సాక్షి, హైదరాబాద్: పత్తిలో బీటీ మాదిరే వరిలోనూ కొత్తగా ఐపీటీ జన్యు టెక్నాలజీని ప్రవేశపెట్టారు. దీని ప్రభావంపై నిజామాబాద్ జిల్లాలో గుట్టుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగాలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కౌన్సిల్ (జీఈఏసీ), రివ్యూ కమిటీ ఆన్ జెనెటిక్ మానిప్యులేషన్ (ఆర్‌సీజీఎం)లు ఇప్పటికే అనుమతి ఇచ్చాయి. ఈ టెక్నాలజీ ప్రభావంపై నిజామాబాద్‌లో 30 రకాల ట్రయల్స్ జరుగుతున్నట్టు తెలిసింది. ఈ ప్రయోగాలను రాష్ట్ర వ్యవసాయశాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పర్యవేక్షిస్తున్నాయి. పత్తిలో బీటీ టెక్నాలజీని దేశంలో పరిచయం చేసిన మహికో కంపెనీ.. కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ ప్రయోగాలు చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. తక్కువ నీటితో వరి పండించడం, అధిక ఉత్పాదకత సాధించడమే ఈ టెక్నాలజీ లక్ష్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నా.. మరికొందరు ఈ ప్రయోగాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రయోగాలు సాగుతున్నాయిలా..
వరిలో ఐపీటీ జన్యువును మహారాష్ట్రలోని ఓ లేబొరేటరీలో మహికో కంపెనీ తయారుచేసినట్లు సమాచారం. అయితే ఈ జన్యువు ప్రభావంపై ఎక్కడ ప్రయోగాలు నిర్వహించాలన్న అంశంపై ముందుగా అనేక ప్రాంతాలను కంపెనీ పరిశీలించింది. తెలంగాణలోనే విత్తన సాగుకు అనుకూల వాతావరణం ఉండటంతో చివరకు నిజామాబాద్‌ను ఎంచుకున్నారు. కనీసం 50 శాతం అంతకంటే తక్కువ నీటితో వరి పండేలా చేయాలన్నదే ఈ ఐపీటీ జన్యు టెక్నాలజీ లక్ష్యమని చెబుతున్నారు. కొన్ని రకాల వరి విత్తనాల్లో ఈ టెక్నాలజీని చొప్పించి పది రోజుల వరకు నీరు పోయకుండా ప్రయోగాలు చేస్తున్నారు. కొన్నింటికి 20 రోజుల వరకు నీరు పోయకుండా పరిశోధనలు చేస్తున్నారు. మరికొన్ని ట్రయల్స్‌లో ఉష్ణోగ్రత, తేమశాతంలో మార్పులు చేసి పరిశీలిస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నాడు పత్తిలో... నేడు వరిలో..
పత్తిలో బీటీ టెక్నాలజీ ఓ విప్లవం అన్నది ఎంత వాస్తవమో దాంతో పత్తి విత్తనం విష వలయంలోకి వెళ్లిందనడం అంతే నిజం. పత్తి రైతుల ఆత్మహత్యలకు సైతం ఈ టెక్నాలజీ కారణమైంది. చివరకు పత్తిలో దేశీయ విత్తన మనుగడే లేకుండా పోయింది. గత్యంతరం లేక ఆ విషపు పత్తి విత్తనాన్నే రైతులు సాగు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మోన్‌శాంటో అనే బహుళజాతి కంపెనీ 2002లో పత్తిలో బీటీ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. చివరకు ఎలాగోలా స్థిరపడింది. అయినా పత్తిని గులాబీరంగు పురుగు పీడిస్తుండటంతో బీటీ టెక్నాలజీలో ఓ కణాన్ని చొప్పించి బీజీ–1గా మార్కెట్లోకి పత్తి విత్తనాన్ని తెచ్చింది. 2006 నాటికి బీజీ–1 కూడా గులాబీరంగు పురుగును తట్టుకునే శక్తి కోల్పోయింది.
దీంతో బీజీ–2 టెక్నాలజీతో పత్తి విత్తనాన్ని తెచ్చింది. 2012 నాటికి అది కూడా విఫలమైంది. తర్వాత దాన్ని రద్దు చేయకుండా మోన్‌శాంటో కంపెనీ బీజీ–3 విత్తనాలు తెచ్చింది. దానికితోడు పత్తి పంటకు కలుపు వస్తే దాన్ని నాశనం చేసేందుకు గ్‌లైపోసేట్ అనే పురుగుమందు తీసుకొచ్చింది. అయితే దీంతో జీవవైవిధ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని తేలడంతో కేంద్రం బీజీ–3కి అనుమతివ్వలేదు. అలాంటి మోన్‌శాంటో కంపెనీకి భారత్‌లో ఆశ్రయమిచ్చిన మహికో కంపెనీయే ఇప్పుడు.. వరిలో ఐపీటీ జన్యువును ప్రవేశపెడుతుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment