హరిత బాటలో కంపెనీలు
న్యూఢిల్లీ: లాభాలతో పచ్చగా కళకళలాడేందుకు కంపెనీలు పర్యావరణ అనుకూల హరితబాట పడుతున్నాయి. విద్యుత్, ప్యాకేజింగ్ మొదలైన వ్యయాలు తగ్గించుకునేందుకు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నాయి. షాపర్స్ స్టాప్, మార్క్స్ అండ్ స్పెన్సర్ తదితర రిటైల్ సంస్థలు ఈ విషయంలో ముందంజలో ఉంటున్నాయి. కరెంటు ఖర్చులు నింగినంటుతున్న తరుణంలో.. షాపింగ్ బ్యాగులే కాదు షాపులను కూడా పర్యావరణ అనుకూలంగా తీర్చిదిద్దుతున్నాయి. మొత్తం వ్యయాల్లో దాదాపు అరశాతం నుంచి ఒక శాతం దాకా ఉండే విద్యుత్ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
ఉదాహరణకు, షాపర్స్ స్టాప్..ముంబైలోని ఒక స్టోర్‌లో సోలార్ ప్యానెళ్లని అమర్చింది. నిర్వహణ భారం తగ్గించుకునే విధంగా తేలికపాటి విద్యుత్ పరికరాలను ఇందులో వాడుతోంది. అటు, స్పోర్ట్స్ లైఫ్‌స్టయిల్ దిగ్గజం ప్యూమా ..బెంగళూరులో ఎకో ఫ్రెండ్లీ స్టోరు ప్రారంభించింది. పాత డీవీడీ ప్లేయర్లు, సైకిళ్లు, టిఫిన్ బాక్సులు మొదలైన వాటిని రీసైకిల్ చేయగా వచ్చిన ఉక్కుతో ఈ బిల్డింగ్‌ను నిర్మించారు.
మరోవైపు మార్క్స్ అండ్ స్పెన్సర్.. ఢిల్లీలో సుమారు 20,000 చ.అ. మేర స్టోర్‌ని ప్రారంభించింది. ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదని సంస్థ అని తెలిపింది. స్టోర్‌లోపల ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులేకుండా ఉండేలా చూసే గ్లాస్‌ని ఇందులో అమర్చినట్లు వివరించింది. ఇది హానికారక అల్ట్రావయోలెట్ కిరణాలను సైతం 90 శాతం వరకూ నిరోధించగలదు. అలాగే, సోలార్ రిఫ్లెక్టివ్ టైల్స్ వల్ల స్టోర్ చల్లగా ఉంటుంది. స్టోర్‌లో విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఎనర్జీ మీటర్స్ కూడా ఇందులో ఉన్నాయి.
కోకాకోలా ‘ఎకోకూల్’ సోలార్ కూలర్లు
ఇక సాఫ్ట్ డ్రింక్స్ దిగ్గజం కోకా కోలా విద్యుత్ ఆదా చర్యల కోసం 22 ప్రాంతాల్లో ఉన్న తమ బాట్లింగ్ ప్లాంట్ల భాగస్వామ్య సంస్థలతో చేతులు కలిపింది. ఈ ఏడాది ఆఖరు నాటికి 1,000 ‘ఎకోకూల్’ సోలార్ కూలర్లను అమర్చడంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా 5బై20 పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద విద్యుత్ కొరత ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో సైతం అమ్మకాలు పెంచుకునేందుకు స్థానిక రిటైలర్లకు సోలార్ కూలర్లను పంపిణీ చేస్తారు. ఈ కూలర్లు ఒక్కోటి 300 మిల్లీలీటర్లు ఉండే సుమారు 48 గాజు బాటిళ్లను చల్లబరిచి, నిల్వ చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇటు వ్యయాలను తగ్గించుకోవ డానికే కాకుండా అటు పర్యావరణానికీ మేలు చేసే విధంగా రిటైల్ సంస్థలు వ్యవహరిస్తుండటం మంచిదేనని పరిశీలకులు అంటున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి వినూత్న ప్రయోగాలు మరిన్ని చూసే అవకాశం ఉండగలదని భావిస్తున్నారు