vegetables cultivation
-
వినూత్నంగా సెల్ఫోన్లో కూరగాయల వ్యాపారం, నిమిషాల్లో డోర్ డెలీవరీ
కూరగాయలు పండించడంలో పాత పద్ధతి పాటిస్తూ.. వాటిని విక్రయించడంలో మాత్రం కొత్త పోకడలు అవలంబిస్తున్నాడో రైతు. మార్కెట్‌కు వెళ్లే అవసరం లేకుండా, కూరగాయలు రాశిగా పోసి కొనుగోలు దారుల కోసం వేచి చూడాల్సిన అగత్యం లేకుండా సెల్‌ఫోన్ సాయంతో వ్యాపారం చేస్తున్నారు. ఇంటి నుంచే నిర్వహిస్తున్న ఈ వ్యాపారానికి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. నరసన్నపేట: వాట్సాప్ సాయంతో ఓ గ్రూపును ఏర్పాటు చేసుకున్న రైతు దాని ద్వారానే ఎంచక్కా వ్యాపారం నిర్వహిస్తున్నారు. నచ్చిన కూరగాయలు వాట్సాప్ లో బుక్ చేసిన కొన్ని గంటల వ్యవధిలో డోర్ డెలివరీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ తమకూ బాగుండడంతో వినియోగదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నరసన్నపేటలోని దేశవానిపేటకు చెందిన ఆదర్శ రైతు రావాడ మోహనరావు వినూత్న పద్ధతిలో వర్తకం చేస్తున్నారు.మోహనరావుకు ప్రకృతి వ్యవసాయంపై గురి బాగా కుదిరింది. దీంతో సారవకోట మండలంలోని పద్మపురంలో 20 ఎకరాల విస్తీర్ణంలో పురుగు మందులు వాడకుండా సహజ ఎరువులతో పంటలు పండిస్తున్నారు. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలతో కూరగాయల సాగు చేస్తున్నారు. వీటిని అందరిలా కాకుండా వాట్సాప్ ద్వారా విక్రయించాలని నిర్ణయించుకుని మన మార్ట్ ఆర్గానిక్ ఫార్మ్ అని పేరుతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి తనకు తెలిసిన మిత్రులను చేర్చారు. మొదట్లో 26 మందితో ఉన్న ఈ గ్రూపు ఇప్పుడు 540 మందికి చేరింది. ఈ వాట్సాప్ గ్రూపులో పండిన కూరగాయలు, దుంపలు, పళ్లు వాటి ధరలను ప్రదర్శిస్తున్నారు. నచ్చిన వారు తమకు కావాల్సిన కూరగాయలను ఆర్డర్ పెడుతున్నారు. కొన్ని గంటల్లో కూరగాయలు ఇంటికి చేర్చుతున్నారు. ఇప్పుడు నరసన్నపేటలో ఈ వ్యాపారం హాట్ టాపిక్ అయింది. రోజూ ఆకుకూరలు, కూరగాయలు వంద కిలోలకు పైగా విక్రయిస్తున్నారు. శమ తప్పింది నేను వృద్ధాప్యంలో ఉన్నాను. బజారుకు వెళ్లి కూరగాయలు కొనేందుకు నానా అవస్థలు పడేవాడిని. ఇప్పుడు కావాల్సిన కూరగాయలు వాట్సాప్‌లో ఆర్డర్ చేస్తున్నాం. తెచ్చి అందిస్తున్నారు. బాగుంది. కూరగాయలు నాణ్యతగా ఉంటున్నాయి. – కేఎల్ఎన్ మూర్తి, పుండరీకాక్ష కాలని, నరసన్నపేట తాజా కూరగాయలు వాట్సాప్‌లో కూరగాయలు చూసి ఆర్డర్ పెడుతున్నాం. గంట వ్యవధిలోనే ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. మాకు సమయం ఆదా అవుతోంది. కూరగాయలు కూడా తాజాగా ఉంటున్నాయి. తూకం కచ్చితంగా ఉంటుంది. – సాయి శ్రీనివాస్, టీచర్, నరసన్నపేట ఆదరించారు.. ప్రకృతి వ్యవసాయంపై మక్కువతో పలు ప్రాంతాల్లో తిరిగి ఏడాదిగా వివిధ పద్ధతుల్లో కూరగాయల సాగు చేస్తున్నాను. కొందరు మిత్రుల సలహాతో వాట్సాప్‌లో కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాను. మూడు నెలలుగా ఇది నిరంతరాయంగా సాగుతోంది. పండుతున్న కూరగాయలు ఏ రోజుకు ఆ రోజు అయిపోతున్నాయి. వినియోగదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. – రావాడ మోహనరావు, ఆదర్శ రైతు, దేశవానిపేట -
ఆదర్శ రైతుగా మారిన విలేజ్ ట్రైబల్
-
మట్టిని వాడకుండా కూరగాయల సాగు.. ప్రత్యక్ష శిక్షణ
పట్టణ/నగర ప్రాంతాల్లో కూరగాయల సాగు, టెర్రస్ కిచెన్ గార్డెనింగ్ ఆవశ్యకత పెరుగుతున్న నేపథ్యంలో మట్టిని వాడకుండా, కొబ్బరి పొట్టుతోనే నారు మొక్కలు, కూరగాయల సాగుకు ప్రాముఖ్యం పెరుగుతోంది. శుద్ధి చేసిన కొబ్బరి పొట్టును బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) రూపొందించిన ఆర్క మైక్రోబియల్ కన్సార్షియం ద్రావణంతో పులియబెడితే.. పోషకాలతో కూడిన సేంద్రియ కొబ్బరి పొట్టు (అర్క ఫర్మెంటెడ్ కోకోపీట్– ఎ.ఎఫ్.సి.) సిద్ధమవుతుంది. దీన్ని తయారు చేసుకోవటం.. మట్టి వాడకుండా కుండీలు, మడుల్లో నారు మొక్కలను, కూరగాయ మొక్కలను సాగు చేసుకోవటంపై ఆగస్టు 13న ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు శిక్షణ ఇవ్వనున్నారు. బెంగళూరులోని ఐఐహెచ్‌ఆర్‌కు వెళ్లి ప్రత్యక్ష శిక్షణ పొందేవారు రూ. 2,000, జూమ్ ఆప్ ద్వారా ఆన్లైన్లో శిక్షణ పొందగోరే వారు రూ. 500 ఫీజుగా చెల్లించి, ఆగస్టు 11లోగా రిజిస్టర్ చేసుకోవాలి. ఆసక్తి గల వారెవరైనా శిక్షణకు అర్హులే. సేంద్రియ ఇంటిపంటల సాగును ఉపాధి మార్గంగా ఎంచుకోదలచిన వ్యక్తులు, స్టార్టప్‌లు, ఎఫ్.పి.ఓ.లు, వ్యవసాయ/ఉద్యాన విద్యార్థులు/పట్టభద్రులు ఎవరైనా శిక్షణ పొందవచ్చు. అభ్యర్థులు ఈ కింది లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. https://forms.gle/tBYyusdJ9D2hgvQD6 bessthort@gmail.com నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్పై అడ్వాన్స్డ్ కోర్సు పంటల సాగులో పురుగులు, తెగుళ్లకు సంబంధించిన మౌలికాంశాలను అర్థం చేసుకొని రసాయన రహిత పద్ధతుల్లో చీడపీడలను అరికట్టేందుకు ఉపయోగపడే మెలకువలను నేర్పించడానికి ఆగస్టు 5–7 తేదీల్లో గ్రామీణ అకాడమీ ‘నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్పై అడ్వాన్స్డ్ కోర్సు’పై శిక్షణ ఇవ్వనుంది. జూమ్ ఆప్ ద్వారా మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ) కార్యనిర్వాహక సంచాలకులు, వ్యవసాయ శాస్త్రవేత్త డా. జీ వీ రామాంజనేయులు ఆంగ్లంలో శిక్షణ ఇస్తారు. ఫీజు రూ. 2,500. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు.. 99850 16637 https://grameenacademy.in/courses/ సద్దుపల్లిలో ప్రతి శనివారం రైతులకు శిక్షణ ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు నాగరత్నంనాయుడు ప్రతి శనివారం తన వ్యవసాయ క్షేత్రంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం (రామోజీ ఫిలిం సిటీ ఎదురు రోడ్డు) సద్దుపల్లి గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రతి శనివారం ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు ఆయన శిక్షణ ఇస్తారు. ఆగస్టు 2 (సోమవారం) ఉ. 11 గంటలకు శిక్షణా తరగతులను ప్రారంభిస్తున్నట్లు ‘రైతునేస్తం’ వేంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 94905 59999 -
చెత్త చక్కని ఎరువై.. పచ్చని ఇంటిపంటలై..!
గుంటూరు నగరంలో తడి చెత్త, సేంద్రియ వ్యర్థాలపై గృహిణులు సమరం ప్రకటించారు. తడి చెత్త, వ్యర్థాలను మున్సిపల్ సిబ్బందికి ఇవ్వకుండా సేంద్రియ ఎరువు తయారు చేస్తూ.. సేంద్రియ ఎరువుతో ఎంచక్కా ఆరోగ్యదాయకమైన ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ఇంటి ఆవరణలో కుండీలు, కవర్లు, కంటెయినర్లలో ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలను పెంచుతున్నారు. నగరపాలక సంస్థకు భారంగా మారిన చెత్త తరలింపు సమస్య పరిష్కారం కావడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే సేంద్రియ కూరగాయలు లభిస్తున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండి దోమలు, అంటు వ్యాధుల బెడద తగ్గుతోంది. గుంటూరు నగరంలోని 23,24,25,28 వార్డుల్లో గృహిణులు తమ ఇళ్ళల్లో వచ్చే తడి వ్యర్ధాలతో ఇంటి దగ్గరే కంపోస్టు తయారు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ గుంటూరు సాధన కృషిలో భాగస్వాములవుతున్నారు. నగరపాలక సంస్థ, ఐటీసీ ‘బంగారు భవిష్యత్తు’ విభాగాల ఆధ్వర్యంలో నాలుగు వార్డుల్లో ఘన వ్యర్థాల నిర్వహణ పైలట్ ప్రాజెక్టు అమలును చేపట్టారు. ఇళ్లు, అపార్టుమెంట్లలో ఐటీసీ సిబ్బంది, వార్డు ఎన్విరాన్మెంటల్ సెక్రెటరీలు, వార్డు వలంటీర్లు ఎవరికి వారు ఇంట్లోనే వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారీపై అవగాహన కల్పించారు. 1,572 ఇళ్ళలో హోం కంపోస్టింగ్, ఇంటిపంటల సాగు ప్రారంభమైంది. కంపోస్టు తయారీ విధానం ఇలా.. నలుగురు కుటుంబ సభ్యులు ఉండే ఇంటికి కంపోస్టు తయారీకి 20 లీటర్ల ఖాళీ బక్కెట్ సరిపోతుంది. బక్కెట్ చుట్టూ రంధ్రాలు చేయాలి. బక్కెట్లో ఒక అంగుళం మేర కొబ్బరి పొట్టు వేయాలి. ప్రతి రోజూ వంట గదిలో పోగుపడే కూరగాయలు, ఆకుకూరల వ్యర్ధాలు, ముక్కలు, పండ్ల తొక్కలు, పూలు, టీ పొడిని ఈ కంపోస్టు బక్కెట్లో వేయాలి. తడి చెత్తను ఇందులో వేసిన ప్రతిసారీ పైన అంగుళం మందాన కొబ్బరి పొట్టును వేయాలి. ఇలా ప్రతి రోజూ చేస్తూ వారంలో రెండు సార్లు బక్కెట్లో కింది నుంచి పైకి కలియ తిప్పాలి. పది రోజుల తరువాత వేసిన వ్యర్ధాలు కుళ్లడం ప్రారంభమవుతుంది. 45 రోజులకు నాణ్యమైన రసాయనాలు లేని సారవంతమైన సేంద్రియ ఎరువు తయారవుతోంది. బక్కెట్లో ఒక్కోసారి పురుగులు కనిపించే అవకాశం ఉంటుంది. బక్కెట్లోని వ్యర్థాల్లో 40 శాతం తేమ ఉండేలా చేసుకోవడంతోపాటు, మార్కెట్లో లభ్యమయ్యే ద్రావణం వేస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది. వంటింటి నుంచి వెలువడే తడి చెత్త, వ్యర్థాలను కుళ్లబెట్టి కంపోస్టు తయారు చేయడానికి అవసరమైన కొబ్బరి పొట్టును నగరపాలక సంస్థ ఉచితంగా ఇస్తుండడంతో గృహిణులు కంపోస్టు తయారీపై ఆసక్తి చూపుతున్నారు. వ్యర్థాల పునర్వినియోగంతో పాటు నగరవాసుల సేంద్రియ ఇంటిపంటల సాగుకు నగర పాలకుల ఊతం దొరకడం హర్షించదగిన పరిణామం. చెత్తకు కొత్త అర్థం ఇస్తున్నాం ఇంట్లో చెత్తను రోడ్లపై, కాలువల్లో పడేయకుండా హోంకంపోస్టు ద్వారా ఎరువుగా మార్చి చెత్తకు కొత్త అర్ధం ఇస్తున్నాం. జీఎంసీ, ఐటీసీ సహకారంతో మా ఇంట్లోనే నాణ్యమైన ఎరువు తయారు చేసుకుంటున్నాం. మా వీధుల్లో ఎవరూ చెత్త వేయడం లేదు. దోమలు, ఈగలు తగ్గాయి. – ఏలూరి విజయలక్ష్మి, వేమూరివారి వీధి, గుంటూరు వలంటీర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం తడి వ్యర్ధాల నిర్వహణ ఇంట్లోనే జరుగుతోంది. ఇళ్ళల్లో చక్కని కిచెన్ గార్డెన్ పెంచడంతోపాటు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండి, దోమలు, అంటువ్యాధుల నివారణ జరుగుతోంది. ఐటీసీ సహకారంతో వార్డు వలంటీర్లు, వార్డు ఎన్విరాన్మెంట్ సెక్రటరీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పెద్ద మొత్తంలో వ్యర్ధాలు ఉత్పత్తి చేసే కళ్యాణమండపాలు, హోటల్స్‌లో క్లస్టర్ కంపోస్టుల ఏర్పాటు జరుగుతోంది. ఇళ్లలోనే చెత్తతో కంపోస్టు చేయడం, కిచెన్ గార్డెన్ల సాగుపై నగర ప్రజలందరూ దృష్టి పెట్టాలి. స్వచ్ఛ సర్వేక్షన్ 2020లో నగరానికి ఉత్తమ ర్యాంకు సాధించాలి. – చల్లా అనురాధ, కమిషనర్, గుంటూరు నగరపాలక సంస్థ సొంత కంపోస్టుతో ఇంటిపంటలు సాగు చేస్తున్నాం మా ఇంటిలో చెత్తను బక్కెట్లో వేసి సేంద్రియ ఎరువుగా మార్చుతున్నాను. ఆ కంపోస్టును మొక్కలు, ఆకుకూరలకు ఎరువుగా వేస్తుంటే ఎంతో ఏపుగా, చక్కగా పెరుగుతున్నాయి. రసాయనిక ఎరువులు లేకుండా కూరగాయలు, ఆకుకూరలు పండించుకునేందుకు సేంద్రియ ఎరువును మేమే తయారు చేసుకొంటున్నాం. చెత్తను మున్సిపాలిటీ సిబ్బందికి ఇవ్వడం లేదు. – వేమూరి విశాలక్షి, ఏటీఅగ్రహారం, గుంటూరు కొబ్బరి పొట్టును మేమే ఇస్తున్నాం గుంటూరు నగరంలో తడి చెత్త, వ్యర్థాల నిర్వహణపై ప్రజలను చైతన్య వంతులను చేస్తున్నాం. సేంద్రియ ఎరువు తయారీపై గృహిణులకు అవగాహన కల్పించాం. అందుకు అవసరమైన కొబ్బరి పొట్టును మేమే ఇస్తున్నాం. ఈ సేంద్రియ ఎరువుతో రసాయన మందులు వినియోగం లేకుండా, చక్కగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు కిచెన్ గార్డెన్లో పెంచుకోవచ్చు. నగర ప్రజలంతా ఈ కార్యక్రమానికి సహకరించాలి. – ఐ.శామ్యూల్ ఆనందకుమార్, నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్, గుంటూరు – ఓబుల్‌రెడ్డి వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో, గుంటూరు – గజ్జెల రాంగోపాల్‌రెడ్డి, స్టాప్ ఫొటోగ్రాఫర్, గుంటూరు -
ఎమ్మెల్యే ప్రకృతి సేద్యం
రసాయనిక అవశేషాల్లేకుండా ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసుకోవడానికి రోజువారీ పనుల వల్ల తీరిక దొరకటం లేదనుకుంటూ ఉంటారు. అయితే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇందుకు శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి నిదర్శంగా నిలుస్తూ ఇంటిపంటలను ఇష్టంగా సాగు చేస్తున్నారు. ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ఉండే ఆమె ప్రకృతి వ్యవసాయ ప్రేమికురాలు కావడం విశేషం. స్వగ్రామం వండువలో ఇంటి పక్కనే ఉన్న 50 సెంట్ల స్థలాన్ని ఉద్యాన పంటల వనంలా మార్చారు. ఆకుకూరలు, పందిరి కూరగాయ పంటలు ఆనప, బీర, బెండ, గుమ్మడి కాయల దిగుబడి బాగుంది. ఒక్కో ఆనపకాయ 10 నుంచి 20 కిలోల బరువు పెరుగుతున్నాయి. కంది, చెరకు, పెండలం, కంద ఇలా అనేక పంటలను సాగు చేస్తున్నారు. వంటకు బయోగ్యాస్‌ను వినియోగిస్తున్నారు. పంటలకు సొంతంగా తయారు చేసుకున్న సేంద్రియ ఎరువును, జీవామృతాన్ని, కషాయాలను వాడుతూ మంచి దిగుబడి సాధిస్తుండటం విశేషం. పెరటి పంటల పనులను కళావతి ప్రతి రోజూ ఉదయం గంట సేపు స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. పెరటి తోటలో కలియ దిరుగుతూ సిబ్బందికి తగిన సూచనలిస్తారు. పురుగు గానీ, ఆకు ముడత కనపడినా వెంటనే వాటిని తీసేయడం ద్వారా చక్కని పంట దిగుబడులు పొందుతుండడం విశేషం. – సూరాబత్తుల గాంధీ, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా మహిళలు పెరటి తోటల సాగు చేపట్టాలి శ్రద్ధగా చేస్తే ప్రకృతి/సేంద్రియ సాగు అసాధ్యమేమీ కాదు. సేంద్రియ ఎరువుతో భూమిని సారవంతం చేస్తే పంటల సాగుకు అనుకూలంగా మారుతుంది. బాల్యం నుంచీ పంటల సాగు అంటే బాగా ఇష్టం. ఇంటి దగ్గర కొద్ది స్థలంలో సరదాగా చేపట్టిన సాగు 50 సెంట్లకు విస్తరించింది. మహిళలంతా పెరటి తోటల సాగు చేపట్లేలా స్ఫూర్తినివ్వాలన్నది నా కోరిక. సేంద్రియ ఎరువులతో ఇంటి వద్దనే ఆరోగ్యదాయకమైన కూరగాయలు, పండ్లు సాగు చేసుకునేందుకు మహిళలు ముందుకు రావాలి. – విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా -
ప్రకృతి సేద్యమే ప్రాణం!
ఆరోగ్యానికి, ఆదాయానికి ప్రకృతి వ్యవసాయమే మేలని యువ రైతు జిన్న రాజు, మాధవి దంపతుల కుటుంబం అనుభవపూర్వకంగా చెబుతోంది. గత ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి, కూరగాయలు, పప్పుధాన్యాలు సాగు చేసుకుంటూ రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తాము తింటూ, పరిసర గ్రామాల ప్రజలకు కూడా అందుబాటులోకి తేవడం విశేషం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి గ్రామానికి చెందిన జిన్న బేతయ్య–లింగమ్మ దంపతుల సంతానం బాలయ్య, రాజు, కృష్ణ. రెండు బోరుబావులతో కూడిన ఐదు ఎకరాల సాగు భూమే వీరి జీవనాధారం. అందరిలాగే రసాయనిక ఎరువులు, పురుగు మందులతో వీరి వ్యవసాయం కొనసాగింది. ఆ క్రమంలో ఎంసీఏ చదువుకున్న బాలయ్య సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ గ్రామభారతి ద్వారా ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని తన కుటుంబానికి పరిచయం చేశారు. పంట పొలాన్నే ప్రాణంగా నమ్ముకున్న భర్త రాజు, అతని భార్య మాధవి ప్రకృతి వ్యవసాయంపై పాలేకర్ పుస్తకం చదివి.. ఆ ప్రకారంగా ఐదేళ్ల క్రితం వరి, కూరగాయలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయనారంభించారు. టేక్మాల్ మండలం శేరిపల్లి గ్రామంలో విఠల్–బూదెమ్మ దంపతుల కుమార్తె అయిన మాధవి తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. రాజును పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పొలం పనుల్లో తన భర్తకు చేదోడు వాదోడుగా ఉంటోంది. రాజు, మాధవి సహా ఇంటిల్లపాదీ పొలానికి వెళ్లి పనులన్నీ చేసుకుంటారు. ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం మాచవరంలో ప్రకృతి వ్యవసాయదారుడు కోటపాటి మురహరి రావు, హైదరాబాద్‌లో విజయరామ్ ఆధ్వర్యంలో జరిగిన సభల్లో పాల్గొన్న రాజు ప్రకృతి వ్యవసాయంలో పాటించాల్సిన ముఖ్య సూత్రాలు, ఎరువులు, కషాయాలు తయారీ పద్ధతులపై అవగాహన పెంచుకున్నాడు. అతని భార్య మాధవి పాలేకర్ పుస్తకాన్ని చదివి ప్రకృతి వ్యవసాయ పరిజ్ఞానం పెంచుకున్నారు. దంపతులు శ్రద్ధగా ఆచరణలో పెట్టారు. ఘనజీవామృతం, జీవామృతం, కషాయాలను సొంతంగానే తయారు చేసుకొని వాడుతున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులకు స్వస్తి చెప్పడంతో వరి సాగులో ఎకరానికి రూ. 4 వేల నుంచి 5 వేల వరకు ఖర్చు తగ్గిపోయిందని, ఐదెకరాలకు సరిపోను ఘనజీవామృతం, జీవామృతం తయారీకి రూ. రెండు వేల ఖరీదైన బెల్లం కొంటే సరిపోతున్నదని రాజు చెప్పాడు. వరిలో ఎకరానికి దుక్కిలో 200 కిలోలు, కలుపు తీసిన తర్వాత మరో 200 కిలోల చొప్పున ఘన జీవామృతం వాడుతున్నారు. ప్రతి 15 రోజులకోసారి ద్రవ జీవామృతం నీటితోపాటు క్రమం తప్పకుండా అందిస్తున్నారు. వరి దిగుబడి ఎకరానికి 30 బస్తాలు(20 క్వింటాళ్ల) వరకు వస్తున్నదని రాజు వివరించారు. వరితోపాటు ఇంట్లోకి అవసరమైన ఇతర పంటలన్నీ కొద్ది విస్తీర్ణంలో పండించుకుంటుండడం ఈ రైతు కుటుంబం ప్రత్యేకత. కూరగాయలు, ఆకుకూరలు, ఉల్లి, వెల్లుల్లి, పప్పులు.. తమ కుటుంబానికి సరిపడా ఏడాది పొడవునా సాగు చేసుకొని తింటుండడం విశేషం. దేశీ వంగడం మైసూరు మల్లిగ గతంలో సాధారణ వరి రకాలు సాగు చేసిన రాజు, మాధవి గత ఏడాది నుంచి దేశీ వంగడాలను సాగు చేస్తున్నారు. హైదరాబాద్ సేవ్ సంస్థ దేశీ విత్తనోత్సవంలో పాల్గొని తెచ్చుకున్న ఐదు రకాల దేశీ వరి వంగడాలను ఒక్కో ఎకరంలో గత ఏడాది సాగు చేశారు. అందులో దిగుబడి మెరుగ్గా ఉన్న సన్న రకం దేశీ వంగడం మైసూరు మల్లిగను ఈ ఏడాది మూడున్నర ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దూదేశ్వర్ అనే మరో దేశీ రకాన్ని అరెకరంలో సాగు చేస్తున్నారు. పండించిన ధాన్యాన్ని నిల్వ పెట్టుకొని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారికి బియ్యం క్వింటాలు రూ. 6,500 చొప్పున అమ్ముతూ మంచి ఆదాయం గడిస్తున్నామని, రసాయనాల్లేని ఆహారం తింటూ ఆరోగ్యంగా ఉన్నామని రాజు(99634 49223) అన్నారు. – కిషోర్ పెరుమాండ్ల, సాక్షి, మెదక్ -
ఇంటిపైనే పచ్చని ఔషధ వనం!
మచిలీపట్నం రాజుపేటకు చెందిన యువకుడు అన్నా మణిరత్నం తమ ఇంటిపైన ఔషధ, ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కల వనాన్ని సృష్టించారు. మేడపైన కుండీలు, టబ్‌లలో జీవామృతంతో సేంద్రియ ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. మేడపైకి అడుగుపెడితే సువాసనలు వెదజల్లుతాయి. నాటిన ప్రతీ మొక్క ఆయర్వేద వైద్యంలో ఉపయోగపడేదే. అక్కడ ఉన్న మొక్కలతో తయారు చేసే మందులతో చాలా రకాలైన వ్యాధులను నయం చేయవచ్చని చెబుతున్నారు మణిరత్నం. అక్కడ కనిపించే ప్రతీ మొక్కలోనూ ఓ పరమార్థం కనిపిస్తోంది. వాయు కాలుష్యాన్ని పారదోలి ఆరోగ్యదాయకమైన గాలిని పొందడంతోపాటు ఔషధ మొక్కల ఆకులతో ఇంటిల్లి్లపాదీ రోజుకో రకం కషాయం సేవిస్తూ ఆరోగ్యంగా ఉన్నామని మణిరత్నం అన్నారు. రసాయనిక అవశేషాల్లేని ఆకుకూరలు, కూరగాయలతోపాటు పండ్లను సైతం 2017 నవంబర్ నుంచి సాగు చేస్తున్నారు. సీఏ చదివిన మణిరత్నం ఆరోగ్యపరిరక్షణకు అవసరమయ్యే వివిధ రకాల ఆయుర్వేద మొక్కలను పెంచుతుండడంతో అమ్మ కృష్ణవేణి, నాన్న ఆంజనేయులు ప్రోత్సహించారు. వారూ మొక్కల పెంపకంలో భాగస్వాములు కావటంతో వారి ఇంటి పరిసరాలు ఔషధ మొక్కల సువాసనలతో నిండిపోతోంది. ప్లాస్టిక్ డబ్బాలు, మట్టి కుండలు, బక్కెట్లలో మట్టి, సేంద్రియ ఎరువు నింపి మొక్కలు పెంచుతున్నారు. 675 చదరపు అడుగుల డాబాపైన సుమారుగా 70కు పైగానే వివిధ రకాల ఆయుర్వేద మొక్కలను పెంచుతున్నారు. అడ్డసరం, మల్టీవిటమిన్ప్లాంట్, ఇన్సులిన్ ప్లాంట్, పొడపత్రి, గుగ్గులు, గలిజేరు, అవిశ, రణపాల, కొండపిండి ఆకు, కాడ జెముడు, నిమ్మగడ్డి, సిట్రోనెల్ల, నేల ఉసిరి, తుర్కవేప, వాము ఆకు, వావిలి ఆకు, గుంటగలకరాకు, వెన్న ముద్దాకు, నేలవేము, కలబంద, నల్లేరు, తుంగమస్తులు, సిందూరం, కుందేటి చెవి వంటి ఆయుర్వేద మొక్కలే కాకుండా పండ్ల మొక్కలు, సుగంధాలను వెదజల్లే మొక్కలను అక్కడ పెంచుతున్నారు. వీటì తో తయారు చేసే ఔషధాలతో దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేయవచ్చని, అవగాహన కోసం అధ్యయనం చేస్తున్నానని మణిరత్నం అంటున్నారు. జీవామృతం ప్రతి 15 రోజులకోసారి పిచికారీ చేయడం, నీటిలో కలిపి కుండీల్లో పోయడం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. రాలిన ఆకులు, చెత్తను డ్రమ్ములో వేసి ఎరువు తయారు చేస్తున్నారు. – కోవెల కాశీ విశ్వనాథం, సాక్షి, మచిలీపట్నం ఆరోగ్యం.. ఆహ్లాదం.. మొక్కలంటే ఇష్టం. వాటిని ప్రేమతో చూసుకుంటున్నాను. ఉదయపు నీరెండకు మిద్దె తోట పనులు చేసుకుంటే చాలు. వాకింగ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. రసాయనిక అవశేషాల్లేకుండా ఇంటిపట్టున పెంచుకునే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతోపాటు ఔష«ధాలు, కషాయాలు ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేస్తాయి. ఇంటిల్లపాదికీ ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందించే ఇంటిపంటల సాగుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని ఆచరించాలి. – మణిరత్నం (88853 82341), రాజుపేట, మచిలీపట్నం రణపాల మొక్కతో... -
సాగుకు స్కానింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా వివిధ ఆహార పదార్థాలను దిగుమతి చేసుకునే పరిస్థితికి చరమగీతం పాడాలని, రైతు ఆదాయాన్ని మరింత పెంచాలని భావిస్తోంది. విరివిగా ఆహార శుద్ధి పరిశ్రమలు స్థాపించాలని యోచిస్తోంది. అందుకు రాష్ట్ర వ్యవసాయాన్ని పంట కాలనీలుగా తయారు చేయాలని నిర్ణయించింది. ఇటీవల సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ, దాని అనుబంధ విభాగ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు పంట కాలనీల ఏర్పాటుపై సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. పంటల వివరాలతో పాటు రైతుల వివరాలను సేకరించనుంది. రాష్ట్రంలో ఉన్న దాదాపు 60 లక్షల మంది రైతులు ఒక్కొక్కరు ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు సాగు చేస్తారో తెలుసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. దాదాపు 3 నెలల పాటు సర్వే చేపట్టాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన 26 అంశాలతో కూడిన నమూనా సర్వే పత్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) రైతుల వద్దకు వెళ్లి ఈ సమాచారాన్ని సేకరించనున్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణను ఈ నెల 25 లోపు పూర్తిచేసి, వచ్చే ఖరీఫ్‌లో పైలట్ ప్రాజెక్టు కింద పంట కాలనీలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏఈవోలు సేకరించే సమాచారంతో పట్టాదారు నంబర్, రైతు పేరు, తండ్రి పేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, సామాజిక పరిస్థితి, ఎన్ని ఎకరాల్లో విస్తీర్ణం ఉంది సర్వే నంబర్ వారీగా నమోదు చేసుకుంటారు. నీటి సదుపాయం, బోరు బావుల ద్వారా ఎంత పండుతుంది.. కాలువల కింద ఎంత సాగవుతుందో అంచనా వేస్తారు. వర్షాధార సాగు విస్తీర్ణం, భూసార పరీక్ష కార్డులు అందాయో లేదో సేకరిస్తారు. పంట రకం.. దిగుబడి కూడా.. సాగయ్యే పంటలు.. వాటిల్లో ఏ రకం, ఏ సర్వే నంబర్‌తో ఎంత విస్తీర్ణంతో సాగు చేస్తున్నారో ప్రత్యేక టేబుల్లో నమోదు చేస్తారు. ఎంత దిగుబడి వస్తుందో కూడా తెలుసుకుంటారు. ఇలా ఖరీఫ్, రబీలకు వేర్వేరుగా వివరాలు నమోదు చేస్తారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మనీటి సేద్యం ఎంతమేరకు అందుబాటులో ఉందనే వివరాలను సేకరించనుంది. పంట రుణాలు కూడా ఎంత మొత్తంలో తీసుకున్నారు.. ఎంత విస్తీర్ణంలో పంటకు బీమా చేయించారనే సమగ్ర వివరాలు నమో దు చేయనున్నారు. పండించిన పంటలో మార్కెట్లో ఎంత విక్రయించారనే వివరాలు కూడా ఉంటా యి. అధిక ఉత్పత్తి ఉన్న పంటలకు ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపన ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులను స్వయం సహాయక బృందాల ద్వారా ప్రోత్సహించటానికి ఈ ప్రణాళిక రూపొందిస్తున్నారు. వచ్చే ప్రయోజనం? రాష్ట్రంలో రైతులు సంప్రదాయ పంటలనే సాగు చేస్తున్నారు. లాభ నష్టాలను లెక్క చేయకుండా జీవనం కోసం పంటలు పండిస్తున్నారు. దీనివల్ల అనేకసార్లు రైతులు నష్టాల పాలవుతున్నారు. పంటలు సరిగా పండకపోవడం, పండినా మద్దతు ధర రాకపోవడంతో అప్పుల పాలవుతున్నారు. శాస్త్రీయ అంచనా లేకుండా ఎవరికి వారు ఇలా పంటలు సాగు చేస్తుండటంతో రైతుల పరిస్థితి అధ్వానంగా మారుతోంది. ఈ దుస్థితిని మార్చాలని సీఎం కేసీఆర్ ఏడాది కిందటే పంట కాలనీలు అంశం తెరపైకి తెచ్చారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎలాంటి పంటలు పండుతాయో శాస్త్రీయ పద్ధతిలో గుర్తించి, ఆ మేరకు పంట కాలనీలు ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మిరప పంట అధికంగా సాగవుతుందనుకుందాం. ఆ ప్రాంతాన్ని మిర్చి పంట కాలనీగా ప్రకటిస్తారు. ఆ మేరకు రైతులకు అవసరమైన సాంకేతిక సాయం అందజేస్తారు. నాణ్యమైన విత్తనాలను అందిస్తారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంచేలా అవగాహన కల్పిస్తారు. మార్కెట్లో దానికి సరైన ధర అందించేలా ప్రభుత్వమే పూనుకుంటుంది. మిర్చితో కారం పొడి తయారు చేయించేలా ప్రత్యేకంగా ఆహారశుద్ధి పరిశ్రమ నెలకొల్పుతారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు పండే ప్రాంతాన్ని కూడా ఓ పంట కాలనీగా గుర్తిస్తారు. రాష్ట్రానికి అవసరమైన కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నాం. దాదాపు 60 శాతం కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచే వస్తున్నాయని మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. కూరగాయలు పండించే ప్రాంతాల రైతులకు అవసరమైన సాయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూరగాయలు పండించే ప్రాంతాలను కూడా పంట కాలనీలుగా గుర్తిస్తారు. రాష్ట్రంలో ఏ పంటలకు కొరత ఉందో గుర్తించి ఆ మేరకు కొత్త పంటలను ప్రోత్సహిస్తారు. పంట కాలనీల ప్రధాన ఉద్దేశం స్వయం సమృద్ధి. కాబట్టి రాష్ట్రంలో ప్రజలు ఏ ఆహారాలను ఏ మోతాదులో వినియోగిస్తున్నారన్న దానిపై గతేడాది జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమగ్ర సర్వే నిర్వహించింది. ఆ నివేదికను సీఎంకు అందజేసింది. -
లోటుకు జవాబు.. పెంపే
సాక్షి, హైదరాబాద్ : కూరగాయల ఉత్పత్తిలో రాష్ట్రం అత్యంత వెనుకబడి ఉంది. దీంతో ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెంచడమే సరైన పరిష్కారమని ఉద్యానశాఖ భావించి తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్ర ప్రజలు రోజువారీ ప్రధానంగా 20 రకాల కూరగాయలను వినియోగిస్తుంటారు. ఇలా ఏడాదికి 22.28 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం కాగా, కేవలం 15.94 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే లభిస్తున్నాయి. అంటే 6.34 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉంది. ఈ 20 రకాల్లో టమాటా, వంకాయ, బెండ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ముల్లంగి వంటి ఆరు రకాలు అవసరానికి మించి ఉత్పత్తి అవుతుండగా, పచ్చిమిర్చి, కాకర , బీర, సొరకాయ, దోసకాయ, బీన్స్, క్యాప్సికం, బంగాళదుంప, చేమగడ్డ, క్యారట్, కందగడ్డ, ఆకుకూరలు, ఉల్లిగడ్డలు సహా 14 రకాలకు తీవ్ర కొరత నెలకొని ఉంది. ఇక ఆరు రకాల్లో వినియోగం 7.99 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఉత్పత్తి 8.66 లక్షల మెట్రిక్ టన్నులుంది. అంటే 66,760 మెట్రిక్ టన్నులు అదనంగా ఉత్పత్తి అవుతున్నాయి. మిగిలిన 14 రకాలు 14.29 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, ఉత్పత్తి 7.28 లక్షల మెట్రిక్ టన్ను లు మాత్రమే . ఈ 14 రకాల వరకు చూస్తే దాదాపు సగం అంటే 7.01 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఉంది. దీంతో ఈ సాగును అదనంగా 2.13 లక్షల ఎకరాల్లో చేయాలని ఉద్యానశాఖ ప్రతిపాదించింది. ఎనిమిది రకాల పండ్లకూ కొరతే... రాష్ట్రంలో వినియోగించే ఎనిమిది రకాల పండ్ల ఉత్పత్తి తక్కువగా ఉంది. జామ, ద్రాక్ష, యాపి ల్, కర్బూజ, నేరేడు, అరటి, పైన్ ఆపిల్, దాని మ్మ అవసరానికంటే 4.46 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉంది. యాపిల్ ఇక్కడ పండే పంట కాదు కాబట్టి ఆ చర్చ లేదు. జామ 23 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, రాష్ట్రంలో కేవలం 13 వేల మెట్రిక్ టన్నులే పండుతోంది. ద్రాక్ష 27 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, కేవలం 3 వేల మెట్రిక్ టన్నులే ఉత్పత్తి అవుతోంది. అరటి పండ్లు 3.39 లక్షల మెట్రిక్ టన్నులు గాను, 73 వేల మెట్రిక్ టన్నులే . దానిమ్మ 49 వేల మెట్రిక్ టన్నులకు గాను, కేవలం 11 వేల మెట్రిక్ టన్నులే ఉత్పత్తి అవుతోంది. ఆయా పండ్ల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే అదనంగా 38 వేల ఎకరాల్లో పండ్ల సాగు చేయా లని ఉద్యానశాఖ ప్రభుత్వానికి నివేదించింది. మామిడి, బొప్పాయి, పుచ్చకాయ, సపోటా, కమలా, బత్తాయి పండ్ల ఉత్పత్తి అవసరానికి మించి 9.43 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఉత్పత్తి అవుతుండటం గమనార్హం. అందులో మన జనాభాకు మామిడి 60 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, 4.82 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోంది. బొప్పాయి 3 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, రాష్ట్రంలో 51 వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోంది. అదనంగా ఉత్పత్తి అవు తున్న పండ్లను ఎగుమతి చేయాలని ఉద్యానశాఖ భావిస్తోంది.అందుకోసం ఆహారశుద్ధి పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం నెలకొని ఉంది. కొరత నెలకొన్న పండ్ల కోసం అదనంగా 38 వేల ఎకరాల్లో సాగు చేయాలని ప్రతిపాదించింది. -
అటు సేంద్రియ పంటలు ఇటు ఇంటిపంటలు!
‘సాక్షి సాగుబడి’ పేజీలో ‘ఇంటిపంట’, ప్రకృతి వ్యవసాయ కథనాలతో స్ఫూర్తిపొందిన యలమంచి వంశీ అనే యువరైతు గత రెండేళ్లుగా రసాయనాలు వాడకుండా వరి, మిర్చి సాగుతోపాటు మిద్దె తోటను సాగు చేస్తూ కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. తమ కుటుంబానికే కాకుండా బంధుమిత్రులకూ రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన పంటలు అందిస్తూ ఇతరులకు స్ఫూరినిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలోని ఆంధ్రకేసరి కాలనీ నివాసి అయిన వంశీ.. తన తండ్రి హయాంలో 23 ఏళ్ల క్రితం నిర్మించిన నివాస భవనంపైన రెండేళ్ల క్రితం సిమెంటు బెడ్స్ నిర్మించి మిద్దె తోట పెంచుతూ ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు తింటున్నారు. 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న టెర్రస్‌పైన 17 మడులను ఇటుకలతో నిర్మించి సిమెంటు ప్లాస్టింగ్ చేయించారు. టెర్రస్ మీద ఒక అడుగు ఎత్తున ఖాళీ ఉంచి మడులు నిర్మించారు. 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పున మడి నిర్మించారు. అడుగు లోతున మట్టి, పశువుల ఎరువు, కొబ్బరి పొట్టు మిశ్రమాన్ని నింపి కూరగాయలు పండిస్తున్నారు. ప్రస్తుతం వంగ, బెండ, దొండ దిగుబడి వస్తోంది. క్యాబేజి, బీట్రూట్ కూడా ఉన్నాయి. ఆపిల్ బెర్ తదితర పండ్ల మొక్కలు కూడా వేశారు. పంచగవ్య, వేస్ట్‌డీకంపోజర్, జీవామృతం, కషాయాలతో వరి, మిర్చి సాగు చేస్తున్న వంశీ మిద్దె తోటను కూడా శ్రద్ధగా సాగు చేస్తున్నారు. మారుమూల పల్లెటూర్లో సేంద్రియ వ్యవసాయం చేయడంతోపాటు ఇంటిపైన కూరగాయలు పెంచడం పలువుర్ని ఆకర్షిస్తోంది. సేంద్రియ వరి బియ్యాన్ని, మిర్చి పొడిని హైదరాబాద్‌లోని ఆర్గానిక్ షాపులకు ఇస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులను రుచి చూసిన వారు మళ్లీ అడుగుతుండటంతో మరింత ఉత్సాహం కలుగుతోందని, ఈ ఏడాది ఎకరంలో మిర్చితోపాటు 9 ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నానని వంశీ తెలిపారు. గ్రామాల్లో సైతం మిద్దె తోటలు నిర్మించుకుంటే ఎండాకాలం ఇల్లు చల్లగా ఉంటుంది. మిద్దెతోట కూరగాయలను తమ కుటుంబ సభ్యులు ఇష్టంగా తింటున్నారని వంశీ (99089 97969) తెలిపారు. -
భూసారాన్ని బట్టే చీడపీడల బెడద!
రసాయనిక అవశేషాల్లేని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగు చేసుకోవాలన్న ఆసక్తి గాఢంగా ఉండాలే గాని సొంతిల్లే అవసరం లేదు. క్వార్టర్లో నివాసం ఉంటున్నప్పటికీ ఎంచక్కా సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవచ్చని రుజువు చేస్తున్నారు డా. వి. శ్రీనివాసరావు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన తన కుటుంబంతో క్యాంపస్ క్వార్టర్లో నివాసం ఉంటూ.. పెరటి స్థలంలో ఇంటిపంటలు పండించుకుంటున్నారు. గతంలో క్వార్టర్ పై అంతస్తులో ఉండగా టెర్రస్ మీద ఐదేళ్లపాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సొంతంగా తయారు చేసుకున్న జీవామృతం, ఘన జీవామృతంతో ఇంటిపంటలు సాగు చేసిన అనుభవం ఉంది. గత ఏడాది నుంచి పెరట్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం నాటావుల మాగిన పేడ ఎరువు, మేకల ఎరువు సమపాళ్లలో కలిపి మొక్కలకు వేస్తున్నారు. వేసవిలోనే దగ్గర్లోని గ్రామానికి వెళ్లి రైతు నుంచే కొనుగోలు చేసి తెచ్చుకొని వాడుతున్నారు. అరటి గెల ఆయన పెరటి తోటకు దీపస్థంభంలా భాసిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆయన పెరటి తోటలో దొండ/బీర పాదులతోపాటు బెండ మొక్కలు, వంగ మొక్కలు, పుదీన ఉన్నాయి. వంగ మొక్కలకు వేసవికి ముందు 4–5 అంగుళాల ఎత్తున ప్రూనింగ్ చేశారు. కొత్త కొమ్మలకు ఇప్పుడు కాయలు వచ్చాయి. పుదీన, తోటకూర ఉంది. మృగశిర కార్తెతో పాటే రుతుపవనాలు పలుకరించిన తర్వాత వారం క్రితమే అనేక ఆకుకూరలు విత్తుకున్నారు.కూరగాయ మొక్కల విత్తనాల నారు పోసుకున్నారు. టెర్రస్ గార్డెన్లో కన్నా పెరటి తోటలో పంటలకు చీడపీడల బెడద తక్కువగా ఉన్నట్లు గమనించానని డా. శ్రీనివాసరావు తెలిపారు. భూమిలో సారం బాగుంటే చీడపీడల బెడద తక్కువగా ఉంటుందన్నారు. కట్టెల బొగ్గు పొడిని అప్పుడప్పుడూ మొక్కలపై చల్లుతుంటానన్నారు. వారానికోసారి లీటరు నీటికి 10–15 ఎం.ఎల్. నాటావు మూత్రాన్ని కలిపి పెరటి తోటలో పిచికారీ చేస్తున్నానని తెలిపారు. వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో తమ పెరటి తోట కూరగాయలు, ఆకుకూరలనే తింటామని డా. శ్రీనివాసరావు(94922 93299) సంతోషంగా చెప్పారు. కొత్తిమీర, ఎరువును చూపుతున్న డా. శ్రీనివాసరావు -
సాక్షి స్ఫూర్తితో ఇంటిపంటల సాగు!
‘సాక్షి’లో ‘ఇంటిపంట’ కాలమ్ స్ఫూర్తితో చీరాల రూరల్ మండలం రామకృష్ణాపురం మండలం సిపాయిపేటకు చెందిన తేళ్ల ఎలిజబెత్ తమ ఇంటిపై సేంద్రియ ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ఎమ్మే బీఈడీ చదివిన ఆమె ప్రైవేటు స్కూల్ టీచర్‌గా పనిచేస్తుండగా భర్త సంజీవరావు ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. భర్త, అత్తమామల ప్రోత్సాహంతో తమ మూడంతస్తుల భవనంపై ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ఆమె సాగు చేస్తున్నారు. బాల్యం నుంచే ఆమెకు మొక్కల పెంపకంపై ఆసక్తి మెండు. వివాహానంతరం మెట్టినింటికి వచ్చిన తర్వాత మూడో అంతస్తులో నివాసం కావడంతో మొక్కల పెంపకానికి కొంతకాలం దూరమయ్యారు. ఆ దశలో ‘ఇంటిపంట’ కాలమ్ స్ఫూర్తితో గత నాలుగేళ్లుగా మేడపైన సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు పెంచుతున్నారు. ఇంటిల్లిపాదీ ఆరోగ్యదాయకమైన కూరగాయలు, పండ్లు తింటున్నారు. ఇసుక, ఎర్రమట్టి మిశ్రమం.. ఎర్రమట్టిలో పావు వంతు ఇసుకను కలిపి కుండీల్లో నింపి మొక్కలు నాటి, తర్వాత నెలా రెండు నెలలకోసారి గేదెల పేడ ఎరువును వేస్తూ ఉంటానని ఎలిజబెత్ తెలిపారు. చీడపీడల నుంచి ఇంటిపంటలను కాపాడుకోవడానికి లీటరు నీటిలో 10 ఎం.ఎల్. వేప నూనె కలపి పిచికారీ చేస్తున్నారు. మొదట ఆకుకూరలతో ఇంటిపంటల సాగు ప్రారంభించి క్రమంగా కూరగాయలు, పండ్ల సాగు చేపట్టారు. 16 పాత ఎయిర్‌కూలర్ల అడుగు భాగాలను సేకరించి వాటిల్లో టమాటా, వంగ తదితర కూరగాయలు పండిస్తుండటం విశేషం. తక్కువ లోతు, ఎక్కువ వెడల్పు గల టబ్‌లలో చుక్కకూర, పాలకూర, గోంగూర తదితర ఆకుకూరలు పెంచుతున్నారు. పండ్ల మొక్కల సాగుకు లోతైన టబ్‌లు, బక్కెట్లు వాడుతున్నారు.వాటర్ యాపిల్, దానిమ్మ, జామ, సపోట, సీతాఫలం, రామాఫలం, నారింజ, అరటి, బొప్పాయి, కమల, వాటర్ యాపిల్, మామిడి, పనస, పంపర పనస, అంజూర, డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష, బత్తాయి. కర్బూజ, చెర్రీ, ఉసిరి మొక్కలను పెంచుతున్నారు. కర్బూజ, వాటర్ యాపిల్, సీడ్లెస్ నిమ్మ, స్వీట్ నిమ్మ, జ్యూస్ నిమ్మ రకాల మొక్కలు కాయలతో కళకళలాడుతున్నాయి. నాలుగైదు రకాల గులాబీలు, మందారాలు, చేమంతులను పెంచుతున్నారు. – కొప్పోలు వాసుబాబు, సాక్షి, చీరాల రూరల్, ప్రకాశం జిల్లా ఇంటిపంటలు ఎంతో రుచికరం.. సేంద్రియ ఎరువులతో కుండీలలో పెంచిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎంతో రుచిగా ఉంటున్నాయి. చాలా వరకు మా మేడపైన పండిన కూరలే ఇంటిల్లిపాదీ తింటున్నాం. ఉదయం గంట, సాయంత్రం గంటపాటు ఇంటిపంటలకు సమయం కేటాయించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను. ఇళ్ల ముందు ఖాళీ ప్రదేశాలు లేని వారు డాబాలపై కుండీలు ఏర్పాటు చేసుకొని పంటలు పండించుకోవచ్చు. మంచి ఆహారం లభించడంతో పాటు మొక్కల్లో పనిచేస్తూ ఉంటే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. – తేళ్ల ఎలిజబెత్ (74167 06209), సిపాయిపేట, చీరాల రూరల్ మండలం, ప్రకాశం జిల్లా -
కూరగాయల సాగుతో లాభాలు
వికారాబాద్: దేశంలోనే జిల్లాలోని భూములు పండ్ల తోటలు, కూరగాయల పెంపకానికి అనువుగా ఉన్నాయని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు. సోమవారం వికారాబాద్‌లోని కొత్తగడి గ్రామంలో ఉత్తమ రైతు మోహన్‌రెడ్డి వ్యవసాయక్షేత్రంలో ఏర్పాటు చేసిన ‘మన ఊరు- మన కూరగాయలు’ రైతు శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లా రైతులు పండ్లు, కూరగాయల తోటల పెంపకంపై దృష్టి పెట్టాలని, మంచి లాభాలు పొందాలని సూచించారు. హైదరాబాద్‌లోని బోయిన్పల్లి మార్కెట్‌కు 80 శాతం కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయన్నారు. జిల్లా రైతులకు కూరగాయల సాగుపై అవగాహన పెంచాలని అన్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వారి అవసరాలకు రోజుకు 25 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరమని, తెలంగాణ వ్యాప్తంగా కేవలం లక్ష మెట్రిక్ టన్నుల కూరగాయలే పండిస్తున్నారని అన్నారు. మిగతావన్నీ ఇతర రాష్ట్రాల నుంచే దిగుమతి అవుతున్నాయన్నారు. రైతుల వద్దకే వచ్చి కూరగాయలు కొనే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. మామిడి, జామ పండ్ల తోటల్లో శాస్త్రీయ పద్ధతుల్లో అంటుకట్టి ఉత్పత్తులను పెంచడానికి ప్రభుత్వం అన్ని రకాల పద్ధతులను అవలంబిస్తున్నదన్నారు. వికారాబాద్ వ్యవసాయ ఉద్యాన క్షేత్రం నుంచి యేటా 5 లక్షల మొక్కలను అంటు కట్టి తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. అంతకుముందు పట్టణంలోని ఉద్యాన వ్యవసాయ క్షేత్రంలో పర్యటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరావు, ఉద్యావన, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, సబ్ కలెక్టర్ హరినారాయణ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కూరల ఊరు గంగాపూరు
వర్షాభావం...కరెంటు కోతలు... తగ్గిపోయిన భూగర్భజలాలు..కళ్లముందే నాశమైపోతున్న పంటలు...లక్షల రూపాయలు పెట్టుబడి...రోజుల తరబడి చేసిన రెక్కల కష్టం.. అంతా వృధా..మెతుకుసీమ రైతుల కష్టాలివి. అయినా చాలా మంది సాగునీరు తగినంత లేకపోయినా చెరువుకిందో..బావికిందో వరిసాగు చేస్తారు..మళ్లీ మళ్లీ నష్టపోతారు. కానీ గంగాపూర్ వాసులు మాత్రం కష్టాల సాగుకు స్వస్తి పలికారు. ఉన్న నీటితోనే పండే ఆరుతడి పంటలైన కూరగాయల సాగుపై దృష్టి సారించారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తూ అందరికీ స్ఫూర్తి నిలుస్తున్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోలేక ఆత్మహత్యలే దిక్కనుకుంటున్న రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. చిన్నకోడూరు, న్యూస్‌లైన్: మండలంలోని గంగాపూర్ ఓ చిన్న గ్రామం. గ్రామంలోని వారంతా దాదాపు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సుమారు వెయ్యి ఎకరాల భూమి ఉండగా, సాగులో ఉన్నది మాత్రం 400 ఎకరాలు. అందులోనూ 250పైగా ఎకరాల సాగులో ఉన్నది కూరగాయల పంటలే. వర్షాభావం..సాగునీరు లభ్యత తక్కువగా ఉండడం..కరెంటు కోతల నేపథ్యంలో ఈ గ్రామంలోని రైతులంతా ఆరుతడి పంటలైన కూరగాయలు సాగుకు సిద్ధయ్యారు. మిర్చి, టమాట, బెండకాయల, ఆకుకూరలను పండిస్తున్నారు. పెట్టుబడి తక్కువ...ఆదాయం ఎక్కువగా ఉండడంతో ఒకరిని చూసి మరొకరు ఇలా గ్రామంలోని రైతులంతా కూరగాయల బాటే పట్టారు. వీరు పండించిన పంటలను సమీపంలోని సిద్దిపేట, కరీంనగర్ మార్కెట్లో విక్రయిస్తారు. వెంటనే పైసలొస్తాయి...చేసిన కష్టం మరచిపోతారు. అందుకే చాలా మంది రైతులు ఇంటికి కావాల్సిన మేరకు వరి పండించి...మిగతా పొలంలో కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. శ్రమకు తగ్గ ఫలితం ఉంది కూరగాయల పంటలను సాగు చేయడం వల్ల శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుందని పలువురు రైతులు అంటున్నారు. ముఖ్యంగా మిర్చి విత్తనాలను ఒక్కసారి నాటితే పదిహేను రోజులకు ఒక సారి పంట దిగుబడి వస్తుంది. ఈ విధంగా నెలల తరబడి రావడంతో రైతులు ఈ పంటను నిరంతరంగా పండిస్తున్నారు. వీరు చేసే సాగులో కనీసం ఒక ఎకరం మిర్చి, కూరగాయల సాగు ఉండటం విశేషం. తక్కువ పెట్టుబడులతో మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా కూరగాయలను సరఫరా చేస్తుండటం రైతులకు మంచి ఆదాయ మార్గంగా మారింది. ప్రోత్సాహం అవసరం ఆరుతడి పంటలే సాగు చేయాలంటూ ప్రచారం చేస్తున్న ప్రభుత్వం, అందరికీ ఆదర్శంగా నిలుస్తోన్న గంగాపూర్ రైతులను ప్రోత్సాహించాల్సి ఉంది. రాయితీపై కూరగాయల విత్తనాలు, డ్రిప్ పరికరాలు, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేస్తే సాగు విస్తీర్ణం మరింత పెంచుతామంటున్నారు గంగాపూర్ రైతులు. అంతేకాకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలతో సూచనలు, సలహాలు ఇప్పించడంతో పాటు పంటల కొనుగోలు, రవాణా బాధ్యత సర్కార్ తీసుకుంటే తమకు మేలు జరుగుతుందని వారంతా చెబుతున్నారు.