కూరగాయలు పండించడంలో పాత పద్ధతి పాటిస్తూ.. వాటిని విక్రయించడంలో మాత్రం కొత్త పోకడలు అవలంబిస్తున్నాడో రైతు. మార్కెట్‌కు వెళ్లే అవసరం లేకుండా, కూరగాయలు రాశిగా పోసి కొనుగోలు దారుల కోసం వేచి చూడాల్సిన అగత్యం లేకుండా సెల్‌ఫోన్ సాయంతో వ్యాపారం చేస్తున్నారు. ఇంటి నుంచే నిర్వహిస్తున్న ఈ వ్యాపారానికి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది.
నరసన్నపేట: వాట్సాప్ సాయంతో ఓ గ్రూపును ఏర్పాటు చేసుకున్న రైతు దాని ద్వారానే ఎంచక్కా వ్యాపారం నిర్వహిస్తున్నారు. నచ్చిన కూరగాయలు వాట్సాప్ లో బుక్ చేసిన కొన్ని గంటల వ్యవధిలో డోర్ డెలివరీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ తమకూ బాగుండడంతో వినియోగదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నరసన్నపేటలోని దేశవానిపేటకు చెందిన ఆదర్శ రైతు రావాడ మోహనరావు వినూత్న పద్ధతిలో వర్తకం చేస్తున్నారు.మోహనరావుకు ప్రకృతి వ్యవసాయంపై గురి బాగా కుదిరింది. దీంతో సారవకోట మండలంలోని పద్మపురంలో 20 ఎకరాల విస్తీర్ణంలో పురుగు మందులు వాడకుండా సహజ ఎరువులతో పంటలు పండిస్తున్నారు.
వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలతో కూరగాయల సాగు చేస్తున్నారు. వీటిని అందరిలా కాకుండా వాట్సాప్ ద్వారా విక్రయించాలని నిర్ణయించుకుని మన మార్ట్ ఆర్గానిక్ ఫార్మ్ అని పేరుతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి తనకు తెలిసిన మిత్రులను చేర్చారు. మొదట్లో 26 మందితో ఉన్న ఈ గ్రూపు ఇప్పుడు 540 మందికి చేరింది. ఈ వాట్సాప్ గ్రూపులో పండిన కూరగాయలు, దుంపలు, పళ్లు వాటి ధరలను ప్రదర్శిస్తున్నారు. నచ్చిన వారు తమకు కావాల్సిన కూరగాయలను ఆర్డర్ పెడుతున్నారు. కొన్ని గంటల్లో కూరగాయలు ఇంటికి చేర్చుతున్నారు. ఇప్పుడు నరసన్నపేటలో ఈ వ్యాపారం హాట్ టాపిక్ అయింది. రోజూ ఆకుకూరలు, కూరగాయలు వంద కిలోలకు పైగా విక్రయిస్తున్నారు.
శమ తప్పింది
నేను వృద్ధాప్యంలో ఉన్నాను. బజారుకు వెళ్లి కూరగాయలు కొనేందుకు నానా అవస్థలు పడేవాడిని. ఇప్పుడు కావాల్సిన కూరగాయలు వాట్సాప్‌లో ఆర్డర్ చేస్తున్నాం. తెచ్చి అందిస్తున్నారు. బాగుంది. కూరగాయలు నాణ్యతగా ఉంటున్నాయి.
– కేఎల్‌ఎన్ మూర్తి, పుండరీకాక్ష కాలని, నరసన్నపేట
తాజా కూరగాయలు
వాట్సాప్‌లో కూరగాయలు చూసి ఆర్డర్ పెడుతున్నాం. గంట వ్యవధిలోనే ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. మాకు సమయం ఆదా అవుతోంది. కూరగాయలు కూడా తాజాగా ఉంటున్నాయి. తూకం కచ్చితంగా ఉంటుంది.
– సాయి శ్రీనివాస్, టీచర్, నరసన్నపేట
ఆదరించారు..
ప్రకృతి వ్యవసాయంపై మక్కువతో పలు ప్రాంతాల్లో తిరిగి ఏడాదిగా వివిధ పద్ధతుల్లో కూరగాయల సాగు చేస్తున్నాను. కొందరు మిత్రుల సలహాతో వాట్సాప్‌లో కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాను. మూడు నెలలుగా ఇది నిరంతరాయంగా సాగుతోంది. పండుతున్న కూరగాయలు ఏ రోజుకు ఆ రోజు అయిపోతున్నాయి. వినియోగదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
– రావాడ మోహనరావు, ఆదర్శ రైతు, దేశవానిపేట
Comments
Please login to add a commentAdd a comment