సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ‘కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ’ (సీఎం పీ) కింద కేటాయించిన ప్రభుత్వ ధాన్యాన్ని కొందరు రైస్ మిల్లర్లు సొంత ఆస్తిగానే భావిస్తున్నారు. ధాన్యం తీసుకుని గడువులోగా బియ్యం అప్పగించాలనే నిబంధనలను తుంగలో తొకుతున్నారు. లాబీయింగ్‌కు అలవాటు పడి న ఓ మిల్లర్ల సంఘం నేత ఒత్తిళ్లు, పౌరసరఫరాల శాఖలో ఏళ్ల తరబడిగా పాతుకుపోయిన ఓ ద్వితీయశ్రేణి అధికారి మూలంగా రూ. 251 కోట్ల విలు వ చేసే ప్రభుత్వ ధాన్యంతో మిల్లర్లు కొందరు వ్యాపారం చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ప్రతి ఏటా ప్రభుత్వం ఖరీఫ్ మార్కెట్ సీజనుగా భావిస్తుంది.
ఖరీఫ్, రబీల్లో వచ్చే ఉత్పత్తులను కలిపి మార్కెటింగ్ పరంగా ఖరీఫ్ సీజనుగానే పేర్కొంటుంది. గతేడాది అక్టోబరు ఆరంభం నుంచి ఈ ఏడాది సెప్టెం బరు వరకు ఈ సీజను ఉంటుంది. 2013-14 ఖరీఫ్ మార్కెట్ సీజను మరో నెల రోజుల్లో ముగియనుంది. జిల్లాలోని మిల్లర్లు మాత్రం ధాన్యం స్వాధీనం చేసుకుని మూడు నెలలు గడుస్తున్నా కేవలం 23 శాతం బియ్యం మాత్రమే అందజేశారు. ఇంకా 77 శాతం (98,355 మెట్రిక్ టన్నుల) బియ్యాన్ని అప్పగిం చకుండా తమ వద్దే పెట్టుకున్నారు. కొందరు రైసుమిల్లర్ల సంఘం నేతల అండదండలు, పౌరసరఫరాల శాఖలోని ఓ సహాయ అధికారి సహకారంతో వీరు నిబంధనలను పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి.
రైసుమిల్లర్లకు చేరింది ఇలా..
వరి సాగు విస్తీర్ణం జిల్లాలో ఎక్కువగా ఉం టుంది. ధాన్యం ఉత్పత్తి ఇదే తీరుగా ఉం టుంది. అన్నదాతలు పండించే ధాన్యం ఆధారంగా అభివృద్ధి చెందాల్సిన రైస్ మిల్లింగ్ పరిశ్రమ కొందరి లాభాపేక్షతో పక్కదారిపడుతోంది. రెండుమూడేళ్లుగా జిల్లాలో ప్రభుత్వ ధాన్యాన్ని రైస్ మిల్లర్లు స్వాహా చేయడం రివాజుగా మారుతోంది. 2013-14 ఖరీఫ్ మార్కెట్ సీజనులోనూ ఇదే జరిగింది.
మరి కొద్ది రోజు ల్లో గడువు ముగియనుండగా ఇప్పటికీ ఇంకా 98,355 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైస్ మిల్లర్లు తమ వద్దే పెట్టుకున్నారు. 2013-14 ఖరీఫ్, రబీల్లో కలిపి ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్), గిరిజన సహకార సంఘాలు(జీసీసీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 1,87,028 మెట్రిక్ టన్నుల టన్నుల ధాన్యాన్ని సేకరించింది.
ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేందుకు ఖరీఫ్‌లో 88 మంది మిల్లర్లకు ఇచ్చింది. ఈ మేరకు ధాన్యం తీసుకున్న మిల్లర్లు 1,28,101 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు అప్పగించాలి. ఇదంతా గడువు ముగిసేలోపే జరగాలి. ప్రభుత్వ ధాన్యాన్ని సొంత ఆస్తిగా భావించే ధోరణి జిల్లాలోని మిల్లర్లలో ఉండడంతో ఇప్పటి వరకు కేవలం 29,746 మె.టన్నుల బియ్యం చెల్లిం చారు. ఇంకా 98,355 టన్నుల బియ్యం వీరి వద్దే ఉండిపోయింది. ఇలా ప్రభుత్వ బియ్యం ఇవ్వని మిల్లర్లు గత ఖరీఫ్‌లో 10 మంది ఉన్నారు. అయినా పౌరసరఫరాల శాఖలోని ఓ ద్వితీయశ్రేణి అధికారి ఈ ఖరీఫ్ సీజన్‌లోను భారీగా ధాన్యం కేటాయించడం వివాదాస్పదం అవుతోంది.
ఎందుకు ఉదాసీనత..
కస్టం మిల్లింగ్ ప్యాడీ కింద ధాన్యం కేటాయించే విషయంలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. ఒక సీజన్‌లో కస్టమ్ మిల్లింగ్‌కు సహకరించని రైసుమిల్లర్లకు మరో సీజన్‌లోను అధికారులు ఎందుకు ధాన్యం కేటాయిస్తున్నారో అర్థం కావడం లేదని ఆ శాఖలోని అధికారులే అంటున్నారు. ఈ ఏడాదిలో కస్టమ్ మిల్లింగ్ కోసం నిజామాబాద్ రెవెన్యూ డివిజన్‌లోని 51 మంది మిల్లర్లకు 80,488 మె.టన్నుల ధాన్యం కేటాయించారు.
ఈ మేరకు 54,669 మె.టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 11,944 మె.టన్నులు మాత్రమే ఇచ్చారు. 42,725 మె.టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే ఉన్నాయి.
ఇందులో సారంగపూర్‌కు చెందిన శ్రీసిద్దివినాయక అండ్ కంపెనీ, శ్రీ ఆర్‌కె ఎంఆర్‌ఎం, శేషాద్రి ఆగ్రో ఇండస్ట్రీస్‌లు 100 శాతం చెల్లించగా... ఖానాపూర్‌లోని శ్రీవంశీకృష్ట 98 శాతం, శ్రీరామ మోడ్రన్ పారాబాయిల్డ్ (సారంగపూర్), లక్ష్మీబాలాజీ ఇండస్ట్రీస్ (ఖానాపూర్)లు 95 శాతం బియ్యం చెల్లించాయి. కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌లో 32,426 మెట్రిక్ టన్నుల ధాన్యంకు 22,047 మె.టన్నుల బియ్యం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 14 శాతం మాత్రమే ఇచ్చారు.
బోధన్ డివిజన్‌లోని 26 మిల్లర్లకు 75,753 మె.టన్నుల ధాన్యం ఇచ్చిన పౌరసరఫరాలశాఖ 51,384 మె.టన్నుల బియ్యం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టింది. అయితే ఇప్పటి వరకు కేవలం 14,674 మె.టన్నులు బియ్యం చెల్లించిన మిల్లర్లు 36,710 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. మిగతా రైసుమిల్లర్లు నిర్దేశించిన సమయంలో బియ్యం ప్రభుత్వానికి చెల్లించే అవకాశం ఉన్నా... కస్టమ్ మిల్లింగ్ కోసం కేటాయించిన ధాన్యంతో వ్యాపారం చేస్తూ రూ.లక్షలు గడించాలని చూస్తున్నారు.
ఇందుకు ఆ శాఖలోని డీఎస్‌వో తర్వాత స్థానం లో ఓ అధికారే ఊతం ఇస్తుండటంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి పౌరసరఫరాల శాఖ తీరుపై నిరంతరం పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు. కస్టమ్ మిల్లింగ్‌కు సంబంధిం చిన కేటాయింపులపై విచారణ జరిపి... గడువులోగా బియ్యం వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మిల్లర్ల సంచిలో సర్కారు వడ్లు
Published Fri, Aug 29 2014 2:51 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement