packaging
-
కేంద్ర ప్రోత్సాహకాలు కొనసాగింపు
ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) రెండో దశలో భాగంగా సెమీకండక్టర్ తయారీ యూనిట్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. దాంతోపాటు కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్, సిలికాన్ ఫోటోనిక్స్‌లో ప్రత్యేకత కలిగిన మరిన్ని కంపెనీలను ఆకర్షించడంపై దృష్టి సారిస్తోంది.దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దానివల్ల ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే సెమీకండక్టర్లకు గిరాకీ ఏర్పడింది. స్థానికంగా ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు సెమీకండక్టర్ల దిగుమతిపై ఆధారపడుతున్నాయి. అందుకు భిన్నంగా స్థానికంగా వీటిని అభివృద్ధి చేసి వినియోగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)ను డిసెంబర్ 2021లో ప్రతిపాదించింది. మొదటి దశలో భాగంగా ఔట్సోర్స్డ్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్(ఓఎస్ఏటీ)తోపాటు అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్(ఏపీఎంపీ) కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించింది. మరికొన్ని నెలల్లో ఈ కంపెనీలు సెమీకండక్టర్ల ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: పేమెంట్ ఆలస్యమైతే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నారా?ఐఎస్ఎం రెండో దశలో భాగంగా సెమీకండక్టర్ తయారీ యూనిట్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ నియమాల ప్రకారం సెమీకండక్టర్లు ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్ యూనిట్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 50 శాతం రాయితీ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయబోయే కంపెనీలకు పన్ను, విద్యుత్ బిల్లులో రాయితీలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్‌లోని సనంద్ ప్రాంతంలో రెండు సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లను ఏర్పాటు చేశారు. మరో రెండింటినీ అస్సాంలోని మోరిగావ్‌లో సిద్ధం చేశారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.1.48 లక్షల కోట్లు వెచ్చించారు. వీటి ద్వారా మరికొద్ది నెలల్లో ఉత్పత్తి ప్రారంభించనున్నారు. -
రూ. 120 కోట్లతో మోల్డ్‌టెక్ ప్లాంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాకేజింగ్ రంగ సంస్థ మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ రూ.100 కోట్లతో కొత్తగా మూడు ప్లాంట్లను ప్రారంభించింది. తెలంగాణలోని సుల్తాన్పూర్, హరియాణాలోని పానిపట్, తమిళనాడులోని చెయ్యార్ వద్ద ఏర్పాటయ్యాయి. వీటి మొత్తం వార్షిక సామర్థ్యం 5,500 మెట్రిక్ టన్నులు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కోసం మహారాష్ట్రలోని మహద్ వద్ద రూ.20 కోట్లతో 1,500 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యం గల ప్లాంటు 2024 అక్టోబర్ నాటికి రెడీ అవుతోంది. 2024–25లో మోల్డ్‌టెక్ రూ.75–80 కోట్ల మూలధన వ్యయం చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.120 కోట్లు, 2022–23లో రూ.148 కోట్లు వెచ్చించింది. 2024–25లో పరిమాణంలో 15–18 శాతం వృద్ధిని ఆశిస్తోంది. తాజా విస్తరణతో 2024–25లో మొత్తం వార్షిక తయారీ సామర్థ్యం 54,000 మెట్రిక్ టన్నులకు చేరుతుందని మోల్డ్‌టెక్ సీఎండీ జె.లక్ష్మణ రావు వెల్లడించారు. ‘కొత్త ప్లాంట్లు కంపెనీ వృద్ధి అవకాశాలను ప్రధానంగా ఫార్మా ప్యాకేజింగ్‌లో మెరుగుపరుస్తాయి. ఫార్మా పరిశ్రమ నుండి మా ఉత్పత్తులకు డిమాండ్ చాలా ప్రోత్సాహకరంగా ఉంది. 2024–25 తొలి త్రైమాసికం నుండి ఫార్మా ప్యాకేజింగ్ ఆదాయం తోడవుతుంది. 5–6 ఏళ్లలో మొత్తం ఆదాయంలో ఫుడ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా విభాగాలు 50 శాతం సమకూర్చాలన్నది మా ప్రణాళిక’ అని తెలిపారు. -
న్యూస్ పేపర్లలో ఆహారం తింటున్నారా? కేంద్ర సంస్థ హెచ్చరిక!
రోడ్డు పక్కన విక్రయించే చిరుతిళ్లు, ఆహార పదార్థాలను సాధారణంగా పాత న్యూస్ పేపర్లలో పొట్లం కట్టి ఇస్తుంటారు. ఇలా న్యూస్ పేపర్లలో ఆహారం తింటే తీవ్రవైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హెచ్చరించింది. ఆహార పదార్థాల ప్యాకింగ్, సర్వింగ్ కోసం న్యూస్ పేపర్లను ఉపయోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని వ్యాపారులను, వినియోగదారులను కోరింది. ఈ విషయంలో నిబంధనలను పర్యవేక్షించడానికి, అమలు చేయడానికి రాష్ట్ర ఆహార అధికారులతో ఎఫ్ఎస్ఎస్ఏఐ కలిసి పని చేస్తోంది. ఆహార పదార్థాలను ప్యాకింగ్, సర్వింగ్ చేయడానికి న్యూస్ పేపర్లను ఉపయోగించడం తక్షణమే నిలిపివేయాలని దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు, ఆహార విక్రేతలను ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో కమల వర్ధనరావు గట్టిగా కోరారు. తీవ్ర ఆరోగ్య సమస్యలు ఆహార పదార్థాల ర్యాపింగ్, ప్యాకేజింగ్ చేయడానికి న్యూస్ పేపర్లు ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన దీనివల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలను తెలియజేశారు. న్యూస్ పేపర్లలో ఉపయోగించే ఇంక్ ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను కలిగించే బయోయాక్టివ్ పదార్థాలను కలిగి ఉంటుందని, ఇది ఆహారాన్ని కలుషితం చేసి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది. ప్రింటింగ్ ఇంక్‌లలో సీసం, ఇతర భారీ లోహాలతో సహా రసాయనాలు ఉండవచ్చని, ఇవి ఆహారంలో కలసి దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయని వివరించింది. అంతేకాకుండా బ్యాక్టీరియా, వైరస్ వంటి వ్యాధికారక క్రిములు న్యూస్ పేపర్ల ద్వారా ఆహారంలోకి ప్రవేశించి అనారోగ్యాలకు కారణమవుతాయని తెలిపింది. కఠిన నిబంధనలు ఆహార పదార్థాల ప్యాకింగ్‌కి న్యూస్ పేపర్ల వాడకాన్ని నిషేధించే ఆహార భద్రత, ప్రమాణాల (ప్యాకేజింగ్) నిబంధనలు-2018ని నోటిఫై చేస్తూ న్యూస్ పేపర్లను ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌గా ఉపయోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని దేశవ్యాప్తంగా వినియోగదారులు, ఆహార విక్రేతలు, వాటాదారులను ఎఫ్ఎస్ఎస్ఏఐ కోరింది. సురక్షితమైన, ఆమోదించిన ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లతో పాటు ఫుడ్-గ్రేడ్ కంటైనర్లను మాత్రమే ఉపయోగించాలని సిఫార్సు చేసింది. -
నిత్యావసరాలు కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
కిరాణాలు, సూపర్ మార్కెట్లలో వివిధ వస్తువులను ప్యాకెట్లరూపంలో విక్రయిస్తున్నారు. వీటిపై తయారీ, గడువు తేదీ, బరువు, ధర స్టిక్కర్లు వేయకుండానే విక్రయిస్తున్నారు. ప్రజలు వివిధ పనులతో బిజీగా ఉండటంతో వ్యాపారులు దానిని అవకాశంగా మార్చుకుని ప్యాకెట్ల రూపంలో వస్తువులు అంటగడుతున్నారు. సూపర్ మార్కెట్ల నుంచి చిన్న కిరాణాల్లోనూ ప్యాకింగ్‌పై అన్ని వివరాలు ఉండాలి. వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పావుకిలో, అర్ధకిలో, కిలో రూపంలో ప్యాకెట్లు నింపుతూ వ్యాపారులు విక్రయిస్తున్నారు. దీంతో తూకంలో తేడాలు వస్తున్నాయి. తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారే తప్ప.. తదుపరి చర్యలపై పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అనుమతి లేకుండానే.. ● నిబంధనల ప్రకారం నిత్యావసరాలను ప్యాక్ చేయాలంటే తూనికలు, కొలతల శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలి. ● ప్యాకెట్‌పై ఎమ్మార్పీ, మ్యానుప్యాక్చరింగ్ డేట్, కమొడిటీ, టోల్‌ఫ్రీ నంబరు ఉండాలి. ● కానీ, అనుమతి లేకుండానే కిరాణాల్లో కందిపప్పు, పెసరపప్పు, చక్కెర, గోధుమపిండి, మైదాపిండి ప్యాక్ చేస్తూ విక్రయిస్తున్నారు. ● చిప్స్, మురుకులు, ఖార, బొందీ తదితర తినుబండారాలనూ ప్యాకెట్లలోనే విక్రయిస్తున్నారు. ● హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పెద్దపెద్ద బస్తాల్లో సరుకులను తీసుకొచ్చి ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నారు. ● మరోవైపు.. పన్నులు తప్పించుకోవడానికి వ్యాపారులు జీరో దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ● తద్వారా ప్రభుత్వానికి పన్నులు ఎగవేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. జాడలేని అధికారులు.. జిల్లాలో 20 మండలాలతో ఉండగా, ప్రస్తుతం జిల్లా ఇన్స్పెక్టర్తోపాటు, సిబ్బంది ఉన్నారు. జిల్లా పెద్దగా ఉండటం, అధికారులు తక్కువగా ఉండటంతో తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో వ్యాపారులదే ఇష్టారాజ్యంగా మారింది. షాపుల్లో తరాజు, బాట్లు వ్యత్యాసం రాకుండా నిత్యం తనిఖీలు చేయాల్సిన అధికారులు.. అలాంటివేమీ చేయడం లేదు. ఏటా కిరాణం వారు తరాజులు, బాట్లకు స్టాంపు వేయించుకోవాలి. ఎలక్ట్రానిక్ కాంటాల వారు సంవత్సరానికోసారి రెన్యూవల్ చేయించుకోవాలి. గ్రామాల్లో అమ్మకాలు.. ● గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మసాలా పొడులు, ఖారాప్యాకెట్లు, వివిధ వస్తువులు, ఉల్లిగడ్డలు ట్రాలీల్లో తీసుకెళ్లి అమ్ముతుంటారు. ● వీటిని చిన్నచిన్న కవర్లలో పోసుకుంటూ విక్రయిస్తుంటారు. ● వీటిపై ఎలాంటి ముద్రణ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండడంలేదు. ● ఇటీవల అధికారులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ధరల్లో తేడాలు.. కొన్ని షాపుల్లో ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేట్లకు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా థియేటర్లలో, బేకరీల్లో ఇస్టారాజ్యంగా రేట్లకు విక్రయిస్తున్నారు. కొత్త సినిమా రోజు సినిమా థియేటర్లలో ఒక కూల్‌డ్రింక్ రూ.30 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. ఒక పాప్‌కార్న్ రూ.20కి అమ్ముతున్నారు. వాటర్‌బాటిల్ రూ.40, చిప్స్ రూ.20కి విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సినిమాకు వెళ్లాడు. పాప్‌కార్న్ కొనుగోలు చేశాడు. దానికి ఎలాంటి స్టిక్కర్లేదు. ప్యాకెట్ రూ.40కిపైగా ధరకు అమ్మాడు. దీంతో అతడు లీగల్ మెట్రోలజీ వెబ్సైట్లో ఫిర్యాదు చేశాడు. అధికారులువెంటనే థియేటర్‌కు వెళ్లి కేసు నమోదు చేశారు. జగిత్యాల అశోక్‌నగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు కూరగాయల మార్కెట్‌కు వెళ్లాడు. కూరగాయలు కొనుగోలు చేశాడు. కిలోకు పావుకిలో వరకు తక్కువగా రావడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. ముద్రణ ఉండాలి ప్రతీ ప్యాకెట్‌పై వస్తువుపై సంబంధిత కంపెనీ ముద్రణ, కన్జ్యూమర్ నంబరు, ఎమ్మార్పీ ఉండాలి. లేకుంటే చర్యలు తీసుకోవాలి, ప్రతీరోజు తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మిషన్ వారు సంవత్సరానికోసారి, తరాజుబాట్ల వారు రెండు సంవత్సరాలకోసారి ముద్ర వేయించుకోవాలి. లేకుంటే చర్యలు తీసుకుంటాం. – అజీజ్‌పాషా, తూనికలు, కొలతల ఇన్స్పెక్టర్ -
లాక్డౌన్ నుంచి వీటికీ మినహాయింపు
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ నుంచి మరికొన్ని రంగాలకు మినహాయింపునిస్తూ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో ప్రకటించిన మినహాయింపులకు అదనంగా ఇవి ఉంటాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగానికి చెందిన నిర్మాణ పనులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల కార్యకలాపాలకు తాజాగా అనుమతినిచ్చింది. కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు, ప్రాసెసింగ్.. తదితరాలకు కూడా అనుమతినిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని నిర్మాణ పనుల్లో.. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు, టెలికం ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఏర్పాటు.. మొదలైనవి ఉన్నాయి. హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు కొద్దిపాటి సిబ్బందితో పనులు చేసుకోవచ్చు. వెదురు, కొబ్బరి, వక్క, కొకొవా తదితర ఉత్పత్తుల ప్లాంటేషన్, ప్యాకేజింగ్, అమ్మకం, మార్కెటింగ్ మొదలైన పనులను ఈ లాక్డౌన్ కాలంలో చేసుకోవచ్చు. -
ప్యాకేజింగ్‌లో ’ప్లాస్టిక్’ తగ్గించనున్న అమెజాన్
న్యూఢిల్లీ: ఒకసారి మాత్రమే ఉపయోగించడానికి పనికొచ్చే ప్లాస్టిక్‌తో ప్యాకేజింగ్‌ను 2020 జూన్ నాటికి పూర్తిగా నిలిపివేయాలని ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా నిర్దేశించుకుంది. ప్రస్తుతం తమ గిడ్డంగుల్లో ప్యాకేజింగ్‌కు ఉపయోగించే ప్లాస్టిక్‌లో సింగిల్ యూజ్ తరహా ప్లాస్టిక్ వాటా ఏడు శాతం కన్నా తక్కువే ఉంటుందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు. వ్యర్ధాలను తగ్గించుకుని, పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్‌ను ప్రోత్సహించాలన్న లక్ష్యానికి అమెజాన్ కట్టుబడి ఉందని ఆయన వివరించారు. బబుల్ ర్యాప్స్, ఎయి ర్ పిల్లో మొదలైన ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఉత్ప త్తుల స్థానంలో ’పేపర్ కుషన్స్’ను వినియో గించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఆఖరుకి అన్ని గిడ్డంగులకు విస్తరించనున్నట్లు సక్సేనా వివరించారు. 2021 మార్చికి 100% రీసైకిల్డ్ ప్లాస్టిక్ వినియోగం దిశగా.. ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని 25% తగ్గించుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ప్రకటించింది. -
ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకింగ్‌తో ‘జొమాటో’ ఫుడ్
న్యూఢిల్లీ: ఆన్లైన్ రెస్టారెంట్ గైడ్, ఫుడ్ డెలివరీ సేవల సంస్థ జొమాటో.. రెస్టారెంట్లు పంపిన ఆహార పదార్ధాలను మార్గం మధ్యలో ఎవరూ ఓపెన్ చేసేందుకు వీలులేకుండా గట్టి భద్రతా చర్యలను చేపట్టింది. ఇక నుంచి ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్ టేప్స్‌తో ఫుడ్ డెలివరీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ మధ్య ఓ డెలివరీ బాయ్ పార్సిల్‌ను ఓపెన్ చేసిన సంఘటన వైరల్ కాగా, అప్పట్లోనే ఇటువంటి నాణ్యతా చర్యను చేపట్టనున్నట్లు సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా తొలుత దేశంలోని 10 నగరాల్లో ఈ తరహా సేవలను ప్రారంభించినట్లు బుధవారం ప్రకటించింది. పునర్వినియోగానికి వీలైన సింగిల్ మెటీరియల్ పాలిమర్‌తో ఫుడ్ డెలివరీ జరుగుతుందని తెలిపింది. తొలి దశలో ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, పూణె, జైపూర్, చండీగఢ్, నాగ్‌పూర్, వడోదరల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ సీఈఓ మోహిత్ గుప్తా తెలిపారు. ఈ దశలో 5,000 రెస్టారెంట్లు ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్‌తో ఆహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారాయన. -
కూరగాయలు, పండ్లు ఇక కుళ్లిపోవు!
మన దేశంలో ఆరుగాలం కష్టపడి పండించిన కూరగాయలు, పండ్లు పొలం దగ్గర నుంచి వినియోగదారులకు చేరే ముందే దెబ్బతినటం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. రైతులు పండించిన కూరగాయలు, పండ్లు ప్రజల నోటికి అందేలోగా 16% మేరకు వృథా అవుతున్నాయి. వీటి విలువ రూ. 40,811 కోట్లు. తగిన ప్యాకేజింగ్, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాల్లేకపోవడమే ఇందుకు మూలకారణం. అయితే, దేశీ సాంకేతికతతో తాము ఆవిష్కరించిన ప్రత్యేక కవర్లు, సంచులను వాడుకుంటే ఇక ఈ బాధ ఉండదని మైసూరులోని ‘రక్షణ ఆహార పరిశోధన ప్రయోగశాల(డి.ఎఫ్.ఆర్.ఎల్.)’ సీనియర్ ముఖ్య శాస్త్రవేత్త డా. ఎ. రామకృష్ణ (98452 93278) చెబుతున్నారు. పర్యావరణహితమైన ఈ సరికొత్త మోడిఫైడ్ అట్మాస్ఫియర్ ప్యాకేజింగ్(మాప్) సాంకేతికతను మైసూరులోని డి.ఎఫ్.ఆర్.ఎల్. రిసెర్చ్ అప్లియన్సెస్ విభాగం అధిపతి కూడా అయిన డా. రామకృష్ణ ఆవిష్కరించారు. ఇటీవల ఒక సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా డా. రామకృష్ణ ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.రైతులు, చిల్లర వ్యాపారులతోపాటు.. వినియోగదారులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందన్న భావనతో ‘సాక్షి సాగుబడి’ ఈ కథనాన్ని అందిస్తున్నది. బ్రీతబుల్ యాక్టివ్ ప్యాకేజింగ్ అంటే..? ఆహార వృథాను అరికట్టడంతోపాటు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడే ఈ చక్కని సాంకేతికతను ఆవిష్కరించిన ఘనత డా. రామకృష్ణకు దక్కింది. ‘బ్రీతబుల్ యాక్టివ్ ప్యాకేజింగ్ ఫిల్మ్స్ టెక్నాలజీ’గా దీన్ని పిలుస్తున్నారు. ఇది పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన సాంకేతికత. ఈ సాంకేతికతపై ఆరు నెలల క్రితం మైసూరులోని డి.ఎఫ్.ఆర్.ఎల్. పేటెంట్ హక్కులు పొందింది. త్రివిధ దళాల ఆహార అవసరాలు తీర్చడానికి కేంద్ర రక్షణ శాఖ పరిశోధనా విభాగం పరిధిలో డి.ఎఫ్.ఆర్.ఎల్. ఏర్పాటైంది. ఆక్సిజన్, కార్బన్డయాక్సయిడ్పై నియంత్రణ ప్రత్యేకమైన దేశీ పరిజ్ఞానంతో ఈ బ్రీతబుల్ సంచులను ఎటువంటి రసాయనిక లేపనాలు వాడకుండానే రూపొందించారు. చెట్ల నుంచి కోసిన తర్వాత కూడా కూరగాయలు, పండ్లు శ్వాసిస్తూనే ఉంటాయి. ఆక్సిజన్‌ను తీసుకుంటూ కార్బన్‌డయాక్సయిడ్‌ను విడుదల చేస్తూ ఉంటాయి. ‘మాప్’ టెక్నిక్ ద్వారా రూపొందించిన ప్రత్యేకమైన ‘బ్రీతబుల్’ సంచుల ద్వారా ఈ ప్రక్రియను నియంత్రిస్తే వాటిని చాలా రోజుల వరకు చెడిపోకుండా నిల్వ చేసుకోవచ్చు. డి.ఎఫ్.ఆర్.ఎల్. శాస్త్రవేత్త దీనిపైనే పరిశోధించి తగిన సంచులను తయారు చేయడంలో సఫలీకృతులయ్యారు. ఈ సంచులలో నిల్వ చేసే కూరగాయలు, పండ్ల నుంచి వెలువడే నీటి ఆవిరి పరిమాణాన్ని బట్టి.. సంచి లోపల ఆక్సిజన్, కార్బన్డయాక్సయిడ్ల పరిమాణాన్ని తగిన రీతిలో నియంత్రించడం ద్వారా ఈ సంచులు నిల్వ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. ఒక దశలో శ్వాస క్రియ పూర్తిగా నిలిచిపోయే స్థితి ఏర్పడుతుంది. ∙ ఎన్ని రోజులు నిల్వ ఉంచవచ్చు? ఈ సంచులలో నింపిన కూరగాయలు, పండ్లను 30–40 రోజుల వరకు వడలిపోకుండా, నాణ్యత దెబ్బతినకుండా, రంగు మారకుండా నిల్వ చేసుకోవచ్చు. ఇందుకు ఎటువంటి కోల్డ్ స్టోరేజ్ అవసరం లేదు. సాధారణ గది వాతావరణంలోనే నిల్వ చేసుకోవచ్చు. ఎటువంటి రసాయనాలనూ వాడాల్సిన అవసరం లేదు. సూక్ష్మజీవులను పరిహరించే జాగ్రత్త తీసుకోవడం వల్ల ఈ సంచుల్లో పండ్లు, కూరగాయలు కుళ్లిపోవు. ఎన్ని కిలోలను నిల్వచేయొచ్చు? వంద గ్రాముల నుంచి 5 కిలోల వరకు వేర్వేరు సైజుల్లో సంచులను తయారు చేసుకుంటే తరలించడానికి బాగుంటుంది. 25 కిలోల సంచులు కూడా తయారు చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఏయే రకాల పండ్లు, కూరగాయలు నిల్వ చేయొచ్చు? అన్ని రకాల కూరగాయలు, పండ్లను నిశ్చింతగా 40 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. సంచుల తయారీకి ఖర్చెంత? ప్రతి కిలో కూరగాయలు, పండ్లను నిల్వ చేయడానికి సరిపోయే సంచి తయారు చేయడానికి ఒక రూపాయి చొప్పున ఖర్చవుతుంది. పాతిక కేజీల టమాటాలు లేదా మామిడి పండ్లు నిల్వచేసే సంచి తయారీకి రూ.25 ఖర్చవుతుంది. పర్యావరణానికి హాని కలుగుతుందా? ఈ సంచులు/కవర్లు పర్యావరణానికి హాని చేయని మోడిఫైడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌ను వాడినందు వల్ల.. సెకండరీ ప్యాకేజీ చేయనవసరం లేకుండానే ఈ సంచుల్లో నిల్వ చేసుకోవచ్చు. ఈ సంచులను ఒకసారి కొంటే మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. పాత సంచులతో మళ్లీ కొత్త సంచులను తయారు చేసుకోవచ్చు. ప్యాకేజీ పదార్థాల వృథాను, కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఈ సంచులు ఎక్కడ దొరుకుతాయి? మైసూరులోని డి.ఎఫ్.ఆర్.ఎల్. ఈ సంచుల తయారీకి అవసరమైన పూర్తి దేశీ సాంకేతికతను ఆవిష్కరించి, పేటెంట్ పొందింది. అయితే, డి.ఎఫ్.ఆర్.ఎల్. సంచులను తయారు చేసి అమ్మదు. ఈ టెక్నాలజీని విక్రయించడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వ/ ప్రైవేటు సంస్థలు/వ్యక్తులు కొనుగోలు చేసి వాణిజ్య స్థాయిలో ఈ సంచులను ఉత్పత్తి చేసి మార్కెట్లో అందుబాటులోకి తేవచ్చు. సీజన్లో ధర లేక పారబోసిన టమాటాలు (ఫైల్) ఎవర్ని సంప్రదించాలి? THE DIRECTOR Defence Food Research Laboratory, DRDO, Ministry of Defence, Govt of India Siddartha Nagar, Mysore- 570 011, Tel: 0821-2473783, Fax: 0821-2473468, E-mail: dfrlmysore@sancharnet.in డా. ఎ. రామకృష్ణ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డీఎఫ్ఆర్ఎల్, మైసూరు -
కెరీర్ ప్యాక్ చేద్దాం!
చర్మ సంరక్షణకు ఉపయోగపడే సబ్బు నుంచి, ఆరోగ్యాన్ని అందించే మందు బిళ్లల వరకు. మంచి నూనె నుంచి మిర్చిపౌడర్ వరకు... దేనికైనా పదిలమైన, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ అవసరం. ప్రస్తుత సూపర్ మార్కెట్ సంస్కృతిలో స్వీయ సేవ (సెల్ఫ్ సర్వీసింగ్) ఎవరికి కావల్సిన వస్తువులను వారే తీసుకునే పద్ధతి వచ్చింది. ఓ పెద్ద సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తున్న వ్యక్తికి ఒకే వస్తువుకు సంబంధించి పలు బ్రాండ్లు కనిపిస్తుంటాయి. అలాంటపుడు కొనుగోలుదారుల్ని ఓ వస్తువు ఆకర్షించాలంటే అందమైన ప్యాకేజింగ్ అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశ్రమల నుంచి బయటకొచ్చిన ఏ ఉత్పత్తి అయినా విజయవంతం కావడంలో ప్యాకేజింగ్ కీలకం. అందుకే ప్రస్తుతం ప్యాకేజింగ్ రంగ నిపుణులకు జాబ్ మార్కెట్లో అవకాశాలు పెరుగుతున్నాయి. ‘ప్యాకేజింగ్’ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు ‘విద్య – ఉద్యోగం’లో మీకోసం... – సాక్షి, స్కూల్ ఎడిషన్ ♦ కంపెనీ తయారు చేసిన వస్తువు అమ్మకాల్లో ప్యాకేజింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. వస్తువు చెడిపోకుండా ఉంచడంలో, కొనుగోలుదారుడిని ఇట్టే ఆకర్షించడంలోనూ ప్యాకేజింగ్‌దే ప్రముఖ పాత్ర. మొత్తంమీద ఓ వస్తువు మార్కెటింగ్‌లో ప్యాకేజింగ్ పాత్ర కీలకమని చెప్పొచ్చు. అందుకే ప్యాకేజింగ్ సాదాసీదా వ్యవహారంలా కాకుండా, సరికొత్త వృత్తిగా మారిపోయింది. యువతకు ఓ ప్రత్యామ్నాయ కెరీర్ చాయిస్‌గా నిలుస్తోంది. కావాల్సిన నైపుణ్యాలు... ఇతర కోర్సులతో పోలిస్తే ఇది భిన్నమైన రంగం. ఇందులో రాణించాలంటే.. సృజనాత్మకత, విభిన్నంగా ఆలోచించడం, ప్రస్తుత మార్కెటింగ్ ట్రెండ్స్‌పై అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కోర్సులో ఉండే అంశాలు... పరిశ్రమ, మార్కెటింగ్ అవసరాలకు అనుగుణంగా ప్రవేశ పెట్టిన కోర్సుల్లో ప్యాకేజింగ్ కోర్సులు ఒకటి... ఇందులో ఇంజనీరింగ్, ప్రింటింగ్, మార్కెటింగ్, కవర్ డిజైన్, మాన్యుఫాక్చరింగ్, గ్రాఫిక్ డిజైన్ సంబంధిత అంశాలుంటాయి. ఈ క్రమంలో ప్యాకేజింగ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్, లాజిస్టిక్స్ అండ్ ఫిజి కల్ డిస్ట్రిబ్యూషన్, ప్యాకేజింగ్ ప్రాసెస్, క్వాలిటీ కంట్రోల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, అప్లయిడ్ మెకానిక్స్, ప్రింటింగ్ టెక్నాలజీ, మెషిన్ డ్రాయింగ్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, ప్యాకేజింగ్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. అవకాశాలు... పారిశ్రామిక రంగం నుంచి బయటకు వచ్చిన, వస్తున్న ఏ ఉత్పత్తినైనా ఆకర్షణీయంగా మార్చేది వాటి ప్యాకింగ్. కాబట్టి ప్యాకేజింగ్ నిపుణులకు అవకాశాలు ఎక్కువని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పరిశ్రమలు మనుగడ సాగించినంత కాలం... ప్యాకేజింగ్ పరిశ్రమకు ఢోకా ఉండదు. వేతనాలు... అవకాశాలకనుగుణంగానే ఆకర్షణీయ వేతనాలు వీరికి లభిస్తున్నాయి. కెరీన్ ప్రారంభంలో సంవత్సరానికి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు వేతనం అందుకోవచ్చు. ఆ తర్వాత పనితీరు ఆధారంగా భారీ వేతనాలు సంపాదించే అవకాశం ఉంది. విధులు... ఒక ఉత్పత్తిని అందంగా ఆకట్టుకునేలా మన్నికైన∙ప్యాకింగ్ చేయడం ప్యాకేజింగ్ నిపుణుల విధి. ఆయా పరిశ్రమలు వాటి ఉత్పత్తులు, కాలపరిమితి ఆధారంగా సాంకేతికంగా ఎటువంటి ప్యాకింగ్ అవసరమో (ఉదాహరణకు ఫార్మా కంపెనీల ఉత్పత్తులకు ఎలాంటి ప్యాకేజీ అవసరం, కెమికల్ ఉత్పత్తులకు ఎలాంటి ప్యాకేజీ చేయాలి) నిర్ధారించడం, అందుకోసం అవసరమైన రసాయనాలను సూచించడం, వాటిని ఎంత మోతాదులో వినియోగించాలో సలహాలివ్వడం, పర్యావరణ పరంగా అవసరమైన జాగ్రత్తలను సూచించడం వంటి విధులను వీరు నిర్వర్తిస్తుంటారు. ప్యాకేజింగ్ టెక్నాలజీలో శిక్షణ పొందుతున్న వారిని ‘ప్యాకేజింగ్ టెక్నాలజిస్టులు’ అంటారు. ప్యాకేజింగ్ టెక్నాలజిస్టులు క్యాలిటీ ఇంజినీర్, పర్చేజింగ్, మెటీరియల్ విభాగాలలో తమ కెరీర్‌ను ప్రారంభించవచ్చు. పరిశ్రమ పనితీరు... ప్రస్తుతం శరవేగంగా వృద్ధి చెందుతున్న రంగాల్లో ప్యాకేజింగ్ పరిశ్రమ ఒకటి. ఏటా భారత ప్యాకేజింగ్ పరిశ్రమ 13 నుంచి 15 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటుంది. ప్రస్తుతం దేశ ప్యాకేజింగ్ పరిశ్రమ విలువ దాదాపు రూ.లక్ష కోట్లు. దేశంలో మొత్తం పేపర్ ఉత్పత్తిలో అధిక శాతం పేపర్‌ను ప్యాకింగ్ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఇందుకోసం 7.6 మిలియన్ టన్నుల పేపర్‌ను వాడుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఉంది. ఈ రంగంలో ప్రతి ఏటా 20 నుంచి 25 శాతం వృద్ధి నమోదవుతుంది. ప్యాకేజింగ్ రంగంలో గ్లాస్ ప్యాకింగ్ వాటా 4 నుంచి 5 శాతం, మెటల్ ప్యాకింగ్ వాటా 8 శాతం వరకు ఉంటుంది. కొన్ని ప్రముఖ కంపెనీలు... హెచ్‌సీఎల్, హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్, డాబర్ ఇండియా లిమిటెడ్, క్యాడ్బరీ ఇండియా లిమిటెడ్, ఐటీసీ లిమిటెడ్, జాన్సన్ అండ్ జాన్సన్ లిమిటెడ్, క్యాస్ట్రాల్ ఇండియా లిమిటెడ్, కోకా–కోలా ఇండియా, ప్రోక్టర్ అండ్ గ్యాంబిల్ వంటి కంపెనీల్లో ఉద్యోగాలు పొందొచ్చు. కోర్సులు... దేశంలో ప్యాకేజింగ్ రంగానికి సంబంధించిన కోర్సులను ఆఫర్ చేస్తున్న ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్... ఇండియన్‌ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ). కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఐఐపీకి ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, హైదారాబాద్‌లలో క్యాంపస్‌లున్నాయి. వీటి ద్వారా అందిస్తోన్న కోర్సులు వివరాలు... పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్... అర్హత: కనీసం ద్వితీయ శ్రేణి మార్కులతో గ్రాడ్యుయేషన్ (12+3 విధానంలో మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/మైక్రోబయాలజీలలో ఒకటి మెయిన్ లేదా సెకండ్ సబ్జెక్ట్‌గా) లేదా అగ్రికల్చర్/ఫుడ్ సైన్స్/పాలిమర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్/టెక్నాలజీ. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. రాత పరీక్ష , ఇంటర్వూ ద్వారా ఎన్నుకుంటారు. అభ్యర్థులు ఇంటర్వూ సమయానికి సంబంధిత డిగ్రీ సర్టిఫికెటన్ను సమర్పించాల్సి ఉంటుంది. సీట్ల వివరాలు... ముంబై–80, ఢిల్లీ–80, కోల్‌కతా–60, హైదరాబాద్–60. ఓబీసీ విద్యార్థులకు 27శాతం, ఎస్సీ విద్యార్థులకు 15శాతం, ఎస్టీ విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్ ఉంటుంది. డిప్లమా ఇన్ ప్యాకేజింగ్.. ప్యాకేజింగ్ డిప్లమా కోర్సు మూడేళ్లు ఉంటుంది. ఈ కోర్సులో పదోతరగతి ఉత్తీర్ణులై, పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంచుకుంటారు. ఎంపికైన వారికి హాస్టల్ వసతి ఉంటుంది. తెలుగు రాష్ట్రల్లో ఈ కోర్సును అందిస్తోన్న ఏకైక కళాశాల హైదారాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉన్న జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల. -
రియల్ జ్యూస్‌కు అదిరే షాక్ ఇచ్చిన బాలిక
న్యూఢిల్లీ: 'రియల్' ఫ్రూట్ జ్యూస్ తెలుసు కదా!. ఆ కంపెనీకి ఓ తొమ్మిదేళ్ల బాలిక ఇచ్చిన షాక్‌తో దిమ్మతిరిగింది. గువాహటికి చెందిన మృంగా కే మజుందార్(9) తన తండ్రితో పాటు బయటకు వెళ్లింది. ఓ షాపు వద్ద కూతురికి రియల్ ఫ్రూట్ జ్యూస్ కొనిచ్చాడు. ఫ్రూట్ జ్యూస్ ప్యాకేజింగ్‌పై బాలుడు స్కూల్ యూనిఫాం వేసుకుని ఉండటంతో అది కేవలం అబ్బాయిలకేనా అని తండ్రిని ప్రశ్నించి జ్యూస్ తాగడానికి నిరాకరించింది మృంగా. దీంతో ఈ విషయంపై మృంగా తండ్రి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీకి లేఖ రాశారు. రియల్ ఫ్రూట్ జ్యూస్ ప్యాకేజింగ్ మహిళపై వివక్ష చూపుతున్నట్లు ఉందని లేఖలో పేర్కొన్నారు. దాంతో వెంటనే చర్యలు తీసుకున్న రియల్ ఫ్రూట్ జ్యూస్ ప్యాకేజింగ్‌పై ఉన్న ఫోటోను మార్చేసింది. మహిళల పట్ల తమకు ఎలాంటి వివక్షపూరిత ధోరణి లేదని పేర్కొంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పింది. -
అత్యున్నత కెరీర్‌కు.. ప్యా‘కింగ్’
ప్యాకేజింగ్.. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్గ్రీన్ కెరీర్. మనం ఉదయాన లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు వాడే ప్రతి వస్తువునూ గమనించండి.. ప్యాకింగ్ లేని వస్తువు ఏదైనా ఉందేమోనని. ఒక్కటి కూడా కనిపించదు. అంతగా మనిషి జీవితంతో పెనవేసుకుపోయింది.. ప్యాకేజింగ్. నగరం కేంద్రంగా ఎన్నో కంపెనీలు వివిధ చిన్నా, పెద్ద వస్తువులను తయారు చేస్తున్నాయి. వీటి తయారీ ఒకెత్తయితే.. ఆయా వస్తువులు వినియోగదారుడిని ఆకట్టుకునేలా ప్యాక్ చేయడం మరో ఎత్తు. ఈ కారణంతో కంపెనీలు ప్యాకింగ్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. ప్యాకేజింగ్ రంగంలో నిష్ణాతులను నియమించుకుని భారీ స్థాయిలో వేతనాలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిటీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ), జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వంటివి ప్యాకింగ్‌లో వివిధ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిని పూర్తిచేస్తే ఏ రంగానికీ తీసిపోనివిధంగా ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. అవకాశాలెన్నో.. అందిపుచ్చుకునేవారేరీ? గుండుసూది మొదలుకొని టూత్ పేస్టులు, సబ్బులు, పౌడర్లు, సెంట్లు, షేవింగ్ సామగ్రి, దుస్తులు, బూట్లు, చెప్పులు, స్వీట్స్, ఇతర ఆహార పదార్థాలు, పిల్లలాడుకునే బొమ్మలు, అగర్బత్తీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్మెషీన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లు, వివిధ వ్యాధుల నివారణ మందులు, రైతులు పొలాలకు వాడే ఎరువులు, క్రిమిసంహారక మందులు,.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెరుగుతుందే కానీ తగ్గదు. ప్రతిదానికీ ప్యాకింగ్ ఉండాల్సిందే. అందుకే ఏ రంగానికైనా ఆర్థిక మాంద్యం ఉందేమో కానీ.. ప్యాకేజింగ్ రంగానికి లేదు. సమయంతో పనిలేకుండా ఏడాదిలో 365 రోజులూ ఉద్యోగాలందించే విభాగం ప్యాకేజింగ్. మన దేశంలో చిన్నా, పెద్దా అన్నీ కలుపుకుని దాదాపు 22,000 వరకు ప్యాకేజింగ్ కంపెనీలుంటాయని అంచనా! నగరాల్లో ప్రతి ప్రాంతంలోనూ రిటైల్ మాల్స్ ఏర్పాటు చేసిన కంపెనీల దృష్టి ఇప్పుడు ఓ మాదిరి పట్టణాలపై కూడా పడింది. అంతేకాకుండా ఆన్లైన్ షాపింగ్.. రిటైల్ రంగానికి దీటుగా వర్థిల్లుతోంది. నేటి బిజీ జీవితంలో దుకాణానికి వెళ్లి కావాల్సిన వస్తువులు తీసుకొచ్చే తీరిక, ఓపిక ఎవరికీ ఉండటం లేదు. ఈ నే పథ్యంలోనే అందరూ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. వస్తువులను ఆయా వినియోగదారులు ఉన్నచోటకి సురక్షితంగా, చెడిపోకుండా పంపాలంటే తగిన ప్యాకింగ్ తప్పనిసరి. ఇలా అటు రిటైల్ రంగంలోనూ, ఇటు ఈ-కామర్స్ కోణంలోనూ ప్యాకేజింగ్ నిపుణులకు అవకాశాలకు ఆకాశమే హద్దు అని చెప్పొచ్చు. 2011 నాటికి ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ప్యాకేజింగ్ మార్కెట్‌గా భారత్ నిలిచింది. 2020 నాటికి మూడో స్థానానికి చేరుకుంటుందని అంచనా. వచ్చే నాలుగు, ఐదేళ్లలో ఏటా ఈ రంగం 12.3 శాతం వృద్ధిరేటుతో పురోగమించడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ప్యాకేజింగ్‌లో విభాగాలు ప్యాకేజింగ్ అంటే వస్తువులను ప్యాకింగ్ చేయడం మాత్రమే కాదు. ఇందులో మరెన్నో విభాగాలు ఉంటాయి. ప్యాకింగ్ చేయాల్సిన వస్తువులను పరిశీలించడం, ఆయా వస్తువులకు సరిపోయే ప్యాకేజింగ్ పద్ధతులను ఎంపిక చేయడం, వినియోగదారుడిని ఆకట్టుకునే డిజైన్‌ను రూపొందించడం, ఆ ప్యాకింగ్ ఎక్కువ కాలం మన్నుతుందో..లేదో పరీక్షించడం, ప్యాకింగ్ నాణ్యతను పరిశీలించడం, పర్యావరణానికి హాని కలిగించని వాటిని ఉపయోగించడం, ఈ రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకోవడానికి, పోటీ సంస్థలను అధిగమించడానికి పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం. ఇలా ప్యాకేజింగ్ రంగంలో ఎన్నో విభాగాలు.. అందులో వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలుంటాయి. స్వయం ఉపాధికి సమృద్ధిగా అవకాశాలున్న రంగం.. ప్యాకేజింగ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ప్యాకేజింగ్ రంగంలో.. నిష్ణాతులను అందించడానికి, ప్యాకేజింగ్ ప్రమాణాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వంలోని వాణిజ్య మంత్రిత్వశాఖ 1966లో ఏర్పాటు చేసిన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్(ఐఐపీ). ఆహార, వాణిజ్య, ఫార్మా, ఇతర రంగాల కంపెనీల ఉత్పత్తులకు పటిష్ట ప్యాకేజింగ్ రూపొందించడం.. విదేశాలకు ఎగుమతయ్యే ఆహార వస్తువులు, పదార్థాలు, రసాయనాలు, ఆభరణాలకు ప్యాకేజింగ్ చేసే నిష్ణాతులను తయారుచేయడం దీని ప్రధాన లక్ష్యం. ముంబై ప్రధాన క్యాంపస్‌గా దేశవ్యాప్తంగా ఐఐపీకి మరో 4 క్యాంపస్‌లున్నాయి. అవి. హైదరాబాద్ (సనత్‌నగర్), ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై. ఈ సంస్థ ప్యాకేజింగ్ కోర్సులను ఆఫర్ చేయడంలో దేశవ్యాప్తంగా పేరుగాంచింది. వెబ్సైట్: www.iip-in.com ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఏ ఫుల్‌టైం సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ప్యాకేజింగ్ వ్యవధి: 3 నెలలు. అర్హత: ఏదైనా డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత. ఎంపిక విధానం: మొదట వచ్చినవారికి తొలి ప్రాధాన్యం ప్రాతిపదికన ప్రవేశం కల్పిస్తారు. ఏ ఫుల్‌టైం పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ వ్యవధి: రెండేళ్లు. మొత్తం సీట్లు: హైదరాబాద్ క్యాంపస్‌లో 60, ముంబైలో 80, ఢిల్లీ-80, కోల్‌కతా-60 అర్హత: సైన్స్/ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్/సంబంధిత సబ్జెక్టులలో ద్వితీయశ్రేణిలో గ్రాడ్యుయేషన్ (12+3) విధానంలో ఉత్తీర్ణత. ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. వీరు పర్సనల్ ఇంటర్వ్యూ నాటికి ఉత్తీర్ణులై ఉంటేనే ప్రవేశం లభిస్తుంది. ఎంపిక విధానం: అకడమిక్ రికార్డ్, ప్రవేశపరీక్ష, మౌఖిక పరీక్షల ఆధారంగా. ప్రవేశపరీక్షను ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాల్లో నిర్వహిస్తారు. మౌఖిక పరీక్ష ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్ష విధానం: మల్టిపుల్ చాయిస్ విధానంలో జరిగే పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంజనీరింగ్ సబ్జెక్టులపై గ్రాడ్యుయేషన్ స్థాయిలో ప్రశ్నలుంటాయి. ఇవేకాకుండా దూరవిద్య విధానంలో కూడా ఐఐపీ కోర్సులు నిర్వహిస్తోంది. ఇంకా ఎగ్జిక్యూటివ్స్‌కు పార్ట్‌టైం, వీకెండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ ద్వారా.. మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమాలో ప్రవేశానికి నిర్వహించే ‘పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్)’ ద్వారా మూడేళ్ల డిప్లొమా ఇన్ ప్యాకింగ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. హైదరాబాద్ (రామంతాపూర్)లో ఉన్న జేఎన్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ కోర్సును అందిస్తున్నారు. మొత్తం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు పూర్తిచేసుకున్న తర్వాత విద్యార్థులందరికీ దాదాపు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్నారు. కోర్సుల్లో ఏం నేర్పుతారు? కంపెనీలు, పరిశ్రమలు ఏ ఉత్పత్తిని బయటకు తీసుకువచ్చినా... వాటిని వినియోగదారుడు ఇష్టపడేలా చేయడంలో ప్యాకేజింగ్‌దే కీలకపాత్ర. ప్యాకేజీ ఎంత బాగుంటుందనేదానిపైనే అమ్మకాలు ఆధారపడి ఉంటాయి. అందుకే కోర్సులో ప్యాకేజింగ్ అంటే? దాని అవసరం? అందులో దశలు? ఫార్మా కంపెనీల ఉత్పత్తులకు ఎలాంటి ప్యాకేజీ అవసరం? కెమికల్ ఉత్పత్తులకు ఎలాంటి ప్యాకేజీ చేయాలి? ఆహార పదార్థాలకు అనువైన ప్యాకేజింగ్ ఏది? ఏ మోతాదులో చేయాలి? వంటివి నేర్పుతారు. డిమాండ్ ఉన్న కెరీర్ ఢిల్లీ మార్కెట్ నుంచి గల్లీ మార్కెట్ వరకు వివిధ వస్తువులు ఉప్పెనలా వచ్చిపడుతున్నాయి. ఈ వస్తువులు వినియోగదారులను ఆకర్షించడానికి పొందికైన, ఆకర్షణీయమైన ప్యాకింగ్ తప్పనిసరి. ఈ రంగంలో డిమాండ్‌కు తగిన విధంగా నిపుణులు లేరు. ఈ నేపథ్యంలో ప్యాకేజింగ్ కోర్సు ఉత్తీర్ణుల అవసరం అంతకంతకూ పెరుగుతోంది. విదేశాల్లో సైతం వీరికి మంచి అవకాశాలున్నాయి. ప్రారంభంలోనే భారీ వేతనాలు అందుకోవచ్చు. ఓ మాదిరి కంపెనీల్లో రూ.25,000 నుంచి వేతనం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి లక్షల్లో సంపాదించొచ్చు. ఈ రంగంలో అనుభవం సంపాదించిన తర్వాత ఆర్థిక స్థోమత ఉంటే సొంతంగా ప్యాకేజింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా కెరీర్లో మరింత రాణించొచ్చు. ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న కంపెనీలు: ఐఐపీలో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు ఇవ్వడానికి వివిధ కంపెనీలు పోటీపడుతున్నాయి. వాటిలో హరిత-ఎన్టీఐ, నెస్లే ఇండియా లిమిటెడ్, ఆగ్రోటెక్ ఫుడ్స్ లిమిటెడ్, క్యాడ్బరీ ఇండియా లిమిటెడ్, క్యాస్ట్రాల్, కోకాకోలా, సిప్లా, డాబర్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, గుజరాత్ గ్లాస్ లిమిటెడ్, హిమాలయ డ్రగ్, హిందూస్థాన్ యూనిలీవర్, హిందూస్థాన్ పెట్రోలియం, ఐటీసీ, జాన్సన్ అండ్ జాన్సన్, లార్సన్ అండ్ టూబ్రో లిమిటెడ్, మాట్రిక్స్, ది పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ మొదలైన కంపెనీలున్నాయి. ఇంజనీరింగ్, ఆర్ట్ సమ్మిళితమే ప్యాకేజింగ్! శ్రీతయారీ, రిటైల్ రంగంలో అభివృద్ధి నేపథ్యంలో ప్యాకేజింగ్ విభాగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. కంపెనీల ఉత్పత్తులు విజయవంతం కావడంలో ప్యాకేజింగ్ నిపుణుల కృషి ఎంతో ఉంటుంది. కాబట్టి మెకానికల్, ఫార్మాస్యూటికల్, ఫెర్టిలైజర్, అగ్రికల్చర్, టాయ్స్తోపాటు దాదాపు అన్ని పరిశ్రమలూ ప్యాకేజింగ్ టెక్నోక్రాట్స్‌ను నియమించుకుంటున్నాయి. వీరికి కేవలం భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇతర ఉద్యోగాల్లో మాదిరి ప్యాకేజింగ్ కొలువుల్లోనూ వివిధ స్థాయిలుంటాయి. గ్రౌండ్ లెవల్ టెక్నీషియన్లు, సూపర్వైజర్లుగా ప్యాకేజింగ్ కంపెనీల్లో చేరొచ్చు. పదోతరగతి, ఇంటర్మీడియెట్ తర్వాత ఒకేషనల్, స్వల్పకాలిక కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా ప్యాకేజింగ్ ఉద్యోగాలు లభిస్తాయి. ఇంజనీరింగ్, ఆర్ట్ సమ్మిళితమే ప్యాకేజింగ్‌గా పేర్కొనొచ్చు. ఉత్పత్తుల డిజైన్‌కు అనుగుణంగా ఉండేలా స్ట్రక్చరింగ్ కోసం ఇంజనీరింగ్ దృక్పథం తోడ్పడుతుంది. ప్రారంభంలోనే ఏడాదికి కనీసం రూ.3 లక్షల వేతనం లభిస్తోంది. ప్యాకేజింగ్‌లో శిక్షణ పొందిన వారు ఎంటర్ప్రెన్యూర్లుగా రాణించొచ్చ్ణు - ఎ.వి.పి.ఎస్. చక్రవర్తి, ైచైర్మన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్- హైదరాబాద్ బ్రాంచ్. -
కెరీర్ కౌన్సెలింగ్
ప్యాకేజింగ్ కోర్సులను పూర్తిచేస్తే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? - సంతోష్‌కుమార్, వరంగల్ వస్తువుల విక్రయాల్లో ప్యాకేజింగ్‌దే కీలక పాత్ర. ప్యాకేజీ ఆకర్షణీయంగా ఉంటే వస్తువు వినియోగదారుడి దృష్టిని వెంటనే ఆకట్టుకుంటుంది. తద్వారా అమ్మకాలు పెరుగుతాయి. దీంతో కంపెనీలు ప్యాకేజింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. సృజనాత్మకతతో విభిన్నమైన ప్యాకేజీలను సృష్టించాలనే ఆసక్తి ఉన్నవారు ప్యాకేజింగ్ కోర్సులను అభ్యసించవచ్చు. మనదేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) వివిధ ప్యాకేజింగ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. దీనికి హైదరాబాద్‌లోనూ శాఖ ఉంది. సైన్స్/టెక్నాలజీ/ఇంజనీరింగ్ కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు అర్హులు. హైదరాబాద్‌లో జేఎన్ పాలిటెక్నిక్ కళాశాల ప్యాకేజింగ్ లో డిప్లొమా కోర్సును అందిస్తోంది. పాలిసెట్ ద్వారా ప్రవేశం ఉంటుంది. కెరీర్ స్కోప్: ప్రైవేట్ రంగంలోని అనేక సంస్థలు ప్యాకేజింగ్ నిపుణులను నియమించుకుంటున్నాయి. ఫుడ్ అండ్ బేవరేజెస్, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, పేపర్, ప్లాస్టిక్ తయారీ యూనిట్లలో మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రొడక్షన్, మార్కెటింగ్, పర్చేజ్, ఆర్ అండ్ డీ వంటి విభాగాల్లో ప్యాకేజింగ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్/ఆపరేటర్, క్వాలిటీ కంట్రోల్ అనలిస్టు, ఇంజనీర్, సైంటిస్టు, సేల్స్ ఎగ్జిక్యూటివ్ తదితర హోదాల్లో అవకాశాలు అందుకోవచ్చు. సొంతంగా ప్యాకేజింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందొచ్చు. ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు పొందొచ్చు. తర్వాత అనుభవం, పనితీరును బట్టి అధిక వేతనాలు అందుకోవచ్చు. వివరాలకు: వెబ్సైట్: www.iip-in.com -
ప్యాకేజింగ్ ‘పొట్లం’లో పదిలమైన కెరీర్...!
చర్మ సంరక్షణకు ఉపయోగపడే సబ్బు బిళ్లయినా.. ఆరోగ్యాన్ని పంచే మందు బిళ్లయినా.. దేనికైనా పదిలమైన, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ అవసరం. ప్రస్తుత సూపర్ మార్కెట్ సంస్కృతిలో స్వీయ సేవ (సెల్ఫ్ సర్వీసింగ్) మార్కెటింగ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ఓ పెద్ద సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తున్న వ్యక్తి నిమిషానికి 600 వస్తువులను దాటుకుంటూ వెళ్తాడు. ఇలాంటి పరిస్థితిలో కొనుగోలుదారుల్ని ఓ వస్తువు ఆకర్షించాలంటే అందమైన ప్యాకేజింగ్ అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశ్రమల నుంచి బయటకొచ్చిన ఏ ఉత్పత్తి అయినా విజయవంతం కావడంలో ప్యాకేజింగ్ కీలకం. అందుకే ప్రస్తుతం ప్యాకేజింగ్ రంగ నిపుణులకు జాబ్ మార్కెట్లో అవకాశాలు పెరుగుతున్నాయి. ఓ కంపెనీ తయారు చేసిన వస్తువు అమ్మకాల్లో ప్యాకేజింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. వస్తువు చెడిపోకుండా ఉంచడంలోనూ, కొనుగోలుదారుడిని ఇట్టే ఆకర్షించడంలోనూ ప్యాకేజింగ్ది పెద్దన్న పాత్రే! మొత్తంమీద ఓ వస్తువు మార్కెటింగ్‌లో ప్యాకేజింగ్ పాత్ర కీలకమని చెప్పొచ్చు. అందుకే ప్యాకేజింగ్ సాదాసీదా వ్యవహారంలా కాకుండా, సరికొత్త వృత్తిగా సొబగులద్దుకుంటోంది! యువత ముందు ఓ ప్రత్యామ్నాయ కెరీర్ ఆప్షన్‌గా నిలుస్తోంది! వన్నె తెచ్చే కోర్సులు: దేశంలో ప్యాకేజింగ్‌కు సంబంధించి కోర్సులను అందిస్తున్న ప్రతిష్టాత్మక సంస్థ.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ). ఇది కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖ పాలనా మండలి ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్వయంప్రతిపత్తి సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లో బ్రాంచ్‌లున్నాయి. బెంగళూరులో బ్రాంచ్ ఏర్పాటు పనులు సాగుతున్నాయి. ఇది పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్, సర్టిఫికెట్ కోర్సు ఇన్ ప్యాకేజింగ్, గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ ప్యాకేజింగ్(దూరవిద్యలో) కోర్సులను ఆఫర్ చేస్తోంది. వీటితో పాటు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు, స్వల్ప కాలిక కోర్సులను అందిస్తోంది. సైన్స్/టెక్నాలజీ/ఇంజనీరింగ్/సంబంధిత కోర్సుల్లో గ్రాడ్యుయేషన్/తత్సమాన కోర్సులను పూర్తిచేసినవారు ప్యాకేజింగ్ కోర్సుల్లో చేరొచ్చు.రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలు ప్యాకేజింగ్ టెక్నాలజీ డిప్లొమాను ఆఫర్ చేస్తున్నాయి. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ ద్వారా ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సును పూర్తి చేసిన తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, మెకానికల్ మెరైన్, మెకట్రానిక్స్ బ్రాంచ్‌లతో బీటెక్ చేసే అవకాశం కూడా ఉంది. కోర్సులో బోధించే అంశాలు: సాధారణంగా ప్యాకేజింగ్ కోర్సుల కరిక్యులం 60 శాతం థియరీకి, 40 శాతం ప్రాక్టికల్స్‌కు సంబంధించి ఉంటుంది. పరిశ్రమల సందర్శన, పారిశ్రామిక శిక్షణ, ప్రాజెక్టు వర్క్ ఉంటాయి. ఇంట్రడక్షన్ టు ప్యాకేజింగ్; సెల్యులోజ్ టెక్నాలజీ; ఫైబర్ బోర్డు అండ్ గ్లాస్ టెక్నాలజీ; ప్లాస్టిక్ టెక్నాలజీ; మెటల్ కంటైనర్స్; టూలింగ్, డిజైన్, మౌల్డ్స్; ప్యాకేజ్ ప్రింటింగ్ టెక్నాలజీ; ప్యాకేజింగ్ టెక్నాలజీ ఫుడ్/ఫార్మాస్యూటికల్స్/కాస్మెటిక్స్/కెమికల్స్); కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర అంశాలను బోధిస్తారు. కెరీర్: ప్యాకేజింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. ఫుడ్ అండ్ బేవరేజెస్ కంపెనీలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, పేపర్, ప్లాస్టిక్, ప్యాకేజింగ్ యూనిట్లు తదితరాల్లో అవకాశాలుంటాయి. ప్రొడక్షన్, పర్చేస్, మార్కెటింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో వివిధ హోదాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ప్యాకేజింగ్ శిక్షణ కేంద్రాల్లో బోధనా సిబ్బందిగా అవకాశాలు ఉంటాయి. ప్యాకేజింగ్ రీసెర్చ్, డెవలప్మెంట్ సంస్థల్లోనూ ఉద్యోగాలుంటాయి. సొంతంగా ప్యాకేజింగ్ యూనిట్లు ఏర్పాటుచేసుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్స్: ప్యాకేజింగ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్. ప్యాకేజింగ్ మేనేజర్/ ఆపరేటర్. క్వాలిటీ కంట్రోల్ అనలిస్టు (ప్యాకేజింగ్). ప్యాకేజింగ్ ఇంజనీర్. ప్యాకేజింగ్ సైంటిస్ట్స్. సేల్స్ ఎగ్జిక్యూటివ్ (ప్యాకేజింగ్). విధులు: ఒక ఉత్పత్తిని అందంగా ఆకట్టుకునేలా మన్నికైన ప్యాకేజింగ్‌ను రూపొందించడం ప్యాకేజింగ్ నిపుణుల విధి. ఈ క్రమంలో ఆయా పరిశ్రమలు వాటి ఉత్పత్తులు, కాలపరిమితి ఆధారంగా సాంకేతికంగా ఎటువంటి ప్యాకింగ్ అవసరమో (ఉదాహరణకు ఫార్మా కంపెనీల ఉత్పత్తులకు ఎలాంటి ప్యాకేజీ అవసరం, కెమికల్ ఉత్పత్తులకు ఎలాంటి ప్యాకేజీ చేయాలి) నిర్ధారించడం, అందుకోసం అవసరమైన రసాయనాలను సూచించడం, వాటిని ఎంత మోతాదులో వినియోగించాలో సలహానివ్వడం, పర్యావరణ పరంగా అవసరమైన జాగ్రత్తలను సూచించడం వంటి విధులను వీరు నిర్వర్తిస్తుంటారు. వేతనాలు: అవకాశాలకనుగుణంగానే ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయని చెప్పొచ్చు. కెరీర్ ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం అందుకోవచ్చు. ఆ తర్వాత పనితీరు ఆధారంగా భారీ వేతనాలు పొందే అవకాశం ఉంది. టాప్ రిక్రూటర్స్: హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ క్యాడ్బరీ ఇండియా లిమిటెడ్ కోకా కోలా ఇండియా ఐఎన్‌సీ పోక్టర్ అండ్ గ్యాంబిల్ ఇండియా లిమిటెడ్ డాబర్ ఇండియా లిమిటెడ్ జాన్సన్ అండ్ జాన్సన్ లిమిటెడ్ విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ఐటీసీ లిమిటెడ్ సిప్లా లిమిటెడ్ నైపుణ్యాలు: సృజనాత్మకత కమ్యూనికేషన్ స్కిల్స్ మార్కెటింగ్ ధోరణులపై అవగాహన బృంద స్ఫూర్తి టెక్నాలజీ అప్లికేషన్. కోర్సులు పూర్తిచేసిన వారికి వంద శాతం ప్లేస్‌మెంట్స్ ప్రస్తుతం పరిశ్రమల్లో ప్యాకేజింగ్ ప్రత్యేక విభాగంగా గుర్తింపు పొందుతోంది. పరిశ్రమల యాజమాన్యాలు ప్యాకేజింగ్ టెక్నాలజిస్టులను నియమించుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ప్యాకేజింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి 100 శాతం ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి. ఆహార సంబంధిత పరిశ్రమలు, కెమికల్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తులు తదితరాలకు సంబంధించిన సంస్థల్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రారంభంలో కనీసం రూ.2 లక్షల నుంచి రూ.2,50,000 వరకు వార్షిక వేతనం లభిస్తోంది. ప్రారంభంలోనే ఏడాదికి ఐదారు లక్షల ప్యాకేజీలకు ఉద్యోగాలను సొంతం చేసుకున్న వారూ ఉన్నారు. కోర్సులు పూర్తిచేసిన వారు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దిశగా కూడా వెళ్లొచ్చు. - ఎ.వి.పి.ఎస్. చక్రవర్తి, చైర్మన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ హైదరాబాద్ బ్రాంచ్. ఐఐపీ- పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ప్యాకేజింగ్ (ఐఐపీ).. రెండేళ్ల కాల వ్యవధి గల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత: కనీసం ద్వితీయ శ్రేణి మార్కులతో గ్రాడ్యుయేషన్ (12+3 విధానంలో ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథమెటిక్స్/మైక్రోబయాలజీలలో ఒక సబ్జెక్టు మెయిన్‌గా లేదా సెకండ్ సబ్జెక్ట్‌గా ఉండాలి).అగ్రికల్చర్/ఫుడ్ సైన్స్/పాలిమర్ సైన్స్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్/టెక్నాలజీ డిగ్రీని కనీసం ద్వితీయ శ్రేణి మార్కులతో పూర్తిచేసిన వారు కూడా అర్హులు.చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. వీరు ఇంటర్వ్యూ సమయానికి సంబంధిత డిగ్రీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. లేకుంటే ప్రవేశ ప్రక్రియ నుంచి తప్పిస్తారు.నిర్దేశ డిగ్రీకి తత్సమాన కోర్సులను విదేశాల్లో పూర్తిచేసిన వారు అర్హులు. అయితే వారు అకడమిక్‌గా మంచి ప్రతిభ కనబరచి ఉండాలి. ప్రవేశం: అకడమిక్ మెరిట్, ఎంట్రన్స్ (రాత పరీక్ష, ఇంటర్వ్యూ)లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. పరీక్ష పత్రం గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్షను ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌లలో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌లో ఉంటుంది. సీట్ల వివరాలు: ముంబై-80; ఢిల్లీ-80; కోల్‌కతా-60; హైదరాబాద్-60 ఓబీసీ విద్యార్థులకు 27శాతం, ఎస్సీ విద్యార్థులకు 15 శాతం,ఎస్టీ విద్యార్థులకు 7.5శాతం రిజర్వేషన్ ఉంటుంది కోర్సులో ప్రవేశించేటప్పుడు రూ.40 వేలు ఫీజు చెల్లించాలి. దీంతో పాటు సెమిస్టర్‌కు రూ.60 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.కోర్సు స్వరూపం: మూడు సెమిస్టర్లు ఉంటాయి. కోర్సులో ప్యాకేజింగ్‌కు సంబంధించిన అంశాలతో పాటు మేనేజ్మెంట్ సబ్జెక్టులను కూడా బోధిస్తారు. అవి.. ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ: జూన్ 12, 2014. ప్రవేశ పరీక్ష జరుగు తేదీ: జూన్ 19, 2014. వెబ్సైట్: www.iipin.com -
హరిత బాటలో కంపెనీలు
న్యూఢిల్లీ: లాభాలతో పచ్చగా కళకళలాడేందుకు కంపెనీలు పర్యావరణ అనుకూల హరితబాట పడుతున్నాయి. విద్యుత్, ప్యాకేజింగ్ మొదలైన వ్యయాలు తగ్గించుకునేందుకు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నాయి. షాపర్స్ స్టాప్, మార్క్స్ అండ్ స్పెన్సర్ తదితర రిటైల్ సంస్థలు ఈ విషయంలో ముందంజలో ఉంటున్నాయి. కరెంటు ఖర్చులు నింగినంటుతున్న తరుణంలో.. షాపింగ్ బ్యాగులే కాదు షాపులను కూడా పర్యావరణ అనుకూలంగా తీర్చిదిద్దుతున్నాయి. మొత్తం వ్యయాల్లో దాదాపు అరశాతం నుంచి ఒక శాతం దాకా ఉండే విద్యుత్ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఉదాహరణకు, షాపర్స్ స్టాప్..ముంబైలోని ఒక స్టోర్‌లో సోలార్ ప్యానెళ్లని అమర్చింది. నిర్వహణ భారం తగ్గించుకునే విధంగా తేలికపాటి విద్యుత్ పరికరాలను ఇందులో వాడుతోంది. అటు, స్పోర్ట్స్ లైఫ్‌స్టయిల్ దిగ్గజం ప్యూమా ..బెంగళూరులో ఎకో ఫ్రెండ్లీ స్టోరు ప్రారంభించింది. పాత డీవీడీ ప్లేయర్లు, సైకిళ్లు, టిఫిన్ బాక్సులు మొదలైన వాటిని రీసైకిల్ చేయగా వచ్చిన ఉక్కుతో ఈ బిల్డింగ్‌ను నిర్మించారు. మరోవైపు మార్క్స్ అండ్ స్పెన్సర్.. ఢిల్లీలో సుమారు 20,000 చ.అ. మేర స్టోర్‌ని ప్రారంభించింది. ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదని సంస్థ అని తెలిపింది. స్టోర్‌లోపల ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులేకుండా ఉండేలా చూసే గ్లాస్‌ని ఇందులో అమర్చినట్లు వివరించింది. ఇది హానికారక అల్ట్రావయోలెట్ కిరణాలను సైతం 90 శాతం వరకూ నిరోధించగలదు. అలాగే, సోలార్ రిఫ్లెక్టివ్ టైల్స్ వల్ల స్టోర్ చల్లగా ఉంటుంది. స్టోర్‌లో విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఎనర్జీ మీటర్స్ కూడా ఇందులో ఉన్నాయి. కోకాకోలా ‘ఎకోకూల్’ సోలార్ కూలర్లు ఇక సాఫ్ట్ డ్రింక్స్ దిగ్గజం కోకా కోలా విద్యుత్ ఆదా చర్యల కోసం 22 ప్రాంతాల్లో ఉన్న తమ బాట్లింగ్ ప్లాంట్ల భాగస్వామ్య సంస్థలతో చేతులు కలిపింది. ఈ ఏడాది ఆఖరు నాటికి 1,000 ‘ఎకోకూల్’ సోలార్ కూలర్లను అమర్చడంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా 5బై20 పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద విద్యుత్ కొరత ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో సైతం అమ్మకాలు పెంచుకునేందుకు స్థానిక రిటైలర్లకు సోలార్ కూలర్లను పంపిణీ చేస్తారు. ఈ కూలర్లు ఒక్కోటి 300 మిల్లీలీటర్లు ఉండే సుమారు 48 గాజు బాటిళ్లను చల్లబరిచి, నిల్వ చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇటు వ్యయాలను తగ్గించుకోవ డానికే కాకుండా అటు పర్యావరణానికీ మేలు చేసే విధంగా రిటైల్ సంస్థలు వ్యవహరిస్తుండటం మంచిదేనని పరిశీలకులు అంటున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి వినూత్న ప్రయోగాలు మరిన్ని చూసే అవకాశం ఉండగలదని భావిస్తున్నారు