విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రి సీరియస్ రాష్ట్రంలోని మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరు, తద్వారా ప్రభుత్వం అప్రదిష్ట మూటగట్టుకుంటున్న అంశంపై మంత్రి సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లోని మిల్లులకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని పంపించి, మిల్లింగ్ చేయించి ఎఫ్‌సీఐకి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ మేరకు ఎఫ్‌సీఐ నుంచి అనుమతి పొందినట్లు సమాచారం. సోమవారం జరిగే పౌరసరఫరాల శాఖ ఉన్నతస్థాయి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
మర ఆడించాలా.. మానేయాలా?
సాక్షి ప్రతినిధి, వరంగల్: పౌర సరఫరాల శాఖ, రైసుమిలర్ల నడుమ ‘రా’ రైస్ వివాదం తారాస్థాయికి చేరింది. 2018–19 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) వ్యవహారంలో తలెత్తిన వివాదం.. రబీ ధాన్యాన్ని రైసుమిల్లుల్లో దింపుకునేందుకు నిరాకరించే వరకు చేరింది. ఈనెల 3వ తేదీ నుంచి రబీ సీఎంఆర్ ధాన్యం ముట్టబోమంటూ రైసుమిల్లర్ల సంక్షేమ సంఘం బాధ్యులు ఇటీవల ప్రకటించారు. దీంతో పది రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణను ముమ్మరం చేసిన పౌరసరఫరాల శాఖకు.. రైసుమిల్లర్ల నిర్ణయంతో చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు పౌరసరఫరాలశాఖ బియ్యం సేకరణను నిలిపివేయడం, ఓ వైపు రైసుమిల్లుల్లో బియ్యం నిల్వలు నిండిన నేపథ్యంలో రబీ ధాన్యాన్ని ఎలా నిల్వ చేసుకోవాలన్న ఆందోళనను మిల్లర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిశీలన, ఉన్నతాధికారులతో సమీక్షలకు వస్తుండడం గమనార్హం. వివాదం ముదురింది ఇలా... ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం మర ఆడించేందుకు(బియ్యంగా మార్చడం) మిల్లర్లకు సీఎంఆర్ కింద ధాన్యం కేటాయిస్తుంది. ఇదే క్రమంలో 2018–19 ఖరీఫ్ సీజన్లో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో మొత్తం 115 రా రైసుమిల్లులకు 1,25,499 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించారు. ఈ ధాన్యాన్ని మర ఆడించిన రైసుమిల్లర్లు 84,186 మెట్రిక్ టన్నుల బియ్యంను పౌరసరఫరాలశాఖ ద్వారా ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రైసుమిల్లర్లు 55,350 మెట్రిటన్నుల బియ్యం సరఫరా చేయగా.. ఇంకా 28,836 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయాల్సి ఉంది. ఈ మొత్తం బియ్యాన్ని సైతం పంపేందుకు రైసుమిల్లర్లు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ సరఫరా చేసిన గన్నీ బ్యాగులపై స్టెన్సిల్(చాప) కొట్టి, కాంటా పెట్టి సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే ఫిబ్రవరి 14 నుంచి రా రైస్ సేకరణను నిలిపి వేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుమారు 80 రోజులుగా బియ్యం సేకరణ నిలిచిపోయింది. ఎఫ్‌సీఐకి పంపితే వారు కూడా తీసుకోవడం లేదని, ఫలితంగా బియ్యానికి పురుగులు పడుతున్నాయని రైసుమిలర్ల సంఘం నాయకులు ఇటీవల వెల్లడించారు. ఇకనైనా ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ స్పందించి బియ్యం తీసుకోనట్లయితే శుక్రవారం నుంచి రబీ సీఎంఆర్ ధాన్యాన్ని దిగుమతి చేసుకోకుండా సహాయ నిరాకరణ చేపడుతామని బాయిల్, రా రైస్ మిల్లుల యజమానులు ప్రకటించడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. కమిషనర్ పర్యటన ఇలా... పౌరసరఫరాలశాఖ కమిషనర్ డాక్టర్ అకున్ సబర్వాల్ ఉదయం 8.30 గంటలకు వరంగల్ పోలీసు గెస్ట్‌హౌస్‌కు చేరుకుని 10 గంటల వరకు అబ్కారీశాఖ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షిస్తారు. ఆ తర్వాత వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారులు, జిల్లా మేనేజర్లతో సమీక్ష జరిపిన మీదట పలు రేషన్ దుకాణాలను పరిశీలిస్తారు. అలాగే, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను కూడా పర్యవేక్షించనున్నారు. ఆ తర్వాత జనగామ జిల్లాకు చేరుకోనున్న అకున్ సబర్వాల్ అక్కడ కూడా జాయింట్ కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా మేనేజర్ ఇతర అధికారులతో సమీక్ష జరిపి హైదరాబాద్ వెళ్తారు. కాగా, రైసుమిల్లర్లు, పౌర సరఫరాల శాఖల మధ్యన రా రైస్ వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆ శాఖ కమిషనర్ పర్యటించనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రేపటి నుంచి సహాయ నిరాకరణ మర ఆడించిన బియాన్ని తీసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మిల్లర్లు శుక్రవారం నుంచి సహాయ నిరాకరణకు దిగనున్నారు. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ తదితర సంస్థల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా తరలిస్తే ఎట్టి పరిస్థితుల్లో మిల్లుల్లో దించుకోబోమని స్పష్టం చేస్తున్నారు. జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు తోట సంపత్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, కోశాధికారి దుబ్బ రమేష్ తదితరులు జిల్లా అధికారులకు ఈ విషయమై వినతిపత్రం సమర్పించడంతో పాటు రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ నిర్ణయాన్ని వెల్లడించారు. మిల్లుల్లో ఉన్న బియ్యం నిల్వలు ఖాళీ అయ్యే వరకు ప్రభుత్వానికి సహకరించేది లేదని స్పష్టం చేశారు. ఇదిలా వుండగా ప్రభుత్వ ఎక్స్అఫిషీయో కార్యదర్శి, పౌరసరఫరాలశాఖ కమిషనర్ డాక్టర్ అకున్ సబర్వాల్ గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పర్యటించన్నారు. -
డిఫాల్టర్లకూ సీఎంపీ కేటాయింపు
- ప్రారంభం కాని మిల్లులకూ ఇచ్చారు - పేరు ఒకరిది.. మిల్లింగ్ మరోచోట - పౌర సరఫరాలశాఖ అధికారుల తీరు - రైసుమిల్లర్ల వద్దే 98,355 మెట్రిక్ టన్నుల బియ్యం - గతంలో ఓ వ్యాపారి ఆత్మహత్య సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ‘కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ’(సీఎంపీ) కింద ధాన్యం కేటాయింపులో ఎక్కడ చూసినా అధికారుల డొల్లతనమే కనిపిస్తోంది. సీఎంపీ కేటాయింపుల్లో నిబంధనలను ఉల్లంఘించి మా మూళ్లు అందించిన రైసుమిల్లర్లకే పెద్దపీట వేశారు. ఇందుకు 2013-14 ఖరీఫ్ సీజన్లో కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ కేటాయిం పులే ఉదాహరణ. ఓ వైపు కస్టమ్ మిల్లింగ్ కోసం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం సరఫరా చేయని 53 పారా బాయిల్డ్, రా రైసుమిల్లులను పౌరసరఫరాల శాఖ అధికారులు డిఫాల్టర్ల జాబితాలో చేర్చారు. తిరిగి అదే జాబితాలోని రైసుమిల్లర్లకు 2013-14 ఖరీఫ్‌లో టన్నుల కొద్దీ ధాన్యాన్ని కేటాయించారు. రా రైసు మిల్లులు 5 వేల క్వింటాళ్ల నుంచి 10 వేల క్వింటాళ్లు, పారా బాయిల్డ్ మిల్లులైతే 10 వేల క్వింటాళ్లు, డబుల్ ప్లాంటులు ఉన్న మిల్లులు 20 వేల క్వింటాళ్లు కస్టమ్ మిల్లింగ్ కింద బియ్యం చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ ధాన్యాన్ని పొందిన రా రైసుమిల్లర్లు 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం చొప్పున పౌరసరఫరాలశాఖకు చెల్లించాల్సి వుండగా, పారాబాయిల్డ్ మిల్లులైతే 68 కిలోలు ఇవ్వాలి. అయితే ఇదేమీ పట్టని అధికారులు, కొందరు రైసుమిల్లర్లకు ఇష్టారాజ్యంగా కేటాయించడం వివాదాస్పదం అవుతోంది. అంతా పథకం ప్రకారమే లాబీయింగ్‌కు అలవాటు పడిన ఓ మిల్లర్ల నేత ఒత్తిళ్లు, పౌరసరఫరాల శాఖలో వివిధస్థాయిల్లో పని చేస్తూ ఏళ్ల తరబడిగా పాతుకుపోయిన ఓ ద్వితీయ శ్రేణి అధికారి కలిసి కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ ఇష్టారాజ్యంగా కేటాయిస్తున్నారన్న విమర్శలు కొందరు రైసుమిల్లర్లే చేస్తున్నారు. ప్రతియేడు జరుగుతున్న తంతుపై ఏ ఉన్నతాధికారి స్పందించిన పాపాన పోలేదంటున్నారు. ‘అయిన వారికి ఆకుల్లో... కాని వారికి కంచాల్లో...’ అన్న చందంగా ప్రతియేటా జరుగుతున్న సీఎంపీ కేటాయింపుల్లో రూ.కోట్లు చేతులు మారుతున్నాయన్న విమర్శలు ఇటు రైసుమిల్లర్లు, అటు పౌరసరఫరాల శాఖలో బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఈసారి కూడ ఇదే తంతు జరగ్గా రూ. 251 కోట్ల విలువ చేసే ప్రభుత్వ ధాన్యంతో మిల్లర్లు కొందరు వ్యాపారం చేస్తున్నారు. 2013-14 ఖరీఫ్, రబీల్లో కలిపి ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్), గిరిజన సహకార సంఘాలు(జీసీసీ) ద్వారా 1,87,028 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన ప్రభుత్వం ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేం దుకు 88 మంది మిల్లర్లకు ఇచ్చింది. ఈ మేరకు ధాన్యం తీసుకున్న మిల్లర్లు 1,27,179 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు అప్పగిం చాలి. ఇదంతా గడువులోపే జరగాలి. అయితే ప్రభు త్వ ధాన్యాన్ని సొంత ఆస్తిగా భావించే ధోరణి జిల్లాలోని మిల్లర్లకు ఉండడంతో ఇప్పటి వరకు కేవలం 29,746 మెట్రిక్ టన్నుల బియ్యం చెల్లించారు. మిగతా బియ్యం కోసం అధికారులు స్పందించడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 6ఏ తదితర, ఇతర ఎలాంటి కేసులు లేకుండా వ్యాపారం చేసే రైసుమిల్లులను ఎంపిక చేసి కస్టమ్ మిల్లింగ్ ప్యాడీని కేటాయించాల్సి ఉంది. ఇవేమీ పట్టని అధికారులు మామూళ్లు, పరిచయాలు, ప్రలోభాలకు పెద్దపీట వేసి ఇష్టారాజ్యంగా సీఎంపీ ఇవ్వడం రైసుమిల్లర్లలో చర్చనీయాంశమైంది. సీఎంపీ నిబంధనలు అక్రమ వ్యాపారులకు వరంగా మారగా, అంతంతమాత్రంగా వ్యాపారం చేసుకునే మిల్లర్లకు శాపంగా కూడ మారుతోంది. గతేడాది కస్టమ్ మిల్లింగ్ కోసం ధాన్యం తీసుకున్న రైసుమిల్లర్లలో 48 మందిని పౌరసరఫరాల శాఖ డిఫాల్టర్లుగా గుర్తించింది. అదే 2013-14కు వచ్చే సరికి అందులో 26 మందిని కలిపి మొత్తం 88 మందికి కస్టమ్ మిల్లింగ్ ప్యాడీని కేటాయించడం వివాదాస్పదంగా మారింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలంలో ఓ పారాబాయిల్డ్ రైసుమిల్లుకు అధికారులు ధాన్యం కేటాయించే నాటికి విద్యుత్ కనెక్షన్ కూడ ఇవ్వలేదు. అలాగే నడవని రైసుమిల్లులకు కూడ సీఎంపీ ఇచ్చిన అధికారులు వాటిని మరో చోట మిల్లింగ్ చేసి, అస లు మిల్లుల యజమానులకు కమీషన్ దక్కకుండా చేసిన వైనం ఉంది. ఇదే క్రమంలో 2012-13 సీజన్ లో సీఎంపీ కారణంగా నందిపేట మండలం తొడుపునూరుకు చెందిన ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడ ఉంది. జుక్కల్ మండలంలో ఓ రైసుమిల్లుపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ కేసు కూడ నమోదు చేశారు. కస్టం మిల్లింగ్ ప్యాడీ విషయంలో ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.