న్యూఢిల్లీ: దిగుమతి నిర్వహణ వ్యవస్థను అనుసరించి అనుమతి పొందిన కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 4 బిలియన్ డాలర్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, ఇతర ఐటీ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. 2023–24లో ఈ దిగుమతుల విలువ 8.4 బిలియన్ డాలర్లు. వీటిలో అత్యధికం చైనా నుంచి భారత్‌కు వస్తున్నాయని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
2023 అక్టోబర్‌లో ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల దిగుమతుల కోసం ప్రభుత్వం దిగుమతి నిర్వహణ/అధికారీకరణను రూపొందించింది. మార్కెట్ సరఫరా దెబ్బతినకుండా దేశంలోకి ఈ వస్తువుల రాకను పర్యవేక్షించడం ఈ వ్యవస్థ లక్ష్యం. దీని ప్రకారం దరఖాస్తు చేసుకుని పొందిన అనుమతులు 2024 సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయి.
10 బిలియన్ డాలర్లకుపైగా..
నూతన వ్యవస్థ అమలులోకి వచ్చిన తొలిరోజు 2023 నవంబర్ 1న 100కుపైగా దరఖాస్తులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో యాపిల్, డెల్, లెనోవో వంటి సంస్థలు ఉన్నాయి. 10 బిలియన్ డాలర్లకుపైగా విలువైన ఉత్పత్తుల కోసం ఇవి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
ఈ ఏడాది సెప్టెంబర్ 30 తర్వాత తదుపరి ఉత్తర్వుల కోసం వాణిజ్య మంత్రిత్వ శాఖ పూర్తిగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూచనలను పాటిస్తుందని అధికారి తెలిపారు. 2022–23లో భారత్‌కు 5.33 బిలియన్ డాలర్ల విలువైన పర్సనల్ కంప్యూటర్లు దిగుమతి అయ్యాయి. ఇందులో చైనా వాటా ఏకంగా 5.11 బిలియన్ డాలర్లు ఉంది. సింగపూర్, హాంగ్‌కాంగ్, యూఎస్, మలేషియా, తైవాన్, నెదర్లాండ్స్, వియత్నాం సైతం ఐటీ ఉత్పత్తులను భారత్‌కు సరఫరా చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment