తన ఇంటిపై మిద్దెతోటలో వంశీఇంటి పంట
‘సాక్షి సాగుబడి’ పేజీలో ‘ఇంటిపంట’, ప్రకృతి వ్యవసాయ కథనాలతో స్ఫూర్తిపొందిన యలమంచి వంశీ అనే యువరైతు గత రెండేళ్లుగా రసాయనాలు వాడకుండా వరి, మిర్చి సాగుతోపాటు మిద్దె తోటను సాగు చేస్తూ కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. తమ కుటుంబానికే కాకుండా బంధుమిత్రులకూ రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన పంటలు అందిస్తూ ఇతరులకు స్ఫూరినిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలోని ఆంధ్రకేసరి కాలనీ నివాసి అయిన వంశీ.. తన తండ్రి హయాంలో 23 ఏళ్ల క్రితం నిర్మించిన నివాస భవనంపైన రెండేళ్ల క్రితం సిమెంటు బెడ్స్ నిర్మించి మిద్దె తోట పెంచుతూ ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు తింటున్నారు. 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న టెర్రస్‌పైన 17 మడులను ఇటుకలతో నిర్మించి సిమెంటు ప్లాస్టింగ్ చేయించారు. టెర్రస్ మీద ఒక అడుగు ఎత్తున ఖాళీ ఉంచి మడులు నిర్మించారు.
4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పున మడి నిర్మించారు. అడుగు లోతున మట్టి, పశువుల ఎరువు, కొబ్బరి పొట్టు మిశ్రమాన్ని నింపి కూరగాయలు పండిస్తున్నారు. ప్రస్తుతం వంగ, బెండ, దొండ దిగుబడి వస్తోంది. క్యాబేజి, బీట్‌రూట్ కూడా ఉన్నాయి. ఆపిల్ బెర్ తదితర పండ్ల మొక్కలు కూడా వేశారు. పంచగవ్య, వేస్ట్‌డీకంపోజర్, జీవామృతం, కషాయాలతో వరి, మిర్చి సాగు చేస్తున్న వంశీ మిద్దె తోటను కూడా శ్రద్ధగా సాగు చేస్తున్నారు. మారుమూల పల్లెటూర్లో సేంద్రియ వ్యవసాయం చేయడంతోపాటు ఇంటిపైన కూరగాయలు పెంచడం పలువుర్ని ఆకర్షిస్తోంది.
సేంద్రియ వరి బియ్యాన్ని, మిర్చి పొడిని హైదరాబాద్‌లోని ఆర్గానిక్ షాపులకు ఇస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులను రుచి చూసిన వారు మళ్లీ అడుగుతుండటంతో మరింత ఉత్సాహం కలుగుతోందని, ఈ ఏడాది ఎకరంలో మిర్చితోపాటు 9 ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నానని వంశీ తెలిపారు. గ్రామాల్లో సైతం మిద్దె తోటలు నిర్మించుకుంటే ఎండాకాలం ఇల్లు చల్లగా ఉంటుంది. మిద్దెతోట కూరగాయలను తమ కుటుంబ సభ్యులు ఇష్టంగా తింటున్నారని వంశీ (99089 97969) తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment