బ్రీతబుల్ యాక్టివ్ టెక్నాలజీతో తయారైన చిన్న సంచిలో టమాటాలు
మన దేశంలో ఆరుగాలం కష్టపడి పండించిన కూరగాయలు, పండ్లు పొలం దగ్గర నుంచి వినియోగదారులకు చేరే ముందే దెబ్బతినటం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. రైతులు పండించిన కూరగాయలు, పండ్లు ప్రజల నోటికి అందేలోగా 16% మేరకు వృథా అవుతున్నాయి. వీటి విలువ రూ. 40,811 కోట్లు. తగిన ప్యాకేజింగ్, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాల్లేకపోవడమే ఇందుకు మూలకారణం.
అయితే, దేశీ సాంకేతికతతో తాము ఆవిష్కరించిన ప్రత్యేక కవర్లు, సంచులను వాడుకుంటే ఇక ఈ బాధ ఉండదని మైసూరులోని ‘రక్షణ ఆహార పరిశోధన ప్రయోగశాల(డి.ఎఫ్.ఆర్.ఎల్.)’ సీనియర్ ముఖ్య శాస్త్రవేత్త డా. ఎ. రామకృష్ణ (98452 93278) చెబుతున్నారు.
పర్యావరణహితమైన ఈ సరికొత్త మోడిఫైడ్ అట్మాస్ఫియర్ ప్యాకేజింగ్(మాప్) సాంకేతికతను మైసూరులోని డి.ఎఫ్.ఆర్.ఎల్. రిసెర్చ్ అప్లియన్సెస్ విభాగం అధిపతి కూడా అయిన డా. రామకృష్ణ ఆవిష్కరించారు. ఇటీవల ఒక సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా డా. రామకృష్ణ ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.రైతులు, చిల్లర వ్యాపారులతోపాటు.. వినియోగదారులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందన్న భావనతో ‘సాక్షి సాగుబడి’ ఈ కథనాన్ని అందిస్తున్నది.
బ్రీతబుల్ యాక్టివ్ ప్యాకేజింగ్ అంటే..?
ఆహార వృథాను అరికట్టడంతోపాటు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడే ఈ చక్కని సాంకేతికతను ఆవిష్కరించిన ఘనత డా. రామకృష్ణకు దక్కింది. ‘బ్రీతబుల్ యాక్టివ్ ప్యాకేజింగ్ ఫిల్మ్స్ టెక్నాలజీ’గా దీన్ని పిలుస్తున్నారు. ఇది పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన సాంకేతికత. ఈ సాంకేతికతపై ఆరు నెలల క్రితం మైసూరులోని డి.ఎఫ్.ఆర్.ఎల్. పేటెంట్ హక్కులు పొందింది. త్రివిధ దళాల ఆహార అవసరాలు తీర్చడానికి కేంద్ర రక్షణ శాఖ పరిశోధనా విభాగం పరిధిలో డి.ఎఫ్.ఆర్.ఎల్. ఏర్పాటైంది.
ఆక్సిజన్, కార్బన్‌డయాక్సయిడ్‌పై నియంత్రణ
ప్రత్యేకమైన దేశీ పరిజ్ఞానంతో ఈ బ్రీతబుల్ సంచులను ఎటువంటి రసాయనిక లేపనాలు వాడకుండానే రూపొందించారు. చెట్ల నుంచి కోసిన తర్వాత కూడా కూరగాయలు, పండ్లు శ్వాసిస్తూనే ఉంటాయి. ఆక్సిజన్‌ను తీసుకుంటూ కార్బన్‌డయాక్సయిడ్‌ను విడుదల చేస్తూ ఉంటాయి. ‘మాప్’ టెక్నిక్ ద్వారా రూపొందించిన ప్రత్యేకమైన ‘బ్రీతబుల్’ సంచుల ద్వారా ఈ ప్రక్రియను నియంత్రిస్తే వాటిని చాలా రోజుల వరకు చెడిపోకుండా నిల్వ చేసుకోవచ్చు. డి.ఎఫ్.ఆర్.ఎల్. శాస్త్రవేత్త దీనిపైనే పరిశోధించి తగిన సంచులను తయారు చేయడంలో సఫలీకృతులయ్యారు. ఈ సంచులలో నిల్వ చేసే కూరగాయలు, పండ్ల నుంచి వెలువడే నీటి ఆవిరి పరిమాణాన్ని బట్టి.. సంచి లోపల ఆక్సిజన్, కార్బన్‌డయాక్సయిడ్‌ల పరిమాణాన్ని తగిన రీతిలో నియంత్రించడం ద్వారా ఈ సంచులు నిల్వ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. ఒక దశలో శ్వాస క్రియ పూర్తిగా నిలిచిపోయే స్థితి ఏర్పడుతుంది. ∙
ఎన్ని రోజులు నిల్వ ఉంచవచ్చు?
ఈ సంచులలో నింపిన కూరగాయలు, పండ్లను 30–40 రోజుల వరకు వడలిపోకుండా, నాణ్యత దెబ్బతినకుండా, రంగు మారకుండా నిల్వ చేసుకోవచ్చు. ఇందుకు ఎటువంటి కోల్డ్ స్టోరేజ్ అవసరం లేదు. సాధారణ గది వాతావరణంలోనే నిల్వ చేసుకోవచ్చు. ఎటువంటి రసాయనాలనూ వాడాల్సిన అవసరం లేదు. సూక్ష్మజీవులను పరిహరించే జాగ్రత్త తీసుకోవడం వల్ల ఈ సంచుల్లో పండ్లు, కూరగాయలు కుళ్లిపోవు.
ఎన్ని కిలోలను నిల్వచేయొచ్చు?
వంద గ్రాముల నుంచి 5 కిలోల వరకు వేర్వేరు సైజుల్లో సంచులను తయారు చేసుకుంటే తరలించడానికి బాగుంటుంది. 25 కిలోల సంచులు కూడా తయారు చేసుకొని నిల్వ చేసుకోవచ్చు.
ఏయే రకాల పండ్లు, కూరగాయలు నిల్వ చేయొచ్చు? అన్ని రకాల కూరగాయలు, పండ్లను నిశ్చింతగా 40 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు.
సంచుల తయారీకి ఖర్చెంత?
ప్రతి కిలో కూరగాయలు, పండ్లను నిల్వ చేయడానికి సరిపోయే సంచి తయారు చేయడానికి ఒక రూపాయి చొప్పున ఖర్చవుతుంది. పాతిక కేజీల టమాటాలు లేదా మామిడి పండ్లు నిల్వచేసే సంచి తయారీకి రూ.25 ఖర్చవుతుంది.
పర్యావరణానికి హాని కలుగుతుందా?
ఈ సంచులు/కవర్లు పర్యావరణానికి హాని చేయని మోడిఫైడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌ను వాడినందు వల్ల.. సెకండరీ ప్యాకేజీ చేయనవసరం లేకుండానే ఈ సంచుల్లో నిల్వ చేసుకోవచ్చు. ఈ సంచులను ఒకసారి కొంటే మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. పాత సంచులతో మళ్లీ కొత్త సంచులను తయారు చేసుకోవచ్చు. ప్యాకేజీ పదార్థాల వృథాను, కాలుష్యాన్ని తగ్గించవచ్చు.
ఈ సంచులు ఎక్కడ దొరుకుతాయి?
మైసూరులోని డి.ఎఫ్.ఆర్.ఎల్. ఈ సంచుల తయారీకి అవసరమైన పూర్తి దేశీ సాంకేతికతను ఆవిష్కరించి, పేటెంట్ పొందింది. అయితే, డి.ఎఫ్.ఆర్.ఎల్. సంచులను తయారు చేసి అమ్మదు. ఈ టెక్నాలజీని విక్రయించడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వ/ ప్రైవేటు సంస్థలు/వ్యక్తులు కొనుగోలు చేసి వాణిజ్య స్థాయిలో ఈ సంచులను ఉత్పత్తి చేసి మార్కెట్‌లో అందుబాటులోకి తేవచ్చు.
సీజన్‌లో ధర లేక పారబోసిన టమాటాలు (ఫైల్)
ఎవర్ని సంప్రదించాలి?
THE DIRECTOR
Defence Food Research Laboratory, DRDO,
Ministry of Defence, Govt of India
Siddartha Nagar, Mysore- 570 011,
Tel: 0821-2473783, Fax: 0821-2473468,
E-mail: dfrlmysore@sancharnet.in
డా. ఎ. రామకృష్ణ
సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్
డీఎఫ్‌ఆర్‌ఎల్, మైసూరు
Comments
Please login to add a commentAdd a comment