Mold-Tek Packaging
-
రూ. 120 కోట్లతో మోల్డ్‌టెక్ ప్లాంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాకేజింగ్ రంగ సంస్థ మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ రూ.100 కోట్లతో కొత్తగా మూడు ప్లాంట్లను ప్రారంభించింది. తెలంగాణలోని సుల్తాన్పూర్, హరియాణాలోని పానిపట్, తమిళనాడులోని చెయ్యార్ వద్ద ఏర్పాటయ్యాయి. వీటి మొత్తం వార్షిక సామర్థ్యం 5,500 మెట్రిక్ టన్నులు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కోసం మహారాష్ట్రలోని మహద్ వద్ద రూ.20 కోట్లతో 1,500 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యం గల ప్లాంటు 2024 అక్టోబర్ నాటికి రెడీ అవుతోంది. 2024–25లో మోల్డ్‌టెక్ రూ.75–80 కోట్ల మూలధన వ్యయం చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.120 కోట్లు, 2022–23లో రూ.148 కోట్లు వెచ్చించింది. 2024–25లో పరిమాణంలో 15–18 శాతం వృద్ధిని ఆశిస్తోంది. తాజా విస్తరణతో 2024–25లో మొత్తం వార్షిక తయారీ సామర్థ్యం 54,000 మెట్రిక్ టన్నులకు చేరుతుందని మోల్డ్‌టెక్ సీఎండీ జె.లక్ష్మణ రావు వెల్లడించారు. ‘కొత్త ప్లాంట్లు కంపెనీ వృద్ధి అవకాశాలను ప్రధానంగా ఫార్మా ప్యాకేజింగ్‌లో మెరుగుపరుస్తాయి. ఫార్మా పరిశ్రమ నుండి మా ఉత్పత్తులకు డిమాండ్ చాలా ప్రోత్సాహకరంగా ఉంది. 2024–25 తొలి త్రైమాసికం నుండి ఫార్మా ప్యాకేజింగ్ ఆదాయం తోడవుతుంది. 5–6 ఏళ్లలో మొత్తం ఆదాయంలో ఫుడ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా విభాగాలు 50 శాతం సమకూర్చాలన్నది మా ప్రణాళిక’ అని తెలిపారు. -
మోల్డ్‌టెక్ రెండు ప్లాంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాకేజింగ్ రంగ కంపెనీ మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ కొత్తగా రెండు ప్లాంట్లను స్థాపిస్తోంది. తమిళనాడులోని చెయ్యార్, హరియాణాలోని పానిపట్ వద్ద ఇవి రానున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ కోసం వీటిని నెలకొల్పుతున్నట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఒక్కో ప్లాంటుకు రూ.30 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ సీఎండీ జె.లక్ష్మణరావు తెలిపారు. చదవండి: QR Code On Cylinders: కేంద్రం సంచలన నిర్ణయం, గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త -
రూ.150 కోట్లు సమీకరిస్తున్న మోల్డ్‌టెక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్లాస్టిక్ ప్యాకేజింగ్ రంగంలో ఉన్న మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ క్విప్ జారీ ద్వారా రూ.150 కోట్లు సమీకరించనుంది. ఈ మొత్తాన్ని కాన్పూర్‌తోపాటు ఇతర నగరాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు, తయారీ సామర్థ్యం పెంపునకు వినియోగించనుంది. విశాఖపట్నం, మైసూరు ప్లాంట్ల సామర్థ్యం రెండింతలు చేర్చాలని ఒక క్లయింట్ నుంచి డిమాండ్ ఉందని సంస్థ తెలిపింది. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌లో భాగంగా కాన్పూర్ ప్లాంటులో ఇంజెక్షన్ బ్లో మౌల్డింగ్ (ఐబీఎం) సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తామని మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ సీఎండీ జె.లక్షణ రావు తెలిపారు. ‘ఈ సాంకేతికతతో ప్యాకేజింగ్ సురక్షితంగా, డిజైన్ సౌకర్యవంతంగా ఉంటుంది. ముద్రణకు అనువైనది. దేశంలో ఐబీఎం మార్కెట్ రూ.5,000 కోట్లుంది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, కాస్మెటిక్స్ విభాగాల్లో అపార అవకాశాలు ఉన్నాయి. ఈ విభాగంలో సుస్థిర స్థానాన్ని సంపాదించాలన్నది లక్ష్యం. ఐబీఎం కోసం రూ.10 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్ పూర్తి చేశాం’ అని వివరించారు. -
మోల్డ్‌టెక్ మరో రెండు ప్లాంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజెక్షన్ మోల్డెడ్ ప్లాస్టిక్ కంటైనర్ల తయారీ దిగ్గజం మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ మరో రెండు ప్లాంట్లను స్థాపిస్తోంది. హైదరాబాద్ సమీపంలోని సుల్తాన్పూర్ వద్ద ఇంజెక్షన్ బ్లో మౌల్డింగ్ (ఐబీఎం) ప్యాకేజింగ్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని రూ.50 కోట్లతో నెలకొల్పనుంది. అలాగే రూ.20 కోట్లతో ఉత్తరప్రదేశ్‌లోనూ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్టు మోల్డ్‌టెక్ గ్రూప్ సీఎండీ జె.లక్ష్మణ్ రావు తెలిపారు. ఫార్మా, కాస్మెటిక్స్, ఎఫ్ఎంసీజీ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల కోసం ఐబీఎం ప్యాకేజింగ్ విభాగంలోని ప్రవేశించిన సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ టెక్నాలజీని పరీక్షించేందుకు రూ.10 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాం. ఐబీఎం ప్యాకేజింగ్ ఉత్పత్తుల మార్కెట్ దేశంలో 9 శాతం వృద్ధితో రూ.5,000 కోట్లు ఉంది. 2025 నాటికి ఈ రంగంలో 5–6 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకుంటాం’ అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏకైక సంస్థ.. రోబోలను వినియోగించి ప్లాస్టిక్ కంటైనర్లను అలంకరణకు ఇన్ మోల్డ్ లేబులింగ్ (ఐఎంఎల్) విధానాన్ని దేశంలో పరిచయం చేసిన తొలి సంస్థగా మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ రికార్డు సాధించింది. ప్రపంచంలో ఐఎంఎల్ డెకోరేషన్ కోసం రోబోలను సొంతంగా రూపకల్పన చేసి తయారు చేస్తున్న ఏకైక ప్యాకేజింగ్ సంస్థ కూడా ఇదే. ‘గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.480 కోట్ల టర్నోవర్ సాధించింది. 2021–22లో 25 శాతం వృద్ధితో రూ.600 కోట్లు ఆశిస్తోంది. మూడు నాలుగేళ్లలో రూ.1,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నాం. విస్తరణకుగాను 2024 నాటికి రూ.200 కోట్లు పెట్టుబడి చేయనున్నాం’ అని లక్షణ్ రావు తెలిపారు. భారత్‌లో సంస్థకు 9 తయారీ కేంద్రాలు ఉన్నాయి. మోల్డ్‌టెక్ గ్రూప్ సీఎండీ జె.లక్ష్మణ్ రావు -
మోల్డ్‌టెక్ మరో రెండు ప్లాంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్లాస్టిక్ ప్యాకేజింగ్ రంగ సంస్థ మోల్డ్‌టెక్ మరో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. 2,000 టన్నుల వార్షిక తయారీ సామర్థ్యంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్తరాదిన ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సుమారు రూ.15 కోట్లు వెచ్చించనుంది. అలాగే హైదరాబాద్ సమీపంలోని సుల్తాన్పూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో మరో ప్లాంట్ రానుంది. రెండేళ్లలో ఇది సిద్ధం కానుంది. 10–12 వేల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో రానున్న ఈ కేంద్రానికి సుమారు రూ.60 కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ సీఎండీ జె.లక్ష్మణ రావు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. నష్టాలు వస్తున్నందునే.. కంపెనీకి యూఏఈలోని రస్ అల్ ఖైమాలో 3,000 టన్నుల కెపాసిటీ గల ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ప్లాంటు ఉంది. గత మూడేళ్లలో ఈ యూనిట్ ద్వారా కంపెనీకి సుమారు రూ.11 కోట్ల నష్టం వచ్చింది. ఇరాన్, ఇరాక్‌కు సరఫరాలపై నిషేధం ఉండడంతో పాటు ఆర్థికంగా సంస్థకు అక్కడి మార్కెట్ కలిసి రాలేదు. అక్కడి పెయింట్ కంపెనీలింకా ప్యాకేజింగ్ కోసం టిన్నే వినియోగిస్తున్నాయి. భారత్‌లో మాదిరి ప్యాకేజింగ్‌కు టిన్ నుంచి ప్లాస్టిక్‌కు మళ్లుతాయని భావిం చిన మోల్డ్టెక్కు నిరాశే మిగిలింది. దీంతో ప్లాం టును మూసేసి మెషినరీని భారత్‌లోని ప్లాంట్లకు తరలించింది. రూ.11 కోట్లను రైటాఫ్ చేసింది. ఈ ఏడాది 20 శాతం వృద్ధి.. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మూలధన వ్యయం రూ.75 కోట్లు. 2019–20లో ఇది రూ.30 కోట్లకు పరిమితం కానుంది. ఇందులో రూ.15 కోట్లు ఉత్తరాది ప్లాంటుకు, మిగిలిన మొత్తం సామర్థ్యం పెంపునకు వినియోగిస్తారు. మైసూరు యూనిట్ ఫిబ్రవరిలో, వైజాగ్ కేంద్రం మార్చి నుంచి అందుబాటులోకి వచ్చాయి. వీటికి రూ.45 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కొక్కటి 3,000 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది ఈ 2 యూనిట్ల సామర్థ్యం పూర్థి స్థాయిలో తోడవనుంది. హైదరాబాద్, డామన్, హోసూరు, సతారా ప్లాంట్లతో కలిపి మొత్తం సామర్థ్యం 38,000 టన్నులకు చేరుకుంది. 2019–20లో టర్నోవర్‌లో 20% వృద్ధిని మోల్డ్‌టెక్ ఆశిస్తోంది. 2018–19లో కంపెనీ రూ.407 కోట్ల టర్నోవర్‌పై రూ.32 కోట్ల నికరలాభం ఆర్జించింది. -
రస్ అల్ ఖైమాలో మోల్డ్-టెక్ ప్లాంట్ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రస్ అల్ ఖైమా ఫ్రీ ట్రేడ్ జోన్లో తమ కొత్త ప్లాంటును ఆవిష్కరించినట్లు మోల్డ్-టెక్ ప్యాకేజింగ్ వెల్లడించింది. ఈ నెలలోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభం కాగలవని పేర్కొంది. 1,192 చ.మీ. మేర విస్తరించిన ప్లాంటు సామర్థ్యం ప్రస్తుతం 2,500-3,000 టన్నులుగా ఉంది. ప్లాంటు కార్యకలాపాల సానుకూల పనితీరు ప్రభావంతో రాబోయే మూడు, నాలుగు త్రైమాసికాల్లో మరింత వృద్ధి కనిపించగలదని కంపెనీ పేర్కొంది. మరోవైపు, ప్యాకేజింగ్ రంగానికి విశిష్ట సేవలందిస్తున్నందుకు గాను సంస్థ సీఎండీ లక్ష్మణ రావుకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ తయారీ సంస్థల అసోసియేషన్(సీపీఎంఏ) .. ఎలీట్ ప్లస్ బిజినెస్ సర్వీసెస్ గ్రూప్ ‘అవుట్‌స్టాండింగ్ అచీవ్మెంట్’ అవార్డును ప్రకటించాయి. -
మోల్డ్‌టెక్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్లాస్టిక్ ప్యాకేజింగ్ రంగంలో ఉన్న మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ వచ్చే 12 నెలల కాలంలో విస్తరణకుగాను రూ.15-18 కోట్లు వెచ్చించనుంది. ఇందులో ఇన్ మోల్డ్ లేబులింగ్(ఐఎంఎల్) సామర్థ్యం పెంపునకు సగం ఖర్చు చేయనుంది. ఐఎంఎల్ ఫుడ్ కంటైనర్ల (డబ్బాలు) ఉత్పత్తి పెంచేందుకు, అలాగే మహారాష్ట్రలోని సతారా ప్లాంటు విస్తరణకు మిగిలిన మొత్తం వ్యయం చేస్తారు. ఆసియన్ పెయింట్స్‌కు కంటైనర్లను సరఫరా చేసేందుకే సతారా ప్లాంటును నెలకొల్పారు. ప్రస్తుతం ఈ ప్లాంటు వార్షిక సామర్థ్యం 3,200 టన్నులు. దీనిని మార్చికల్లా 4 వేల టన్నులకు చేర్చాలని ఆసియన్ పెయింట్స్ కోరింది. ఇక విస్తరణకు వెచ్చించనున్న నిధులను అంతర్గత వనరులు, టెర్మ్లోన్ల ద్వారా మోల్డ్‌టెక్ సమకూర్చుకోనుంది. పెయింట్ల తయారీలో ఉన్న అక్జో నోబెల్తోనూ కంపెనీ చర్చలు జరుపుతోంది. చర్చలు సఫలమైతే అక్జో నోబెల్‌కు చెందిన గ్వాలియర్ ప్లాంటుకు కంటైనర్ల సరఫరా కాంట్రాక్టు చేతికొస్తుంది. ఇందుకు డమన్ ప్లాంటును మోల్డ్‌టెక్ విస్తరించనుంది. తొలిసారిగా అధిక టర్నోవర్: సెప్టెంబరుతో ముగిసిన క్వార్టర్లో కంపెనీకి సుమారు రూ.74 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలుస్తోంది. కంపెనీకి ఒక క్వార్టర్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక ఆదాయం. నికర లాభం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలు వచ్చినట్టు సమాచారం. సతారా ప్లాంటులో ఉత్పత్తి జూన్ నుంచి పుంజుకోవడం, ఫుడ్, ఎఫ్ఎంసీజీలో కొత్త క్లయింట్లు.. వెరసి ఆదాయం, లాభం పెరిగేందుకు దోహదం చేశాయి. ఇప్పటిదాకా ఇంజనీరింగ్ సేవలందిస్తున్న సంస్థ అనుబంధ కంపెనీ మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ ఇటీవలే ఐటీ సేవల్లోకి అడుగు పెట్టింది. మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ 2012-13లో రూ.33 కోట్ల ఆదాయం ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.40 కోట్లు ఆశిస్తోంది. కొత్త క్లయింట్ల రాకతో... కంపెనీకి ఉన్న ఆరు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 22 వేల టన్నులు. 2014 మార్చికల్లా 26 వేల టన్నులకు చేర్చనున్నట్టు మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ సీఎండీ లక్ష్మణ్ జె రావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. దేశీయంగా కొత్త క్లయింట్ల రాకతో ఇక్కడి ప్లాంట్ల సామర్థ్యం పెంచడంపైనే దృష్టిపెట్టామన్నారు. ప్రతిపాదిత దుబాయి ప్లాంటు ఏర్పాటును మరో ఏడాది వాయిదా వేశామన్నారు. ప్రస్తుతం ఐఎంఎల్ నుంచి 25 శాతం ఆదాయం సమకూరుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం వాటా 40-45 శాతానికి చేరొచ్చని తెలిపారు. 2013-14లో రూ.275 కోట్ల ఆదాయం ఆశిస్తున్నట్టు చెప్పారు.