సాక్షి, హైదరాబాద్: సూపర్ మార్కెట్‌కు వెళితే ఇంటికి కావాల్సిన అన్ని సరుకులు కొనుగోలు చేస్తాం. ఉప్పుపప్పు నుంచి నూనెలు, బిస్కెట్లు, చాక్లెట్లు కూడా అందులో ఉంటాయి. అంతేకాదు.. అల్పాహారం కోసం విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఓట్స్ వంటివి కూడా తీసుకుంటాం.
అంతేనా.. ఫారిన్ పళ్లు సైతం కొంటుంటాం. రోజూ కాకపోయినా వారానికోసారి అయినా ఆ తరహా షాపింగ్ ఉంటుంది. అయితే మీరు కొంటున్న ఆహార పదార్థాలను ఒక్కసారి పరిశీలించండి. ఎందుకంటే ఆరోగ్యానికి హాని చేసే జన్యుమార్పిడి పంటల (జీఎం ఫుడ్స్)తో తయారైన ఆహారం నగర మార్కెట్‌ను ముంచెత్తుతోంది. హైదరాబాద్‌లోని పలు మాల్స్, స్టోర్స్, సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్న నిత్యావసర ఆహార పదార్థాలు, చిన్నపిల్లలు అధికంగా ఇష్టపడే చిరుతిళ్లలో 32 శాతం వరకు జన్యుమార్పిడి పంటల నుంచి తయారైనవేనని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇటీవల పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో చేసిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. జీఎం ఫుడ్స్‌లో ప్రధానంగా సోయా, మొక్కజొన్నతో తయారు చేసిన పదార్థాలు ఉన్నాయని, ఇవన్నీ కెనడా, అమెరికా,నెదర్లాండ్స్, థాయ్‌లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవేనని తేలింది. వీటిలోచాలా వరకు జీఎం పాజిటివ్ ఆహార పదార్థాలేనని సీఎస్‌ఈ స్పష్టం చేసింది. మార్కెట్‌లో ఇంత జరుగుతున్నా ఫుడ్‌సేఫ్టీ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జీఎం ఫుడ్స్ వెల్లువ ఇలా..
మన దేశంలో 2013 నుంచి అక్రమంగా పలు జన్యు మార్పిడి పంటల సాగు మొదలైంది. జీఎం ఫుడ్స్‌లో ప్రధానంగా జన్యుమార్పిడి పత్తి విత్తనాల నుంచి తీసిన నూనెను ఆహార పదార్థాల తయారీకి వినియోగిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సోయా, మొక్కజొన్న తదితర పంటలతో తయారు చేసిన ఆహార పదార్థాల్లో జన్యుమార్పిడి పంటల ఆనవాళ్లున్నాయి. జన్యుమార్పిడి పంటలు, వాటితో తయారైన పదార్థాలను కట్టడిచేసే విషయంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ చర్యలూ తీసుకోవట్లేదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో విక్రయిస్తున్న జీఎం ఫుడ్స్‌లో ప్రధానంగా ఉదయం అల్పాహారంగా తీసుకునే ఓట్స్, కార్న్‌ఫ్లేక్స్ వంటివి సైతం ఉన్నాయని తేలింది.
♦ జీఎం ఫుడ్స్‌లో మూడు రకాలున్నాయి.. జీఎం ఫుడ్స్ ఆనవాళ్లుండీ లేబుల్స్ అతికించని పదార్థాలు ఒకటి కాగా.. ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు మించి జీఎం అవశేషాలున్నవి మరొకటి.. అసలు ఎలాంటి అనుమతుల్లేకుండా విక్రయిస్తున్న జీఎం ఫుడ్స్ మూడోరకం.
♦ రాజధానిలోని అన్ని సూపర్ మార్కెట్లు, మాల్స్‌లో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో చాలావరకు జీఎం ఫుడ్స్ ఆగ్‌మార్క్ లేబుల్స్ లేకుండానే విక్రయిస్తున్నట్లు తేలింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అధ్యయనంలో దేశంలో సుమారు 65 రకాల జీఎం ఫుడ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించింది. ఇందులో 35 విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి, మరో 30 దేశీయంగా తయారవుతున్నాయి.
♦ సీఎస్‌ఈలోని పొల్యూషన్ మానిటరింగ్ ప్రయోగశాలలో పలు రకాల ఆహార పదార్థాలను పరిశీలించగా వీటిలో సుమారు 32 శాతం ఆహార పదార్థాలకు ‘జీఎం–పాజిటివ్’ అని తేలింది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న ఆహార పదార్థాల్లో సుమారు 80 శాతం వరకు జీఎం పాజిటివ్ ఉన్నట్లు సీఎస్‌ఈ వెల్లడించింది. అంతేగాక పలు ఆహార పదార్థాల ప్యాకింగ్‌పై జీఎం ఆనవాళ్లున్నట్లు ఎలాంటి లేబుల్స్ అతికించట్లేదని గుర్తించారు.
♦ సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్న పలు జీఎం పాజిటివ్ ఆహార పదార్థాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదని స్పష్టమైంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని ఆహార పదార్థాల ప్యాకింగ్‌పై ‘జీఎం ఫ్రీ’ అని ఉన్నా.. వాటిలో జీఎం ఆనవాళ్లుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఆహారంతో ఎన్నో అనర్థాలు
మానవుల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. జీవక్రియ వేగం మందగిస్తుంది. అలర్జీలకు గురయ్యే ప్రమాదం ఉంది. చర్మం, కళ్ల సంబంధ వ్యాధులు, శ్వాస, జీర్ణకోశ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. సాంక్రమిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.
ఈ ఫుడ్‌ను కట్టడి చేయాల్సిందే..
రాజధాని మార్కెట్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న అన్నిరకాల జీఎం ఫుడ్స్‌ను నిషేధించాలి. ఈ విషయంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కఠినంగా వ్యవహరించాలి. పలు మాల్స్, సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్న జీఎం ఫుడ్స్‌పై జీహెచ్‌ఎంసీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేపట్టాలి. జీఎం ఫుడ్స్ కొనుగోలు విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ఇవి తింటే రోగాలు కొనితెచ్చుకున్నట్లే. – ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, పర్యావరణవేత్త
Comments
Please login to add a commentAdd a comment