హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాకేజింగ్ రంగ సంస్థ మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ రూ.100 కోట్లతో కొత్తగా మూడు ప్లాంట్లను ప్రారంభించింది. తెలంగాణలోని సుల్తాన్‌పూర్, హరియాణాలోని పానిపట్, తమిళనాడులోని చెయ్యార్ వద్ద ఏర్పాటయ్యాయి. వీటి మొత్తం వార్షిక సామర్థ్యం 5,500 మెట్రిక్ టన్నులు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కోసం మహారాష్ట్రలోని మహద్ వద్ద రూ.20 కోట్లతో 1,500 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యం గల ప్లాంటు 2024 అక్టోబర్ నాటికి రెడీ అవుతోంది.
2024–25లో మోల్డ్‌టెక్ రూ.75–80 కోట్ల మూలధన వ్యయం చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.120 కోట్లు, 2022–23లో రూ.148 కోట్లు వెచ్చించింది. 2024–25లో పరిమాణంలో 15–18 శాతం వృద్ధిని ఆశిస్తోంది.
తాజా విస్తరణతో 2024–25లో మొత్తం వార్షిక తయారీ సామర్థ్యం 54,000 మెట్రిక్ టన్నులకు చేరుతుందని మోల్డ్‌టెక్ సీఎండీ జె.లక్ష్మణ రావు వెల్లడించారు. ‘కొత్త ప్లాంట్లు కంపెనీ వృద్ధి అవకాశాలను ప్రధానంగా ఫార్మా ప్యాకేజింగ్‌లో మెరుగుపరుస్తాయి. ఫార్మా పరిశ్రమ నుండి మా ఉత్పత్తులకు డిమాండ్ చాలా ప్రోత్సాహకరంగా ఉంది. 2024–25 తొలి త్రైమాసికం నుండి ఫార్మా ప్యాకేజింగ్ ఆదాయం తోడవుతుంది. 5–6 ఏళ్లలో మొత్తం ఆదాయంలో ఫుడ్, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా విభాగాలు 50 శాతం సమకూర్చాలన్నది మా ప్రణాళిక’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment