హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్లాస్టిక్ ప్యాకేజింగ్ రంగ సంస్థ మోల్డ్‌టెక్ మరో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. 2,000 టన్నుల వార్షిక తయారీ సామర్థ్యంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్తరాదిన ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సుమారు రూ.15 కోట్లు వెచ్చించనుంది. అలాగే హైదరాబాద్ సమీపంలోని సుల్తాన్‌పూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో మరో ప్లాంట్ రానుంది. రెండేళ్లలో ఇది సిద్ధం కానుంది. 10–12 వేల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో రానున్న ఈ కేంద్రానికి సుమారు రూ.60 కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ సీఎండీ జె.లక్ష్మణ రావు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు.
నష్టాలు వస్తున్నందునే..
కంపెనీకి యూఏఈలోని రస్ అల్ ఖైమాలో 3,000 టన్నుల కెపాసిటీ గల ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ప్లాంటు ఉంది. గత మూడేళ్లలో ఈ యూనిట్ ద్వారా కంపెనీకి సుమారు రూ.11 కోట్ల నష్టం వచ్చింది. ఇరాన్, ఇరాక్‌కు సరఫరాలపై నిషేధం ఉండడంతో పాటు ఆర్థికంగా సంస్థకు అక్కడి మార్కెట్ కలిసి రాలేదు. అక్కడి పెయింట్ కంపెనీలింకా ప్యాకేజింగ్ కోసం టిన్‌నే వినియోగిస్తున్నాయి. భారత్‌లో మాదిరి ప్యాకేజింగ్‌కు టిన్ నుంచి ప్లాస్టిక్‌కు మళ్లుతాయని భావిం చిన మోల్డ్‌టెక్‌కు నిరాశే మిగిలింది. దీంతో ప్లాం టును మూసేసి మెషినరీని భారత్‌లోని ప్లాంట్‌లకు తరలించింది. రూ.11 కోట్లను రైటాఫ్ చేసింది.
ఈ ఏడాది 20 శాతం వృద్ధి..
గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మూలధన వ్యయం రూ.75 కోట్లు. 2019–20లో ఇది రూ.30 కోట్లకు పరిమితం కానుంది. ఇందులో రూ.15 కోట్లు ఉత్తరాది ప్లాంటుకు, మిగిలిన మొత్తం సామర్థ్యం పెంపునకు వినియోగిస్తారు. మైసూరు యూనిట్ ఫిబ్రవరిలో, వైజాగ్ కేంద్రం మార్చి నుంచి అందుబాటులోకి వచ్చాయి. వీటికి రూ.45 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కొక్కటి 3,000 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది ఈ 2 యూనిట్ల సామర్థ్యం పూర్థి స్థాయిలో తోడవనుంది. హైదరాబాద్, డామన్, హోసూరు, సతారా ప్లాంట్లతో కలిపి మొత్తం సామర్థ్యం 38,000 టన్నులకు చేరుకుంది. 2019–20లో టర్నోవర్‌లో 20% వృద్ధిని మోల్డ్‌టెక్ ఆశిస్తోంది. 2018–19లో కంపెనీ రూ.407 కోట్ల టర్నోవర్‌పై రూ.32 కోట్ల నికరలాభం ఆర్జించింది.
Comments
Please login to add a commentAdd a comment