Gene conversion
-
ఆ ఆవాల వెనుక బలమైన కారణం ఉందా? కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: జన్యుమార్పిడి చేసిన(జీఎం) ఆవాలను (హైబ్రిడ్ డీఎంహెచ్–11) మార్కెట్లో విడుదల చేయడం వెనుక బలమైన కారణం ఏమైనా ఉందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో జన్యుమార్పిడి విత్తనాలపై నిషేధం విధించాలని కోరుతూ సామాజిక కార్యకర్త అరుణా రోడ్రిగ్స్, ‘జీన్ క్యాంపెయిన్’ అనే ఎన్జీవో దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. జన్యుమార్పిడి విత్తనాల గురించి మన దేశంలో రైతులకు పెద్దగా అవగాహన లేదని గుర్తుచేసింది. ఇలాంటి విత్తనాలతో నష్టాలు ఉంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి వాదనలు వినిపించారు. జన్యుమార్పిడి పంటలను సామాజిక కార్యకర్తలు, కొందరు నిపుణులు సిద్ధాంతపరమైన కారణాలతో వ్యతిరేకిస్తున్నారని, శాస్త్రీయ, హేతుబద్ధతతో కూడిన కారణాలతో కాదని చెప్పారు. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 7వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. డీఎంహెచ్–11 ఆవాలను సెంటర్ ఫర్ జెనెటిక్ మ్యానిప్యులేషన్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్∙అభివృద్ధి చేసింది. -
జన్యు కత్తెరకు నోబెల్
స్టాక్‌హోమ్: జన్యువులను మనకు అవసరమైన రీతిలో కచ్చితంగా కత్తిరించేందుకు ఓ పద్ధతి(జెనెటిక్ సిజర్స్)ని ఆవిష్కరించిన ఫ్రాన్స్ శాస్త్రవేత్త ఎమ్మాన్యుల్ షార్పెంటైర్ (51), అమెరికన్ శాస్త్రవేత్త జెన్నిఫర్ ఏ డౌడ్నా (56)లకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి దక్కింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం స్టాక్‌హోమ్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. జన్యు సంబంధి త వ్యాధుల చికిత్సతోపాటు అనేక ఇతర ప్రయోజనాలు కలిగిన ఈ పద్ధతిని క్రిస్పర్ క్యాస్–9 అని పిలుస్తారు. ‘ఈ జన్యు ఆధారిత పరిజ్ఞానం మౌలిక శాస్త్ర పరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావడమే కాకుండా సరికొత్త చికిత్సలు, అనూహ్యమైన పంటలను అందుబాటులోకి తీసుకురానుందని క్రిస్పర్ క్యాస్–9 గురించి రసాయన శాస్త్ర నోబెల్ కమిటీ అధ్యక్షులు క్లేస్ గుస్తాఫ్సన్ తెలిపారు. షార్పెంటైర్, డౌడ్నాల పరిశోధనల ఫలితంగా జన్యుక్రమంలోని లోపాలను సులువుగా సరిదిద్దవచ్చునని, అయితే ఈ టెక్నాలజీని చాలా జాగరుకతతో ఉపయోగించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అవార్డులో భాగంగా ఒక బంగారు పతకం, కోటి క్రోనార్లు (రూ.8.23 కోట్లు) నగదు అందిస్తారు. స్వీడన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 124 ఏళ్ల క్రితం ఈ అవార్డును ఏర్పాటు చేశారు. అవార్డు ప్రకటించిన సందర్భంగా ఎమ్మాన్యుల్ షార్పెంటైర్ బెర్లిన్ నుంచి ఫోన్ ద్వారా మాట్లాడుతూ ‘‘ఇది చాలా ఉద్వేగభరితమైన క్షణం’’అని వ్యాఖ్యానించారు. క్రిస్పర్ క్యాస్–9 కథ ఇదీ... పరిణామ క్రమంలో వైరస్ల దాడి నుంచి రక్షించుకునేందుకు బ్యాక్టీరియా ఓ శక్తిమంతమైన పరిజ్ఞానాన్ని తన సొంతం చేసుకుంది. దీన్నే క్రిస్పర్ అని పిలుస్తారు. వైరస్ దాడి చేసినప్పుడు దాన్ని జన్యుక్రమంలో బాగా గుర్తించగలిగే కొంత భాగాన్ని బ్యాక్టీరియా తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. భవిష్యత్తులో అదే వైరస్ మళ్లీ దాడి చేస్తే.. ఈ ‘మెమరీ కార్డు’ సాయంతో గుర్తించేందుకన్నమాట. ఒకసారి గుర్తించిందనుకోండి.. తనలోని మెమరీ కార్డుకు ఓ ఎంజైమ్ (క్యాస్ 9)ను జత చేసి కొత్తగా దాడి చేసిన వైరస్‌పైకి ప్రయోగిస్తుంది. ఇది కాస్తా... వైరస్ జన్యుక్రమంలోకి చేరిపోవడమే కాకుండా.. దాన్ని ముక్కలుగా కత్తిరిస్తుంది. మనిషికి విపరీతమైన హాని కలిగించే స్ట్రెప్టోకాకస్ పయోజీన్స్ బ్యాక్టీరియాపై పరిశోధనలు చేస్తున్న క్రమంలో ఎమ్మాన్యుల్ షార్పెంటైర్ అందులో అప్పటివరకూ గుర్తించని ఓ అణువు ఉన్నట్లు గుర్తించారు. ఈ ట్రాకర్‌ఆర్‌ఎన్‌ఏ పురాతన బ్యాక్టీరియా రోగ నిరోధక వ్యవస్థలో భాగమని తెలిసింది. దీనిపై 2011లో షార్పెంటైర్ తన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. అదే ఏడాది ఆర్ఎన్ఏపై అనుభవమున్న జెన్నిఫర్‌తో కలిసి పరిశోధనలు చేపట్టారు. ఇరువురూ ఆ ప్రక్రియను కృత్రిమంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేసి విజయం సాధించారు. సులువుగా పనిచేసేలా, ఏ రకమైన జన్యుపదార్థంతోనైనా పనిచేసేలా మార్చారు. అవసరమైతే మనుషులతోపాటు జంతువులు, మొక్కల జన్యువుల్లోనూ మార్పులు చేసేలా అన్నమాట. డీఎన్ఏ పోగులను అవసరమైనట్లుగా కత్తిరించడంతోపాటు జోడించే శక్తినీ ఈ పద్ధతికి వీరు చేర్చారు. 2012లో క్రిస్పర్ క్యాస్–9 పద్ధతిని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించగా.. శాస్త్రవేత్తలు ఇప్పటికే దీనిద్వారా ఎన్నో అద్భుతమైన ఫలితాలు రాబట్టగలిగారు. ప్రయోజనాలు ఇవీ... ► ఎయిడ్స్ తదితర వ్యాధులకు కారణమైన జన్యువులను సులువుగా తొలగించేందుకు ఈ క్రిస్పర్‌క్యాస్–9 ఉపయోగపడుతుంది. ► మలేరియా వంటి వ్యాధులను నిరోధించగల జన్యువులను దోమల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని అడ్డుకోవచ్చు. ► చైనాలో పాడిపశువుల్లో కండరాలు, వెంట్రుకల ఎదుగుదలను నిరోధించే జన్యువులను క్రిస్పర్ టెక్నాలజీ ద్వారా తొలగించి ఎక్కువ మాంసం, బొచ్చు పెరిగే గొర్రెలను అభివృద్ధి చేశారు. ► కేన్సర్‌కు సరికొత్త చికిత్స కల్పించేందుకు క్రిస్పర్ క్యాస్–9 పరిజ్ఞానాన్ని వాడుకునే ప్రయత్నం జరుగుతోంది. రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాల్లో మార్పులు చేయడం ద్వారా అవి కేన్సర్ కణాలను మరింత సమర్థంగా గుర్తించడంతోపాటు, నాశనం చేసేలా చేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ► కరవు కాటకాలను, చీడపీడలను తట్టుకోగల సరికొత్త వంగడాల సృష్టికి క్రిస్పర్ క్యాస్–9 బాగా ఉపయోగపడుతుంది. ► ఒక రకమైన ఈస్ట్‌లో జన్యుపరమైన మార్పులు చేసి అవి చక్కెరలను హైడ్రోకార్బన్లుగా మార్చేలా చేయవచ్చు. ఈ హైడ్రోకార్బన్లతో ప్లాస్టిక్‌ను తయారు చేయవచ్చు. ► మానవ జన్యుక్రమాల్లోనూ మార్పులు చేసేందుకు ఈ టెక్నాలజీని వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ దీనిపై పలు దేశాల్లో నిషేధం కొనసాగుతోంది. యూకేలో మానవ పిండాలపై మాత్రమే ప్రయోగాలు చేయవచ్చు. -
జీఎం ఫుడ్స్.. నగరంలో 32 శాతం లేబుల్స్ లేనివే విక్రయం
సాక్షి, సిటీబ్యూరో :జన్యు మార్పిడి పంటల (జెనిటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్)తో తయారైన ఆహార పదార్థాలు నగర మార్కెట్‌ను ముంచెత్తి ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లేలా చేస్తున్నాయి. నగరంలోని పలు మాల్స్, స్టోర్స్, సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్న చిరుతిళ్లు, నిత్యావసర ఆహార పదార్థాలు, చిన్నపిల్లలు అధికంగా ఇష్టపడే చిరుతిళ్లలో సుమారు 32 శాతం వరకు జన్యుమార్పిడి పంటల నుంచి తయారైనవేనని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇటీవల పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో చేసిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. జీఎం ఫుడ్స్‌లో ప్రధానంగా సోయా, మొక్కజొన్నతో తయారుచేసిన ఆహార పదార్థాలున్నాయని.. ఇవన్నీ ప్రధానంగా కెనడా, అమెరికా, నెదర్లాండ్స్, థాయ్‌లాండ్, యునైటెడ్ అరబ్ఎమిరేట్స్ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవేనని తేలింది. వీటిలో చాలావరకు జీఎం పాజిటివ్ ఆహార పదార్థాలేనని సీఎస్ఈ స్పష్టం చేసింది. అనర్థాలివీ.. ♦ రోగ నిరోధకశక్తిగణనీయంగా తగ్గుతుంది ♦ జీవక్రియ వేగంమందగిస్తుంది ♦ అలర్జీలకు గురయ్యే ప్రమాదం ♦ చర్మం, కళ్ల సంబంధిత జబ్బులు.. ♦ శ్వాస, జీర్ణకోశ సమస్యలు ♦ పలు సాంక్రమిక వ్యాధులు ♦ మన దేశంలో 2013 నుంచి అక్రమంగా జన్యుమార్పిడి పంటల సాగు మొదలైంది. ♦ జీఎం ఫుడ్స్‌లో ప్రధానంగా జన్యుమార్పిడి పత్తి విత్తనాల నుంచి తీసిన నూనెను వివిధ రకాల ఆహార పదార్థాల తయారీకి వినియోగిస్తున్నారు. ♦ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సోయా, మొక్కజొన్న తదితర పంటలతో తయారుచేసిన ఆహార పదార్థాల్లో జన్యుమార్పిడి పంటల ఆనవాళ్లున్నాయి. ♦ జన్యుమార్పిడి పంటలు, వాటితో తయారైన ఆహార పదార్థాలను కట్టడి చేసే విషయంలో ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చేష్టలుడిగి చూస్తోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ♦ గ్రేటర్ నగరంలో విక్రయిస్తున్న జీఎం ఫుడ్స్‌లో ప్రధానంగా ఉదయం అల్పాహారంగా తీసుకునే ఓట్స్, కార్న్ ఫ్లేక్స్ వంటి ఆహార పదార్థాలున్నాయి. ఉల్లంఘనలిలా.. ♦ నగర మార్కెట్లో విక్రయిస్తున్న జీఎం ఫుడ్స్‌లో మూడు రకాలున్నాయి.. జీఎం ఫుడ్స్ ఆనవాళ్లుండి లేబుల్స్ అతికించని పదార్థాలు వీటిలో ఒకటి కాగా.. ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు మించి జీఎం అవశేషాలున్నవి మరొకటి.. అసలు ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న జీఎం ఫుడ్స్ మూడోరకం. ♦ నగరంలోని అన్ని సూపర్ మార్కెట్లు, మాల్స్‌లో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో చాలావరకు జీఎం ఫుడ్స్ అనే లేబుల్స్ లేకుండానే విక్రయిస్తున్నట్లు తేలింది. ♦ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యయనంలో దేశంలో సుమారు 65 రకాల జీఎం ఫుడ్స్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించింది. ఇందులో 35 విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి కాగా.. మరో 30 రకాలు దేశీయంగా తయారవుతున్నాయి. ♦ సీఎస్ఈలోని పొల్యూషన్ మానిటరింగ్ ప్రయోగశాలలో పలు రకాల ఆహార పదార్థాలను పరిశీలించగా వీటిలో సుమారు 32 శాతం ఆహార పదార్థాలకు జీఎం పాజిటివ్ అని తేలింది. ♦ ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న ఆహార పదార్థాల్లో సుమారు 80 శాతం వరకు జీఎం పాజిటివ్ ఫుడ్స్ ఉన్నట్లు సీఎస్ఈ వెల్లడించింది. ఇవన్నీ ప్రధాన కంపెనీలకు చెందినవే కావడం గమనార్హం. ♦ జన్యు మార్పిడి పంటలతో తయారుచేసిన ఆహార పదార్థాలు ప్రధానంగా అమెరికా, కెనడా, నెదర్లాండ్స్, థాయ్‌లాండ్, యూఏఈ దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ♦ పలు ఆహార పదార్థాల ప్యాకింగ్ కవర్లపై జీఎం ఆనవాళ్లున్నట్లు ఎలాంటి లేబుల్స్ అతికించడంలేదని తేలింది. ♦ సూపర్మార్కెట్లలో విక్రయిస్తున్న పలు జీఎం పాజిటివ్ ఆహార పదార్థాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదని స్పష్టమైంది. ♦ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని ఆహార పదార్థాల ప్యాకింగ్‌పై జీఎం ఫ్రీ అని ఉన్నప్పటికీ.. వాటిలో జీఎం పంటల ఆనవాళ్లుండడం ఆందోళన కలిగిస్తోంది. కట్టడి చేయాల్సిందే.. నగర మార్కెట్లో ఎలాంటి అనుమతులు, లేబుల్స్ లేకుండా విక్రయిస్తున్న అన్నిరకాల జీఎం ఫుడ్స్‌ను నిషేధించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ఈ విషయంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వర్గాలు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని సూచిస్తున్నారు. వినియోగదారులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
జీఎంతో జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: సూపర్ మార్కెట్‌కు వెళితే ఇంటికి కావాల్సిన అన్ని సరుకులు కొనుగోలు చేస్తాం. ఉప్పుపప్పు నుంచి నూనెలు, బిస్కెట్లు, చాక్లెట్లు కూడా అందులో ఉంటాయి. అంతేకాదు.. అల్పాహారం కోసం విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఓట్స్ వంటివి కూడా తీసుకుంటాం. అంతేనా.. ఫారిన్ పళ్లు సైతం కొంటుంటాం. రోజూ కాకపోయినా వారానికోసారి అయినా ఆ తరహా షాపింగ్ ఉంటుంది. అయితే మీరు కొంటున్న ఆహార పదార్థాలను ఒక్కసారి పరిశీలించండి. ఎందుకంటే ఆరోగ్యానికి హాని చేసే జన్యుమార్పిడి పంటల (జీఎం ఫుడ్స్)తో తయారైన ఆహారం నగర మార్కెట్‌ను ముంచెత్తుతోంది. హైదరాబాద్‌లోని పలు మాల్స్, స్టోర్స్, సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్న నిత్యావసర ఆహార పదార్థాలు, చిన్నపిల్లలు అధికంగా ఇష్టపడే చిరుతిళ్లలో 32 శాతం వరకు జన్యుమార్పిడి పంటల నుంచి తయారైనవేనని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇటీవల పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో చేసిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. జీఎం ఫుడ్స్‌లో ప్రధానంగా సోయా, మొక్కజొన్నతో తయారు చేసిన పదార్థాలు ఉన్నాయని, ఇవన్నీ కెనడా, అమెరికా,నెదర్లాండ్స్, థాయ్‌లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవేనని తేలింది. వీటిలోచాలా వరకు జీఎం పాజిటివ్ ఆహార పదార్థాలేనని సీఎస్ఈ స్పష్టం చేసింది. మార్కెట్లో ఇంత జరుగుతున్నా ఫుడ్‌సేఫ్టీ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీఎం ఫుడ్స్ వెల్లువ ఇలా.. మన దేశంలో 2013 నుంచి అక్రమంగా పలు జన్యు మార్పిడి పంటల సాగు మొదలైంది. జీఎం ఫుడ్స్‌లో ప్రధానంగా జన్యుమార్పిడి పత్తి విత్తనాల నుంచి తీసిన నూనెను ఆహార పదార్థాల తయారీకి వినియోగిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సోయా, మొక్కజొన్న తదితర పంటలతో తయారు చేసిన ఆహార పదార్థాల్లో జన్యుమార్పిడి పంటల ఆనవాళ్లున్నాయి. జన్యుమార్పిడి పంటలు, వాటితో తయారైన పదార్థాలను కట్టడిచేసే విషయంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ చర్యలూ తీసుకోవట్లేదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో విక్రయిస్తున్న జీఎం ఫుడ్స్‌లో ప్రధానంగా ఉదయం అల్పాహారంగా తీసుకునే ఓట్స్, కార్న్‌ఫ్లేక్స్ వంటివి సైతం ఉన్నాయని తేలింది. ♦ జీఎం ఫుడ్స్‌లో మూడు రకాలున్నాయి.. జీఎం ఫుడ్స్ ఆనవాళ్లుండీ లేబుల్స్ అతికించని పదార్థాలు ఒకటి కాగా.. ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు మించి జీఎం అవశేషాలున్నవి మరొకటి.. అసలు ఎలాంటి అనుమతుల్లేకుండా విక్రయిస్తున్న జీఎం ఫుడ్స్ మూడోరకం. ♦ రాజధానిలోని అన్ని సూపర్ మార్కెట్లు, మాల్స్‌లో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో చాలావరకు జీఎం ఫుడ్స్ ఆగ్మార్క్ లేబుల్స్ లేకుండానే విక్రయిస్తున్నట్లు తేలింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యయనంలో దేశంలో సుమారు 65 రకాల జీఎం ఫుడ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించింది. ఇందులో 35 విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి, మరో 30 దేశీయంగా తయారవుతున్నాయి. ♦ సీఎస్ఈలోని పొల్యూషన్ మానిటరింగ్ ప్రయోగశాలలో పలు రకాల ఆహార పదార్థాలను పరిశీలించగా వీటిలో సుమారు 32 శాతం ఆహార పదార్థాలకు ‘జీఎం–పాజిటివ్’ అని తేలింది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న ఆహార పదార్థాల్లో సుమారు 80 శాతం వరకు జీఎం పాజిటివ్ ఉన్నట్లు సీఎస్ఈ వెల్లడించింది. అంతేగాక పలు ఆహార పదార్థాల ప్యాకింగ్‌పై జీఎం ఆనవాళ్లున్నట్లు ఎలాంటి లేబుల్స్ అతికించట్లేదని గుర్తించారు. ♦ సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్న పలు జీఎం పాజిటివ్ ఆహార పదార్థాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదని స్పష్టమైంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని ఆహార పదార్థాల ప్యాకింగ్‌పై ‘జీఎం ఫ్రీ’ అని ఉన్నా.. వాటిలో జీఎం ఆనవాళ్లుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆహారంతో ఎన్నో అనర్థాలు మానవుల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. జీవక్రియ వేగం మందగిస్తుంది. అలర్జీలకు గురయ్యే ప్రమాదం ఉంది. చర్మం, కళ్ల సంబంధ వ్యాధులు, శ్వాస, జీర్ణకోశ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. సాంక్రమిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ ఫుడ్‌ను కట్టడి చేయాల్సిందే.. రాజధాని మార్కెట్లో ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న అన్నిరకాల జీఎం ఫుడ్స్‌ను నిషేధించాలి. ఈ విషయంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కఠినంగా వ్యవహరించాలి. పలు మాల్స్, సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్న జీఎం ఫుడ్స్‌పై జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేపట్టాలి. జీఎం ఫుడ్స్ కొనుగోలు విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ఇవి తింటే రోగాలు కొనితెచ్చుకున్నట్లే. – ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, పర్యావరణవేత్త -
జన్యు మార్పిడి వరి!
సాక్షి, హైదరాబాద్: పత్తిలో బీటీ మాదిరే వరిలోనూ కొత్తగా ఐపీటీ జన్యు టెక్నాలజీని ప్రవేశపెట్టారు. దీని ప్రభావంపై నిజామాబాద్ జిల్లాలో గుట్టుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగాలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కౌన్సిల్ (జీఈఏసీ), రివ్యూ కమిటీ ఆన్ జెనెటిక్ మానిప్యులేషన్ (ఆర్సీజీఎం)లు ఇప్పటికే అనుమతి ఇచ్చాయి. ఈ టెక్నాలజీ ప్రభావంపై నిజామాబాద్‌లో 30 రకాల ట్రయల్స్ జరుగుతున్నట్టు తెలిసింది. ఈ ప్రయోగాలను రాష్ట్ర వ్యవసాయశాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పర్యవేక్షిస్తున్నాయి. పత్తిలో బీటీ టెక్నాలజీని దేశంలో పరిచయం చేసిన మహికో కంపెనీ.. కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ ప్రయోగాలు చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. తక్కువ నీటితో వరి పండించడం, అధిక ఉత్పాదకత సాధించడమే ఈ టెక్నాలజీ లక్ష్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నా.. మరికొందరు ఈ ప్రయోగాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రయోగాలు సాగుతున్నాయిలా.. వరిలో ఐపీటీ జన్యువును మహారాష్ట్రలోని ఓ లేబొరేటరీలో మహికో కంపెనీ తయారుచేసినట్లు సమాచారం. అయితే ఈ జన్యువు ప్రభావంపై ఎక్కడ ప్రయోగాలు నిర్వహించాలన్న అంశంపై ముందుగా అనేక ప్రాంతాలను కంపెనీ పరిశీలించింది. తెలంగాణలోనే విత్తన సాగుకు అనుకూల వాతావరణం ఉండటంతో చివరకు నిజామాబాద్‌ను ఎంచుకున్నారు. కనీసం 50 శాతం అంతకంటే తక్కువ నీటితో వరి పండేలా చేయాలన్నదే ఈ ఐపీటీ జన్యు టెక్నాలజీ లక్ష్యమని చెబుతున్నారు. కొన్ని రకాల వరి విత్తనాల్లో ఈ టెక్నాలజీని చొప్పించి పది రోజుల వరకు నీరు పోయకుండా ప్రయోగాలు చేస్తున్నారు. కొన్నింటికి 20 రోజుల వరకు నీరు పోయకుండా పరిశోధనలు చేస్తున్నారు. మరికొన్ని ట్రయల్స్‌లో ఉష్ణోగ్రత, తేమశాతంలో మార్పులు చేసి పరిశీలిస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాడు పత్తిలో... నేడు వరిలో.. పత్తిలో బీటీ టెక్నాలజీ ఓ విప్లవం అన్నది ఎంత వాస్తవమో దాంతో పత్తి విత్తనం విష వలయంలోకి వెళ్లిందనడం అంతే నిజం. పత్తి రైతుల ఆత్మహత్యలకు సైతం ఈ టెక్నాలజీ కారణమైంది. చివరకు పత్తిలో దేశీయ విత్తన మనుగడే లేకుండా పోయింది. గత్యంతరం లేక ఆ విషపు పత్తి విత్తనాన్నే రైతులు సాగు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మోన్శాంటో అనే బహుళజాతి కంపెనీ 2002లో పత్తిలో బీటీ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. చివరకు ఎలాగోలా స్థిరపడింది. అయినా పత్తిని గులాబీరంగు పురుగు పీడిస్తుండటంతో బీటీ టెక్నాలజీలో ఓ కణాన్ని చొప్పించి బీజీ–1గా మార్కెట్లోకి పత్తి విత్తనాన్ని తెచ్చింది. 2006 నాటికి బీజీ–1 కూడా గులాబీరంగు పురుగును తట్టుకునే శక్తి కోల్పోయింది. దీంతో బీజీ–2 టెక్నాలజీతో పత్తి విత్తనాన్ని తెచ్చింది. 2012 నాటికి అది కూడా విఫలమైంది. తర్వాత దాన్ని రద్దు చేయకుండా మోన్శాంటో కంపెనీ బీజీ–3 విత్తనాలు తెచ్చింది. దానికితోడు పత్తి పంటకు కలుపు వస్తే దాన్ని నాశనం చేసేందుకు గ్లైపోసేట్ అనే పురుగుమందు తీసుకొచ్చింది. అయితే దీంతో జీవవైవిధ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని తేలడంతో కేంద్రం బీజీ–3కి అనుమతివ్వలేదు. అలాంటి మోన్శాంటో కంపెనీకి భారత్‌లో ఆశ్రయమిచ్చిన మహికో కంపెనీయే ఇప్పుడు.. వరిలో ఐపీటీ జన్యువును ప్రవేశపెడుతుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మనిషిని మళ్ళీ సృష్టిస్తారా?
కృత్రిమంగా మానవ జన్యు క్రమం తయారీకి రంగం సిద్ధం - ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఇంజనీరింగ్ బయాలజీ’ పేరిట సంస్థ ఏర్పాటు - పదేళ్ల సమయం... రూ. 6,500 కోట్ల ఖర్చుతో మహా ప్రయోగం - వైద్య చికిత్సల అభివృద్ధికి, వైరస్‌లకు శరీరం లొంగకుండా చేయడానికేనని ప్రకటన - అసలు లక్ష్యం సృష్టికి ప్రతిసృష్టి చేయడమే! మనిషి పుట్టుకకు తల్లి, తండ్రి తప్పనిసరి.. ఇరువురి నుంచి చెరి సగంగా అందేజన్యు పదార్థంతో ఒక అండం పిండమవుతుంది, నవమాసాల్లో ఎదిగి బిడ్డగా జన్మిస్తుంది.. ఇదీ ప్రకృతి నియమం.. దాన్ని కాదని మానవ ‘క్లోనింగ్’తో ప్రతిసృష్టికి ప్రయత్నం జరిగింది.. విఫలమైంది.. ఇప్పుడు మళ్లీ అలాంటి మరో మహా ప్రయత్నానికి బీజం పడింది.. కృత్రిమ హ్యూమన్ జినోమ్ తయారీ ప్రాజెక్టు (హెచ్జీపీ-రైట్) మొదలైంది.. మానవ జన్యుక్రమాన్ని కృత్రిమంగా తయారు చేయడమే దీని ఆశయం. ఆ జన్యు క్రమాన్ని మానవ కణంలో ప్రవేశపెట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయడమే దాని లక్ష్యం. మనం కోరుకున్న లక్షణాలతో, కోరుకున్న అంశాలతో మనుషులను సృజించడమే చివరి గమ్యం. తల్లిదండ్రుల అవసరం లేకుండా కృత్రిమ జన్యుక్రమంతో పిల్లలను పుట్టించడమే దీని వల్ల వచ్చే అంతిమ ఫలితం.. ఈ పరిశోధన ప్రకృతి విరుద్ధమంటూ పెద్ద ఎత్తున విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. సైన్సుకు, నైతికతకు ముడిపెడుతున్న ఈ అంశంపై ఈ వారం ఫోకస్... - సాక్షి, హైదరాబాద్ కృత్రిమ జన్యుక్రమం రూపకల్పన ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త జార్జ్ చర్చ్ హ్యూమన్ జినోమ్ ప్రాజెక్ట్ మానవ జన్యుక్రమం మొత్తాన్ని చదవాలన్న సంకల్పంతో అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన ప్రాజెక్టు ఇది. మానవ పరిణామ క్రమాన్ని, వ్యాధులకు కారణాలు, మెరుగైన చికిత్సకు అవకాశాలు వంటి లక్ష్యాలతో ఆ ప్రాజెక్టును చేపట్టారు. 1985లో రాబర్ట్ షిన్షైమర్ అనే అమెరికన్ శాస్త్రవేత్త ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. తరువాత అమెరికా ప్రభుత్వ సంస్థలు వేరుగా ఈ ప్రయత్నానికి తుదిరూపం ఇచ్చాయి. చివరకు 1990లో అమెరికా డి పార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌లు దాదాపు 300 కోట్ల డాలర్లతో ఈ ప్రాజెక్టును చేపట్టి 2003 నాటికి పూర్తి చేశాయి. అయితే వారు జన్యుక్రమంలోని మొత్తం అమరికను చదవలేదు. జన్యుక్రమంలో 90 శాతం వరకూ ఉండే కీలకమైన యూక్రోమాటిక్ ప్రాంతాల్లోని క్రమాన్ని మాత్రమే చదివారు. సెంటీమెర్, టెలిమెర్లతో కూడిన మిగతా భాగాన్ని వదిలేశారు. మరోవైపు 1998లో క్రెయిగ్ వెంటర్ అనే శాస్త్రవేత్త ‘సెలరో జినోమిక్స్’ కంపెనీ పేరుతో మానవ జన్యుక్రమాన్ని నమోదు చేయడం మొదలుపెట్టారు. అతితక్కువ కాలంలో వెంటర్ తన ప్రాజెక్టును పూర్తి చేసినప్పటికీ... 2003, 2005లో రెండు బృందాలు సంయుక్తంగా తమ ఫలితాలను వెల్లడించడం గమనార్హం. పదేళ్ల పాటు ప్రయోగం.. దాదాపు నెల రోజుల క్రితం అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఓ సమావేశం జరిగింది. దాదాపు 150 మంది సైంటిస్ట్‌లు, లాయర్లు, టెక్నాలజిస్టులు అందులో పాల్గొన్నారు. మీడియాకు అనుమతి లేదు, అంతా గుట్టుచప్పుడు కాకుండా.. రహస్యంగా జరిగింది! హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రఖ్యాత జన్యు శాస్త్రవేత్త జార్జ్ చర్చ్, ఆయన స్థాపించిన జెన్9 కంపెనీ సీఈవో కెవిన్ మునెల్లీ, న్యూయార్క్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్త జెఫ్ బోక్, సాఫ్ట్వేర్ సంస్థ ఆటోడెస్క్కు చెందిన ఆండ్రూ హెసెల్లు ఆ భేటీలో పాల్గొన్నారు. శాస్త్రవేత్తలు రహస్యంగా నిర్వహించిన సమావేశం వివరాలు ఇటీవలే బయటకు వచ్చాయి. వైద్య శాస్త్రపరంగా ఎన్నో చికిత్సలను అభివృద్ధి చేయడానికి.. వైరస్లు, బ్యాక్టీరియాలకు మన శరీరం లొంగకుండా చేయడానికి, మనుషులకు సరిపడేలా పంది అవయవాలను తీర్చిదిద్దడానికి తాము ఈ మహా ప్రయత్నాన్ని చేపట్టామని శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీనికోసం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఇంజనీరింగ్ బయాలజీ’ పేరిట ఒక లాభాపేక్ష రహిత సంస్థను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది పరిశోధన కోసం 650 కోట్ల రూపాయలను వివిధ పబ్లిక్, ప్రైవేటు సంస్థల నుంచి సేకరించనున్నట్లు వెల్లడించారు. అయితే మొత్తంగా ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందనేది చెప్పేందుకు నిరాకరించారు. కానీ ఈ ప్రాజెక్టుకు మొత్తంగా రూ. 6,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. జన్యువుల అమరికే మూలం మనకొచ్చే అనేక వ్యాధులకు జన్యువులు కారణమని చాలా కాలంగా తెలుసు. అయితే ఈ జన్యువులు ఏవి, వాటి నిర్మాణం ఎలా ఉంటుంది, మార్పులు చేయడం ద్వారా వ్యాధులను అరికట్టవచ్చా వంటి అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు 1996 ప్రాంతంలో హ్యూమన్ జినోమ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. దాదాపు ఏడేళ్ల శ్రమ తరువాత 2003లో అది పూర్తయింది. మన కణాల్లోని క్రోమోజోమ్‌లలో ఉండే అన్ని డీఎన్ఏ పోగుల్లో ఏ రసాయనాలు ఎలా అమరి ఉన్నాయో తెలుసుకోగలిగాం. ఇంకోలా చెప్పాలంటే మానవ జన్యుక్రమాన్ని చదివేశామన్నమాట. దీని ద్వారా వ్యాధులపై అవగాహన పెరగడంతోపాటు, జన్యుమార్పిడి ద్వారా అటు వ్యవసాయంలో, ఇటు వైద్యంలోనూ వినూత్న పరిణామాలు సంభవించాయి. జెనిటిక్ ఇంజనీరింగ్ పేరుతో శాస్త్రవేత్తలు అధిక దిగుబడినిచ్చే, చీడపీడలను తట్టుకోగల కొత్త వంగడాలను సృష్టించగలిగారు. క్రిస్పర్, క్యాస్9 వంటి టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో జన్యువులను మన అవసరాలకు తగ్గట్టుగా తీసివేయడం జోడించడం సాధ్యమవుతోంది. అయితే పరిశోధనలు ఒక చోట ఆగేవి కాదు. అందుకే కొందరు శాస్త్రవేత్తలు.. ‘ఎలాగూ జన్యుక్రమాన్ని చదివేయగలిగాం, కొంతమేరకు మార్పులు, చేర్పులూ చేయగలుగుతున్నాం.. మనమే కృత్రిమంగా ఓ జన్యుక్రమాన్ని తయారు చేస్తే ఎలా ఉంటుంది?’ అన్న ఆలోచనకు తెర లేపారు. దాని ఫలితంగానే కృత్రిమ జన్యుక్రమం తయారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. 1. కణం: శరీరంలో కోటానుకోట్ల కణాలు. ఒక్కో కణ కేంద్రకంలో ఉండలు చుట్టుకుని 46 క్రోమోజోములు ఉంటాయి. 2. క్రోమోజోములు: క్రోమోజోముల్లో సగం తల్లి నుంచి మిగిలినవి తండ్రి నుంచి అందుతాయి. ఒక్కో క్రోమోజోమ్‌లో గుదిగుచ్చిన పూలదండలా ఉండే అణువు డిఆక్సీరైబోన్యూక్లిక్ యాసిడ్ (డీఎన్ఏ). ఇది మెలితిరిగిన నిచ్చెన ఆకారంలో ఉంటుంది. 3. డీఎన్ఏ: కణంలో ఉండే 46 క్రోమోజోముల్లో డీఎన్ఏ ఉంటుంది. దానిని పక్కపక్కన జోడిస్తే దాదాపు ఆరు అడుగుల పొడవుంటుంది. 4. జన్యుక్రమం: అన్ని డీఎన్ఏ పోగులను కలిపి చూసినప్పుడు ఇవి ఏ క్రమంలో ఉన్నాయో చెప్పేదే జన్యుక్రమం. డీఎన్ఏ అణువు అడినైన్ (ఏ), గ్వానైన్ (జీ) సైటోసైన్ (సీ), థైమీన్ (టీ) అనే నాలుగు రసాయనాలతో ఏర్పడుతుంది. వీటిని నూక్లియోటైడ్ బేసెస్ అంటారు. అడినైన్ మూలకం థైమీన్తో, గ్వానైన్ సైటోసైన్తో మాత్రమే రసాయన బంధం ఏర్పరచుకుంటుంది. వీటిని బేస్‌పెయిర్స్ అంటారు. మానవ జన్యుక్రమంలో 300 కోట్ల బేస్‌పెయిర్స్ ఉన్నాయని అంచనా. 5. జన్యువులు: జన్యుక్రమంలోని డీఎన్ఏలో విడివిడిగా ఉండే భాగాలను జన్యువులు అంటారు. ఒక్కో కణంలో మొత్తంగా 30,000 జన్యువులు ఉంటాయి. ఒక్కోటి సగటున 3 వేల బేస్‌పెయిర్స్ పొడవు ఉంటుంది. అతిపొడవైన జన్యువు డైస్ట్రోఫిన్లో దాదాపు 24 లక్షల బేస్ పెయిర్స్ ఉన్నాయి. జన్యువుల్లో ప్రొటీన్లను ఉత్పత్తి చేసే సూచనలు ఉంటాయి. ఆ ప్రొటీన్లతోనే మన శరీర అవయవాలు తయారవుతాయి. గుండె కొట్టుకునే వేగం, రక్తంలో చక్కెర శాతం వంటి వాటిని నిర్ణయించేవీ ప్రొటీన్లే. మనం తినే ఆహారం, వేసుకునే మందులు శరీరంలో ఏ విధంగా ఉపయోగపడాలన్నది కూడా ప్రొటీన్లే తేలుస్తాయి. 6. తేడా వస్తే చిక్కే: జన్యువుల్లోని రసాయనాల అమరికలో ఏమాత్రం తేడా వచ్చినా వ్యాధులు తలెత్తుతాయి. మానవ జన్యుక్రమాన్ని ఆవిష్కరించాక వివిధ వ్యాధులు ఉన్నవారి జన్యువులను, వ్యాధులు లేనివారి జన్యువులతో పోల్చి చూసి లోపం ఎక్కడ ఉందో గుర్తించగలుగుతున్నారు. 7. జన్యులోపాలు, వ్యాధులు: శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ దాదాపు 6,000 వ్యాధులకు కారణమవుతున్న జన్యులోపాలను గుర్తించారు. సిస్టిక్ ఫైబ్రోసిస్, హంటింగ్టన్ వంటివి కేవలం ఒక జన్యువులో తేడాల కారణంగా వస్తున్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మధుమేహం, గుండె జబ్బులతో పాటు సాధారణ వ్యాధుల్లో జన్యు లోపాల పాత్ర తక్కువగా ఉంటుంది. కణం ఏమిటి.. జన్యుక్రమం ఏమిటి..? డీఎన్ఏ ప్రత్యేకతలివీ.. ► మన శరీరంలోని కణాలన్నింటిలోని డీఎన్ఏను పొడవుగా పక్కపక్కన పెట్టుకుంటూ వెళితే.. దానితో భూమి నుంచి సూర్యుడిని 600 సార్లు చుట్టేయవచ్చు. ► మానవులందరిలో 99.9 శాతం జన్యుక్రమం ఒకేలా ఉంటుంది. మిగిలిన 0.1 శాతంలో వచ్చే తేడాలతోనే మనుషుల్లో ఎన్నో రకాలు తేడాలు కనిపిస్తాయి. ► జన్యుక్రమంలో 97 శాతం ప్రాంతం ద్వారా ఏ రకమైన ప్రొటీన్లు ఉత్పత్తి కావు. దానినే జంక్ లేదా అవసరం లేని డీఎన్ఏ అని భావించేవారు. అయితే ఇటీవలి పరిశోధనల ద్వారా దానితోనూ పలు ప్రయోజనాలు ఉన్నట్లు గుర్తించారు. ► ప్రస్తుతం 2000కుపైగా వ్యాధుల గుర్తింపునకు జన్యుపరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వ్యాపారంగా జన్యు మార్పిడి జన్యు మార్పిడి అనేది ఇప్పుడు ఓ భారీ పరిశ్రమగా చెప్పుకోవాలి. కాకపోతే అందులో ప్రకృతిలో అందుబాటులో ఉన్న జన్యువులనే వినియోగిస్తారు. జెన్9 కంపెనీ విషయాన్నే తీసుకుంటే సెంజెంటా వంటి కంపెనీలకు అవసరమైన జన్యువులను అమ్ముకుంటోంది. దీంతోపాటు ట్విస్ట్, గింగ్‌కో వర్క్స్ వంటి కొన్ని కంపెనీలు కూడా ఫార్మా, వ్యవసాయ రంగాలకు అవసరాల మేరకు చిన్న చిన్న సైజులో డీఎన్ఏ పోగులను కృత్రిమ పద్ధతుల్లో అమర్చి అందిస్తున్నాయి. ఇందుకయ్యే ఖర్చు కూడా తక్కువైపోయింది. 2003లో జన్యుక్రమంలోని ఒక బేస్‌పెయిర్‌ను జోడించేందుకు అయ్యే ఖర్చు దాదాపు నాలుగు డాలర్లు (రూ.260) అయితే ఇప్పుడు అదే పనిని మూడు సెంట్ల (రూ.20)తో పూర్తవుతోంది. అయితే ఇక్కడ ఒక పెద్ద అడ్డంకి ఉంది. మనకు అవసరమైనంత పొడవాటి డీఎన్ఏ పోగులను తయారు చేయడం ఇప్పటివరకూ సాధ్యం కావడం లేదు. అతి కష్టమ్మీద 200 నుంచి వెయ్యి బేస్‌పెయిర్స్ పొడవైన డీఎన్ఏలను మాత్రమే తయారు చేయగలుగుతున్నారు. మనిషి జన్యువుల్లో అతి చిన్నదాని పొడవు మూడు వేల బేస్‌పెయిర్స్ వరకూ ఉంటుంది. ఉపయోగం ఎంత... మానవ జన్యుక్రమం మొత్తాన్ని కృత్రిమంగా తయారు చేసి దాన్ని కణంలో ప్రవేశపెట్టడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏమిటన్న సందేహం చాలామందికి వస్తుంది. నిజానికి ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఎవరికీ తెలియదు. హార్వర్డ్ రహస్య సమావేశానికి హాజరైన డాక్టర్ చర్చ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘మనిషిని కృత్రిమంగా సృష్టించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం కాదు. జన్యుక్రమంలో మరింత వేగవంతమైన పద్ధతులను ఆవిష్కరించాలని ఆలోచిస్తున్నాం. కృత్రిమ జన్యుక్రమంతో మన అవసరాలను తీర్చగల కొత్త కొత్త జీవాలను సృష్టించడం వీలవుతుంది..’’ అని చెప్పారు. ఇది వాస్తవమే. మానవ జన్యుక్రమ ఆవిష్కర్తల్లో ఒకరైన క్రెయిగ్ వెంటర్ 1990 దశకంలోనే కృత్రిమ జీవాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించారు. మైకోప్లాస్మా జెనెటాలియం బ్యాక్టీరియా బతికి ఉండేందుకు అవసరమైన కనీస జన్యువులను గుర్తించారు. 2008లో కృత్రిమ పద్ధతుల ద్వారా ఈ జన్యువులతో ఓ డీఎన్ఏ పోగును తయారు చేసి దాన్ని మరో బ్యాక్టీరియాలోకి జొప్పించారు. ఆ బ్యాక్టీరియా జీవం పోసుకోవడంతోపాటు ఇతర బ్యాక్టీరియా మాదిరిగానే విభజన చెందడం మొదలుపెట్టింది. మరోలా చెప్పాలంటే... ప్రపంచంలోనే తొలి కృత్రిమ జీవం ఊపిరిపోసుకుంది. 2003లో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన జే కీస్లింగ్ అనే శాస్త్రవేత్త మలేరియా చికిత్సకు ఉపయోగించే ఆర్టిమిసినిన్ రసాయనాన్ని బ్యాక్టీరియా ద్వారా తయారు చేసేందుకు ప్రయత్నించి విజయం సాధించారు. మొక్కల ద్వారా తయారు చేయగలిగే ఆర్టిమిసినిన్ మోతాదు చాలా తక్కువగా ఉంటుంది. దీంతో కీస్లింగ్ వేర్వేరు ప్రాణుల నుంచి సేకరించిన జన్యువులను ఈ-కోలీ బ్యాక్టీరియాలోకి జొప్పించి ఈ రసాయనాన్ని ఉత్పత్తి చేసేలా చేయగలిగారు. మరికొన్ని మార్పుల ద్వారా అది చేసే ఉత్పత్తిని పదిరెట్లు ఎక్కువ చేయగలిగారు. తాజాగా చేపట్టిన ప్రాజెక్టు (హెచ్జీపీరైట్) విజయవంతమైతే పర్యావరణానికి హాని కలిగించని ఇంధనాల తయారీకి, అత్యధిక దిగుబడినిచ్చే సరికొత్త పంటలకు కొత్త కొత్త జీవజాతులు పుట్టుకొచ్చినా ఆశ్చర్యం లేదు. సాధ్యమయ్యేనా? మానవ జన్యుక్రమాన్ని కృత్రిమంగా తయారు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హార్వర్డ్ సమావేశం రహస్యంగా జరగడాన్ని కొందరు తప్పు పడుతుండగా... కృత్రిమ జన్యు క్రమ తయారీ అనైతికమని ఇంకొందరు అంటున్నారు. మరోవైపు దాదాపు 300 కోట్ల బేస్‌పెయిర్స్ ఉన్న మానవ జన్యుక్రమాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాంకేతికంగా సాధ్యం కాకపోవచ్చన్నది మరికొందరి వాదన. అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా... ప్రస్తుతం కొన్ని వందల బేస్‌పెయిర్స్ పొడవైన డీఎన్ఏను మాత్రమే తయారు చేయగలుగుతున్నారు. అలాంటిది 300 కోట్ల బేస్‌పెయిర్స్ అంటే.. సాధ్యమయ్యేదేనా అనే సందేహం వ్యక్తమవుతోంది. క్రిస్పర్/క్యాస్9 టెక్నాలజీతో... జన్యుక్రమంలో మార్పులు/చేర్పులు చేసేందుకు ఇటీవల అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానమే ‘క్రిస్పర్/క్యాస్9’. చైనా శాస్త్రవేత్త ఒకరు ఇప్పటికే ఈ టెక్నాలజీ సాయంతో మానవ పిండంలో మార్పులు చేశారు. ఇతర శాస్త్రవేత్తలు మధుమేహ వ్యాధి చికిత్సకు అవసరమైన ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే శిలీంధ్రాలను అభివృద్ధి చేశారు. మానవ కణాల్లోంచి హెచ్ఐవీ వైరస్‌లను తొలగించేందుకూ ప్రయత్నం జరుగుతోంది. వ్యవసాయంలోనూ ఈ జన్యు ఎడిటింగ్ టెక్నాలజీ వేగంగా అడుగులు వేస్తోంది. డ్యూపాంట్ కంపెనీ కరువు పరిస్థితులను తట్టుకుని నిలవగల గోధుమ, మొక్కజొన్న వంగడాల అభివృద్దికి ప్రయత్నిస్తుండగా... ఆర్టీడీఎస్ అనే ఇంకో జన్యు ఎడిటింగ్ టెక్నాలజీ సాయంతో చీడలను సమర్థంగా ఎదుర్కొనే ఆవాల వంగడాన్ని రూపొందించి మార్కెట్లోకి విడుదల చేశారు.