హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్లాస్టిక్ ప్యాకేజింగ్ రంగంలో ఉన్న మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ వచ్చే 12 నెలల కాలంలో విస్తరణకుగాను రూ.15-18 కోట్లు వెచ్చించనుంది. ఇందులో ఇన్ మోల్డ్ లేబులింగ్(ఐఎంఎల్) సామర్థ్యం పెంపునకు సగం ఖర్చు చేయనుంది. ఐఎంఎల్ ఫుడ్ కంటైనర్ల (డబ్బాలు) ఉత్పత్తి పెంచేందుకు, అలాగే మహారాష్ట్రలోని సతారా ప్లాంటు విస్తరణకు మిగిలిన మొత్తం వ్యయం చేస్తారు. ఆసియన్ పెయింట్స్‌కు కంటైనర్లను సరఫరా చేసేందుకే సతారా ప్లాంటును నెలకొల్పారు. ప్రస్తుతం ఈ ప్లాంటు వార్షిక సామర్థ్యం 3,200 టన్నులు. దీనిని మార్చికల్లా 4 వేల టన్నులకు చేర్చాలని ఆసియన్ పెయింట్స్ కోరింది. ఇక విస్తరణకు వెచ్చించనున్న నిధులను అంతర్గత వనరులు, టెర్మ్‌లోన్ల ద్వారా మోల్డ్‌టెక్ సమకూర్చుకోనుంది. పెయింట్ల తయారీలో ఉన్న అక్జో నోబెల్‌తోనూ కంపెనీ చర్చలు జరుపుతోంది. చర్చలు సఫలమైతే అక్జో నోబెల్‌కు చెందిన గ్వాలియర్ ప్లాంటుకు కంటైనర్ల సరఫరా కాంట్రాక్టు చేతికొస్తుంది. ఇందుకు డమన్ ప్లాంటును మోల్డ్‌టెక్ విస్తరించనుంది.
తొలిసారిగా అధిక టర్నోవర్: సెప్టెంబరుతో ముగిసిన క్వార్టర్‌లో కంపెనీకి సుమారు రూ.74 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలుస్తోంది. కంపెనీకి ఒక క్వార్టర్‌లో ఇప్పటివరకు ఇదే అత్యధిక ఆదాయం. నికర లాభం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలు వచ్చినట్టు సమాచారం. సతారా ప్లాంటులో ఉత్పత్తి జూన్ నుంచి పుంజుకోవడం, ఫుడ్, ఎఫ్‌ఎంసీజీలో కొత్త క్లయింట్లు.. వెరసి ఆదాయం, లాభం పెరిగేందుకు దోహదం చేశాయి. ఇప్పటిదాకా ఇంజనీరింగ్ సేవలందిస్తున్న సంస్థ అనుబంధ కంపెనీ మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ ఇటీవలే ఐటీ సేవల్లోకి అడుగు పెట్టింది. మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ 2012-13లో రూ.33 కోట్ల ఆదాయం ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.40 కోట్లు ఆశిస్తోంది.
కొత్త క్లయింట్ల రాకతో...
కంపెనీకి ఉన్న ఆరు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 22 వేల టన్నులు. 2014 మార్చికల్లా 26 వేల టన్నులకు చేర్చనున్నట్టు మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ సీఎండీ లక్ష్మణ్ జె రావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. దేశీయంగా కొత్త క్లయింట్ల రాకతో ఇక్కడి ప్లాంట్ల సామర్థ్యం పెంచడంపైనే దృష్టిపెట్టామన్నారు. ప్రతిపాదిత దుబాయి ప్లాంటు ఏర్పాటును మరో ఏడాది వాయిదా వేశామన్నారు. ప్రస్తుతం ఐఎంఎల్ నుంచి 25 శాతం ఆదాయం సమకూరుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం వాటా 40-45 శాతానికి చేరొచ్చని తెలిపారు. 2013-14లో రూ.275 కోట్ల ఆదాయం ఆశిస్తున్నట్టు చెప్పారు.
మోల్డ్‌టెక్ విస్తరణ
Published Tue, Oct 22 2013 1:18 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM
Advertisement
Advertisement