కిరాణాలు, సూపర్ మార్కెట్లలో వివిధ వస్తువులను ప్యాకెట్లరూపంలో విక్రయిస్తున్నారు. వీటిపై తయారీ, గడువు తేదీ, బరువు, ధర స్టిక్కర్లు వేయకుండానే విక్రయిస్తున్నారు. ప్రజలు వివిధ పనులతో బిజీగా ఉండటంతో వ్యాపారులు దానిని అవకాశంగా మార్చుకుని ప్యాకెట్ల రూపంలో వస్తువులు అంటగడుతున్నారు. సూపర్ మార్కెట్ల నుంచి చిన్న కిరాణాల్లోనూ ప్యాకింగ్‌పై అన్ని వివరాలు ఉండాలి. వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పావుకిలో, అర్ధకిలో, కిలో రూపంలో ప్యాకెట్లు నింపుతూ వ్యాపారులు విక్రయిస్తున్నారు. దీంతో తూకంలో తేడాలు వస్తున్నాయి. తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారే తప్ప.. తదుపరి చర్యలపై పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
అనుమతి లేకుండానే..
● నిబంధనల ప్రకారం నిత్యావసరాలను ప్యాక్ చేయాలంటే తూనికలు, కొలతల శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలి.
● ప్యాకెట్‌పై ఎమ్మార్పీ, మ్యానుప్యాక్చరింగ్ డేట్, కమొడిటీ, టోల్‌ఫ్రీ నంబరు ఉండాలి.
● కానీ, అనుమతి లేకుండానే కిరాణాల్లో కందిపప్పు, పెసరపప్పు, చక్కెర, గోధుమపిండి, మైదాపిండి ప్యాక్ చేస్తూ విక్రయిస్తున్నారు.
● చిప్స్, మురుకులు, ఖార, బొందీ తదితర తినుబండారాలనూ ప్యాకెట్లలోనే విక్రయిస్తున్నారు.
● హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పెద్దపెద్ద బస్తాల్లో సరుకులను తీసుకొచ్చి ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నారు.
● మరోవైపు.. పన్నులు తప్పించుకోవడానికి వ్యాపారులు జీరో దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి.
● తద్వారా ప్రభుత్వానికి పన్నులు ఎగవేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
జాడలేని అధికారులు..
జిల్లాలో 20 మండలాలతో ఉండగా, ప్రస్తుతం జిల్లా ఇన్‌స్పెక్టర్‌తోపాటు, సిబ్బంది ఉన్నారు. జిల్లా పెద్దగా ఉండటం, అధికారులు తక్కువగా ఉండటంతో తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో వ్యాపారులదే ఇష్టారాజ్యంగా మారింది. షాపుల్లో తరాజు, బాట్లు వ్యత్యాసం రాకుండా నిత్యం తనిఖీలు చేయాల్సిన అధికారులు.. అలాంటివేమీ చేయడం లేదు. ఏటా కిరాణం వారు తరాజులు, బాట్లకు స్టాంపు వేయించుకోవాలి. ఎలక్ట్రానిక్ కాంటాల వారు సంవత్సరానికోసారి రెన్యూవల్ చేయించుకోవాలి.
గ్రామాల్లో అమ్మకాలు..
● గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మసాలా పొడులు, ఖారాప్యాకెట్లు, వివిధ వస్తువులు, ఉల్లిగడ్డలు ట్రాలీల్లో తీసుకెళ్లి అమ్ముతుంటారు.
● వీటిని చిన్నచిన్న కవర్లలో పోసుకుంటూ విక్రయిస్తుంటారు.
● వీటిపై ఎలాంటి ముద్రణ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండడంలేదు.
● ఇటీవల అధికారులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
ధరల్లో తేడాలు..
కొన్ని షాపుల్లో ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేట్లకు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా థియేటర్లలో, బేకరీల్లో ఇస్టారాజ్యంగా రేట్లకు విక్రయిస్తున్నారు. కొత్త సినిమా రోజు సినిమా థియేటర్లలో ఒక కూల్‌డ్రింక్ రూ.30 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. ఒక పాప్‌కార్న్ రూ.20కి అమ్ముతున్నారు. వాటర్‌బాటిల్ రూ.40, చిప్స్ రూ.20కి విక్రయిస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సినిమాకు వెళ్లాడు. పాప్‌కార్న్ కొనుగోలు చేశాడు. దానికి ఎలాంటి స్టిక్కర్‌లేదు. ప్యాకెట్ రూ.40కిపైగా ధరకు అమ్మాడు. దీంతో అతడు లీగల్ మెట్రోలజీ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేశాడు. అధికారులువెంటనే థియేటర్‌కు వెళ్లి కేసు నమోదు చేశారు. జగిత్యాల అశోక్‌నగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు కూరగాయల మార్కెట్‌కు వెళ్లాడు. కూరగాయలు కొనుగోలు చేశాడు. కిలోకు పావుకిలో వరకు తక్కువగా రావడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు.
ముద్రణ ఉండాలి
ప్రతీ ప్యాకెట్‌పై వస్తువుపై సంబంధిత కంపెనీ ముద్రణ, కన్జ్యూమర్ నంబరు, ఎమ్మార్పీ ఉండాలి. లేకుంటే చర్యలు తీసుకోవాలి, ప్రతీరోజు తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మిషన్ వారు సంవత్సరానికోసారి, తరాజుబాట్ల వారు రెండు సంవత్సరాలకోసారి ముద్ర వేయించుకోవాలి. లేకుంటే చర్యలు తీసుకుంటాం.
– అజీజ్‌పాషా,
తూనికలు, కొలతల ఇన్‌స్పెక్టర్
Comments
Please login to add a commentAdd a comment