డిఫాల్టర్లకూ సీఎంపీ కేటాయింపు | cmp allocation is composed of the defaulters | Sakshi
Sakshi News home page

డిఫాల్టర్లకూ సీఎంపీ కేటాయింపు

Published Mon, Sep 1 2014 3:21 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

cmp allocation is composed of the defaulters

- ప్రారంభం కాని మిల్లులకూ ఇచ్చారు
- పేరు ఒకరిది.. మిల్లింగ్ మరోచోట
- పౌర సరఫరాలశాఖ అధికారుల తీరు
- రైసుమిల్లర్ల వద్దే 98,355 మెట్రిక్ టన్నుల బియ్యం
- గతంలో ఓ వ్యాపారి ఆత్మహత్య

 సాక్షిప్రతినిధి, నిజామాబాద్ :  ‘కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ’(సీఎంపీ) కింద ధాన్యం కేటాయింపులో ఎక్కడ చూసినా అధికారుల డొల్లతనమే కనిపిస్తోంది. సీఎంపీ కేటాయింపుల్లో నిబంధనలను ఉల్లంఘించి మా మూళ్లు అందించిన రైసుమిల్లర్లకే పెద్దపీట వేశారు. ఇందుకు 2013-14 ఖరీఫ్ సీజన్‌లో కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ కేటాయిం పులే ఉదాహరణ. ఓ వైపు కస్టమ్ మిల్లింగ్ కోసం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం సరఫరా చేయని 53 పారా బాయిల్డ్, రా రైసుమిల్లులను పౌరసరఫరాల శాఖ అధికారులు డిఫాల్టర్ల జాబితాలో చేర్చారు.

తిరిగి అదే జాబితాలోని రైసుమిల్లర్లకు 2013-14 ఖరీఫ్‌లో టన్నుల కొద్దీ ధాన్యాన్ని కేటాయించారు. రా రైసు మిల్లులు 5 వేల క్వింటాళ్ల నుంచి 10 వేల క్వింటాళ్లు, పారా బాయిల్డ్ మిల్లులైతే 10 వేల క్వింటాళ్లు, డబుల్ ప్లాంటులు ఉన్న మిల్లులు 20 వేల క్వింటాళ్లు కస్టమ్ మిల్లింగ్ కింద బియ్యం చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ ధాన్యాన్ని పొందిన రా రైసుమిల్లర్లు 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం చొప్పున పౌరసరఫరాలశాఖకు చెల్లించాల్సి వుండగా, పారాబాయిల్డ్ మిల్లులైతే 68 కిలోలు ఇవ్వాలి. అయితే ఇదేమీ పట్టని అధికారులు, కొందరు రైసుమిల్లర్లకు ఇష్టారాజ్యంగా కేటాయించడం వివాదాస్పదం అవుతోంది.
 
అంతా పథకం ప్రకారమే
లాబీయింగ్‌కు అలవాటు పడిన ఓ మిల్లర్ల నేత ఒత్తిళ్లు, పౌరసరఫరాల శాఖలో వివిధస్థాయిల్లో పని చేస్తూ ఏళ్ల తరబడిగా పాతుకుపోయిన ఓ ద్వితీయ శ్రేణి అధికారి కలిసి కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ ఇష్టారాజ్యంగా కేటాయిస్తున్నారన్న విమర్శలు కొందరు రైసుమిల్లర్లే చేస్తున్నారు. ప్రతియేడు జరుగుతున్న తంతుపై ఏ ఉన్నతాధికారి స్పందించిన పాపాన పోలేదంటున్నారు. ‘అయిన వారికి ఆకుల్లో... కాని వారికి కంచాల్లో...’ అన్న చందంగా ప్రతియేటా జరుగుతున్న సీఎంపీ కేటాయింపుల్లో రూ.కోట్లు చేతులు మారుతున్నాయన్న విమర్శలు ఇటు రైసుమిల్లర్లు, అటు పౌరసరఫరాల శాఖలో బహిరంగంగానే వినిపిస్తున్నాయి.

ఈసారి కూడ ఇదే తంతు జరగ్గా రూ. 251 కోట్ల విలువ చేసే ప్రభుత్వ ధాన్యంతో మిల్లర్లు కొందరు వ్యాపారం చేస్తున్నారు. 2013-14 ఖరీఫ్, రబీల్లో కలిపి ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్), గిరిజన సహకార సంఘాలు(జీసీసీ) ద్వారా 1,87,028 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన ప్రభుత్వం ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేం దుకు 88 మంది మిల్లర్లకు ఇచ్చింది. ఈ మేరకు ధాన్యం తీసుకున్న మిల్లర్లు 1,27,179 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు అప్పగిం చాలి.

ఇదంతా గడువులోపే జరగాలి. అయితే ప్రభు  త్వ ధాన్యాన్ని సొంత ఆస్తిగా భావించే ధోరణి జిల్లాలోని మిల్లర్లకు ఉండడంతో ఇప్పటి వరకు కేవలం 29,746 మెట్రిక్ టన్నుల బియ్యం చెల్లించారు. మిగతా బియ్యం కోసం అధికారులు స్పందించడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 6ఏ తదితర, ఇతర ఎలాంటి కేసులు లేకుండా వ్యాపారం చేసే రైసుమిల్లులను ఎంపిక చేసి కస్టమ్ మిల్లింగ్ ప్యాడీని కేటాయించాల్సి ఉంది.

ఇవేమీ పట్టని అధికారులు మామూళ్లు, పరిచయాలు, ప్రలోభాలకు పెద్దపీట వేసి ఇష్టారాజ్యంగా సీఎంపీ ఇవ్వడం రైసుమిల్లర్లలో చర్చనీయాంశమైంది. సీఎంపీ నిబంధనలు అక్రమ వ్యాపారులకు వరంగా మారగా, అంతంతమాత్రంగా వ్యాపారం చేసుకునే మిల్లర్లకు శాపంగా కూడ మారుతోంది. గతేడాది కస్టమ్ మిల్లింగ్ కోసం ధాన్యం తీసుకున్న రైసుమిల్లర్లలో 48 మందిని పౌరసరఫరాల శాఖ డిఫాల్టర్లుగా గుర్తించింది. అదే 2013-14కు వచ్చే సరికి అందులో 26 మందిని కలిపి మొత్తం 88 మందికి కస్టమ్ మిల్లింగ్ ప్యాడీని కేటాయించడం వివాదాస్పదంగా మారింది.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలంలో ఓ పారాబాయిల్డ్ రైసుమిల్లుకు అధికారులు ధాన్యం కేటాయించే నాటికి విద్యుత్ కనెక్షన్ కూడ ఇవ్వలేదు. అలాగే నడవని రైసుమిల్లులకు కూడ సీఎంపీ ఇచ్చిన అధికారులు వాటిని మరో చోట మిల్లింగ్ చేసి, అస లు మిల్లుల యజమానులకు కమీషన్ దక్కకుండా చేసిన వైనం ఉంది. ఇదే క్రమంలో 2012-13 సీజన్ లో సీఎంపీ కారణంగా నందిపేట మండలం తొడుపునూరుకు చెందిన ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడ ఉంది. జుక్కల్ మండలంలో ఓ రైసుమిల్లుపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ కేసు కూడ నమోదు చేశారు. కస్టం మిల్లింగ్ ప్యాడీ విషయంలో ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement