జీఎం ఫుడ్స్‌.. నగరంలో 32 శాతం లేబుల్స్‌ లేనివే విక్రయం | Gene conversion Crops Food in Hyderabad Super Market | Sakshi
Sakshi News home page

నగరంలో 32 శాతం లేబుల్స్‌ లేనివే విక్రయం

Published Thu, Jan 10 2019 10:27 AM | Last Updated on Thu, Jan 10 2019 10:27 AM

Gene conversion Crops Food in Hyderabad Super Market - Sakshi

సాక్షి, సిటీబ్యూరో :జన్యు మార్పిడి పంటల (జెనిటికల్లీ మాడిఫైడ్‌ ఫుడ్స్‌)తో తయారైన ఆహార పదార్థాలు నగర మార్కెట్‌ను ముంచెత్తి ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లేలా చేస్తున్నాయి. నగరంలోని పలు మాల్స్, స్టోర్స్, సూపర్‌ మార్కెట్లలో విక్రయిస్తున్న చిరుతిళ్లు, నిత్యావసర ఆహార పదార్థాలు, చిన్నపిల్లలు అధికంగా ఇష్టపడే చిరుతిళ్లలో సుమారు 32 శాతం వరకు జన్యుమార్పిడి పంటల నుంచి తయారైనవేనని ఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇటీవల పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో చేసిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. జీఎం ఫుడ్స్‌లో ప్రధానంగా సోయా, మొక్కజొన్నతో తయారుచేసిన ఆహార పదార్థాలున్నాయని.. ఇవన్నీ ప్రధానంగా కెనడా, అమెరికా, నెదర్లాండ్స్, థాయ్‌లాండ్, యునైటెడ్‌ అరబ్‌ఎమిరేట్స్‌ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవేనని తేలింది. వీటిలో చాలావరకు జీఎం పాజిటివ్‌ ఆహార పదార్థాలేనని సీఎస్‌ఈ స్పష్టం చేసింది.

అనర్థాలివీ..
రోగ నిరోధకశక్తిగణనీయంగా తగ్గుతుంది  
జీవక్రియ వేగంమందగిస్తుంది
అలర్జీలకు గురయ్యే ప్రమాదం  
చర్మం, కళ్ల సంబంధిత జబ్బులు..
శ్వాస, జీర్ణకోశ సమస్యలు  
పలు సాంక్రమిక వ్యాధులు  

మన దేశంలో 2013 నుంచి అక్రమంగా జన్యుమార్పిడి పంటల సాగు మొదలైంది.  
జీఎం ఫుడ్స్‌లో ప్రధానంగా జన్యుమార్పిడి పత్తి విత్తనాల నుంచి తీసిన నూనెను వివిధ రకాల ఆహార పదార్థాల తయారీకి వినియోగిస్తున్నారు.
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సోయా, మొక్కజొన్న తదితర పంటలతో తయారుచేసిన ఆహార పదార్థాల్లో జన్యుమార్పిడి పంటల ఆనవాళ్లున్నాయి.
జన్యుమార్పిడి పంటలు, వాటితో తయారైన ఆహార పదార్థాలను కట్టడి చేసే విషయంలో ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చేష్టలుడిగి చూస్తోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
గ్రేటర్‌ నగరంలో విక్రయిస్తున్న జీఎం ఫుడ్స్‌లో ప్రధానంగా ఉదయం అల్పాహారంగా తీసుకునే ఓట్స్, కార్న్‌ ఫ్లేక్స్‌ వంటి ఆహార పదార్థాలున్నాయి.  

ఉల్లంఘనలిలా..
నగర మార్కెట్‌లో విక్రయిస్తున్న జీఎం ఫుడ్స్‌లో మూడు రకాలున్నాయి.. జీఎం ఫుడ్స్‌ ఆనవాళ్లుండి లేబుల్స్‌ అతికించని పదార్థాలు వీటిలో ఒకటి కాగా.. ఫుడ్‌సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిబంధనలకు మించి జీఎం అవశేషాలున్నవి మరొకటి.. అసలు ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న జీఎం ఫుడ్స్‌ మూడోరకం.  
నగరంలోని అన్ని సూపర్‌ మార్కెట్లు, మాల్స్‌లో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో చాలావరకు జీఎం ఫుడ్స్‌ అనే లేబుల్స్‌ లేకుండానే విక్రయిస్తున్నట్లు తేలింది.
సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అధ్యయనంలో దేశంలో సుమారు 65 రకాల జీఎం ఫుడ్స్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించింది. ఇందులో 35 విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి కాగా.. మరో 30 రకాలు దేశీయంగా తయారవుతున్నాయి.
సీఎస్‌ఈలోని పొల్యూషన్‌ మానిటరింగ్‌ ప్రయోగశాలలో పలు రకాల ఆహార పదార్థాలను పరిశీలించగా వీటిలో సుమారు 32 శాతం ఆహార పదార్థాలకు జీఎం పాజిటివ్‌ అని తేలింది.
ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న ఆహార పదార్థాల్లో సుమారు 80 శాతం వరకు జీఎం పాజిటివ్‌ ఫుడ్స్‌ ఉన్నట్లు సీఎస్‌ఈ వెల్లడించింది. ఇవన్నీ ప్రధాన కంపెనీలకు చెందినవే కావడం గమనార్హం.
జన్యు మార్పిడి పంటలతో తయారుచేసిన ఆహార పదార్థాలు ప్రధానంగా అమెరికా, కెనడా, నెదర్లాండ్స్, థాయ్‌లాండ్, యూఏఈ దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి.
పలు ఆహార పదార్థాల ప్యాకింగ్‌ కవర్లపై జీఎం ఆనవాళ్లున్నట్లు ఎలాంటి లేబుల్స్‌ అతికించడంలేదని తేలింది.
సూపర్‌మార్కెట్లలో విక్రయిస్తున్న పలు జీఎం పాజిటివ్‌ ఆహార పదార్థాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదని స్పష్టమైంది.
విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని ఆహార పదార్థాల ప్యాకింగ్‌పై జీఎం ఫ్రీ అని ఉన్నప్పటికీ.. వాటిలో జీఎం పంటల ఆనవాళ్లుండడం ఆందోళన కలిగిస్తోంది.

కట్టడి చేయాల్సిందే..
నగర మార్కెట్‌లో ఎలాంటి అనుమతులు, లేబుల్స్‌ లేకుండా విక్రయిస్తున్న అన్నిరకాల జీఎం ఫుడ్స్‌ను నిషేధించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ఈ విషయంలో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) వర్గాలు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్లు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని సూచిస్తున్నారు. వినియోగదారులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement