
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ రెస్టారెంట్ గైడ్, ఫుడ్ డెలివరీ సేవల సంస్థ జొమాటో.. రెస్టారెంట్లు పంపిన ఆహార పదార్ధాలను మార్గం మధ్యలో ఎవరూ ఓపెన్ చేసేందుకు వీలులేకుండా గట్టి భద్రతా చర్యలను చేపట్టింది. ఇక నుంచి ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్ టేప్స్‌తో ఫుడ్ డెలివరీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ మధ్య ఓ డెలివరీ బాయ్ పార్సిల్‌ను ఓపెన్ చేసిన సంఘటన వైరల్ కాగా, అప్పట్లోనే ఇటువంటి నాణ్యతా చర్యను చేపట్టనున్నట్లు సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇందుకు అనుగుణంగా తొలుత దేశంలోని 10 నగరాల్లో ఈ తరహా సేవలను ప్రారంభించినట్లు బుధవారం ప్రకటించింది. పునర్వినియోగానికి వీలైన సింగిల్ మెటీరియల్ పాలిమర్‌తో ఫుడ్ డెలివరీ జరుగుతుందని తెలిపింది. తొలి దశలో ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, పూణె, జైపూర్, చండీగఢ్, నాగ్‌పూర్, వడోదరల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ సీఈఓ మోహిత్ గుప్తా తెలిపారు. ఈ దశలో 5,000 రెస్టారెంట్లు ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్‌తో ఆహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారాయన.