
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి స్టాలిన్ డీలిమిటేషన్, త్రిభాష విధానంపై రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. త్రిభాషా విధానంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని డీఎంకే వితండవాదం చేస్తోంది. డీలిమిటేషన్, జాతీయ విద్యావిధానంపై దివాలాకోరుతనంతో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. 2026 తమిళనాడు ఎన్నికల్లో ఓటమి నుంచి తప్పించుకోవడానికి డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తోంది. దీన్ని బూచిగా చూపించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తమిళనాడులో లిక్కర్ సరఫరాలో కుంభకోణం తెరపైకి వచ్చింది. డీఎంకే నేతలు కోట్ల రూపాయలు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ స్కాం దృష్టి మళ్లించడానికే డీఎంకే.. దక్షిణాదికి అన్యాయం అనే వాదనను లేవనెత్తింది. త్రిభాషా విధానం బ్రిటిష్ కాలం నుంచే అనేక సంవత్సరాలుగా అమలు జరుగుతోంది. త్రిభాషా విధానంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఎన్నికల ఎత్తుగడలో భాగంగా ఓటమి భయంతో స్టాలిన్ బురద జల్లుతున్నారు అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment