చికెన్‌కు సిటీజనులు ఫిదా
టేస్టీ చికెన్ సిటీజనులను మైమరిపిస్తోంది. వెరైటీ రుచులు ఆహా అనిపిస్తున్నాయి. సిటీ ఫుడ్ లవర్స్ చికెన్‌కు ఫిదా అయిపోయారు. ఎంతగా అంటే... దేశంలోనే చికెన్ ఆర్డర్లలో నగరం నంబర్ వన్ స్థానంలో నిలిచేలా చేశారు. ఆన్‌లైన్ చికెన్ ఆర్డర్లలో సిటీ ప్రథమ స్థానంలో ఉన్నట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ సర్వేలో వెల్లడైంది. తర్వాతి స్థానాల్లో బెంగళూర్, ఢిల్లీ, కోల్‌కతా, పుణె నిలిచాయి. పోషక విలువలు, ప్రొటీన్స్ అధికంగా ఉండడం... అన్ని వర్గాల వారికీ ధరలు అందుబాటులో ఉండడంతోనే చికెన్ వంటకాలకు గిరాకీ పెరుగుతోందని ఈ సర్వేలో తేలింది.
ఏనీటైమ్ బిర్యానీ..
సాధారణంగా లంచ్, డిన్నర్ టైమ్‌లోనే చాలామంది బిర్యానీకి ఆర్డర్ చేయడం పరిపాటి. కానీ సిటీజనులు మాత్రం ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ టైమ్‌లోనూ చికెన్ బిర్యానీని లొట్టలేసుకుంటూ ఆరగిస్తున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోందని సర్వేలో వెల్లడైంది.
వీకెండ్‌లో చికెన్ జోష్..
ఇక వారంరోజులపాటు వివిధ రకాల వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపకాలు, వ్యాపారాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సిటీజన్లు వారాంతాల్లో చికెన్ వంటకాలతో పసందు చేసుకుంటున్నట్లు సర్వేలో తేలింది. ఆదివారం రాత్రి డిన్నర్ టైమ్‌లో మూడు బిర్యానీలు..ఆరు కబాబ్స్ అన్న చందంగా స్విగ్గీ సంస్థకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నట్లు వెల్లడించింది.
మ్యాచ్‌లతో కొక్కొరోకో...
ఇక ఐపీఎల్, ఐసీసీ టెస్ట్, వన్డే మ్యాచ్‌లున్న రోజుల్లోనూ చికెన్ వంటకాల ఆర్డర్లు బంపర్‌గా వచ్చిపడుతున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో ఈ అర్డర్లుంటున్నాయట. ఇక సాధారణ రోజుల్లోనూ ఆర్డర్లున్నా.. మ్యాచ్‌ల సందర్భంగా ఫుల్ గిరాకీ రావడంపై ఈ సంస్థ హర్షం ప్రకటించడం విశేషం.
పూటకో వెరైటీ..
చికెన్ ఉషోదయం: సిటీజనులు బ్రేక్‌ఫాస్ట్‌లోనూ చికెన్ వెరైటీలనే ఇష్టపడుతున్నారట. ప్రధానంగా చికెన్ శాండ్‌విచ్, చికెన్ బర్గర్, చికెన్ బిర్యానీలకే బ్రేక్‌ఫాస్ట్‌టైమ్‌లో ఆరగించేందుకు మక్కువ చూపుతుండడం విశేషం.
లంచ్:
► లంచ్‌లో ఇష్టపడుతున్న చికెన్ వంటకాల్లో చికెన్ బిర్యానీ, ఫ్రైడ్‌రైస్, తందూరీ చికెన్, చికెన్ లాలీపప్, చికెన్ సబ్, చికెన్ 65 ఆరగిస్తున్నారు.
స్నాక్స్:
► బిర్యానీ, బర్గర్స్‌తో పాటు చికెన్‌రోల్, చికెన్‌మోమో, చికెన్‌షావర్మ.
డిన్నర్:
► చిల్లీ చికెన్, చికెన్‌టిక్కా,గ్రిల్డ్ చికెన్, చికెన్‌రోల్, చికెన్ బిర్యానీ. ఇక డిన్నర్ సమయంలో 8:47 గంటలకే స్విగ్గీకి చికెన్ బిర్యానీల ఆర్డర్లు అధికంగా ఉంటున్నాయట.
పోషక విలువలున్న చికెన్ వెరైటీలివే:
మానవ జీవక్రియలకు అవసరమైన ఆవశ్యక పోషకవిలువలు, ప్రొటీన్స్ అధికంగా ఉన్న చికెన్ వంటకాల్లో రోస్టెడ్‌చికెన్ సలాడ్, చికెన్ టిక్కా సలాడ్, తందూరీ చికెన్ శాండ్‌విచ్ (మల్టీగ్రెయిన్)లున్నాయట.
గ్రేటర్‌లో నాన్‌వెజ్ అమ్మకాలు
♦ గ్రేటర్ జనాభా: కోటి
♦ రోజువారీ మాంసం అమ్మకాలు: 8.66 లక్షల కిలోలు
♦ ఇందులో చికెన్ విక్రయాలు: 6.66 లక్షలు
♦ మటన్, బీఫ్ అమ్మకాలు: లక్ష కిలోలు
♦ చేపలు, సముద్ర ఉత్పత్తుల అమ్మకాలు: లక్ష కిలోలు
Comments
Please login to add a commentAdd a comment