సేద తీరేందుకు తగిన ఏర్పాట్లు
ఎండల దృష్ట్యా కంపెనీల నిర్ణయం
న్యూఢిల్లీ: ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి డెలివరీ పార్ట్‌నర్స్ సేద తీరేందుకు ఫుడ్ డెలివరీ, ఈ–కామర్స్ కంపెనీలు పలు చర్యలకు శ్రీకారం చుట్టాయి. దేశవ్యాప్తంగా 450 రెస్ట్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్టు జొమాటో ప్రకటించింది. డెలివరీ పార్ట్‌నర్స్ ఈ కేంద్రాల్లో సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. మొబైల్ చార్జింగ్, మంచి నీరు, వాష్‌రూమ్స్ ఏర్పాట్లు ఉంటాయి.
250 నగరాలు, పట్టణాల్లో 450 కేంద్రాల్లో డెలివరీ పార్ట్‌నర్స్‌కు అందించేందుకు శీతల పానీయాలు, పళ్ల రసాలు, గ్లూకోస్ వంటి 5 లక్షల ప్యాక్‌లను కంపెనీ కొనుగోలు చేసింది. అత్యవసర వైద్యం అవసరమైతే 15 నిముషాల్లో చేరుకునేలా 530కిపైగా నగరాలు, పట్టణాల్లో అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేసింది. ఫుల్ స్లీవ్, డ్రై ఫిట్ టీ–షర్టులను అందుబాటులోకి తెచి్చనట్టు జొమాటో సీఈవో రాకేశ్ రంజన్ తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ఎండ తీవ్రత ఉన్న సమయంలో ఫుడ్ ఆర్డర్ చేయకూడదని కంపెనీ తన కస్టమర్లకు ఎక్స్ వేదికగా విన్నవించింది.
బీమా కవరేజ్ సైతం..
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 900లకుపైగా రీచార్జ్ జోన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో సీటింగ్, మొబైల్ చార్జింగ్, మంచి నీరు, వాష్‌రూమ్స్ ఏర్పాట్లు ఉంటాయి. అత్యవసర వైద్యం కోసం జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ తన యాప్‌లో ఎస్‌వోఎస్ సపోర్ట్ ప్రవేశపెట్టింది. డెలివరీ పార్ట్‌నర్స్ వేచి ఉండే ప్రాంతాల్లో ఎయిర్ కూలర్స్‌ను ఏర్పాటు చేసినట్టు బ్లింకిట్ సీఈవో అల్బీందర్ ధిండ్సా తెలిపారు. జొమాటో, బ్లింకిట్ డెలివరీ పార్ట్‌నర్స్ ఆసుపత్రిలో చేరితే రూ.1 లక్ష వరకు, ఔట్ పేషెంట్ సేవలు పొందితే రూ.5,000 వరకు బీమా కవరేజ్ ఆఫర్ చేస్తోంది. గ్లూకోస్ పానీయాలను అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫెసిలిటీస్ వద్ద ఫ్యాన్స్, కూలర్స్‌ను అదనంగా ఏర్పాటు చేసినట్టు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment