ఆంధ్రా బియ్యానికి రాయపూర్‌ దెబ్బ | rice imports down | Sakshi
Sakshi News home page

ఆంధ్రా బియ్యానికి రాయపూర్‌ దెబ్బ

Published Sat, Aug 5 2017 12:10 AM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM

ఆంధ్రా బియ్యానికి రాయపూర్‌ దెబ్బ

ఆంధ్రా బియ్యానికి రాయపూర్‌ దెబ్బ

ఎగుమతులు లేక వ్యాపారులు విలవిల 
మన కంటే తక్కువ ధరకు చత్తీస్‌ఘడ్‌ సరుకు
కాకినాడ పోర్టు నుంచి అవే విదేశాలకు
రైతుల వద్ద ధాన్యం నిల్వలు 
తాడేపల్లిగూడెం:
ఆంధ్రా బియ్యానికి రాయపూర్‌ దెబ్బ తగిలింది. ఈ దెబ్బ ప్రభావం నేరుగా ఎగుమతులపై పడింది. ’’జీఎస్‌టీ వస్తుంది బియ్యం ధరలు తగ్గుతాయని’’ భారీగా ప్రచారం చేసిన మిల్లర్లు, వ్యాపారులు రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని అయిన కాడికి కొనేందుకు చూస్తున్నారు. ఇదే సమయంలో బియ్యం ఎగుమతులకు రాయ్‌పూర్‌ దెబ్బ తగిలింది. ఇటు బియ్యం ఎగుమతులు, అటు ధాన్యం కొనుగోళ్లు అరువు ప్రాతిపదికన మాత్రమే నడిచే పరిస్థితి వచ్చింది. రెండు నెలల క్రితం వరకు రైతు దగ్గర ధాన్యం ఉంటే చాలు వ్యాపారులు కొంటారులే అనే ధీమా ఉండేది. జీఎస్‌టీ పుణ్యాన సీన్‌ కాస్తా రివర్స్‌ అయ్యింది. 75 కిలోల ధాన్యం బస్తా ధర జీఎస్‌టీ రాక ముందు 1400 రూపాయల వరకు ఎగబాకింది. ఎప్పుడైతే జీఎస్‌టీ అమల్లోకి వచ్చిందో బియ్యం ధరలు పడిపోతాయని వ్యాపారులు, మిల్లర్లు పెద్దెత్తున ప్రచారం చేశారు. దాంతో «ధాన్యం ధరలు తగ్గిపోయాయి. జిల్లాలో ఎక్కువగా పండించే 1010 రకం« ధాన్యాన్ని ఇక్కడ ఎవ్వరూ తినే పరిస్థితి లేదు. సోనా అనో... పాలిష్‌ రైస్‌ అనో .. బ్రాండెడ్‌ సన్న బియ్యం అనో.. అవే తినే అలవాటులో పడిపోవడంతో మన దగ్గర పండిన ధాన్యం మనమే తినే అలవాటు లేకుండా పోయింది. ముతక రకం బియ్యంగా పిలుచుకొనే ఈ రకాలను కొండ ప్రాంతాల ప్రజలు బాగా ఇష్టపడతారు. దీంతో  ఆయా దేశాలకు ఇక్కడి నుంచి కాకినాడ పోర్టు ద్వారా బియ్యం సరఫరా చేసేవారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎగుమతి కంపెనీదారుల ప్రతినిధుల నుంచి లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ తీసుకొని ఇక్కడి మిల్లర్లు , వ్యాపారులు బియ్యాన్ని నేరుగా కాకినాడకు పంపి ఎగుమతి చేసేవారు. క్రమేణా మన బియ్యానికి ఇతర రాష్ట్రాల వ్యాపారులు పోటీకి దిగారు. ఎఫ్‌సీఐ లెవీగా బియ్యాన్ని మిల్లర్ల నుంచి తీసుకున్న సందర్భాలలో కేంద్రం ప్రకటించిన ఎంఎస్‌పీ (కనీస మద్దతు ధర)ని కచ్చితంగా  అమలు చేసేవారు. ఇతర రాష్ట్రాలలో చూస్తే అండర్‌ సేల్‌ మద్దతు ధర కంటే తక్కువగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం ఎగుమతుల విషయంలో పోటీ ఏర్పడింది. ముఖ్యంగా చత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్‌ వంటి ప్రాంతం నుంచి బియ్యం కాకినాడకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతోంది. ఆ రాష్ట్ర వ్యాపారులు ఇచ్చినంత తక్కువ ధరకు ఏపీ వ్యాపారులు, మిల్లర్లు బియ్యం ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఇక్కడి ఎగుమతులపై నీలినీడలు అలముకున్నాయి. ప్రస్తుతం ఎగుమతి రకం బియ్యం ధర క్వింటాలుకు రూ. 2200 నుంచి రూ. 2300 వరకు వస్తుంది. ఈ ధరకు ఇక్కడి వ్యాపారులు బియ్యం ఎగుమతి చేసే అవకాశాలు లేకుండా పోయాయి. 
ధాన్యానికి జీఎస్‌టీ దెబ్బ 
జీఎస్‌టీ వస్తే బ్రాండెడ్‌ బియ్యంపై ఐదు శాతం పన్ను ఉంటుందని ప్రచారం సాగింది. బ్రాండ్‌ల పేరిట కాకుండా విక్రయించే బియ్యం ధరలు భారీగా తగ్గుతాయని ప్రచారం చేశారు. దీంతో ధాన్యాలను మార్కెట్‌లో వ్యాపారులు కొనడం మానేశారు. నెలాపదిహేను రోజులుగా జీఎస్‌టీ ప్రభావం ధాన్యం ఖరీదులపై పడింది. జీఎస్‌టీకి ముందు తర్వాత అన్నట్టుగా ధాన్యం కొనుగోళ్లు మారాయి. 75 కిలోల బస్తా 1010 రకం ధాన్యం గతంలో 1450 రూపాయలకు వెళితే.. ప్రస్తుతం ఆ ధర 1300 లకు ఆగిపోయింది. పైగా నెల రోజుల పాటు అరువు. ప్రస్తుతం ఈ రకం బస్తా ధర 1450 రూపాయల వద్దే ఆగిపోయింది. 1121, 1156 రకం ధాన్యం బస్తా 1225 రూపాయల వద్ద ఉంది. పీఎల్‌ రకం 1450 రూపాయల దగ్గర ఆగిపోయింది. ధాన్యం సుమారుగా రైతుల వద్ద జిల్లాలో లక్ష క్వింటాళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ« ధాన్యం అమ్ముకోవాలన్నా అరువు ప్రాతిపదికన విక్రయించు కోవాల్సిందే. ధాన్యం ఉపఉత్పత్తులైన తవుడు ,నూకల ధరలపై కూడా ఈ ప్రభావాలు పడ్డాయి. తవుడు క్వింటాలు 1600, నూకలు 1750 రూపాయల వద్ద ఉండిపోయాయి.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement