Home crops
-
ఇండోనేసియాలో ఇంటిపంటలకు కోవిడ్ కిక్కు!
17 వేల ద్వీపాల సమాహారమైన ఇండోనేసియా నగరాలు, పట్టణ ప్రాంతాల ప్రజల ఆహారపు అవసరాలు తీర్చడంలో, పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో అర్బన్ ఫార్మింగ్ ఇప్పుడు కీలకపాత్ర పోషిస్తోంది. కరోనా అనంతర కాలంలో వైవిధ్య భరితమైన, రసాయనిక అవశేషాల్లేని ఆహారం కోసం అర్బన్ ఫార్మింగ్ చేపట్టే వారి సంఖ్య పెరుగుతోంది. సకియా నసుషన్ తన రెండంతస్తుల మేడపైన ఏడాది క్రితం నుంచి సేంద్రియ పంటలు పండిస్తున్నారు. సుమత్రా దీవిలో అతిపెద్ద నగరం మెడాన్ నివాసి ఆమె. ముగ్గురు బిడ్డల తల్లి అయిన సకియా స్థానిక విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు వ్యవసాయ శాస్త్రం బోధిస్తున్నారు. సాగు మెలకువలు తెలిసినప్పటికీ కోవిడ్ మహమ్మారి తాకిడి తర్వాతనే ఆమె ఇంటిపైన పంటలు సాగు చేయటం ప్రారంభించారు. ‘ఇప్పుడు మా ఇంటిల్లిపాదికీ అవసరమైన కూరగాయలన్నీ పండించుకుంటున్నాం. ఆకుకూరలైతే అసలు బయట కొనాల్సిన అవసరమే రావటం లేదు’ అంటారామె. కాలీఫ్లవర్స్, పాలకూర, టొమాటోలు, లెట్యూస్, జపనీస్ మస్టర్డ్ గ్రీన్స్, కీరదోస, పసుపు, అల్లం వంటి అనేక పంటలను టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్ పద్ధతుల్లో పండిస్తున్నారు సకియా. ఆమెను చూసి పరిసరాల్లోని అనేక ఇళ్లపైన కూడా కిచెన్ గార్డెన్లు పుట్టుకొచ్చాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇండోనేసియాలో ఆహారోత్పత్తుల ధరలు అమాంతంగా 30–40% పెరగటం కూడా ప్రజలను సేంద్రియ ఇంటిపంటల దిశగా నడిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్న ఖాళీ స్థలాల్లో కూరగాయలు, పండ్లు సాధ్యమైనంత వరకైనా పండించుకోవాలన్న స్పృహ నగరవాసుల్లో విస్తరిస్తోంది. ‘ఇంటిపంటల సాగు దిశగా ప్రజలు కదలటం ఆహారోత్పత్తిలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తుంద’ని వెస్ట్ జావా రాష్ట్రంలో గరుట్ జిల్లాకు చెందిన నిస్సా వర్గడిపుర అనే సామాజిక కార్యకర్త అంటున్నారు. నిస్సా అనేక ఏళ్ల క్రితమే అత్–తారిఖ్ సేంద్రియ ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్‌ను నెలకొల్పి రసాయనాలు వాడకుండా పంటలు పండించడంలో యువతీ యువకులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ కృషికి గాను నాలుగేళ్ల క్రితం ఓ పురస్కారాన్నీ అందుకున్నారు నిస్సా. ఇండోనేసియాలో ఆహార భద్రతకు చిన్న, సన్నకారు రైతుల కుటుంబ సేద్యం మూల స్తంభం వంటిది. అనేక రకాల కూరగాయ పంటలు పండించి స్థానికంగా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి అర్బన్ ఫార్మింగ్ దోహదం చేస్తోంది అంటున్నారు నిస్సా. స్కూల్‌కు అనుబంధంగా ఉన్న రెండున్నర ఎకరాల క్షేత్రంలో 450 రకాల బహువార్షిక, ఏకవార్షిక, సీజనల్ పంటలను నిస్సా సాగు చేస్తుండటం విశేషం. సెంట్రల్ జావా రాష్ట్రంలోని సురకర్త (దీన్ని ‘సోలో’ అని కూడా పిలుస్తారు) నగరం అర్బన్ ఫార్మింగ్‌కు పెద్ద పీట వేస్తోంది. నగరంలో ఇళ్లపైన, ప్రభుత్వ/ప్రైవేటు ఖాళీ స్థలాల్లో ఎత్తు మడులపై, కుండీల్లో సేంద్రియ ఇంటిపంటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. మరోవైపు, హైడ్రోపోనిక్స్ పద్ధతిలో ఆకుకూరలు, టొమాటోలు పండించడం అర్బన్ యూత్‌లో సరికొత్త ట్రెండ్‌గా మారింది. ప్రత్యేక శిక్షణ సంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయి. సోలో నగర పొలిమేర ప్రాంతాల్లో హెక్టారు కన్నా తక్కువ క్షేత్రాల్లో అర్బన్ ఫార్మర్స్ వాణిజ్య స్థాయిలో పంటలు పండిస్తున్నారు. పెరటి కోళ్ల పెంపకం, ఇళ్ల దగ్గరే చిన్న సిమెంటు ట్యాంకుల్లో క్యాట్‌ఫిష్ సాగు కనిపిస్తోంది. కూరగాయలు, పండ్లతో పాటు తేనెకు మంచి గిరాకీ ఉందని సోలో సిటీ ఫార్మర్స్ చెబుతున్నారు. ఇండోనేసియా ప్రభుత్వం నగరప్రాంత ప్రజల ఆహార భద్రతకు ప్రత్యేక చట్టాలు చేసి అర్బన్ అగ్రికల్చర్‌ను ప్రోత్సహిస్తోంది. ఫుడ్ సెక్యూరిటీ కౌన్సిల్ అర్బన్ అగ్రికల్చర్ పథకానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు చేసింది. దీని అమలు తీరును సోలో నగర మేయర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మహిళా అర్బన్ రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తుండటం విశేషం. – పంతంగి రాంబాబు కోవిడ్ నేర్పిన గుణపాఠం వల్ల రోగాలను పారదోలే కార్యకలాపాలకు ఇల్లే కేంద్రంగా మారింది. అందుకే ఇప్పుడు అర్బన్ ఫార్మింగ్ ఊపందుకుంది. మాకు అవసరమైన ఆకుకూరలు, కూరగాయలను ఇంటిపైనే పండించుకుంటున్నాం. – సకియా, అర్బన్ ఫార్మర్, అగ్రికల్చర్ లెక్చరర్, మెడాన్, ఇండోనేసియా -
ఇంటి పంటల పూజారి!
మనసుంటే మార్గం లేకపోదు. ఇంటి పంటలకు మనసులో చోటిస్తే చాలు.. మనకున్న అతికొద్ది చోటులోనూ పచ్చని కూరల వనాన్నే పెంచవచ్చు అనడానికి ఈ రేకుల మిద్దె తోటే ప్రత్యక్ష సాక్ష్యం! పక్కా భవనాల్లో ఉంటున్న వారు కూడా ఇంటి పైన కుండీలు, మడులు పెట్టి మొక్కలు పెంచాలంటే శ్లాబ్ దెబ్బతింటుందేమో అని సందేహ పడి తటపటాయిస్తున్న రోజులివి. అయితే, పదేళ్ల క్రితం నుంచే రేకుల ఇంటిపైన సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఓ యువ పూజారి. కరోనా లాక్డౌన్ ఎండా కాలంలో కూడా బయటకు వెళ్లి కొనకుండా పూర్తిగా తన ఇంటిపంటలే సరిపోయాయని అంటున్నారు. అతని పేరు పుట్టా ప్రవీణ్‌కుమార్. సికింద్రాబాద్‌లోనే పుట్టి పెరిగాడు. తన తల్లి కృష్ణవేణికి ఇంటి చుట్టూ మొక్కలు పెంచటం అంటే మహాఇష్టం. అలా చిన్నప్పటి నుంచే ప్రవీణ్‌కు సేంద్రియ ఇంటిపంటల సాగుపై ఆసక్తి కలిగింది. తల్లి మర ణించిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. బన్సీలాల్‌పేట్ డివిజన్ బోయిగూడ ప్రాంతంలో శ్రీధనలక్ష్మీ ఉప్పలమ్మ ఆలయంలో ప్రవీణ్ పూజారిగా పనిచేస్తూ, అక్కడే నివాసం ఉంటున్నారు. అల్ల నేరేడు చెట్టు కింద ఈ గుడి ఉంటుంది. గుడిలో భాగంగానే (ఇనుప కమ్ముల మీద వేసిన) సిమెంటు రేకుల షెడ్డు ఉంది. దాని విస్తీర్ణం 60 గజాలు ఉంటుంది. ఆ రేకుల ఇంటిపైన పిట్టగోడల మీద ఒడుపుగా ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. రేకులకు ఇబ్బందేమీ లేదా అంటే.. పదేళ్ల క్రితం నుంచే తాను ఇలా కూరగాయలు, ఆకుకూరలు పండించుకొని వండుకు తింటున్నానని, ఎప్పుడూ ఏ ఇబ్బందీ రాలేదని ప్రవీణ్ తెలిపారు. పూలు, వంటింటి వ్యర్థాలకు ఆవు పేడ కలిపి తానే ఎరువు తయారు చేసుకొని వాడుతున్నారు. రేకుల ఇల్లు కాబట్టి చూట్టూతా పిట్ట గోడపైనే మడులు, కుండీలు, బాటిల్స్ పెట్టి సాగు చేస్తున్నారు. దూరం నుంచి చూస్తే చిన్న స్థలమే కదా అనిపిస్తుంది. కానీ, చిన్న కవర్లు, ట్రేలు, కుండీలు, టబ్‌లలో అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తుండటం విశేషం. మడుల్లో కన్నా బాటిల్స్‌లోనే తక్కువ నీటితో సాగు చేయవచ్చని అనుభవపూర్వకంగా చెబుతున్నారు ప్రవీణ్. అమ్మ చెప్పిందని బొగ్గులను నెలకోసారి ఎరువుగా వేస్తున్నానన్నారు. బచ్చలికూర, పాలకూర, తోటకూర, గోంగూర ఉన్నాయి. చిక్కుడు, గుమ్మడి, బీర, సొర తీగలను కట్టెల పందిరికి పాకించారు. 60–70 టమాటా, 30 స్వీట్‌కార్న్, 15 బెండ, 15 వంగ మొక్కలతోపాటు ఉల్లి, పచ్చిమిర్చి మొక్కలు కూడా ప్రవీణ్ రేకుల మిద్దె తోటలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. పదులకొద్దీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌కు అడుగు కత్తిరించి మొక్కలు పెంచుతున్నారు. పంటల మార్పిడి తప్పకుండా పాటిస్తున్నారు. తాను తినగా మిగిలిన కూరగాయలను ఇతరులకు పంచిపెడుతున్నారు. గత ఏడాది ఈ బాటిల్స్‌లో 5 కిలోల వరి ధాన్యం కూడా పండించారు. ఆ ధాన్యాన్ని పూజా కార్యక్రమాల్లో వాడుకున్నానని తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్, అంజీర గింజలు విత్తి నర్సరీ పెంచుతున్నారు. మొక్కల మీద, అమృతాహారం మీద, శ్రమైకజీవనం మీద ప్రవీణ్‌కు ఉన్న ప్రేమ అవ్యాజమైనది. ఇంతకన్నా ఆనందం ఏముంది? మొక్కలు పెంచటం నాకెంతో ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది. ఇంటి పంటల మధ్య ఉంటే ఒత్తిడి పోతుంది. హాయిగా ఉంటుంది. ప్రతి రోజు రెండు గంటల సమాయాన్ని కేటాయిస్తున్నా. ఇతరత్రా ఏ పనుల్లోనూ ఈ ఆనందం లేదు. – పుట్టా ప్రవీణ్‌కుమార్ (86868 08194), బోయిగూడ, సికింద్రాబాద్ – ఇ.చంద్రశేఖర్, సాక్షి, బన్సీలాల్‌పేట్ (సికింద్రాబాద్) -
ఇంటి సాగే ఇతని వృత్తి!
వ్యవసాయమా... అందునా ఇంటిపైనా.. అయ్య బాబోయ్ అంత శ్రమపడలేను, సమయం వెచ్చించలేనని ఎంతమాత్రం వెనుకాడవద్దు అంటున్నారు చెన్నైకి చెందిన 31 ఏళ్ల యువకుడు రాహుల్ ధోకా. నాలుగు గోడలు ఉంటే చాలు, రోజుకు కేవలం పది నిమిషాల సమయం గడిపితే చాలు ప్రకృతి వరప్రసాదం వంటి స్వచ్ఛమైన అనేక వ్యవసాయ ఉత్పత్తులు మీకు సొంతం అవుతాయని భరోసా ఇస్తున్నారాయన. విలాసవంతమైన జీవితంతోపాటూ ఎం.ఎస్. పట్టా చేతిలో ఉండి కూడా ఇంటిపంటల సాగునే వృత్తిగా చేసుకున్న విలక్షణ వ్యక్తిత్వం రాహుల్‌ది. తన ఉత్పత్తులతో కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను ఆకట్టుకుంటున్నారు. వంటింటి అవసరాలకు మార్కెట్లకు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ ఇంటిలోనే వ్యవసాయ ఉత్పత్తులను హైడ్రోపోనిక్ పద్ధతిలో చేతికి మట్టి అంటకుండా సులభతరంగా సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆయన మాటల్లోనే.. అన్నా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ అయ్యాక యూకే వెళ్లి వార్విక్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశాను. అక్కడ చదువుకుంటున్న సమయంలోనే సేంద్రియ వ్యవసాయం వైపు ఆకర్షితుడినయ్యాను. తల్లిదండ్రుల వద్దకు చెన్నై తిరిగి వచ్చిన తరువాత 2013లో సేంద్రియ ఉత్పత్తుల విక్రయ స్టోర్ పెట్టాను. వంద రకాల ఉత్పత్తులను అమ్మేవాడిని. స్వయంగా సాగు చేయాలని 2016 డిసెంబరులో హైడ్రోపోనిక్ విధానంలో ‘ఆక్వాఫామ్స్’ పేరిట (నుంగంబాక్కం తిరుమూర్తి నగర్‌లోని) మా ఇంటి పైనే సాగు ప్రారంభించాను. చెన్నైలో తరచూ ఎదురయ్యే నీటి కొరత ప్రభావానికి గురికాని వ్యవసాయం చేయాలని తలపెట్టాను. మూడు నెలలు పరిశోధన చేసిన తరువాత వీటన్నింటికీ సమాధానంగా హైడ్రోపోనిక్ విధానంలో పంటల సాగు ఎంతో శ్రేయస్కరమని నమ్మి అనుసరిస్తున్నాను. పాలకూర, తోటకూర, గోంగూర తదితర ఆకుకూరలు, వాము పాక్చోయ్, బ్రహ్మి, తులసి, బంతి పెంచుతున్నాను. కొబ్బరి పొట్టు, క్లే బాల్స్ వేసి విత్తనాలు నాటి నర్సరీ పెంచుతున్నాను. మొక్కలు కొంచెం పెరిగిన తరువాత వాటిని పీవీసీ పైపులను నిలువుగా అనేక వరుసల్లో ఏర్పాటు చేసుకొని, వాటికి రంధ్రాలు పెట్టి, కేవలం రెండు అంగుళాలున్న ఆ కప్పులను ఆ రంధ్రాల్లో కూర్చోబెడుతున్నాను (ఈ కప్పుల్లో మట్టికి బదులుగా వరిపొట్టు, వర్మిక్యులేట్, స్పాంజ్‌లను కూడా వాడవచ్చు). మొక్కల కుదుళ్లకు కొబ్బరి పొట్టును ఏర్పాటు చేసి సాధారణ నీటిలో న్యూట్రిషన్ నీళ్లను కలిపి ప్లాస్టిక్ గొట్టాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా ప్రవహింపజేస్తాను. ఎన్పీకే న్యూట్రిషన్తోపాటు మెగ్నీషియం సల్ఫేటు, కాల్షియం నైట్రేట్‌ను ద్రావణం రూపంలో కేవలం మొక్కల వేళ్ల ద్వారా ప్రవహింపజేయడం వల్ల ఎలాంటి దోషమూ ఉండదు. నేలపై అమర్చిన చిన్నపాటి వాటర్ ట్యాంక్ నుంచి మోటార్ ద్వారా పైప్‌కు పై భాగంలో ఈ నీటిని విడుదల చేస్తాను. అవి అలా ప్రవహిస్తూ అన్ని మొక్కలకు చేరుతాయి. మొక్కలకు అందగా మిగిలిన నీరు మళ్లీ కింద ట్యాంక్‌లో పడిపోతుంది. అదేనీటిని నిర్ణీత కాలవ్యవధిలో మళ్లీ వాడుకోవచ్చు. ఈ పద్ధతి వల్ల ఒక్కనీటి చుక్క కూడా వృథా పోదు. ఆరు వారాల్లో 200 గ్రాముల దిగుబడి పాలకూర, తోటకూర, లెట్యుసీ, పాక్చోయ్, బ్రహ్మి, తులసి, మారిగోల్డ్ ఫ్లవర్, అజ్వైన్ తదితర ఆకుకూరలు పెంచుతున్నాను. పుదీనా, ఇటాలియన్ బాసిల్ (తులసి), పది తులసి రకాలు వేశాను. మట్టిలో సాధారణ సాగుతో పోల్చితే హైడ్రోపోనిక్ విధానంలో 90 శాతం నీరు ఆదా అవుతుంది. మట్టిని వాడకపోవడం వల్ల మొక్కలకు వ్యాధులు సోకవు. కలుపు మొక్కలు పెరగవు. ఇలా సాగుచేస్తున్న పంట ఆరు వారాల్లో చేతికి వస్తుంది. ఆకుకూర, ఔషధ మొక్కలనుంచి ఆరు నుంచి ఎనిమిది వారాల్లో 200 గ్రాముల దిగుబడి సాధించవచ్చు. 30 అడుగుల్లో 500 మొక్కలు డాబాపై 80 చదరపు అడుగుల్లో 6,000 కూరగాయ, ఔషధ మొక్కలు పెంచుతున్నాను. అయితే, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం కేవలం 30 చదరపు అడుగుల్లో 500 మొక్కలు పెంచుతున్నాను. నీటి పారుదల మట్టం కొంచం తగ్గించడం వల్ల ఆక్సిజన్ చేరుతుంది. ఇది మొక్కల పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. హైడ్రోపోనిక్ విధానంలో సేంద్రియ విత్తనాలే వాడాల్సిన అవసరం లేదు. సాధారణ విత్తనాలు మొక్కలైనపుడు వాటిల్లోని దోషాలు వంద శాతం తొలగిపోతాయి. ఏదైనా చిన్నపాటి సమస్యలు తలెత్తినట్లయితే వేప నూనెను పిచికారీ చేయడం ద్వారా వాటిని రూపుమాపవచ్చు. వర్టికల్ పైప్‌లైన్ సాగు విధానంతో ఎంత చిన్న స్థలంలోనైనా మొక్కలను పెంచవచ్చు. గోడకు కూడా పైప్‌లైన్ వ్యవస్థను అమర్చుకుని మొక్కలు పెంచవచ్చు. ఏడాదికి నాలుగు దఫాలు దిగుబడి సాధించవచ్చు. రోజుకు పది నిమిషాలు చాలు! ముఖ్యంగా ఈ మొక్కల పెంపకం కోసం గంటల తరబడి శ్రమించాల్సిన అవసరం లేదు. 500 మొక్కల పెంపకానికి సరదాగా రోజుకు పది నిమిషాలు కేటాయిస్తే చాలు. ఎల్తైన పైప్‌లైన్ వ్యవస్థ వల్ల కిందకు వంగి శ్రమపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది వృద్ధులకు ఎంతో సౌకర్యం. కేజీకి రూ. 20 ఖర్చు ఒక కేజీ ఆకుకూరలు, ఔషధ మొక్కలు పెంపకానికి కేవలం రూ.20లు మాత్రమే ఖర్చవుతుంది. అదే బజారులో కొంటే ఎంతో ఖరీదు. డాబాపై పంటలు వేసినపుడు అవసరమైన సూర్యరశ్మి అందుతుంది. అలా డాబా పైన ఖాళీ స్థలం లేని వారు నిరుత్సాహపడక్కర లేదు. ఇంటిలోపల కూడా సూర్యరశ్మికి బదులుగా ఎల్ఈడీ దీపాలను అమర్చి ఈ మొక్కలు పెంచవచ్చు. 12 గంటల ఎల్ఈడీ దీపాల వెలుగు ఆరుగంటల సూర్యరశ్మితో సమానం. ఒక పంట దిగుబడి తరువాత కొబ్బరి పొట్టు మారిస్తే తర్వాత పంటలోనూ మంచి ఫలితాలు పొందవచ్చు. సేంద్రియం కంటే హైడ్రోపోనిక్ మేలు సేంద్రియ సాగు కంటే హైడ్రోపానిక్ సాగు ఎంతో శ్రేష్టం. సేంద్రియ పంటల్లో సాల్మోనెల్లా, ఇకొలి అనే బ్యాక్టీరియాను న్యూయార్క్‌లో కనుగొని 75 శాతం ఉత్పత్తులను వెనక్కు పంపివేశారు. సేంద్రియ వ్యవసాయంలో కొందరు ఉత్పత్తుల సైజు పెంచడం కోసం ఆక్సిటోసిన్ హార్మోన్‌ను వినియోగిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. ఆక్సిటోసిన్‌తో తయారైన ఉత్పత్తులను భుజించడం వల్ల క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. ఇంటింటా హైడ్రపోనిక్ పంటే లక్ష్యం హైడ్రోపోనిక్ వ్యవసాయం అందరికీ అందుబాటులోకి రావాలి. తమకు అవసరమైన మొక్కలను ఎవరికి వారు పెంచుకునే స్థాయికి చేరుకోవాలనేదే నా లక్ష్యం. మార్కెట్‌కు వెళితే అధిక ధరలతోపాటూ వాహనాలకు ఆయిల్ ఖర్చు భరించాల్సి ఉంటుంది. అంతేగాక ఎంతో సమయం వృథా అవుతుంది. ఈ వాస్తవాలపై అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 2019 జనవరిలో చెన్నైలో ‘ఆక్వా ఫాం’ హైడ్రోపోనిక్స్ కన్సల్టెన్సీ ఆఫీసును ఏర్పాటు చేశాను. ముందుగా బంధువులకు నేర్పాను. మా ఆఫీసు ద్వారా ఎంతోమందికి సలహాలు, సూచనలు ఇస్తున్నాను. నెలకు రెండు శిక్షణా తరగతులను మూడు నెలలుగా నిర్వహిస్తున్నాను. ఇతర రాష్ట్రాల నుంచి ఎందరో తరగతులకు హాజరవుతున్నారు. ఇలా ఎంతోమందికి అవగాహన కల్పించాను. – కొట్ర నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై నేను పండించిన ఆకుకూరలు, ఔషధ మొక్కలను మా ఇంటిలో, బంధుమిత్రుల ఇళ్లలో వాడుకోగా మిగిలినవి ఇతరులకు అమ్ముతున్నాను. వినియోగదారుల నుంచి ముందుగానే ఆర్డర్లు తీసుకొని సరఫరా చేస్తున్నాం. ఇలా ఎందరో ఖాతాదారులు ఏర్పడ్డారు. రిటైల్ దుకాణాలకు కూడా సరఫరా చేస్తున్నాను. (రాహుల్ «ధోకాను 89395 49895 నంబరులో సంప్రదించవచ్చు) https://www.acquafarms.org -
‘కుండీ పందిరి కూరగాయల’కు అవార్డుల పంట!
కుండీల్లోనే బుల్లి పందిళ్లు వేసి ఎంచక్కా తీగజాతి కూరగాయలను మేడ మీద/పెరట్లో కూడా ఇట్టే పండించుకోవచ్చని ఈ ఫొటోలు చూస్తే తెలుస్తుంది. కన్నుల పండువగా ఉన్న చిట్టి పందిరి కూరగాయల సాగుదారులు ఇటీవల కోల్‌కత్తాలో జరిగిన అవార్డులు పంట పండించుకున్నారు. అగ్రి–హార్టికల్చరల్ సొసైటీ ఆఫ్ ఇండియా (డా. విలియం కారీ 1820లో స్థాపించారు) కోల్‌కత్తాలో ఏర్పడి 200 ఏళ్లయ్యింది. ఈ సందర్భంగా 200వ వార్షిక పుష్ప ప్రదర్శనతోపాటు మధ్య ఆసియా దేశాల గులాబీ మహాసభ ఈ నెల 9 నుంచి 12 వరకు జరిగాయి. ప్రపంచం నలుమూలల నుంచి 300 మంది ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొన్నారు. రోజ్ షోలో 136 సెక్షన్లు ఉండగా.. కూరగాయలు, పండ్లు, బోన్సాయ్, పామ్స్, ఫెర్న్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ తదితర 50 విభాగాల్లో ఉత్తమ సాగుదారులకు బహుమతులు అందజేశారు. కుండీల్లోనే చిన్న పందిళ్లు వేసి తీగజాతి కూరగాయలు పండించే నమూనాలు, కుండీల్లో పండ్ల సాగు నమూనాలు ఈ షోలో హైలైట్‌గా నిలిచాయి. ఒక కుండీలో కట్టె పుల్లలతో పందిరి వేసి సొర తీగను పాకించి నాలుగు సొరకాయలు కాయించిన నమూనాకు కంటెయినర్ కిచెన్ గార్డెనింగ్ విభాగంలో ప్రథమ బహుమతి దక్కింది. వంగ కుండీకి ద్వితీయ బహుమతి దక్కింది. కుండీల్లో సైతం తీగజాతి కూరగాయలను నిశ్చింతగా సాగు చేయడమే కాకుండా మంచి దిగుబడి కూడా తీయొచ్చని ఈ ఫొటోలు చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్ అగ్రి–హార్టీకల్చర్ సొసైటీ నేతలు కొందరు కోల్కత్తా పూలు, కూరగాయలు, పండ్ల ప్రదర్శనలో పాల్గొని స్ఫూర్తిని పొందటం విశేషం. -
23 ఏళ్లుగా ఇంటిపంటల సాగు
బాల్యంలో పెరటి తోటల పనుల్లో భాగం పంచుకున్న అనుభవాలు ఆమెను చక్కని టెర్రస్ ఆర్గానిక్ కిచెన్ గార్డెనర్‌గా నిలబెట్టాయి. చెన్నైలోని తిరువోత్రియూర్ ప్రాంతంలో సొంత ఇంట్లో నివాసం ఉంటున్న పాలిన్ శ్యామ, గోపి నటరాజన్ దంపతులు ప్రకృతికి అనుగుణమైన జీవన శైలిని గత 23 ఏళ్లుగా అనుసరిస్తున్నారు. సుమారు 50 రకాల పండ్లు, కూరగాయలను తమ ఇంటి మేడపైనే పాలిన్ సునాయాసంగా పెంచుతున్నారు. ‘నేను కేరళలో పుట్టాను. మా ఇంటి పెరట్లో కూరగాయలు, పండ్లు, పూల మొక్కల పెంపకంలో మా తాత గారికి సాయం చేస్తుండేదాన్ని. అప్పట్లో కొబ్బరి పొట్టును ఎరువుగా వేసేవాళ్లం. రుచికరమైన సొంత కూరగాయలు, పండ్లు తిన్న బాల్యానుభవమే పెళ్లయి మద్రాసు వచ్చాక టెర్రస్ ఆర్గానిక్ కిచెన్ గార్డెన్ పెట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది’ అంటున్నారు పాలిన్. మొక్కలకు పోషకాలు అందించేందుకు 23 ఏళ్లుగా ఎన్నో ప్రయోగాలు చేస్తూ, తప్పులు చేస్తూ నేర్చుకున్నానని ఆమె అంటున్నారు. వంటింటి తడి వ్యర్థాలు ఏవైనా సరే మున్సిపాలిటీ వాళ్లకు ఇవ్వకుండా కంపోస్టు తయారు చేసుకుంటూ, ఆ కంపోస్టుతోనే టెర్రస్ మీద కుండీలు, గ్రోబాగ్స్‌లో కూరగాయలు, పండ్లు పండించుకుంటున్నారామె. 3 మట్టి పాత్రలలో (ప్లాస్టిక్ బకెట్లలో కూడా కంపోస్టు చేసుకోవచ్చు) వ్యర్థాలు, మట్టిని పొరలు పొరలుగా వేస్తూ.. రెండు రోజులకోసారి కలియదిప్పుతూ.. పైపైన పుల్లటి మజ్జిగ చిలకరిస్తూ ఉంటే.. 60 రోజుల్లో కంపోస్టు సిద్ధమవుతుందని పాలిన్ తెలిపారు. కుండీలు, గ్రోబాగ్స్‌లో మొక్కలకు నెలకోసారి గుప్పెడు కంపోస్టు వేస్తూ ఉంటానన్నారు. చేపల మార్కెట్‌కు వెళ్లి చేపలు ముక్కలు చేసిన తర్వాత మిగిలిపోయే వ్యర్థాలను తీసుకువచ్చి.. కిలో చేపల వ్యర్థాలకు కిలో బెల్లం కలిపి(నీరు కలపకూడదు).. గాజు పాత్రలో వేసి గట్టిగా మూత పెట్టాలి. 40 రోజులకు మంచి పోషక ద్రవం తయారవుతుంది. అదే ఫిష్ అమినోయాసిడ్. దీన్ని 5ఎం.ఎల్.ను 10 లీటర్ల నీటిలో కలిపి మొక్కలపైన పిచికారీ చేస్తాను, మొక్కల మొదళ్లలో పోస్తాను అన్నారామె. కోడిగుడ్ల పెంకులను పిండి చేసి కాల్షియం కోసం మొక్కలకు వేస్తూ ఉంటారు. తన కిచెన్ గార్డెన్లో ఉన్న 75 కుండీల్లో పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పెంచుకునే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలు, బోన్సాయ్ మొక్కల ఉత్పాదకత చాలా బాగుందని సంతోషంగా చెబుతున్నారు. చెన్నై అనగానే నీటికొరతే గుర్తుకొస్తుంది. అయితే, టెర్రస్ మీద నుంచి వర్షపు నీటిని వృథా పోనియ్యడం లేదు. వాన నీటిని తమ ఇంటి ఆవరణలోని బోరుకు రీచార్జ్ చేసేందుకు వాడుతున్నారు. తద్వారా మండు వేసవిలోనూ నీటి కొరత ఉండటం లేదన్నారు. పర్యావరణ అనుకూల జీవనవిధానాన్ని అనుసరిస్తూ చక్కని ఆరోగ్యదాయకమైన కూరగాయలు, పండ్లు పండించుకొని తినడంతోపాటు నీటి సంరక్షణ చేస్తూ పాలిన్, గోపి నటరాజన్ దంపతులు నగరవాసులకే ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ స్పృహతో నాగరికతకు సరికొత్త అర్థం చెబుతున్నారు. గోపి, పాలిన్ శ్యామ దంపతులు -
చలికాలపు ఇంటిపంటలు
చలికాలంలో ఇంటిపెరట్లో, మేడపైన సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసుకోదగిన ప్రత్యేక కూరగాయ రకాలు కొన్ని ఉన్నాయి. ఆకుకూరలను ఏడాదిలో ఎప్పుడైనా సాగు చేసుకోవచ్చు. వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలూ/బీన్స్, క్యాబేజ్, క్యాలీ ఫ్లవర్, కాప్సికం, ఉల్లి, ముల్లంగి, వంగ, క్యారట్, టమాట, గోరుచిక్కుడు, పాలకూర, మెంతికూర వంటి రకాలను ఈ సీజన్లో నిక్షేపంగా సాగు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలం సుదీర్ఘంగా కొనసాగడం వల్ల శీతాకాలపు పంటలకు సంబంధించి ఇప్పుడు నారు పోసుకోవడం కన్నా.. దగ్గరల్లోని నర్సరీల నుంచో, సీనియర్ ఇంటిపంటల సాగుదారుల నుంచో మొక్కల నారును తెచ్చుకొని నాటుకోవడం మేలు. ఈ సీజన్లో కుండీలు, మడుల్లో మొక్కలకు నీరు అంత ఎక్కువగా అసవరం ఉండదు. తేమను బట్టి తగుమాత్రంగా నీటిని అందించుకోవడం అవసరమని ఇంటిపంటల సాగుదారులు గుర్తించాలి. -
ఇంటిపై ఆరోగ్య పంట!
గ్రామాలు కూడా కాంక్రీట్ జంగిళ్లుగా మారిపోతున్న నేపథ్యంలో రసాయనిక పురుగుమందుల అవశేషాలు లేని కూరగాయలు, ఆకుకూరలను తమ ఇంటిపైన సిమెంటు మడుల్లో పండించుకుంటున్నారు కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన బిళ్లా వెంకటేశ్వరరావు(93934 36555), రామతులసి దంపతులు. బీసీ కాలనీలో 3 సెంట్ల స్థలంలో మూడేళ్ల క్రితం వారు రెండంతస్తుల ఇల్లు నిర్మించుకున్నారు. సేంద్రియ ఇంటిపంటల సాగు పద్ధతులు, తద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పత్రికలు, టీవీ ప్రసారాల ద్వారా తెలుసుకున్న వెంకటేశ్వరరావు ఇంటి పంటల సాగుపై దృష్టి పెట్టారు. రెండేళ్ల క్రితం డాబాపైన రెండు అడుగుల ఎత్తు, అడుగున్నర వెడల్పు, మూడు–పది అడుగుల పొడవైన సిమెంటు తొట్లు కట్టించారు. వాటి పైన కొంత ఎత్తులో తుప్పుపట్టని తీగతో పందిరి ఏర్పాటు చేయించుకున్నారు. ఎర్రమట్టి, నల్లమట్టి, మాగిన పశువుల ఎరువు కలిపిన మిశ్రమాన్ని నింపి, అందులో అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డాబాపై గోరుచిక్కుడు, టమాట, కాకర, బెండ, వంగ, మిర్చితోపాటు పొట్ల, బీర, సొర వంటి తీగజాతి కూరగాయలు సాగు చేస్తున్నారు. తోటకూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, గోంగూరను సేంద్రియ పద్ధతుల్లో పెంచుకొని తాజాగా వండుకొని తింటూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తుండడం విశేషం. – ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు బిళ్లా వెంకటేశ్వరరావు, రామతులసి -
ఇంటిపంటలకు బలవర్థకం
సేంద్రియ ఇంటిపంటలను మనసు పెట్టి సాగు చేసే అనుభవజ్ఞులు కొత్త ఆలోచిస్తూ, కొత్త కొత్త ద్రావణాలు తయారు చేసి వాడుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ కోవలోని వారే పినాక పద్మ శ్రీనివాస్ దంపతులు. హైదరాబాద్ మియాపూర్‌లో 850 చదరపు అడుగుల మేడ మీద దగ్గర దగ్గరగా పేర్చిన 500 కుండీలు, టబ్‌లు, గ్రోబాగ్స్‌లో దట్టమైన ఇంటిపంటల అడవినే సృష్టించారు. మండు వేసవిలోనూ షేడ్‌నెట్ అవసరం లేకుండా ఇంటిపంటలను చల్లగా సాగు చేసుకుంటున్నారు. పోషక లోపం రాకుండా చూసుకోవడం విజయవంతంగా ఇంటిపంటల సాగుకు ఒకానొక కీలకాంశం. ఇందుకోసం పద్మ శ్రీనివాస్ కోడిగుడ్లు+నూనెల ద్రావణాన్ని వాడుతున్నారు. ఆమె మాటల్లోనే.. ‘‘వేపనూనె + కొబ్బరి నూనె + రైస్ బ్రాన్ (బియ్యం తవుడు) ఆయిల్.. ఈ నూనెలన్నీ కలిపి 150 ఎం.ఎల్. తీసుకోవాలి. ఈ నూనెలను తొలుత మిక్సీ జార్లో పోసి గ్రైండ్ చెయ్యాలి. ఆ తర్వాత రెండు కోడిగుడ్లు పగులగొట్టి జార్లో పోసి.. మళ్లీ గ్రైండ్ చెయ్యాలి. తర్వాత ఒక గ్లాస్ నీటిని పోసి మళ్లీ గ్రైండ్ చెయ్యాలి. అంతే.. కోడుగుడ్లు + నూనెల ద్రావణం రెడీ. ఈ ద్రావణాన్ని డ్రమ్ములోని వంద లీటర్ల నీటిలో కలిపి.. ఆ నీటిని మొక్కలకు మట్టిలో ఉదయం వేళలో పోయాలి. సాయంత్రం పోస్తే ఆ వాసనకు పందికొక్కులు మట్టి తవ్వేస్తాయి. సాధారణంగా రోజూ పోసే నీటికి బదులు, అదే మోతాదులో, ఈ ద్రావణాన్ని పోయాలి. నేను 15 రోజులకు ఒకసారి మొక్కల మొదళ్లలో ఈ ద్రావణం పోస్తున్నాను. అప్పుడప్పుడూ లీటరు నీటికి 5 ఎం.ఎల్. కోడిగుడ్డు+నూనెల ద్రావణాన్ని కలిపి మొక్కలపై పిచికారీ కూడా చేస్తాను. అవే నూనెలు ప్రతిసారీ వాడకూడదు. మార్చుకోవాలి. ఆవ నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూ¯ð ల్లో ఏదో ఒక నూనెను మార్చి మార్చి కలుపుకోవాలి. ఈ ద్రావణం వల్ల మొక్కలు దృఢంగా, గ్రీన్‌గా, కాయలు కూడా పెద్దగా పెరుగుతాయి. చీడపీడలు కూడా ఆశించవు. కోడిగుడ్లు, రకరకాల నూనెల్లోని పోషకాలతో కూడి ఉన్నందువల్ల ఈ ద్రావణం మొక్కలు, చెట్లకు ఒకవిధంగా బూస్ట్ లాగా పనిచేస్తుంది. దీన్ని తయారు చేసుకున్న రోజునే వాడాలి. మరో రకం ద్రావణం కూడా వాడుతుంటాను. వేరుశనగ చెక్క అర కేజీ, ఆవాల చెక్క అర కేజీ, బెల్లం 200 గ్రాములు వేసి కలిపి 20 లీటర్ల నీటిలో కలిపి.. ఆ ద్రావణాన్ని 3 రోజులు పులియబెడతాను. 5 లీటర్ల ద్రావణాన్ని వంద లీటర్ల నీటిలో కలిపి మొక్కలకు పోస్తుంటాను.’’ – పినాక పద్మ శ్రీనివాస్ (94406 43065), మియాపూర్, హైదరాబాద్ -
ఇంటిపైనే పచ్చని ఔషధ వనం!
మచిలీపట్నం రాజుపేటకు చెందిన యువకుడు అన్నా మణిరత్నం తమ ఇంటిపైన ఔషధ, ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కల వనాన్ని సృష్టించారు. మేడపైన కుండీలు, టబ్‌లలో జీవామృతంతో సేంద్రియ ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. మేడపైకి అడుగుపెడితే సువాసనలు వెదజల్లుతాయి. నాటిన ప్రతీ మొక్క ఆయర్వేద వైద్యంలో ఉపయోగపడేదే. అక్కడ ఉన్న మొక్కలతో తయారు చేసే మందులతో చాలా రకాలైన వ్యాధులను నయం చేయవచ్చని చెబుతున్నారు మణిరత్నం. అక్కడ కనిపించే ప్రతీ మొక్కలోనూ ఓ పరమార్థం కనిపిస్తోంది. వాయు కాలుష్యాన్ని పారదోలి ఆరోగ్యదాయకమైన గాలిని పొందడంతోపాటు ఔషధ మొక్కల ఆకులతో ఇంటిల్లి్లపాదీ రోజుకో రకం కషాయం సేవిస్తూ ఆరోగ్యంగా ఉన్నామని మణిరత్నం అన్నారు. రసాయనిక అవశేషాల్లేని ఆకుకూరలు, కూరగాయలతోపాటు పండ్లను సైతం 2017 నవంబర్ నుంచి సాగు చేస్తున్నారు. సీఏ చదివిన మణిరత్నం ఆరోగ్యపరిరక్షణకు అవసరమయ్యే వివిధ రకాల ఆయుర్వేద మొక్కలను పెంచుతుండడంతో అమ్మ కృష్ణవేణి, నాన్న ఆంజనేయులు ప్రోత్సహించారు. వారూ మొక్కల పెంపకంలో భాగస్వాములు కావటంతో వారి ఇంటి పరిసరాలు ఔషధ మొక్కల సువాసనలతో నిండిపోతోంది. ప్లాస్టిక్ డబ్బాలు, మట్టి కుండలు, బక్కెట్లలో మట్టి, సేంద్రియ ఎరువు నింపి మొక్కలు పెంచుతున్నారు. 675 చదరపు అడుగుల డాబాపైన సుమారుగా 70కు పైగానే వివిధ రకాల ఆయుర్వేద మొక్కలను పెంచుతున్నారు. అడ్డసరం, మల్టీవిటమిన్ప్లాంట్, ఇన్సులిన్ ప్లాంట్, పొడపత్రి, గుగ్గులు, గలిజేరు, అవిశ, రణపాల, కొండపిండి ఆకు, కాడ జెముడు, నిమ్మగడ్డి, సిట్రోనెల్ల, నేల ఉసిరి, తుర్కవేప, వాము ఆకు, వావిలి ఆకు, గుంటగలకరాకు, వెన్న ముద్దాకు, నేలవేము, కలబంద, నల్లేరు, తుంగమస్తులు, సిందూరం, కుందేటి చెవి వంటి ఆయుర్వేద మొక్కలే కాకుండా పండ్ల మొక్కలు, సుగంధాలను వెదజల్లే మొక్కలను అక్కడ పెంచుతున్నారు. వీటì తో తయారు చేసే ఔషధాలతో దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేయవచ్చని, అవగాహన కోసం అధ్యయనం చేస్తున్నానని మణిరత్నం అంటున్నారు. జీవామృతం ప్రతి 15 రోజులకోసారి పిచికారీ చేయడం, నీటిలో కలిపి కుండీల్లో పోయడం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. రాలిన ఆకులు, చెత్తను డ్రమ్ములో వేసి ఎరువు తయారు చేస్తున్నారు. – కోవెల కాశీ విశ్వనాథం, సాక్షి, మచిలీపట్నం ఆరోగ్యం.. ఆహ్లాదం.. మొక్కలంటే ఇష్టం. వాటిని ప్రేమతో చూసుకుంటున్నాను. ఉదయపు నీరెండకు మిద్దె తోట పనులు చేసుకుంటే చాలు. వాకింగ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. రసాయనిక అవశేషాల్లేకుండా ఇంటిపట్టున పెంచుకునే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతోపాటు ఔష«ధాలు, కషాయాలు ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేస్తాయి. ఇంటిల్లపాదికీ ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందించే ఇంటిపంటల సాగుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని ఆచరించాలి. – మణిరత్నం (88853 82341), రాజుపేట, మచిలీపట్నం రణపాల మొక్కతో... -
నలుగురి కుటుంబానికి 49 మీటర్ల పెరటి తోట!
జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్) హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఉంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్తలు, అధికారులు, స్టార్టప్స్ ఏర్పాటు చేసుకునే యువతీ యువకులు.. ‘మేనేజ్’లో వివిధ అంశాలపై ఏటా వందలాది మంది శిక్షణ పొందుతూ ఉంటారు. వీరికి సేంద్రియ ఇంటిపంటలపై అవగాహన కలిగించేందుకు.. జెండర్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో సేంద్రియ ఇంటిపంటలపై ‘మేనేజ్’ ఆవరణలో నమూనా ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేశారు. 2016 డిసెంబర్ నుంచి మోడల్ వెజిటబుల్ గార్డెన్, మోడల్ బాల్కనీ గార్డెన్‌ను పెంచుతున్నారు. అర్బన్ అగ్రికల్చర్ విభాగంలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యాననిపుణురాలు నాగరాణి ఈ నమూనా ప్రదర్శనా క్షేత్రాలను పర్యవేక్షిస్తున్నారు. నలుగురి కుటుంబానికి (7 మీటర్ల పొడవు“7 మీటర్ల వెడల్పు) 49 చదరపు మీటర్ల పెరట్లో ఏడాది పొడవునా కుటుంబానికి సరిపోయే అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవచ్చని తమ అధ్యయనంలో నిర్థారణ అయ్యిందని నాగరాణి ‘సాక్షి’కి తెలిపారు. ఈ 49 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రణాళికాబద్ధంగా సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకుంటే.. రోజుకు 250 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు కూరగాయల దిగుబడి వస్తుందన్నారు. టమాటా, వంగ, మిరప, కాప్సికం, ఎర్రముల్లంగి, బీట్రూట్, బీన్స్, బెండ, మునగ, నేతిబీర, కాకర, క్యాబేజి తదితర 20 రకాల కూరగాయలు, 7 రకాల ఆకుకూరలతోపాటు అరటి చెట్లు వేర్వేరు మడుల్లో సాగు చేస్తున్నారు. ప్రతి మడి 2 మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. టమాటా వంటి ఎక్కువగా వాడే కూరగాయ మొక్కలు ఎక్కువ లైన్లలో నాటుతామని నాగరాణి వివరించారు. దశల వారీగా విత్తుకోవాలి.. ఇనుప మెష్‌తో కంచె వేసిన ఈ పెరటి తోట పెంచుతున్న భూమి అంతగా సారం లేని గ్రావెల్ మాదిరి భూమి కావడంతో ప్రారంభంలో 2 ట్రక్కుల ఎర్రమట్టి తోలించి, మాగిన పశువుల ఎరువు కలిపి మడులు చేశారు. ఏడాది పొడవునా నిరంతరం కూరగాయలు అందుబాటులో ఉండాలంటే దశలవారీగా పంటలు విత్తుకోవడం లేదా మొక్కలు నాటడం చేయాలని ఆమె అన్నారు. టమాటా, మిర్చి, వంగ వంటి కూరగాయ పంటలు విత్తిన 50–60 రోజుల్లో పూత, కాపు ప్రారంభమవుతుంది. 3–4 నెలలు దిగుబడి వస్తుంది. ప్రస్తుత పంట నెలన్నరలో కాపు అయిపోతుందనగా.. మరో దఫా నారు పోసుకోవాలి లేదా విత్తుకోవాలి. 25 రోజుల నారును తీసి వరుసల్లో నాటుకోవాలి. ప్రతి మడిలోనూ పంట మార్పిడి పాటించాలి. వేసిన పంటే మళ్లీ వేయకూడదు. పంట మార్చిన ప్రతి సారీ వర్మీకంపోస్టు , పశువుల ఎరువు కలగలిపిన మిశ్రమం కొంత వేస్తూ ఉంటే పంటలకు పోషకాల లోపం రాదు. పంటకు ప్రతి పది రోజులకోసారి సేంద్రియ ఎరువులు కొంచెం వేస్తే మంచి దిగుబడులు వస్తాయని నాగరాణి అంటారు. 15 రోజులకోసారి జీవామృతం.. వర్మీవాష్.. జీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి 1:10 నిష్పత్తిలో నీటిలో కలిపి పొదుల్లో పోస్తామని నాగరాణి తెలిపారు. అదేవిధంగా ప్రతి 15 రోజులకోసారి జీవామృతం లేదా వర్మీ వాష్ అదొకసారి ఇదొకసారి పిచికారీ చేస్తున్నారు. రసం పీల్చే పురుగులను అరికట్టడానికి పసుపు, నీలం రంగు జిగురు అట్టలు రెండిటిని పెరటి తోటలో పెట్టుకోవాలి. లింగాకర్షక బుట్టలను ఏర్పాటుచేసుకుంటే కూరగాయ పంటలను ఆశించే లద్దె పురుగును అరికట్టవచ్చు. వేసవిలో కన్నా వర్షాకాలంలో పురుగు ఉధృతి ఎక్కువ, వేసవిలో తక్కువగా ఉంటుందని నాగరాణి తెలిపారు. చీడపీడల నియంత్రణకు అవసరాన్ని బట్టి నాణ్యమైన వేప నూనె లీటరుకు 5–7 ఎం.ఎల్. కలిపి పిచికారీ చేస్తారు. పురుగు మరీ ఉధృతంగా ఉంటే అగ్ని అస్త్రం ద్రావణాన్ని 10 లీటర్ల నీటికి 200 ఎం.ఎల్. చొప్పున కలిపి పిచికారీ చేస్తామన్నారు. మోడల్ బాల్కనీ గార్డెన్ 6 మీటర్లు “ 4 మీటర్ల విస్తీర్ణంలో మోడల్ బాల్కనీ గార్డెన్‌ను కూడా నాగరాణి నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ కుండీలు, గ్రోబాగ్స్, వర్టికల్ టవర్లలో కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్నారు. 20% కొబ్బరిపొట్టు + 40% ఎర్రమట్టి + 20% మాగిన పశువుల ఎరువు కలిపి తయారు చేసుకున్న మట్టి మిశ్రమాన్ని వాడుతున్నట్లు నాగరాణి వివరించారు. మేకల ఎరువుకు వేడి లక్షణం ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో మొక్కలకు వేయకూడదు. చలికాలంలో మాత్రమే మేకల ఎరువు వాడాలి. పశువుల ఎరువు ఎప్పుడైనా వాడొచ్చు. 8 అంగుళాల ఎత్తుండే పాలీ బ్యాగ్ ఆకుకూరల సాగుకు సరిపోతుంది. కూరగాయ మొక్కలకు 18 అంగుళాల ఎత్తు, 12 అంగుళాల వ్యాసార్థం కలిగిన పాలీ బ్యాగ్ వాడితేనే ఎక్కువ కాలం కాపు వస్తుంది. 30% షేడ్‌నెట్ హౌస్‌లో కూరగాయల ఉత్పాదకత ఆరుబయట కన్నా ఎక్కువగా వస్తుందని నాగరాణి తెలిపారు. అడుగున్నర ఎత్తు, అడుగు వ్యాసార్థం ఉన్న గ్రోబాగ్‌లో టమాటా మొక్కలు నాటి షేడ్‌నెట్ హౌస్‌లో ఉంచితే వారానికి 500–750 గ్రాముల టమాటాల దిగుబడి, 3 నెలల పాటు వస్తుందన్నారు. సాధారణ ఆకుకూరల్లో కన్నా మైక్రోగ్రీన్స్‌లో 40% అధికంగా పోషకాలు లభిస్తాయని నాగరాణి (97030 83512) అంటున్నారు. 49 చ.మీ.ల నమూనా పెరటి తోట షేడ్‌నెట్ హౌస్‌లో టమాటో మొక్కలు -
ఒక్క బ్యారెల్ = 60 కుండీలు!
వర్టికల్ టవర్ గార్డెన్‌ను మీరే తయారు చేసుకోవచ్చు.. వర్టికల్ టవర్ గార్డెన్ ఇంటిపంటల సాగుదారులకు చాలా ఉపయోగకరం. మేడ మీద లేదా బాల్కనీలో, ఇంటి పెరట్లో అతి తక్కువ స్థలంలో (కనీసం 4 గంటలు ఎండ తగిలే చోట) ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కో బారెల్లో 60 రకాల ఆకుకూరలు, కూరగాయలు, కషాయాల కోసం ఔషధ మొక్కలను పెంచుకోవచ్చు. బారెల్ మధ్యలో ఉండే పీవీసీ పైపులో వంటింటి వ్యర్థాలు వేస్తూ.. వర్మీ కంపోస్టును కూడా తయారు చేసుకోవచ్చు. ఈ టవర్ గార్డెన్లను సేంద్రియ ఇంటిపంటలపై ఆసక్తి, ఓపిక ఉన్న వారు తమంతట తాము తయారు చేసుకోవచ్చు. అదెలాగో వర్టికల్ టవర్ గార్డెన్ నిపుణులు రవి చంద్రకుమార్ వివరిస్తున్నారు. మార్కెట్లో దొరికే 300 లీటర్ల లేదా 250 లీటర్ల హెచ్.డి.పి.ఇ. బారెల్ తీసుకోవాలి. బారెల్ పొడవు 36 అంగుళాలు. బారెల్‌కు చుట్టూతా 5 అంగుళాలకు ఒక చోట కత్తిరిస్తే (దీన్నే పాకెట్ అని పిలుస్తున్నాం).. 7 వరుసల్లో పాకెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అడ్డంగా ఒక్కొక్క పాకెట్ వెడల్పు 5 అంగుళాలు ఉండేలా కొలత స్కేల్‌తో మార్క్ చేసుకోవాలి. రెండు పాకెట్ల మధ్య 4 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. ఒక వరుసలో 8 పాకెట్లు వస్తాయి. 7 వరుసల్లో మొత్తం 56 పాకెట్లు వస్తాయి. బారెల్ పై భాగాన 4 మొక్కలు పెట్టవచ్చు. అన్నీ కలిపి 60 మొక్కలు పెట్టుకోవచ్చు. అంటే ఒక బారెల్ 60 కుండీలతో సమానం అన్నమాట! పాకెట్లు ఎక్కడ పెట్టుకోవాలో మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసిన చోట బారెల్ను డ్రిల్ మెషిన్‌తో కత్తిరించి చిల్లు పెట్టాలి, జిగ్సా రంపం పట్టడం కోసం. జిగ్సా తో వరుసల్లో మార్క్ చేసిన చోట్ల 5 అంగుళాల వెడల్పున కట్ చేయాలి. పాకెట్ మౌల్డింగ్ చేసే విధానం.. హీట్ గన్‌తో కట్ చేసిన ప్రదేశంలో హీట్ చేయాలి. తగిన హీట్ అయిన తరువాత ఆ ప్రదేశంలో చిత్రంలో చూపిన విధంగా సిమెంటు దిమ్మె అమర్చాలి. అలా అన్ని పాకెట్లను తయారు చేయాలి. బారెల్ అడుగు భాగంలో మధ్యన 4 అంగుళాల రంధ్రం చేయాలి. పక్కన అర అంగుళం రంధ్రం చేయాలి. అధిక నీరు బయటకు వెళ్లడానికి అక్కడ గ్రోమేట్ పెటి టేకాహ్ అమర్చాలి. మధ్యలో 4 అంగుళాల పీవీసీ గొట్టం అమర్చాలి. గొట్టం చుట్టూ చిల్లులు పెట్టాలి. గొట్టం అమర్చే విధానం.. ఆ గొట్టాన్ని క్రింది భాగాన 6 అంగుళాలు బయటకు ఉండేలా అమర్చి.. అక్కడ ఎంసీల్‌తో అతకాలి. పై భాగాన జీయే వైరుతో కట్టాలి. 4 అంగుళాల గొట్టానికి పైన, కింద మూతలు అమర్చాలి. ఈ బారెల్ను నిలబెట్టడానికి ఇనుప స్టాండ్‌ను తయారు చేసుకోవాలి. స్టాండ్ 18 అంగుళాల పొడవు, 18 అంగుళాల వెడల్పు, 10 అంగుళాల ఎత్తు ఉండాలి. వర్టికల్ గార్డెన్లో కంపోస్టు తయారు చేసే విధానం– వర్మీ కంపోస్టు 30%, రంపపు పొట్టు 30%, పశువుల ఎరువు 30%, వేప గింజల చెక్క 10%.. ఇవన్నీ కలిపి బారెల్లో సరిపడినంత నింపుకోవాలి. బారెల్ మధ్యలో అమర్చిన గొట్టంలో వంటింటి వ్యర్థాలు వేయాలి. అందులో చక్కటి వర్మీకంపోస్టు తయారవుతుంది. స్టాండ్ మీద వర్టికల్ గార్డెన్‌ను అమర్చుకున్న తర్వాత.. అందులో కంపోస్టు మిశ్రమాన్ని నింపుకోవాలి. బారెల్ చుట్టూ ఉన్న అరలలో విత్తనాలు నాటుకోవాలి. ఒక్కో వర్టికల్ గార్డెన్ టవర్‌ను తయారు చేసుకోవడానికి (బారెల్, స్టాండ్, టవర్, కంపోస్టు, విత్తనాలు.. అన్నీ కలిపి) రూ. 5 వేలు ఖర్చవుతుంది. వర్టికల్ టవర్‌కు రోజుకు కనీసం 4 గంటలు ఎండ తగిలే చోట పెట్టుకోవాలి. ఇందులో అన్ని రకాల ఆకుకూరలు, ఔషధ మొక్కలు చక్కగా పండించవచ్చని రవిచంద్ర కుమార్ (95812 42255) తెలిపారు. -
కేరళ వంగ భలే రుచి..!
ఇది ఎంతో రుచికరమైన వంగ రకం. దీని పేరు వెంగెరి వంగ. కాయ సన్నగా పొడుగ్గా ఉంటుంది కాబట్టి ‘అమితాబ్ బచ్చన్’ వంగ రకం అని చమత్కరిస్తుంటారు. హైదరాబాద్ మెహదీపట్నానికి చెందిన ఇంటిపంటల సాగుదారు వి.ఎం. నళిని తన మేడపై ఐదారు రకాల వంకాయలను సాగు చేసుకుంటున్నారు. 15“15 అంగుళాల సైజులోని మూడు కంటెయినర్లలో వెంగెరి రకం వంగ మొక్కలను ఆమె పెంచుతున్నారు. ఆరోగ్యంగా, పొడవుగా పెరిగిన ఈ వంకాయలు ఆమె ఇంటిపంటలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇది కేరళకు చెందిన దేశీ వంగ రకమని, కొన్నాళ్ల క్రితం బెంగళూరులో ఇంటిపంటల సాగుదారుల విత్తన మార్పిడి సమావేశంలో పాల్గొన్నప్పుడు ఎవరో తనకు ఈ విత్తనాలు ఇచ్చారని నళిని తెలిపారు. కొన్ని కాయలను విత్తనాలకు ఉంచి, బంధుమిత్రులకు పంపిణీ చేస్తానని ఆమె అన్నారు. -
టవర్ గార్డెన్ భేష్!
తక్కువ స్థలంలో ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలనే కాదు కషాయాల కోసం అనేక రకాల ఔషధ మొక్కలను సైతం పెంచుకోవడానికి వీలు కల్పించే ఉపాయం ‘టవర్ గార్డెన్’. దీన్నే వర్టికల్ గార్డెన్, వర్టికల్ టవర్ అని కూడా పిలుచుకోవచ్చు. 2 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ టవర్ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి చుట్టూతా 60 ప్యాకెట్లు ఉంటాయి. వాటిల్లో 60 మొక్కలు పెంచుకోవచ్చు. బాల్కనీలలో, మేడ పైన, ఇంటి ముందు, ఇంటి వెనుక కొద్దిపాటి ఖాళీ ఉన్నా టవర్ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, ఇందులో మొక్కలు చక్కగా పెరిగి దిగుబడినివ్వాలంటే కనీసం 3 గంటలు ఎండ తగిలే చోటులో దీన్ని పెట్టుకోవాలి. టవర్ గార్డెన్లను పెట్టుకున్న ఇద్దరు హైదరాబాద్ వాసుల అనుభవాలు ఈ వారం ‘ఇంటిపంట’ పాఠకులకు ప్రత్యేకం.. ఒక్కో టవర్ చుట్టూ 60 మొక్కలు మా మిద్దె తోటలో టవర్ గార్డెన్లో ఆకుకూరలు, ఔషధ మొక్కలు పెంచుకుంటున్నాం. ఆకుకూరలను తినడంతోపాటు ఔషధ మొక్కలతో కషాయాలను తాగడం వల్ల కుటుంబం అంతా ప్రయోజనం పొందగలుగుతున్నాం. మా మిద్దె తోటలో ఆరు టవర్ గార్డెన్లు ఉన్నాయి. ఒక్కో టవర్‌కు చుట్టూతా, పైన కలిపి 60 మొక్కలు పెట్టుకోవచ్చు. ఇంటిల్లిపాదికీ ఆకుకూరలు, కషాయాల కోసం గ్రీన్స్, మెడిసినల్ ప్లాంట్స్‌కు కొరత ఉండకుండా ఇవి ఉపయోగపడుతున్నాయి. సదాపాకు కషాయం, గోంగూర కషాయం, పుదీనా కషాయం, మెంతికూర, కొత్తిమీర, పునర్నవ (గలిజేరు), తమలపాకు, తిప్పతీగ, గోధుమ ఆకులు, నల్లేరు, 5 రకాల తులసి (రామ తులసి, జింజిర్ తులసి, లవంగ తులసి, కర్పూర తులసి, మింట్ తులసి), కరివేపాకు, ఉత్తరేణితో పాటు జామ, మామిడి, వేప, రావి, గానుగ, పారిజాతం మొక్కలను కూడా పెంచుకొని వంటల్లోనూ, కషాయాలలోనూ వాడుకుంటూ ఆరోగ్యకరమైన జీవనం సాగిస్తున్నాం. వీటితో పాటు ఖాదర్ గారు చెప్పిన ఐదు రకాల సిరిధాన్యాలను తింటున్నాం. తిన్న అందరిలోనూ మార్పు స్పష్టంగా కనపడుతున్నది. స్థలాభావం ఉన్న ఆరోగ్య ప్రియులందరూ మిద్దె మీద టవర్ గార్డెన్లో ఆకుకూరలు, ఔషధ మొక్కలు పెంచుకునే అవకాశం ఉంది. – బి. రవిచంద్రకుమార్(95812 42255), బ్యాంకు కాలనీ, హైదరాబాద్ వర్టికల్ టవర్‌లో పుష్కలంగా ఆకుకూరలు నాలుగు నెలల క్రితం మా మేడ మీద ఒకటి, ఇంటి వెనుక ఖాళీలో మరొకటి వర్టికల్ టవర్స్ పెట్టాం. టవర్ చుట్టూ 10 ప్యాకెట్లలో తెల్లగలిజేరు, కొన్ని ఎర్ర గలిజేరు మొక్కలు పెట్టాను. తోటకూర, గోంగూర, పాలకూర, చెన్నంగి, పొన్నగంటి, మెంతికూరలు కొన్ని ప్యాకెట్లలో విత్తుకున్నాను. తెల్లగలిజేరు 2 నెలల పాటు వరుసగా పప్పులో వేసుకోవడానికి కొరత లేకుండా వచ్చింది. డా. ఖాదర్ గారు చెప్పినది విన్న తర్వాత గలిజేరు కషాయం కూడా కొన్నాళ్లు తాగాం. నాటు తోటకూర రెండే మొక్కలు ఉన్నా.. వారానికోసారి కూరకు సరిపడా వస్తున్నాయి. విత్తిన పది రోజుల్లోనే మెంతికూర వచ్చింది. 20 రోజులకు పాలకూర రావడం ప్రారంభమైంది, ఇప్పటిMీ వారానికోసారి పుష్కలంగా వస్తోంది. వర్టికల్ టవర్ పైభాగాన 3 వంగ మొక్కలు పెట్టాను. వారానికో కిలో చొప్పున కాయలు వచ్చాయి. ఈ వర్టికల్ టవర్ మధ్యలో నిలువుగా ఉన్న గొట్టంలో వంటింటి వ్యర్థాలను వేస్తూ వర్మీ కంపోస్టును తయారు చేసుకుంటున్నాను. రెండు నెలలకు ఒక కిలో కంపోస్టు వచ్చింది కూడా. వంటింటి వ్యర్థాలను నేరుగా ఇందులో వేయకూడదు. తడి చెత్త, పొడి చెత్తను కలిపి వేస్తే మంచిది. లేదంటే.. కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తొక్కలను వేరే పాత్రలో వేస్తూ 20 రోజుల తర్వాత సగం కుళ్లిన వ్యర్థాలను తీసి ఈ టవర్‌లో వేసి, కొన్ని వానపాములను వేస్తే చాలు. – నోరి శైలజ (99483 36508), సన్‌సిటీ, కీర్తి రిచ్మండ్ విల్లాస్, లంగర్‌హౌజ్, హైదరాబాద్ -
వేసవి ఇంటిపంటలకు నారు పోసుకోవలసిందిప్పుడే!
వేసవి ఇంటి పంటల కోసం కూరగాయల నారు పోసుకోవడానికి ఇది తగిన సమయం. కొబ్బరి పొట్టు, వర్మీకంపోస్టు లేదా కంపోస్టు, మట్టి కలిపిన మిశ్రమంలో నారు పోసుకోవచ్చు. నారు పోసుకునే ట్రే లేదా మడి మరీ ఎక్కువ లోతున మట్టి మిశ్రమం వేయనవసరం లేదు. జానెడు లోతు ఉంటే సరిపోతుంది. మట్టి మిశ్రమాన్ని ట్రేలో నింపిన తర్వాత వేళ్లతో లేదా పుల్లతో సాళ్లు మాదిరిగా చేసుకోవాలి. ఆ సాళ్లలో విత్తనాలు విత్తుకున్న తర్వాత పక్కన మట్టిని కప్పి చదరంగా చేయాలి. విత్తనాలు మరీ లోతున పడకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ట్రే పైన గుడ్డ కప్పాలి. తడి ఆరిపోకుండా చూసుకుంటూ.. నీటిని తేలిగ్గా చిలకరించాలి. మట్టిలో విత్తనాలు నీరు చిలకరించినప్పుడు చెదిరిపోకుండా ఉండాలంటే.. పల్చటి గుడ్డను కప్పి.. దానిపైన నీటిని చిలకరించాలి. చలి ఉధృతంగా ఉంది. కాబట్టి విత్తనం మొలక రావాలంటే కొంత వెచ్చదనం కావాలి. నారు పోసుకునే ట్రే పైన పాలిథిన్ షీట్ చుట్టినట్టయితే 5–7 రోజుల్లో మొలక రావడానికి అవకాశం ఉంటుంది. మొలక వచ్చిన తర్వాత పాలిథిన్ షీట్‌ను తీసేయవచ్చు. వేసవిలో కాపు వచ్చే అవకాశం ఉన్న ఏమేమి రకాల కూరగాయలకు ఇప్పుడు నారు పోసుకోవచ్చు? అన్నది ప్రశ్న. చలికాలంలో మాత్రమే వచ్చే నూల్‌కోల్, క్యాబేజి, కాలీఫ్లవర్ వంటì వాటిని ఇప్పుడు విత్తుకోకూడదు. వంగ (గ్రీన్ లాంగ్, పర్పుల్ లాంగ్, పర్పుల్ రౌండ్, గ్రీన్ రౌండ్), మిర్చి (ఎల్లో కాప్సికం, రెడ్ కాప్సికం, గ్రీన్ చిల్లీ, ఆర్నమెంటల్ చిల్లీ), టమాట (సాధారణ రకం, స్ట్రాబెర్రీ టమాట)తోపాటు.. వెల్లుల్లి రెబ్బలు, ఉల్లి, బ్రకోలి, క్యారట్, స్కార్లెట్ రకాలను ఇప్పుడు టెర్రస్‌పై ట్రేలలో ఇంటిపంటల సాగు కోసం విత్తుకోవచ్చు. వేసవిలో కూరగాయలను పొందాలనుకునే వారు వెంటనే విత్తుకోవాలి. – ఉషారాణి (81217 96299), వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు,రాజేంద్రనగర్, సేంద్రియ ఇంటి పంటల సాగుదారు విత్తనాలను ఇలాకప్పేయాలి, ఇలా విత్తుకోవాలి -
చెక్క పెట్టెల్లో ఎంచక్కా ఇంటిపంటలు!
హైదరాబాద్ మియాపూర్‌లో సొంత భవనంలో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ వక్కలెంక శ్రీనివాసరావు కుటుంబం గత కొన్నేళ్లుగా టెర్రస్‌పై సేంద్రియ ఇంటిపంటలు పండించుకుంటూ ఇంటిల్లపాదీ ఆరోగ్యదాయకమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వాడేసిన చెక్క పెట్టెలను స్వల్ప ధరకే కొనుక్కొచ్చి గార్డెన్‌కు అనుగుణంగా పెట్టెలను తనంతట తానే తయారు చేసుకొని, ప్లాస్టిక్ షీట్ వేసి మట్టి మిశ్రమం నింపి ఇంటిపంటలు పండిస్తుండటం శ్రీనివాసరావు ప్రత్యేకత. 5% ఎర్రమట్టి + 40% కొబ్బరి పొట్టు + 45% ఆవు, గేదె, గుర్రం, గొర్రెల ఎరువులు ఎన్ని రకాలు దొరికితే అవి, వర్మీకంపోస్టు కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుంటున్నారు. చెక్క పెట్టెల వల్ల ఎండ దెబ్బ నుంచి మొక్కలను సులభంగా పరిరక్షించుకుంటున్నారు. తమ కుటుంబానికి అవసరమైన ఆకుకూరలను 100%, కూరగాయలను 60–70% మేరకు ఇంటిపైనే పండించుకుంటున్న శ్రీనివాసరావు (91829 71978) అభినందనీయులు. -
ఉల్లి తప్ప ఏమీ కొనను!
వ్యవసాయ శాఖలో అదనపు సంచాలకురాలిగా పనిచేస్తున్న ఉషారాణి తమ కుటుంబం కోసం ఇంటిపైనే సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సాగు చేస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని రైతు శిక్షణా కేంద్రంలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న ఉషారాణి బిహెచ్ఇఎల్ సమీపంలోని తమ స్వగృహంపై ఇంటిపంటలు సాగు చేస్తూ.. ఉల్లిపాయలు తప్ప ఇతరత్రా అన్నీ తానే పండించుకుంటున్నారు. ఆమె భర్త యలమంద వృత్తిరీత్యా బీహెచ్ఈఎల్ ఇంజినీర్. ఆయన సహాయంతో టెర్రస్‌పై ఇనుప ఊచలతో పందిరిని ఏర్పాటు చేసుకొని తీగజాతి కూరగాయ పాదులను దానిపైకి పాకిస్తూ, నిశ్చింతగా ఇంటిపంటలు పండిస్తున్నారు. 200 లీటర్ల ఫైబర్ డ్రమ్మును మధ్యకు కత్తిరించి రెండు మడులుగా వాడుతున్నారు. వీటితోపాటు ప్లాస్టిక్ కుండీలు, ఖాళీ బక్కెట్లలో కూడా అనేక రకాల ఆకుకూరలతోపాటు కూరగాయలను సాగు చేస్తున్నారు. డ్రమ్ముల అడుగున హాలో బ్రిక్స్ పెట్టడం వల్ల టెర్రస్‌పైన పడిన నీరు వెంటనే పల్లానికి వెళ్లిపోవడానికి వీలవుతోంది. ఎర్రమట్టి, కొబ్బరిపొట్టు, వర్మీకంపోస్టు సమపాళ్లలో వేస్తారు. వేపపిండి, బోన్మీల్, జీవన ఎరువులు కొద్ది మొత్తంలో కలుపుతారు. వంటింటి వ్యర్థాలు, ఎండు పూలతో ఆవు పేడ స్లర్రీని వేసి కంపోస్టును తయారు చేసుకుంటారు. ఈ కంపోస్టును, సముద్రపు నాచుతో తయారైన గ్రాన్యూల్స్‌ను పూత, కాత సమయాల్లో మొక్కలకు అడపా దడపా వేస్తుంటారు. పురుగులు ఏమైనా కనిపిస్తే అవి చిన్నగా ఉన్నప్పుడే పుల్లమజ్జిగ, పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం వంటి వాటిని పిచికారీ చేస్తుంటారు. 6 రకాల వంకాయలను సాగు చేస్తున్నారు. బెండ, వంగ, బంగాళదుంపలు, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి కూరగాయలను సాగు చేస్తున్నారు. దొండ పాదును ఇనుప పందిరిపైకి పాకించలేదు. ఇది బాగా అల్లుకుపోయి ఇతర కూరగాయ మొక్కలను పెరగకుండా చేస్తుందన్న భావనతో ట్రెల్లిస్పైకి పాకించానని ఉషారాణి తెలిపారు. అనేక పండ్ల మొక్కలను కూడా ఆమె సాగు చేస్తున్నారు. స్వీట్ లైమ్, వాటర్ ఆపిల్, అంజూర, నిమ్మ, దానిమ్మ, మామిడి, ప్యాషన్ ఫ్రూట్ తదితర పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. ప్యాషన్ ఫ్రూట్ పాదును ఇంటి ముందు నేలలో నాటి, మేడపైకి పాకించారు. అత్యంత పోషక విలువలున్న ఈ పండ్లు చాలా ఎక్కువ సంఖ్యలో కాస్తున్నాయని ఆమె తెలిపారు. ప్యాషన్ ఫ్రూట్ రసం చాలా రుచికరంగా ఉంటుందన్నారు. ఇంటిపంటలకు అందుబాటులో ఉన్న ఏదో ఒక పోషక పదార్థాన్ని అడపా దడపా వేస్తూ ఉంటే పోషక లోపం లేకుండా మొక్కలు చక్కగా పెరుగుతూ దిగుబడులనిస్తాయని ఆమె అన్నారు. ఆపిల్ బెర్ మొక్క ఒకసారి ఎండిపోయింది. శిలీంద్రనాశిని అయిన ట్రైకోడెర్మా విరిడి పొడిని తెచ్చి మట్టిలో కలిపిన తర్వాత తిరిగి కొత్త చిగుర్లు వేసిందని ఆమె తెలిపారు. కొంచెం ప్రణాళికా బద్ధంగా సీజన్ల వారీగా నార్లు పోసుకుంటూ మొక్కలు నాటుకుంటూ ఉంటే ఏడాది పొడవునా ఇంటిపైనే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను సాగు చేసుకోవడం సులువేనని ఆమె తెలిపారు. ఫిబ్రవరిలో కాపు పొందాలనుకుంటున్న కూరగాయ మొక్కలకు సంబంధించి ఇప్పటికే తాను నారు పోశానన్నారు. భవనానికి ఇంటిపంటల కుండీలు, డ్రమ్ములు బరువై పోతాయని, భవనానికి ఏదైనా నష్టం జరుగుతుందన్న అపోహలు అవసరం లేదని ఆమె అంటారు. వాటర్ ప్రూఫింగ్ చేసిన టెర్రస్‌పైన హాలో బ్రిక్స్ పెట్టుకొని వాటిపై కుండీలు, డ్రమ్ములు పెట్టుకుంటే ఎటువంటి సమస్యా ఉండదని ఉషారాణి (81217 96299) అంటున్నారు. శ్రద్ధ ఉంటే ఇంటిపంటల సాగు కష్టమేమీ కాదని ఆమె అన్నారు. -
హైటెక్ సేద్యానికి చిరునామా!
పట్టణాలు, నగరాలలో నివసించే ప్రజలకు రసాయనిక పురుగుమందుల అవశేషాల్లేని సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను పుష్కలంగా అందుబాటులోకి తేవడానికి అత్యాధునిక పద్ధతుల్లో ఇంటిపంటలను సాగు చేసుకునే పద్ధతులను పట్టణ, నగర ప్రాంతవాసులకు నేర్పించడం తప్ప మరో మేలైన మార్గం లేదు. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విస్తృత పరిశోధనలు సాగుతున్నాయి. హైటెక్ పద్ధతుల్లో తక్కువ స్థలంలో ఇంటిపంటల సాగుపై పరిశోధనల కోసం కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం త్రిస్సూర్‌లో ఐదేళ్ల క్రితమే ప్రత్యేక పరిశోధన, శిక్షణ స్థానాన్నే ఏర్పాటు చేయటం విశేషం. డాక్టర్ పి. సుశీల ఈ కేంద్రానికి అధిపతిగా, ప్రొఫెసర్‌గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ ఇటీవల డాక్టర్ పి. సుశీలను హైదరాబాద్‌కు ఆహ్వానించి ఉద్యాన అధికారులకు, ఇంటిపంటల సాగుదారులకు శిక్షణ ఇప్పించింది. డా. సుశీలతో ‘సాక్షి’ ముచ్చటించింది. కొన్ని ముఖ్యాంశాలు.. ► తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచుకునేందుకు వీలుకల్పించే పాలీకిచెన్ గార్డెన్, చిన్న పాలీహౌస్‌లలో ఇంటిపంటల సాగు, ఓపెన్ ప్రెసిషన్ ఫార్మింగ్, హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్, హైటెక్ కిచెన్ గార్డెన్ టెక్నిక్స్, వర్టికల్ గార్డెనింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, టైరు గార్డెన్స్, లాండ్ స్కేపింగ్ తదితర అంశాలపై డా. సుశీల పరిశోధనలు చేస్తూ వ్యక్తులకు, సంస్థలకు శిక్షణ ఇస్తున్నారు. ► అభ్యర్థుల ఆసక్తి, అవసరాలను బట్టి ఒక రోజు నుంచి నెల, ఆర్నెల్లు, ఏడాది వరకు కాలపరిమితి గల శిక్షణా శిబిరాలను డా. సుశీల నిర్వహిస్తున్నారు. ఈ ఐదేళ్లలో 200 శిక్షణా శిబిరాలను నిర్వహించడం అభినందనీయం. ఆమె ఇప్పటికి 35 పుస్తకాలు, 80 పరిశోధనా పత్రాలు, 500 పాపులర్ వ్యాసాలు రాశారు. 36 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. ► ఈ కేంద్రంలో రూపొందించిన పాలీ కిచెన్ గార్డెన్ ప్రజాదరణ పొందుతున్నదని డా. సుశీల చెప్పారు. 10 చదరపు అడుగుల నుంచి 30 చదరపు అడుగుల చోటులోనే 160 నుంచి 350 మొక్కలు సాగు చేసుకోవడానికి పాలీకిచెన్ గార్డెన్లో వీలుంటుంది. 10 – 20 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెరట్లో లేదా టెర్రస్ మీద ఓపెన్‌గా లేదా చిన్న సైజు పాలీహౌస్ నిర్మించుకొని ఆకుకూరలు, కూరగాయలు పెంచుకోవడానికి పాలీ కిచెన్ గార్డెన్ ఉపయోగపడుతుంది. ► పాలీ కిచెన్ గార్డెన్లో ఫైబర్ డ్రమ్ములకు చుట్టూ మొక్కలు పెంచుకోవటం ఒకటైతే.. ప్లాస్టిక్ గ్రోబ్యాగ్‌ను కూడా డ్రమ్ము మాదిరిగానే మల్టీ టైర్ గ్రోబ్యాగ్గా ఉపయోగించుకునే పద్ధతి మరొకటి. డ్రమ్ము వాడుతున్నప్పుడు వంటింటి వ్యర్థాలను మధ్యలోని పైపులో వేస్తూ ఉంటే.. వర్మీ కంపోస్టుతోపాటు ద్రవ రూప ఎరువు అయిన వర్మీ వాష్‌ను కూడా పొందే వీలుంటుంది. 20 చదరపు అడుగుల పాలీ కిచెన్ గార్డెన్లో నిలువెత్తు మల్టీ టైర్ గ్రోబ్యాగ్స్ రెండిటిని ఏర్పాటు చేసుకుంటే.. వాటి చుట్టూ 250–260 రకాల మొక్కలను కూరగాయ, ఆకుకూర మొక్కలను సాగు చేసుకోవచ్చు. నిలువెత్తు మల్టీ టైర్ గ్రోబ్యాగ్ మధ్యలో పీవీసీ పైపులో కంపోస్టు సదుపాయం ఏర్పాటు చేసుకుంటే, కంపోస్టు తయారు చేసుకుంటూనే దాంట్లో 35–52 మొక్కలు పెంచుకోవచ్చు. ► మల్టీ టైర్ గ్రోబ్యాగ్ / డ్రమ్ముల్లో తోటకూర, పాలకూర, లెట్యూస్, క్యాబేజి, కాళీఫ్లవర్, టమాటో, మిరప, క్యారట్, బీట్రూట్, వంగ వంటి పంటలు పండించుకోవచ్చు. ఇంటిపంటలతోపాటు మైక్రో గ్రీన్స్‌ను కూడా పెంచుకుంటే ఆరోగ్యం మరింత బాగుంటుంది. జానెడు లోతు, వెడల్పుగా ఉండే చిన్న ట్రేలలో వీటిని పెంచుకోవచ్చు. ఈ ట్రేలను ఒక దాని కింద మరొకటి తాళ్లతో వేలాడదీస్తే.. అందులో మైక్రోగ్రీన్స్‌ను వత్తుగా నారు మాదిరిగా, గోధుమ గడ్డి మాదిరిగా పెంచుకోవచ్చు. రెండు వారాల్లో మూడు, నాలుగు అంగుళాలు పెరిగిన తర్వాత కత్తిరించి సలాడ్లలో వాడుకోవచ్చు. ► వీటిని ఏర్పాటు చేసుకోవడానికి కేరళ ప్రభుత్వం రాష్ట్రమంతటా 75% సబ్సిడీపై పట్టణ ప్రాంత ప్రజలకు, రైతులకు కూడా అందిస్తున్నది. పాలీ కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవటం, నిర్వహించడంపై 3 రోజుల శిక్షణా శిబిరాన్ని డాక్టర్ సుశీల నిర్వహిస్తుంటారు. ఆగ్రో సర్వీస్ సెంటర్ల నిర్వాహకులకు, స్వచ్ఛంద సంస్థలకు పది రోజులు శిక్షణ ఇస్తుంటారు. ► మట్టి లేకుండా వట్టి కొబ్బరి పొట్టుతో సాగు (సబ్‌స్ట్రేట్ కల్టివేషన్)పై ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తారు. మట్టి లేకుండా.. నీటిలో పోషకాల ద్రవాన్ని కలుపుతూ మొక్కల వేర్లకు అందించడం ద్వారా కూరగాయలు, ఆకుకూరలు పండించడంపై శిక్షణ ఇస్తారు. దీన్నే హైడ్రోపోనిక్స్ పద్ధతి అంటారు. ఇందులో మూడు రకాలు. న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్, డీప్ వాటర్ కల్టివేషన్, డచ్ బక్కెట్ సిస్టం.. అనే 3 పద్ధతుల్లో హైడ్రోపోనిక్స్ సాగు చేపట్టడంపై డాక్టర్ సుశీల శిక్షణ ఇస్తారు. ► మొక్కలతోపాటు చేపలను కూడా కలిపి పెంచుకోవడమే ఆక్వాపోనిక్స్. ఇందులో మీడియా బెడ్ సిస్టం, డీప్ వాటర్ కల్చర్, న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్‌పై శిక్షణ ఇస్తారు. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో ట్రేలలో పశువుల మేత పెంచుకోవడంపై శిక్షణ ఇస్తున్నారు. విక్ ఇరిగేషన్, ఏరోపోనిక్స్, ఫాగోపోనిక్స్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ తదితర పద్ధతులపై కూడా శిక్షణ ఇస్తారు. ► ఈ అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో తక్కువ చోటులో, తక్కువ శ్రమతో, తక్కువ నీటితో ఎక్కువ పరిమాణంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఆరోగ్యదాయకంగా పండించుకునేందుకు ఉపయోగపడతాయి. ఇంటిపంటల సాగుదారులకు, అదేవిధంగా రైతులకు కూడా ఈ పద్ధతులు అనుకూలంగా ఉంటాయని డా. సుశీల తెలిపారు. ఈ అత్యాధునిక సాంకేతికతలపై శిక్షణ పొందే ఆసక్తి ఉన్నవారు సంప్రదించాల్సిన చిరునామా.. డాక్టర్ పి. సుశీల, ప్రొఫెసర్ అండ్ ప్రాజెక్టు ఇన్చార్జ్, హైటెక్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ యూనిట్, కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కె.ఎ.యు. పోస్ట్, వెల్లనిక్కర, త్రిస్సూర్, కేరళ. మొబైల్ – 99615 33547, suseela1963palazhy@gmail.com మల్టీ టైర్ గ్రోబ్యాగ్‌లలో పాలకూర కనువిందు; వర్టికల్ ఫార్మింగ్‌లో సాగవుతున్న ఆకుకూరలు -
ఇంటిపంటలపై రేపు ఉద్యాన శాఖ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్
నగర, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు (అర్బన్ ఫార్మింగ్)పై పెరుగుతున్న ఆసక్తి దృష్ట్యా ప్రజల్లో అవగాహన పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ ఈ నెల 24న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు జీడిమెట్ల విలేజ్(పైపులరోడ్డు)లోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనుంది. అర్బన్ ఫార్మింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్స్ తదితర అంశాలపై కేరళకు చెందిన నిపుణురాలు డాక్టర్ సుశీల శిక్షణ ఇస్తారు. 25 మంది సీనియర్ ఇంటిపంటల సాగుదారులు తమ అనుభవాలను వివరిస్తారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, ఉద్యాన శాఖ ప్రధాన కార్యదర్శి పార్థసారథి, విశ్రాంత ఐఏఎస్ అధికారి మోహన్ కందా పాల్గొంటారని ఉద్యాన కమిషనర్ ఎల్. వెంకట్రామ్రెడ్డి తెలిపారు. ప్రవేశం ఉచితం. ఆసక్తిగలవారు 79977 24936, 79977 24983, 79977 24985 నంబర్లకు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవచ్చు. -
ఆరోగ్యం.. ఆహ్లాదం..
‘సాక్షి’లో వారం వారం ‘ఇంటిపంట’ల సాగుపై ప్రచురితమవుతున్న కథనాలతో స్ఫూర్తి పొందిన దంపతులు తమ ఇంటిపైన గత 4 నెలలుగా సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలను సాగు చేసుకుంటున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లుకు చెందిన బిళ్లా వెంకటేశ్వరరావు, రామతులసి దంపతులు గ్రామంలోని బీసీ కాలనీలోని తమ డాబాపై ఇంటి పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. డాబాపై సుమారు సెంటున్నర ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో సెంటు మేరకు ఇంటి పంటల సాగుకు కేటాయించారు. శ్లాబుపైన మూడు వరుసలుగా ఎత్తు మడులు(గాడులు) నిర్మించారు. వీటిలో తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, పొదీనా విత్తనాలు చల్లారు. వంగ, బెండ, గోరుచిక్కుడు, టమోట మొక్కలు నాటారు. అక్కడక్కడా తొట్లను ఏర్పాటుచేసి బీర, కాకర, దోస, పొట్ల, సొర విత్తనాలు నాటారు. నాలుగు నెలల క్రితం నాటిన విత్తనాలు ప్రస్తుతం కాపు నిస్తున్నాయి. – ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు రోజుకు గంట చాలు సాక్షిలో కథనాలు చదివిన తర్వాత మా డాబాపైనా ఖాళీ స్థలం ఉంది కదా మనమూ పండించుకుందాం అన్న ఆలోచన వచ్చింది. రసాయనిక పురుగు మందులు, ఎరువులు వాడకుండా సేంద్రియ కూరగాయలు పండించుకుంటున్నాం. మేం తినటమే కాకుండా ఇరుగు, పొరుగు వారు, బంధువులు, స్నేహితులకు కూడా కూరగాయలు ఇస్తున్నాం. ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక అర్థగంట మొక్కలతో గడిపితే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. బడలిక, ఒత్తిడి పోతుంది. – రామతులసి, వెంకటేశ్వరరావు (93934 36555) దంపతులు -
మోడల్ టెర్రస్ కిచెన్ గార్డెన్!
మేడ మీద నాలుగు పూల మొక్కలు పెంచుకునే ఒక సాధారణ గృహిణి.. ఏకంగా ముప్పై రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతోపాటు నాటు కోళ్లను సైతం సునాయాసంగా సాగు చేసుకునే సేంద్రియ ఇంటిపంటల నిపుణురాలిగా మారిపోయారు! ‘సాక్షి’ ఏడేళ్ల క్రితం ప్రారంభించిన ‘ఇంటిపంట’ ప్రచారోద్యమంతోపాటు ఫేస్బుక్లో ఇంటిపంట గ్రూప్ ఆమెకు ప్రేరణ, మార్గదర్శి కావటం విశేషం!! ఆమె పేరు వి. ఎం. నళిని, మెహదీపట్నం(హైదరాబాద్). తమ రెండంతస్తుల మేడ పైన 1300 చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తిస్థాయి ఇంటిపంటల జీవవైవిధ్య క్షేత్రాన్ని నిర్మించుకున్నారు. బాల్యం నుంచీ పూల మొక్కలపై మక్కువ కలిగిన నళిని.. మెట్టినింటి మేడ మీద పూల మొక్కలను పెంచుకుంటూ ఉండేవారు. ఆ దశలో సాక్షిలో సేంద్రియ ఇంటిపంట కాలమ్ గురించి, ఫేస్బుక్లో ఇంటిపంట గ్రూప్ గురించి తెలుసుకొని పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు సాగుపై దృష్టిపెట్టారు. ఇనుప స్టాండ్లపై 300 గ్రోబాగ్స్, కుండీలు.. తండ్రి న్యాయవాది, భర్త ఇంజనీరు. వ్యవసాయ నేపథ్యం లేకపోయినప్పటికీ, కంపోస్టు నుంచి చీడపీడల యాజమాన్యం వరకు ఒక్కో విషయం నేర్చుకున్నానని నళిని తెలిపారు. ఇంటిపంట మిత్రబృందం అడపా దడపా కలుసుకొని విత్తనాలు, మొక్కలు పంచుకోవడం, అనుభవాలు కలబోసుకోవడం ద్వారా ఆమె తన గార్డెన్‌ను పరిపూర్ణమైన మోడల్ టెర్రస్ కిచెన్ గార్డెన్‌గా ఆహ్లాదకరంగా, ముచ్చటగా తీర్చిదిద్దుకోవడం విశేషం. చిన్నా పెద్దా అన్నీ కలిపి 300కు పైగా సిల్పాలిన్ గ్రోబాగ్స్, టబ్‌లలో 22 రకాల పండ్ల మొక్కలు, 10 రకాల ఆకుకూరలు, 8 రకాల కూరగాయలు, ఐదారు రకాల తీగ జాతి కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇనుప స్టాండ్లపైన గ్రోబాగ్స్‌ను ఏర్పాటు చేయడంతో.. టెర్రస్‌పై పడిన నీరు, ఆకులు అలములను సులభంగా శుభ్రం చేసుకోవడానికి వీలుగా ఉంది. మూడు వైపులా కొంత భాగంలో షేడ్‌నెట్ వేశారు. నీడను ఇష్టపడే మొక్కలు, తీగజాతి పాదులను దీనికింద పెంచుతున్నారు. గత ఏడాది నుంచి రెండు గూళ్లలో కింద నాటు కోళ్లను, పైన లవ్‌బర్డ్స్‌ను పెంచుతున్నారు. అరుదైన జాతులు.. అనేక రకాలు.. ఒకే జాతి పండ్లు/కూరగాయల్లో అనేక రకాల మొక్కలను నళిని శ్రద్ధగా సేకరించి సాగు చేస్తున్నారు. వంగలో ఏడు రకాలు.. ముల్లు వంగ(గుండ్రం/పొడవు), వైట్ (రౌండ్/లాంగ్), వెంగోరి బ్రింజాల్, సన్న వంకాయ, ముసుగు(తొడిమతోపాటు ఉండే పొర కాయను చాలా వరకు కప్పి ఉంచుతుంది) వంకాయ, భర్తా బేంగన్ రకాలున్నాయి. తమ్మ (చమ్మ) కాయల తీగతోపాటు చెట్టు కూడా ఉంది. ‘365 డేస్’ చిక్కుడు ఉంది.సాధారణ చిక్కుడు కన్నా 2 నెలలు ముందు నుంచి కాపునివ్వడంతోపాటు.. సాధారణ చిక్కుడు కాపు ముగిసిన తర్వాత నెల అదనంగా చిక్కుడు కాయలను అందిస్తుంది. ఇప్పటికే రెండు నెలలుగా కాస్తున్నదని నళిని తెలిపారు. పొట్టి పొట్ల, చిట్టి కాకర, రెగ్యులర్ కాకర, టమాటా, తెల్లకాకర, ముల్లంగి, రెడ్ బెండ, దొండ పాదులున్నాయి. కాప్సికం గ్రీన్, రెడ్, ఎల్లో రకాలున్నాయి. మిర్చిలో రౌండ్, బ్లాక్, ఉజ్వల(గుత్తులుగా ఆకాశం వైపు తిరిగి ఉండే) రకాలున్నాయి. టమాటా ఎల్లో/రెడ్/బ్లాక్/మదనపల్లి/బెంగళూరు రకాలున్నాయి. మలేషియన్ జామ, బ్లాక్ గాల్, అలహాబాద్ సఫేద్,లక్నో 49 రకాల జామ మొక్కలున్నాయి. ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్ బెర్, సీతాఫలం, బొప్పాయి, మల్బరీ, ఫాల్స ఫ్రూట్, అరటి, ఆరెంజ్, సీడ్నిమ్మ, సీడ్ లెస్ నిమ్మ, అంజీర, డ్రాగన్ ఫ్రూట్, పునాస మామిడి, వాటర్ ఆపిల్ (వైట్/పింక్), ఆల్‌బకర (3 ఏళ్ల నుంచీ కాపు రాలేదు), చైనీస్ లెమన్, లక్ష్మణ ఫలం మొక్కలున్నాయి. చేమ ఆకు, మునగాకు, పాలకూర, చుక్కకూర, గోంగూర, పెరుగుతోటకూర, ఎర్ర తోటకూర, సిలోన్ బచ్చలి, ఎర్ర బచ్చలి, గ్రీన్ బచ్చలి తదితర ఆకుకూరలున్నాయి. కూరగాయలు, పండ్లు 70% మావే ఒకే రకం కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు ఎన్ని ఉన్నా.. వాటిని పక్క పక్కనే పెట్టకుండా వేర్వేరు చోట్ల పెట్టడం ద్వారా చీడపీడల బెడదను చాలా వరకు నివారించవచ్చునని నళిని తెలిపారు. ఒకే కుండీలో కొన్ని రకాల మొక్కలను కలిపి పెంచుతున్నారు. వంగ+మిర్చి, టమాటా+తులసి+ఉల్లి, మామిడి+టమాట+ముల్లంగి.. కలిపి పెంచుతున్నారు. పురుగుల రాకను గుర్తించి తొలిదశలోనే చేతులతో తీసేయడం ముఖ్యమైన విషయమని నళిని అంటారు. ఆవ, బంతి మొక్కలను గార్డెన్లో అక్కడక్కడా పెంచుతున్నారు. పురుగులు తొలుత ఈ రెండు మొక్కలను ఆశిస్తాయి. కనిపించిన రోజే పురుగులను ఏరి నాశనం చేస్తామన్నారు. కాబట్టి పురుగుల బెడద మొక్కలకు ఉండదన్నారు. టమాటా మొక్కను బక్కెట్‌కు అడుగున బెజ్జం పెట్టి నాటి.. తల్లకిందులుగా పెంచుతున్నారు. టమాటాకు అలా పెరగడమే ఇష్టమని నళిని అంటారు. తమ ఇంట్లో ఐదుగురు పెద్దవాళ్లుంటామని, కిచెన్ గార్డెన్ నుంచి పండ్లు, కూరగాయలను 70 శాతం వరకు సమకూర్చుకుంటున్నామని ఆమె సంతృప్తిగా చెప్పారు. కంపోస్టు.. జీవామృతం.. కోళ్ల ఎరువు, పశువుల ఎరువు, గొర్రెల ఎరువుకు ఎండు ఆకులు, అలములతోపాటు వంటింటి వ్యర్థాలు కలిపి స్వయంగా తయారు చేసుకున్న కంపోస్టుతోపాటు.. స్వయంగా తయారు చేసుకునే జీవామృతాన్ని 15 రోజులకోసారి మొక్కలకు ఇస్తూ నళిని చక్కని దిగుబడులు సాధిస్తున్నారు. గ్రాఫ్టెడ్ పండ్ల మొక్కలను నాటడం, ఒకసారి తెచ్చిన కూరగాయ/ఆకుకూర మొక్కల నుంచి విత్తనాలను స్వయంగా తయారు చేసుకొని వాడుకోవడం ఆమె ప్రత్యేకత. ఇంటిపంట ఫేస్బుక్ గ్రూప్ నుంచే తాను అన్ని విషయాలూ నేర్చుకున్నానంటున్న నళిని.. గ్రూప్‌లో ఏదైనా అంశంపై సాధికారంగా, శాస్త్రీయంగా సమాధానాలు ఇస్తూ ఇతరులకు లోతైన అవగాహన కల్పిస్తుండటం ప్రశంసనీయం. నగరంలో పుట్టి పెరుగుతూ.. గడప దాటెళ్లే పని లేకుండా.. రోజుకు కేవలం ఓ గంట సమయాన్ని కేటాయించడం ద్వారా తన కుటుంబానికి కావాల్సిన వైవిధ్యభరితమైన, అమూల్యమైన సేంద్రియ పౌష్టికాహారాన్ని సమర్థవంతంగా సమకూర్చుకుంటున్న ఆదర్శప్రాయురాలైన గృహిణి నళిని గారికి ‘సాక్షి’ జేజేలు పలుకుతోంది! ముసుగు వంగ, పునాస మామిడి, టమాటో, చెట్టు తమ్మ (చెమ్మ) ఉజ్వల మిరప, నాటు కోళ్లు, ఆపిల్ బెర్ -
తపన కొద్దీ ఇంటిపంటలు!
రసాయనిక అవశేషాల్లేని తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలన్న తపన ఉండాలే గానీ దంపతులిద్దరూ ఉద్యోగస్తులైనా ఇంటిపట్టునే పండించుకోవడానికి పుష్కలంగా అవకాశాలున్నాయని కరీంనగర్‌కు చెందిన దంపతులు సూదం రమేశ్‌బాబు, సావిత్రి దంపతులు చాటిచెబుతున్నారు. సావిత్రి కరీంగనర్ పోలీసు శాఖలో సినియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. జమ్మికుంటలో పుట్టిన రమేశ్‌బాబు గ్రానైట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కరీంనగర్లో స్థిరపడ్డారు. నగర శివార్లలోని తీగలగుట్టపల్లెలో సొంత భవనాన్ని నిర్మించుకున్నారు. ఇంటి చుట్టూ మొక్కల పెంపకం కోసం ఖాళీ ఉంచుకున్నారు. మామిడి, జామ చెట్లు పెంచుతున్నారు. ఈ దశలో తుమ్మేటి రఘోత్తమరెడ్డి మిద్దె తోట చూసి స్ఫూర్తిపొంది మేడపైన 1300 చ.అ.ల ఖాళీ టెర్రస్‌పై నిక్షేపంగా ఇంటిపంటలు పెంచుకోవచ్చని గ్రహించారు. 2016 మేలో మడులు నిర్మించుకొని ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టారు. వర్షాకాలం–చలికాలాల్లో 3–4 నెలల పాటు తమ మిద్దెపై తాము పండించుకున్న ఆకుకూరలు, కూరగాయలనే తింటున్నారు. ఇతర కాలాల్లో పాక్షికంగా తమ మిద్దెతోట ఉత్పత్తులపై ఆధారపడుతున్నామని రమేశ్‌బాబు తెలిపారు. మట్టి రెండు పాళ్లు, ఒక పాలు గొర్రెల ఎరువును కలిపిన మట్టిమిశ్రమంతో కుండీలు, మడుల్లో సేంద్రియ ఇంటి పంటలు పండిస్తున్నారు. 4 అడుగుల వెడల్పున ఎత్తు మడులను ఇటుకతో సిమెంటు మడులు నిర్మించి ఆకుకూరలు, టమాటా, ఎర్ర/పచ్చ బెండ మొక్కలు సాగు చేస్తున్నారు. కొన్ని సిమెంటు తొట్లను ఏర్పాటు చేసుకొని దానిమ్మ, సీతాఫలం చెట్లు పెంచుతున్నారు. పాత ఎయిర్‌కూలర్ టబ్‌లలో ఆకుకూరలు వేశారు. 30 మట్టి కుండీల్లో మొక్కజొన్న విత్తారు. పాలకూర, చుక్క, బచ్చలి, వామ, బచ్చలి, గోంగూరలతోపాటు విదేశీ ఆకుకూర లెట్యూస్‌ను కూడా సాగు చేస్తున్నారు. బీట్రూట్, క్యారెట్ దుంప పంటలున్నాయి. రమేశ్‌బాబు మిద్దెతోట ప్రత్యేకతల్లో ఒకటి.. నిలువు పందిళ్లు. టెర్రస్ అంచుల్లో గోడకు నిలువు పందిళ్లు వేసి.. నేతిబీర, పొట్ల తీగలను పాకించారు. ఎత్తుమడిలో వేసిన టమాటా మొక్కలకు పందిరి వేసి, మొక్కలు పడిపోకుండా ఉండేందుకు గుడ్డ పేలికలతో పందిరి కర్రలకు కట్టారు. దీంతో అన్ని మొక్కలకు సమానంగా ఎండ తగిలి, చీడపీడల బెడద అంతగా లేకుండా ఉంటుందని రమేశ్‌బాబు తెలిపారు. సేంద్రియ ఇంటిపంటల రుచి అద్భుతం సేంద్రియ ఇంటిపంటల రుచి అద్భుతమని చెబుతూ.. తమ మేడపై పెరిగిన క్యాబేజి, బెండకాయలు, చుక్కకూరలను రుచి చూసిన తన బంధుమిత్రుల్లో చాలా గిరాకీ ఉందని రమేశ్‌బాబు (90327 70630) చమత్కరించారు. ఇంటిపంటలైనా, పూలైనా దేశీ వంగడాలు పెంచుకోవడమే ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు. ఫేస్బుక్/టెలిగ్రాం బృందాల ద్వారా తమ అనుభవాలను ఇతరులకు పంచుతూ మరి కొన్ని కుటుంబాలను ఇంటిపంటల సాగుకు ఉపక్రమించేలా స్ఫూర్తినిచ్చిన రమేశ్‌బాబు, సావిత్రి దంపతులకు ‘సాక్షి ఇంటిపంట’ హృదయపూర్వకంగా అభినందిస్తోంది! అమృత్‌మట్టిలో ఆరోగ్యవంతమైన పంటలు టెర్రస్ మీద అడుగునే ఇటుకలను మూడు వరుసలుగా పేర్చిన మడిలో అమృత్ మట్టిని తయారు చేస్తూ వాటంతట అవే మొలిచిన పంటలను ఆయన సాగు చేస్తున్నారు. గొర్రెల ఎరువు, మట్టి మిశ్రమంలో సాగవుతున్న పంటలకు, అమృత్ మట్టిలో సాగవుతున్న పంటలకు స్పష్టమైన వ్యత్యాసం ఉన్నట్లు తాను గమనించానన్నారు. ఎండాకులు, కొమ్మలు, రెమ్మలను అమృత్‌జల్(గోమూత్రం, పేడ, బెల్లం కలిపి తయారు చేస్తారు)లో రోజంతా నానబెట్టి మడిలో వేసిన తర్వాత అనేక దశల్లో అమృత్ మిట్టి రూపొందుతుంది. నెల తర్వాత నవధాన్యాలు చల్లి 22 రోజులకోసారి, 42 రోజులకోసారి ఆ మొక్కలను పిలకలు కత్తిరించి అమృత్ మట్టి మడిలోనే ఆచ్ఛాదనగా వేయాలి. 63 రోజులకు పెరిగిన మొక్కలను మరోసారి కత్తిరించి ఆచ్ఛాదనగా వేయాలి. అయితే, అమృత్ మట్టి తయారీని ప్రారంభించిన నెల రోజులకే వర్షాలు రావటంతో నేతిబీర, దొండ మొక్కలు మొలిచాయి. వీటిని పీకెయ్యడం ఎందుకులే అని అలాగే వదిలేశారు. కుండీలు, మడుల్లో పెరిగే తీగజాతి కూరగాయల కన్నా అమృత్ మట్టిలో పెరిగే ఇంటిపంటలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయని, చీడపీడల బెడద కూడా తక్కువేనని రమేశ్‌బాబు అన్నారు. సాధారణ మట్టిమిశ్రమం కన్నా అమృత్‌మట్టిలో పంటలు వేసుకోవడమే ఉత్తమన్నది అనుభవపూర్వకంగా గ్రహించానని, దీని వల్ల మడుల బరువు కూడా తగ్గిపోతుందని రమేశ్‌బాబు తెలిపారు. అమృత్‌మట్టి మడి; మొక్కజొన్న కుండీలు -
ప్రయాస లేని ఇంటిపంటలు!
‘మనిషి చెయ్యి పెడితేనే మొక్కలకు నష్టం జరుగుతుంది. మొక్కలు మనిషి జోక్యాన్ని ఆశించవు. వాటి నైజం బతకటమే కదా. నేను చేసేదేమి ఉంది? ఇది నా అనుభవం..’ అంటున్నారు సీనియర్ అర్బన్ పర్మాకల్చర్ నిపుణురాలు నాదెండ్ల లక్ష్మి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు పదిలో స్వగృహంలో నివాసం ఉంటున్న ఆమె గత ఐదేళ్లుగా అర్బన్ పర్మాకల్చర్ పద్ధతుల్లో పెరటి తోటను స్వతంత్రంగా పెరిగేలా తీర్చిదిద్దారు. ఆ పెరటి తోటలో మొలిచే చాలా రకాల వార్షిక పంటలు ప్రతి ఏటా విత్తనాలు వేయకుండానే మొలిచి మంచి దిగుబడులను ఇస్తున్నాయి! తన పెరటి తోటలో గత మూడేళ్లుగా ఎటువంటి విత్తనాలనూ పనిగట్టుకొని వేయలేదని, అంతకుముందు వరుసగా రెండేళ్లు నాటిన మొక్కలు, వేసిన విత్తనాలే ప్రతి ఏటా వాటంతట అవే మొలకెత్తి, సంతృప్తికరమైన ఫలసాయాన్ని అందిస్తున్నాయని లక్ష్మి వివరించారు. విత్తిన మొదటి ఏడాది పంట తీసుకోరు! ఆమె గార్డెన్లో ప్రస్తుతం అనేక కుండీల్లో వంగ మొక్కలున్నాయి. అయితే, ఆమె తన పెరటి తోటలో ఐదేళ్ల క్రితం వంగ విత్తనాలేశారు. ఆమె పెట్టుకున్న నియమం ఏమిటంటే.. ఏ రకం విత్తనాలైతే కొత్తగా తెచ్చి పెరటి తోటలో చేర్చుతారో ఆ మొక్కల కాయలను తొలి ఏడాది ముట్టుకోరు. అవే పెరిగి, పండి రాలిపోయి భూమిలో కలిసిపోతాయి. అనుకూలమైన వాతావరణం ఏర్పడినప్పుడు ఆ విత్తనాలు మళ్లీ మొలకెత్తి, ఫలసాయాన్ని అందిస్తాయి. ప్రతి ఏటా కొన్ని కాయలను విత్తనాలకు వదిలేస్తారు. వాటిని పనిగట్టుకొని దాచిపెట్టి విత్తటం ఉండదు. అవే మట్టిలో కలిసిపోయి.. తిరిగి మొలకెత్తుతూ ఉంటాయి. ఉదాహరణకు.. ఇప్పుడు కొన్ని కుండీల్లో వంగ మొక్కలున్నాయి. సుమారు 5 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న పెరట్లో కొన్ని సిమెంటు రింగ్‌లు, కొన్ని పెద్ద కుండీలు ఉన్నాయి. చాలా మొక్కలు నేలపైనే పెరుగుతున్నాయి. విత్తనాలు పడి మట్టిలో ఉండి వాటంతటవే తిరిగి మొలుస్తుంటాయి. మొలిచిన మొక్కలకు పరిమితంగా ఆలనాపాలనా చేయడమే తప్ప పెద్దగా చేయాల్సిందేమీ లేదని లక్ష్మి అంటున్నారు. సీజన్లో వంగ మొక్కలు అక్కడక్కడా మొలుస్తాయి. మొలిచిన మొక్కను తీసి కుండీల్లోకి చేర్చుతారు.. ఏడాది పొడవునా రాలిన ఆకులతో లీఫ్ కంపోస్టు తయారు చేసి, ఎప్పటికప్పుడు మొక్కలకు వేస్తూ ఉంటారు. తగుమాత్రంగా నీరందిస్తారు. అంతే.. ఇక వాటంతట అవే పెరుగుతూ దిగుబడినిస్తాయి. వంగ, టమాటా మొక్కలను మాత్రమే పీకి కుండీల్లో నాటుతారు. మిగతా కూరగాయలు, ఆకుకూరలు, బొప్పాయి వంటి పండ్ల మొక్కలు ఎక్కడ మొలిస్తే అక్కడే పెరిగి ఫలసాయాన్నిస్తుంటాయని లక్ష్మి వివరించారు. అందుకే తనది ప్రయాస పడి సాగు చేయని (డూ నథింగ్) పెరటి తోట అంటారామె. భూసారం.. జీవవైవిధ్యం.. భూమిలో వానపాములు, సూక్ష్మజీవరాశి పుష్కలంగా పెరిగేలా సారవంతం చేయడం.. ఆకులు అలములతో ఆచ్ఛాదన కల్పించడం.. వీలైనన్ని ఎక్కువ రకాల (బహువార్షిక, ఏక వార్షిక, స్వల్పకాలిక) పంటల జాతులను కిచెన్ గార్డెన్‌లోకి చేర్చితే చాలు.. అదేపనిగా ప్రతిరోజూ పనిగట్టుకొని పెద్దగా ప్రయాస పడి మొక్కల పనుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని లక్ష్మి చెబుతున్నారు. 2013లో అర్బన్ పర్మాకల్చర్ వర్క్‌షాపును తన ఇంట్లోనే నిర్వహించానని, అప్పటి నుంచి శాశ్వత వ్యవసాయ సూత్రాలను ప్రయాస లేకుండా తు.చ. తప్పకుండా అనుసరిస్తున్నానన్నారు. ఆమె పెరటి తోటలో బొప్పాయి, ప్యాషన్ ఫ్రూట్, దొండ, పొట్ల, అలసంద, 3 రకాల చిక్కుళ్లు, పచ్చిమిర్చి, క్యాప్సికం, వంగ, టమాటాతోపాటు తోటకూర, పాలకూర, మెంతికూర, 3 రకాల బచ్చలికూర మొక్కలున్నాయి. మునగచెట్టు పూలు, పిందెలతో కనువిందు చేస్తుంది. అవకాడొ వంటి అరుదైన పండ్ల మొక్కలూ ఉన్నాయి. తన పెరట్లో ఎందుకనో గాని దేశవాళీ బొప్పాయి మొక్కలు విత్తనాలు వేయకపోయినా రెండేళ్లకోసారి మాత్రమే పుట్టి పెరిగి పండ్లనిస్తున్నాయని లక్ష్మి తెలిపారు. మగ చెట్టును ఒకదాన్ని ఉంచి మిగతావి తీసేస్తానన్నారు. గుత్తిగా పూలు వస్తే అది మగ చెట్టని, పిందెతో కూడిన పూవు ఒకటే వస్తే అది ఆడ చెట్టని గుర్తించాలన్నారు. ఐదారేళ్ల క్రితం వంగ విత్తనాలు వేసి పెంచానని, తర్వాత విత్తనం వేయలేదని, ప్రతి ఏటా గార్డెన్లో అక్కడక్కడా మొలిచిన వంగ మొక్కలను పీకి కుండీల్లో నాటుతానన్నారు. దేశవాళీ టమాటా రకాల విత్తనాలు కొన్ని సంవత్సరాల క్రితం వేశానని, తర్వాత నుంచి వాటికవే మొలుస్తుంటాయని, మొక్కలను తీసి కుండీల్లో నాటి, లీఫ్ కంపోస్టు, నీరు తగినంత అందించడమే తాను చేస్తున్నానన్నారు. రెండు టమాటా మొక్కలుంటే చాలు తమ నలుగురికీ సరిపోయే అన్ని కాయలు కాస్తాయన్నారు. చలికాలంలో 70% తమ కుటుంబానికి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తమ ఇంట్లో పండినవే సరిపోతాయని, వేసవిలో పూర్తిగా మార్కెట్లోనే కొంటామని లక్ష్మి(laxmi_nad@yahoo. com) తెలిపారు. బొప్పాయి మగ పూలు, బొప్పాయి ఆడ పువ్వు, కాప్సికం, ప్యాషన్ ఫ్రూట్ మునగ వైభవం, చిక్కుడు పాదు, వాటికవే మొలిచినవి, తేనెతుట్టె -
ప్లాస్టిక్ బాటిల్‌తో పండు ఈగలకు ఎర!
పండు ఈగల వల్ల కూరగాయలు, పండ్లకు నష్టం జరుగుతూ ఉంటుంది. పండు ఈగ కాటేసిన కాయపై ఆ గాటు దగ్గర నుంచి వృత్తాకారంలో కొద్ది రోజుల్లో కుళ్లిపోతుంది. అపురూపంగా పెంచుకుంటున్న సేంద్రియ కూరగాయలు, పండ్లకు పండు ఈగ కలిగించే నష్టం ఇంటిపంటల సాగుదారులను నిరుత్సాహపరుస్తూ ఉంటుంది.. విస్తారంగా సాగు చేసే రైతులను తీవ్ర ఆర్థిక నష్టానికి గురి చేస్తుంటుంది. హైదరాబాద్ జగద్గిరిగుట్ట ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన సీనియర్ ఇంటిపంటల సాగుదారు దశిక చంద్రశేఖర శాస్త్రి పండు ఈగలను ఆకర్షించి నశింపజేసేందుకు ప్లాస్టిక్ బాటిల్‌తో ట్రాప్లను తయారు చేసి వాడుతున్నారు. వాడేసిన లీటరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను తీసుకొని.. దానికి నాలుగు వైపులా ఆంగ్ల క్యాపిటల్ లెటర్ ‘హెచ్’ ఆకారంలో బ్లేడుతో.. కుడి, ఎడమల వైపున రెండు అంగుళాల పొడవున కత్తిరించాలి. మధ్యన (అంగుళం ఎత్తులో) అడ్డంగా కత్తిరించి, ఆ రెండు ముక్కలను(45 డిగ్రీల కోణంలో) లోపలికి వంచాలి. ఈ కిటికీ ద్వారా పండు ఈగ బాటిల్లోకి ప్రవేశించి బయటకు రాలేక.. లోపలే పడిపోతుంది. పండు ఈగను బాటిల్ వైపు ఆకర్షించడానికి పసుపు, నీలం ఆయిల్ పెయింట్ రంగులను బాటిల్‌కు పూస్తున్నారు. పెయింట్ అందుబాటులో లేకపోతే.. ఇన్సులేషన్ టేప్‌ను బాటిల్‌పై అతికించవచ్చని శాస్త్రి సూచిస్తున్నారు. అరటి పండు తొక్కను బెల్లంతో కలిపి.. ఈ బాటిల్లో అడుగున ఉంచాలి. దీని వాసన.. బాటిల్‌పై పసుపు, నీలం రంగులకు పండు ఈగలు ఆకర్షితమై నశిస్తున్నాయని, ఇది చాలా సులభమైన, ఖర్చులేని మార్గమని ఆయన వివరించారు. అరటి పండు తొక్క, బెల్లం పెట్టిన వారం రోజుల వరకు పనిచేస్తుందన్నారు. అరటి తొక్క కుళ్లిపోయిన తర్వాత తీసివేసి, మళ్లీ పెట్టుకోవాలి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు పండు ఈగలకు ఈ ట్రాప్స్ పెట్టుకుంటే మంచిదని ఆయన తెలిపారు. దీనికి బదులు, చిన్నపాటి సోలార్ ఎల్.ఇ.డి. లైటు కొనుగోలు చేసి పెట్టుకోవచ్చని ఆయన అంటున్నారు. ఈ లైటు పగలు సూర్యరశ్మితో చార్జ్ అవుతుంది. చీకటి పడగానే వెలుగుతుంది. ఈ లైటు అడుగున వాడేసిన ఫుడ్ ప్యాకింగ్ ప్లాస్టిక్ బాక్స్‌ను అమర్చి.. వేపనూనె కలిపిన నీటిని పోయాలి. లైటు రాత్రి 10.30 గం. వరకు వెలుగుతుంది. ఈ వెలుతురుకు దగ్గరకు వచ్చే పండు ఈగలు వేపనూనె నీటిలో పడి చనిపోతాయని శాస్త్రి (81211 58628) వివరించారు. పండు ఈగ సమస్యను అధిగమించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ‘సాక్షి ఇంటిపంట’ జేజేలు పలుకుతోంది. చంద్రశేఖర శాస్త్రి, ∙పండు ఈగ, సోలార్ లైట్ ట్రాప్ -
ఖమ్మంలో 12న ఇంటిపంటలపై సదస్సు
తెలంగాణ ఉద్యాన శాఖ, నేచర్స్ వాయిస్ సంస్థ, స్పర్శ సామాజిక అధ్యయన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12 (ఆదివారం) ఉ. 9 గంటలకు ఖమ్మంలోని టీటీడీసీ హాల్ (ఇల్లెందు క్రాస్ రోడ్డు)లో సేంద్రియ ఇంటిపంటలపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నేచర్స్ వాయిస్ నిర్వాహకులు కె. క్రాంతికుమార్ తెలిపారు. ఇంటిపంటల నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి, రవిచంద్ర, సీనియర్ శాస్త్రవేత్త డా. శ్యామ్‌సుందర్ రెడ్డి, ఉద్యాన అధికారులు అవగాహన కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 98483 30454, 97008 52527. -
8న హైదరాబాద్‌లో ఇంటిపంటలపై సదస్సు
సేంద్రియ ఇంటిపంటల సాగుపై హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజజినీర్స్ భవనంలో ఈనెల 8 (బుధవారం) సా. 5 గంటలకు అవగాహనా కార్యక్రమాన్ని నేచర్స్ వాయిస్ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ శాఖ గౌరవ కార్యదర్శి డా. జి.రామేశ్వర్రావు, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఇంటిపంటల నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి అవగాహన కల్పిస్తారు. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. కె.క్రాంతికుమార్‌రెడ్డి (నేచర్స్ వాయిస్)–96032 14455. -
మూడు ఆకాకర పాదులుంటే చాలు..!
మంచి పోషక విలువలతో కూడిన ఆకాకర/బోడకాకర కాయల ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంటిపంటల్లో సాధారణంగా ఇది కనిపించడం అరుదు. అటువంటి అరుదైన ఆకాకర కాయలను హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ(టెంపుల్ బస్టాప్ దగ్గర)కి చెందిన కన్సల్టింగ్ ఇంజనీర్ నాగేంద్ర సొంత ఇంటిపైన సాగు చేస్తున్నారు. ఆయన టెర్రస్ గార్డెన్లో బోడకాకర పాదులు ఆరు ఉన్నాయి. అందులో 2 మగవి, 4 ఆడవి. ఆడ పాదులే కాయలు కాస్తాయి. పరపరాగ సంపర్కం ద్వారా ఆడ పాదుల పూలు ఫలదీకరణం చెంది ఫలసాయం రావాలంటే.. బొప్పాయి, తాటిచెట్లలో మాదిరిగా.. పది ఆడ పాదులకు కనీసం ఒక మగ పాదు ఉండాలని నాగేంద్ర తెలిపారు. ఆకాకర విత్తనాలు మార్కెట్లో కూడా దొరకడం లేదు. నాగేంద్ర తమ ఇంటి సమీపంలోని రైతు బజార్లో వ్యాపారులు పారేసిన పండు కాయలను తీసుకొచ్చి.. విత్తనాలు సేకరించి.. విత్తుకున్నారు. గుప్పెడు విత్తనాలు వేస్తే 8 మొలిచాయి. 6 మిగిలాయి. ఈ పాదులను విత్తనం ద్వారా లేదా దుంప నాటడం ద్వారా పెంచుకోవచ్చు. దుంపను చూస్తే ఆడ, మగ తేడా తెలీదు. పూత వస్తే తప్ప అది ఆడ పాదా, మగ పాదా అనేది చెప్పలేం. ఆడ, మగ పాదులకు వచ్చే పూల మధ్య ఒక తేడా గమనించవచ్చు. ఆడ పువ్వునకు అడుగున చిన్న కాయ కూడా ఉంటుంది. కొన్నాళ్లకు పువ్వు రాలిపోయి కాయ పెరుగుతుంది. మగ పువ్వు అడుగున కాయేమీ ఉండదు. వర్షాకాలంలో 3 నెలల పాటు ఆకాకర పాదు కాయలనిస్తుంది. ఒక్కో పాదు తడవకు పావు కిలో వరకు కాయలిస్తుంది. రెండు ఆడ పాదులు, ఒక మగ పాదున్నా నలుగురున్న ఇంటికి కూరకు సరిపడా ఆకాకర కాయలు పండించుకోవచ్చని నాగేంద్ర (98481 30414) చెబుతున్నారు. ఇంటిపంటల్లో అరుదైన ఆకాకర/బోడకాకర పాదులు పెంచుతున్న నాగేంద్రను ‘సాక్షి–ఇంటిపంట’ అభినందిస్తోంది. గమనిక: మీరూ ఏదైనా అరుదైన/విలక్షణ కూరగాయలను సేంద్రియంగా ఇంటిపంటల్లో పెంచుతున్న వారెవరైనా ఉంటే వివరాలు, ఫొటోలను sagubadi@sakshi.com కు మెయిల్ చెయ్యవచ్చు. -
అటు సేంద్రియ పంటలు ఇటు ఇంటిపంటలు!
‘సాక్షి సాగుబడి’ పేజీలో ‘ఇంటిపంట’, ప్రకృతి వ్యవసాయ కథనాలతో స్ఫూర్తిపొందిన యలమంచి వంశీ అనే యువరైతు గత రెండేళ్లుగా రసాయనాలు వాడకుండా వరి, మిర్చి సాగుతోపాటు మిద్దె తోటను సాగు చేస్తూ కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. తమ కుటుంబానికే కాకుండా బంధుమిత్రులకూ రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన పంటలు అందిస్తూ ఇతరులకు స్ఫూరినిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలోని ఆంధ్రకేసరి కాలనీ నివాసి అయిన వంశీ.. తన తండ్రి హయాంలో 23 ఏళ్ల క్రితం నిర్మించిన నివాస భవనంపైన రెండేళ్ల క్రితం సిమెంటు బెడ్స్ నిర్మించి మిద్దె తోట పెంచుతూ ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు తింటున్నారు. 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న టెర్రస్‌పైన 17 మడులను ఇటుకలతో నిర్మించి సిమెంటు ప్లాస్టింగ్ చేయించారు. టెర్రస్ మీద ఒక అడుగు ఎత్తున ఖాళీ ఉంచి మడులు నిర్మించారు. 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పున మడి నిర్మించారు. అడుగు లోతున మట్టి, పశువుల ఎరువు, కొబ్బరి పొట్టు మిశ్రమాన్ని నింపి కూరగాయలు పండిస్తున్నారు. ప్రస్తుతం వంగ, బెండ, దొండ దిగుబడి వస్తోంది. క్యాబేజి, బీట్రూట్ కూడా ఉన్నాయి. ఆపిల్ బెర్ తదితర పండ్ల మొక్కలు కూడా వేశారు. పంచగవ్య, వేస్ట్‌డీకంపోజర్, జీవామృతం, కషాయాలతో వరి, మిర్చి సాగు చేస్తున్న వంశీ మిద్దె తోటను కూడా శ్రద్ధగా సాగు చేస్తున్నారు. మారుమూల పల్లెటూర్లో సేంద్రియ వ్యవసాయం చేయడంతోపాటు ఇంటిపైన కూరగాయలు పెంచడం పలువుర్ని ఆకర్షిస్తోంది. సేంద్రియ వరి బియ్యాన్ని, మిర్చి పొడిని హైదరాబాద్‌లోని ఆర్గానిక్ షాపులకు ఇస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులను రుచి చూసిన వారు మళ్లీ అడుగుతుండటంతో మరింత ఉత్సాహం కలుగుతోందని, ఈ ఏడాది ఎకరంలో మిర్చితోపాటు 9 ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నానని వంశీ తెలిపారు. గ్రామాల్లో సైతం మిద్దె తోటలు నిర్మించుకుంటే ఎండాకాలం ఇల్లు చల్లగా ఉంటుంది. మిద్దెతోట కూరగాయలను తమ కుటుంబ సభ్యులు ఇష్టంగా తింటున్నారని వంశీ (99089 97969) తెలిపారు. -
ఇంటిపంటల కోసమే సిటీకి దూరంగా సొంతిల్లు!
వరంగల్‌లో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రేగూరి సింధూజ ఇంజనీరింగ్ చదువుకొని హైదరాబాద్ టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. రసాయనిక అవశేషాలు లేని ప్రకృతిసిద్ధమైన ఆహారం విలువ గుర్తెరిగిన ఆమె.. సిటీలో ఫ్లాట్‌కు బదులు (బీహెచ్ఈఎల్ దగ్గర) నగర శివారు ప్రాంతం అమీన్పూర్ నరేంద్ర నగర్ కాలనీలో ఇండిపెండెంట్ హౌస్ నిర్మించుకున్నారు. 200 గజాల టెర్రస్‌లో సగభాగంలో వందకు పైగా గ్రోబాగ్స్, కుండీలలో గత ఏడాదిగా ఇంటిపంటలు పండించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యాన శాఖ నుంచి 4 పెద్ద వృత్తాకారపు గ్రీన్ గ్రోబాగ్స్తో కూడిన సబ్సిడీ కిట్‌ను తీసుకున్నారు. శిక్షణా శిబిరాలకు హాజరై అవగాహన పెంచుకున్నారు. వీటితోపాటు తెల్లని గ్రోబాగ్స్‌ను, కొబ్బరిపొట్టు తదితర పరికరాలను సేకరించుకున్నారు. 30%మట్టి, 30%పశువుల ఎరువు, 30% శుద్ధి చేసిన కొబ్బరిపొట్టు, వంటింటి వ్యర్థాలతో తయారు చేసిన ఇంటి కంపోస్టు+వేపపిండితో కలిపిన మట్టి మిశ్రమాన్ని గ్రోబాగ్స్, కుండీలలో నింపారు. వేసవి ఎండ తీవ్రత నుంచి ఇంటిపంటలను కాపాడుకోవడానికి ఇనుప ఫ్రేమ్‌తో షేడ్‌నెట్ వేసుకున్నారు. సింధూజ కుటుంబంలో నలుగురు పెద్దవారు ఉంటారు. పాలకూర, చుక్కకూర, గోంగూర, తోటకూర, కొత్తిమీర, బచ్చలి కూర పెంచుకొని తింటున్నారు. గత ఏడాదిగా ఆకుకూరలను బయట కొనటం లేదు. తీగజాతి కూరగాయలను పాకించడానికి కొబ్బరి తాళ్లతో పందిరి అల్లారు. బెండ, బీర, గోరుచిక్కుడు, కాప్సికం, సొర తదితర కూరగాయలు సాగులో ఉన్నాయి. ప్రస్తుతం వారంలో 2,3 రోజులు ఈ కూరగాయలు తింటున్నామని, కొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో ఇంటి కూరగాయలే తమకు సరిపోతాయని సింధూజ(98857 61707) సంతోషంగా చెప్పారు. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా నిపుణుల సలహాలను తెలుసుకుంటున్నానన్నారు. -
సెల్ఫ్ వాటరింగ్ బెడ్!
మేడల మీద కుండీలు, బ్యాగ్‌లలో సేంద్రియ ఇంటిపంటలు సాగు చేయడంపై కేరళవాసులు అధిక శ్రద్ధ చూపుతుంటారు. సృజనాత్మకతను జోడించి తక్కువ శ్రమతో చేసే మెలకువలను అనుసరిస్తూ ఉంటారు. తిరువనంతపురానికి చెందిన షాను మనోహర్ అనే యువకుడు సెల్ఫ్ వాటరింగ్ బ్యాగ్స్‌తో బెడ్‌ను ఏర్పాటు చేస్తున్నాడు. ఈ పద్ధతిలో ప్రతి బ్యాగ్/కుండీలోనూ నీరు పోయాల్సిన పనిలేదు. పీవీసీ పైపులో నీరు పోస్తే చాలు.. పైపుల్లో నుంచి వత్తి ద్వారా అనుసంధానమై ఉండే బాగ్స్‌లోని మొక్కల వేర్లకు తగినంత నీటి తేమ నిరంతరం అందుతూ ఉంటుంది. తక్కువ శ్రమతో చక్కగా ఇంటిపంటలు పండించుకోవచ్చు. షాను మనోహర్ ఇంటిపంటలను ఏర్పాటు చేసే సర్వీస్ ప్రొవైడర్‌గా స్వయం ఉపాధి పొందుతూ ఇంటిపంటల సాగుదారుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇంతకీ ఆయన చేస్తున్నదేమిటో ఫొటోలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది.. 1. పీవీసీ పైపులతో ఇలా మూడు వరుసల బెడ్‌ను ఏర్పాటు చేస్తున్నాడు. పైపుల చివరలను కూడా మూసేస్తారు. కేవలం పైనుంచి నీరు పోయడానికి ఒక చోట అవకాశం ఉంటుంది. ఇందులో పోసిన నీరు బయటకు పోదు. నీరు రోజూ పోయాల్సిన అవసరం లేదు. అయిపోయినప్పుడు మళ్లీ నీరు పోస్తే సరిపోతుంది. వాతావరణాన్ని బట్టి కొద్ది రోజులకోసారి నీరు పోస్తే సరిపోతుంది. 2. ఇది ఒక వత్తి. కిరసనాయిలు దీపంలోని వత్తి మాదిరిగా ఇది పనిచేస్తుంది. కింది పైపుల్లో నుంచి ఈ వత్తి ద్వారా గ్రోబ్యాగ్స్‌లోని మొక్కల వేళ్లు నీటి తేమను తీసుకుంటూ ఉంటాయి. పంటు మొక్కలు ఏపుగా పెరిగి ఫలసాయాన్నిస్తాయి. 3. గ్రోబ్యాగ్‌కు అడుగున బెజ్జం పెట్టి.. వత్తిని ఇలా అమర్చాలి.. 4. వత్తి గ్రోబ్యాగ్ లోపలకు సగం, కిందికి సగం ఉండేలా చూసుకోవాలి. 5. గ్రోబ్యాగ్‌లో ఎర్రమట్టి, కొబ్బరిపొట్టు, పశువుల ఎరువు/వర్మీకంపోస్టు/కంపోస్టు, కొంచెం వేపపిండి మిశ్రమంతో నింపాలి (నల్లమట్టిని వాడితే కొంచెం ఇసుకను కూడా కలుపుకోవాలి). వత్తి ఇలా మట్టి మిశ్రమం పై వరకూ ఉంటే పైపైనే ఉండే మొక్కల వేర్లకు కూడా నీటి తేమ అందుతూ ఉంటుంది. 6. ఇలా సిద్ధం చేసిన గ్రోబ్యాగ్‌లను పీవీసీ పైపులపై ఇలా ఉంచాలి. గ్రోబ్యాగ్ అడుగున ఉన్న వత్తిని పైపులోని బెజ్జంలోకి జొప్పించాలి. గ్రోబ్యాగ్స్ పడిపోకుండా అడుగున సరిపడా ఎత్తున్న ఇటుకలను కుదురుగా పెట్టాలి. పీవీసీ పైపులో నిండు నీరుపోసి, మూత బిగించాలి. రెండు, మూడు రోజులకోసారి మూత తీసి.. నీరు ఎంత ఉందో చూసుకుంటూ ఉండాలి. 7. ఇక అంతే.. గ్రోబ్యాగ్స్‌లో కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు విత్తుకోవచ్చు లేదా మొక్కలు నాటుకోవాలి. చక్కని రుచికరమైన రసాయనిక అవశేషాల్లేని సేంద్రియ ఇంటిపంటలను తక్కువ శ్రమతో ఇలా పండించుకోవచ్చు. ఈ పద్ధతిలో నీరు ఎక్కువ, తక్కువ కావడానికి అవకాశం ఉండదు. ఉష్ణోగ్రతలను బట్టి తగుమాత్రంగా నీటి తేమను వత్తి ద్వారా గ్రోబ్యాగ్స్‌లోని మట్టి పీల్చుకుంటూ మొక్కల వేర్లకు అందిస్తూ ఉంటుంది. బాగుంది కదూ.. మరి మనమూ ట్రై చేద్దామా? మీ అనుభవాలను మెయిల్ చేయండి.. sagubadi@sakshi.com. -
ఫేస్బుక్ చూసి ఇంటిపంటల సాగు!
బాల్యంలో చేసిన పనులు ఎప్పటికీ మదిలో నిలిచి ఉంటాయి. అటువంటి జాబితాలో ఇంటిపంటల సంగతి కూడా ఒకటి. అమ్మతో కలిసి తన బాల్యంలో పెరటి తోటలు సాగు చేసిన అనుభవం కొలను పద్మావతి గారిని మేడపై ఇంటిపంటల సాగుకు పురికొల్పాయి. సికింద్రాబాద్ నేరేడ్మెట్ కృప కాంప్లెక్స్ ప్రాంతంలో సొంత ఇంట్లో నివాసం ఉంటున్న ఆమె.. రైల్వే హిందీ అధికారిగా ఉద్యోగ విరమణ చేశారు. సేంద్రియ ఇంటిపంటల మీద ఆసక్తి ఉన్నప్పటికీ చాలా కాలం అడుగు ముందుకు పడలేదు.ఫేస్బుక్లో తమిళనాడు టెర్రస్ గార్డెన్ గ్రూపు తారసపడడంతో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇంటిపంటల నిపుణులు కర్రి రాంబాబు, తుమ్మేటి రఘోత్తమరెడ్డి మాట సాయంతో ఆమె రెండేళ్ల క్రితం నుంచి ఇంటిపంటలను సాగు చేసుకుంటున్నారు. వేదభవన్ గోశాల నుంచి ఆవు పేడ తెచ్చుకొని చెరువు మట్టి, కొబ్బరిపొట్టును కలిపి.. సిమెంటు కుండీలు, ప్లాస్టిక్/సిల్పాలిన్ కవర్లు/బెడ్స్‌లో వంగ, టమాటా తదితర కూరగాయలు, ఆకుకూరలు, పూలు సాగు చేస్తున్నారు. నేలలో వేసిన సొర పాదును గతంలో మేడ మీద పందిరిపైకి పాకిస్తే.. 40 వరకు సొరకాయలు కాశాయని పద్మావతి(99898 39950) సంతోషంగా చెప్పారు. టమాటా మొక్క, ఆకుకూరలు -
సాక్షి స్ఫూర్తితో ఇంటిపంటల సాగు!
‘సాక్షి’లో ‘ఇంటిపంట’ కాలమ్ స్ఫూర్తితో చీరాల రూరల్ మండలం రామకృష్ణాపురం మండలం సిపాయిపేటకు చెందిన తేళ్ల ఎలిజబెత్ తమ ఇంటిపై సేంద్రియ ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ఎమ్మే బీఈడీ చదివిన ఆమె ప్రైవేటు స్కూల్ టీచర్‌గా పనిచేస్తుండగా భర్త సంజీవరావు ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. భర్త, అత్తమామల ప్రోత్సాహంతో తమ మూడంతస్తుల భవనంపై ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ఆమె సాగు చేస్తున్నారు. బాల్యం నుంచే ఆమెకు మొక్కల పెంపకంపై ఆసక్తి మెండు. వివాహానంతరం మెట్టినింటికి వచ్చిన తర్వాత మూడో అంతస్తులో నివాసం కావడంతో మొక్కల పెంపకానికి కొంతకాలం దూరమయ్యారు. ఆ దశలో ‘ఇంటిపంట’ కాలమ్ స్ఫూర్తితో గత నాలుగేళ్లుగా మేడపైన సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు పెంచుతున్నారు. ఇంటిల్లిపాదీ ఆరోగ్యదాయకమైన కూరగాయలు, పండ్లు తింటున్నారు. ఇసుక, ఎర్రమట్టి మిశ్రమం.. ఎర్రమట్టిలో పావు వంతు ఇసుకను కలిపి కుండీల్లో నింపి మొక్కలు నాటి, తర్వాత నెలా రెండు నెలలకోసారి గేదెల పేడ ఎరువును వేస్తూ ఉంటానని ఎలిజబెత్ తెలిపారు. చీడపీడల నుంచి ఇంటిపంటలను కాపాడుకోవడానికి లీటరు నీటిలో 10 ఎం.ఎల్. వేప నూనె కలపి పిచికారీ చేస్తున్నారు. మొదట ఆకుకూరలతో ఇంటిపంటల సాగు ప్రారంభించి క్రమంగా కూరగాయలు, పండ్ల సాగు చేపట్టారు. 16 పాత ఎయిర్‌కూలర్ల అడుగు భాగాలను సేకరించి వాటిల్లో టమాటా, వంగ తదితర కూరగాయలు పండిస్తుండటం విశేషం. తక్కువ లోతు, ఎక్కువ వెడల్పు గల టబ్‌లలో చుక్కకూర, పాలకూర, గోంగూర తదితర ఆకుకూరలు పెంచుతున్నారు. పండ్ల మొక్కల సాగుకు లోతైన టబ్‌లు, బక్కెట్లు వాడుతున్నారు.వాటర్ యాపిల్, దానిమ్మ, జామ, సపోట, సీతాఫలం, రామాఫలం, నారింజ, అరటి, బొప్పాయి, కమల, వాటర్ యాపిల్, మామిడి, పనస, పంపర పనస, అంజూర, డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష, బత్తాయి. కర్బూజ, చెర్రీ, ఉసిరి మొక్కలను పెంచుతున్నారు. కర్బూజ, వాటర్ యాపిల్, సీడ్లెస్ నిమ్మ, స్వీట్ నిమ్మ, జ్యూస్ నిమ్మ రకాల మొక్కలు కాయలతో కళకళలాడుతున్నాయి. నాలుగైదు రకాల గులాబీలు, మందారాలు, చేమంతులను పెంచుతున్నారు. – కొప్పోలు వాసుబాబు, సాక్షి, చీరాల రూరల్, ప్రకాశం జిల్లా ఇంటిపంటలు ఎంతో రుచికరం.. సేంద్రియ ఎరువులతో కుండీలలో పెంచిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎంతో రుచిగా ఉంటున్నాయి. చాలా వరకు మా మేడపైన పండిన కూరలే ఇంటిల్లిపాదీ తింటున్నాం. ఉదయం గంట, సాయంత్రం గంటపాటు ఇంటిపంటలకు సమయం కేటాయించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను. ఇళ్ల ముందు ఖాళీ ప్రదేశాలు లేని వారు డాబాలపై కుండీలు ఏర్పాటు చేసుకొని పంటలు పండించుకోవచ్చు. మంచి ఆహారం లభించడంతో పాటు మొక్కల్లో పనిచేస్తూ ఉంటే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. – తేళ్ల ఎలిజబెత్ (74167 06209), సిపాయిపేట, చీరాల రూరల్ మండలం, ప్రకాశం జిల్లా -
పచ్చని పంటలే ఆ ఇంటి చిరునామా!
కాంక్రీట్ జంగిల్లా మారిపోతున్న నగరంలోని ఆ ఇంటికి వెళ్తే మాత్రం.. పచ్చదనం పలకరిస్తుంది. పూల పరిమళాలు రారమ్మని పిలుస్తుంటాయి. రెండంతస్తులు ఎక్కితే చాలు.. విభిన్న రకాల పూలు, పళ్లు, ఆకు కూరలు, కూరగాయలతో ఏదైనా పొలంలోకి వచ్చామా అని సంభ్రమాశ్చర్యాలకు లోనైపోతారు. ఇంటికి కావాల్సిన ఆకుకూరలు, కూరగాయలు, పూలు ఏవీ బయట కొనుగోలు చేసే అవసరమేలేకుండా మిద్దెపైనే పండిస్తున్నారు. పర్యావరణంపై ఉన్న ప్రేమతో మేడపై సేంద్రీయ వనాన్ని పెంచుతున్న విశాఖ నగరానికి చెందిన పద్మావతి. టెర్రస్ల పైన సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఔషధ, పూల మొక్కలను మక్కువతో పెంచుతూ.. కాంక్రీటు జంగిల్లో కూడా నిండు పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్న ఇంటిపంటల సాగుదారుల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం నగరంలోనే ఎక్కువగా ఉన్నారు. ఈ జాబితాలో ఒకరు రాంభక్త పద్మావతి. విశాఖ నగరంలోని రామ్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్న పద్మావతి, ఆర్ కె ప్రసాద్ దంపతుల ఇల్లు పచ్చని చెట్లతో నిండి కళకళలాడుతూ ఉంటుంది. ఎమ్మే బీఈడీ, ఎంసీఏ చదివిన పద్మావతికి ఉద్యోగం, సంపాదనపై కన్నా పర్యావరణంపైన, సేంద్రియ ఆహారంపైనే మక్కువ. రచయిత్రిగా సాహితీ రంగంలోనూ రాణిస్తున్న ఆమెకు బాల్యం నుంచే మొక్కల పెంపకంపై అమితాసక్తి. ఆమె అభిరుచికి అనుగుణంగా భర్త ప్రసాద్ కాంట్రాక్టర్ కావడంతో మూడో అంతస్థుపైన టెర్రస్‌ను మొక్కల పెంపకానికి అనువుగా సిమెంటు తొట్లు నిర్మించారు. సిమెంట్, ప్లాస్టిక్, మట్టి కుండీల్లోనూ మొక్కలు పెంచుతూ మేడనే ఓ వనంగా మార్చేశారు. కాలుష్య రహితమైన సౌర విద్యుత్తును ఒడిసిపట్టుకోవడానికి కొన్ని సౌర ఫలకాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. నాలుగేళ్లుగా ఎప్పుడో మరీ అవసరమైనప్పుడు తప్ప కూరగాయలను బయట కొనలేదని పద్మావతి తెలిపారు. మునగ, వంగ తదితర కూరగాయలతో పాటు అరటి, నిమ్మ తదితర పండ్ల మొక్కలనూ సాగు చేస్తున్నారు. వంట గదిలో రెండు కుండీల్లో పుదీనా, కొత్తిమీర పెంచుతున్నారు. టెర్రస్‌పైన, పెంట్ హౌస్ ముందు తోటకూర, గోంగూర, బచ్చలి, పాలకూర, కొత్తిమీర, పుదీనా, ఉల్లికాడలు, మెంతికూర, మొదలైన ఆకుకూరలను సాగు చేస్తున్నారు. వంకాయ, టమాటా, చిక్కుడు, బీర, దోస, సొర, మిరపకాయలు, అల్లం మొదలైన కూరగాయలు పండిస్తున్నారు. ఇంటికి సమీపంలో పశువులు పెంచుతున్న వారి వద్ద నుంచి గోమూత్రం, ఆవు పేడను కొనుగోలు చేసి ఎరువుగా వినియోగిస్తున్నారు. చీడపీడల నివారణకు వేపనూనె, గోమూత్రం, వేపాకు పొడి తదితరాలను నీటిలో కలిపి పద్మావతి పిచికారీ చేస్తున్నారు. ఏపుగా పెరిగిన అరటి గెలలు, మునగ చెట్లు వారి ఇంటిపై పచ్చదనానికి కొండగుర్తుగా దూరం నుంచి కూడా కనిపిస్తుంటాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే..! ‘నగరంలో పచ్చదనం పూర్తిగా తగ్గిపోయింది. నాకు బాధేసింది. అందుకే.. మా ఇంటి వరకూ పర్యావరణం కోసం ఏదైనా చెయ్యాలనే ఆలోచనతోనే మొక్కల పెంపకం ప్రారంభించాను. కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించడంతో ఆకుకూరలు, కూరగాయలతోపాటు ఇలా ప్రతి మొక్కను పెంచసాగాను. మేడపై విస్తారంగా పచ్చదనం పరచుకోవడంతో వేసవిలోనూ ఇల్లు చల్లగా ఉంటోంది. మొక్కలు చూసి మా ఇంటి అడ్రస్ కూడా సులభంగా గుర్తుపడుతున్నారు. – రాంభక్త పద్మావతి, రామ్‌నగర్, విశాఖపట్నం – కరుకోల గోపీకిశోర్ రాజా, సాక్షి, విశాఖ సిటీ -
మట్టి లేని సేంద్రియ ఇంటిపంట!
ఆసక్తి ఉంటే ఇంటిల్లిపాదికీ కావలసినన్ని సేంద్రియ ఆకుకూరలు, తీగ జాతి – చెట్టు జాతి కూరగాయలను మేడపైన పెద్దగా ప్రయాస లేకుండానే పండించుకోవచ్చని అంటున్నారు పొట్లూరి రాజశేఖర్. మట్టి వాడకుండా.. కొబ్బరిపొట్టు, వర్మీ కంపోస్టు, జీవన ఎరువులతో భేషుగ్గా ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. టెలికం సేవల కంపెనీని నిర్వహిస్తున్న రాజశేఖర్.. రైతు కుటుంబంలో పుట్టి వ్యాపార రీత్యా హైదరాబాద్ బంజారాహిల్స్ 3వ నంబరు రోడ్డులోని శ్రీనికేతన్ కాలనీలో స్థిరపడ్డారు. బయట మార్కెట్లో లభించే సేంద్రియ ఉత్పత్తులు ఎంత వరకు సేంద్రియంగా పండించినవో తెలియని అనుమానాస్పద స్థితిలో సొంతంగా ఇంటిపైనే ఆకుకూరలు, కూరగాయలు పండించుకుందామని భావించారు. సేంద్రియ ఇంటి పంటల సేవలు అందించే స్టార్టప్ కంపెనీ హోమ్క్రాప్ను సంప్రదించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (నార్మ్) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన ఉన్నత విద్యావంతులు మన్వితారెడ్డి, షర్మిలారెడ్డి ఈ స్టార్టప్ కంపెనీని గత ఏడాది స్థాపించారు. 7 బెడ్స్.. అనేక పంటలు రాజశేఖర్ ఏడు బెడ్స్(మొత్తం 125 చదరపు అడుగులు)ను 9 నెలల క్రితం ఏర్పాటు చేసుకొని సమృద్ధిగా సేంద్రియ ఇంటిపంటలను సాగు చేసుకుంటున్నారు. చిక్కుడు, దొండ, కాకర, బీర, సొర తీగజాతి కూరగాయలు.. గోంగూర, తోటకూర, పాలకూర, లెట్యూస్ వంటి ఆకుకూరలు.. క్యాబేజి, కాలీఫ్లవర్, వంగ, బెండ, టమాటా వంటి కూరగాయలను సాగు చేస్తున్నారు. మేడపైన గుప్పెడు ఎత్తున ఫైబర్ ఫ్రేమ్ మీద ఫైబర్ షీట్లో (మట్టి అసలు వాడటం లేదు) కొబ్బరి పొట్టు, సేంద్రియ ఎరువులతో కూడిన మిశ్రమాన్ని నింపి.. ప్రతి బెడ్లోనూ చెట్టు జాతి కూరగాయలు లేదా ఆకుకూరలతోపాటు కనీసం ఒక తీగజాతి కూరగాయలను పెంచుతూ చక్కని ఉత్పాదకత సాధిస్తున్నారు. నెలకోసారి చదరపు అడుగుకు అర కిలో చొప్పున (బెడ్‌కు 10 కిలోల వరకు) మాగిన పశువుల ఎరువు లేదా కంపోస్టును వేయడం ద్వారా పంటలకు పోషకాల లోపం లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. నెలకు రెండు సార్లు వేప నూనెను పిచికారీ చేస్తున్నామని, చీడపీడల సమస్య అంతగా లేదని రాజశేఖర్ వివరించారు. పురుగులు టమాటాలను ఆశిస్తున్నప్పుడు వాట్సాప్‌లో ఫొటో పంపి సలహా తీసుకొని, జీవన క్రిమిసంహారిణిని వాడామన్నారు. ఎర్ర చీమల సమస్య వచ్చినప్పుడు వీరి సలహా మేరకు 50 ఎం.ఎల్. నాన్ ఫ్రూట్ వెనిగర్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేశామని రాజశేఖర్ తెలిపారు. ఒక పూటే తగుమాత్రంగా నీరు చల్లుతున్నామన్నారు. మట్టి లేకుండా సాగు చేసినప్పటికీ ఆయన ఇంటిపంటలు చక్కని దిగుబడులనిస్తున్నాయి. బయటి కూరలు తిన్నప్పుడు రసాయనాల వాసన ఇట్టే తెలిసిపోతుంది! ఇంటిపంటల సాగును ప్రారంభించడానికి తొలుత ఖర్చయినప్పటికీ తదనంతరం పెద్దగా ఖర్చులేమీ లేవు. రుచికరమైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు తింటూ ఉంటే చాలా సంతృప్తిగా ఉంది. ఎప్పుడైనా బయటి కూరలు తిన్నప్పుడు వాటిలో రసాయనాల వాసన ఇట్టే తెలిసిపోతుంది. బయట మార్కెట్లో సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు లభిస్తున్నప్పటికీ.. అవి ఎంత వరకు సేంద్రియంగా పండించినవో తెలియని స్థితి నెలకొంది. నగరవాసులు ఎవరికి వారు ఇంటిపంటలు పండించుకోవడమే ఉత్తమం. – పొట్లూరి రాజశేఖర్ (98490 94575), శ్రీనికేతన్ కాలనీ, రోడ్డు నంబర్ 3, బంజారాహిల్స్, హైదరాబాద్ కొబ్బరి పొట్టు, వర్మీ కంపోస్టు.. 40% కొబ్బరి పొట్టు + 40% వర్మీ కంపోస్టు+ 10% జీవన ఎరువులను కలిపిన మిశ్రమంలో ఇంటిపంటలను సాగు చేయిస్తున్నాం. దీని వల్ల మేడపైన బరువుతోపాటు నీటి ఖర్చు కూడా తగ్గుతుంది. బెడ్స్, వర్టికల్ ప్లాంటర్స్, గ్రోబాగ్స్‌ను ఇంటిపంటల సాగుదారులకు అందుబాటులోకి తెచ్చాం. నలుగురున్న కుటుంబానికి 100 నుంచి 125 చదరపు అడుగుల్లో ఇంటిపంటలు సాగు చేసుకుంటే సరిపోతాయి. ఏయే మొక్కల పక్కన ఏయే మొక్కలు వేయాలి? మొక్కల బాగోగులు ఎలా చూసుకోవాలి? వంటి విషయాలను ఇంటిపంటలను కొత్తగా చేపట్టే వారికి తొలి దశలో మా సిబ్బంది నేర్పిస్తారు. మేలైన విత్తనాలూ ఇస్తాం. ఆ తర్వాత కూడా వాట్సాప్, ఫోన్ ద్వారా తోడ్పాటునందిస్తున్నాం. రెండు, మూడు వారాలకోసారి అవసరాలకు తగినట్లు విత్తనాలు వేసుకుంటే ఏడాదంతా ఇంటిపంటలకు కొరత ఉండదు. – ఎల్లు షర్మిలా రెడ్డి (81799 82232),హోమ్‌క్రాప్ డైరెక్టర్ – ఆపరేషన్స్ (homecrop.in) – ఫొటోలు: తూనుగుంట్ల దయాకర్, సాక్షి, ఫొటో జర్నలిస్టు -
విశ్రాంత జీవనం.. ఆకుపచ్చని లోకం!
వ్యవసాయంలో ఎమ్మెస్సీ చదువుకున్న గుడిపాటి జీవన్‌రెడ్డి 35 ఏళ్లు బ్యాంకు ఉద్యోగం చేసిన తర్వాత.. తన ఇంటిపైనే ఆధునిక వసతులతో సేంద్రియ ఇంటి పంటలను సాగు చేస్తున్నారు. ఇనుప చువ్వల పందిరిపై గ్రీన్ షేడ్‌నెట్ వేసి.. 250కి పైగా కుండీలు, డ్రమ్స్, గ్రోబాగ్స్‌లో 15 రకాల కూరగాయలు, ఆకుకూరలు పుష్కలంగా పండించుకొని తింటూ ఇంటిల్లపాదీ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సింగాపురానికి చెందిన జీవన్‌రెడ్డి ఆంధ్రా బ్యాంక్‌లో 35 ఏళ్లు సేవలందించి సీనియర్ మేనేజర్‌గా రిటైరైన తర్వాత.. హన్మకొండ బ్యాంక్ కాలనీలో 2012లో మూడంతస్థుల ఇల్లు నిర్మించుకున్నారు. తమ ఇంటిపైనే ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఆకుకూరలు, కూరగాయల సాగుకు రెండేళ్ళ క్రితం శ్రీకారం చుట్టారు. విశ్రాంత జీవితంలో పచ్చని మొక్కలతోనే సహచర్యం చేస్తున్నారు. ఇంటిపంటల సాగు చక్కని వ్యాపకంతో పాటు రోజుకు 3 గంటల పాటు ఆనందదాయకమైన వ్యాయామంగా కూడా మారిందని ఆనందంగా చెబుతున్నారు.. కాలనీ అభివృద్ధి కమిటీ సంయుక్త కార్యదర్శిగా ఉంటూ.. నలుగురిలోనూ సేంద్రియ ఇంటిపంటల సాగుపై ఆసక్తిని రేకెత్తిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 250కి పైగా కుండీలు, డ్రమ్ములు.. మొదట్లో కొంచెం ఎక్కువ ఖర్చయినా పుష్కలంగా నిరంతరం ఆకుకూరలు, కూరగాయల దిగుబడి వచ్చేలా అత్యంత ప్రణాళికాబద్ధంగా, శాస్త్రీయంగా ఇంటిపంటలను సాగు చేస్తుండడం జీవన్‌రెడ్డి ప్రత్యేకత. ఎత్తుల వారీగా ఇనుప బెంచీలను తయారు చేయించి, వాటిపైన కుండీలను, డ్రమ్ములను ఉంచి ఆకుకూరలు, కూరగాయలు పెంచుతున్నారు. 40 కుండీల్లో టమాటాలు, 10 కుండీల్లో మిరపకాయలు, 30 కుండీల్లో వంకాయలు, 20 కుండీల్లో గోరుచిక్కుడు, 4 కుండీల్లో బంగాళదుంపలు, రెండు కుండీల్లో అల్లం సాగు చేస్తున్నారు. చిన్న కంటెయినర్లు, గ్రోబాగ్స్‌లో క్యాబేజి, కాలీఫ్లవర్ వేశారు.మార్కెట్లో దొరికే వాటర్ డ్రమ్ములు 15 తెచ్చి.. వాటిని నిలువుగా కోసి 30 కుండీలుగా మార్చి.. ఆకుకూరలు వేశారు. నీరు నిలబడకుండా అదనపు నీరు కిందికి వెళ్లిపోవడం కోసం డ్రమ్ము అడుగున ఒక చిన్న బెజ్జం పెట్టి.. దానిపైన చిప్స్, గండ్ర ఇసుక వేసి దానిపైన ఎరువు కలిపిన మట్టి మిశ్రమాన్ని నింపారు. పాలకూర 4, మెంతికూర 3, గోంగూర 3, ఉల్లి కాడలు 4, కొత్తిమీర 3 డ్రమ్ముల్లో వేశారు. ఆకుకూరల విత్తనాలు వేసిన నెలరోజుల్లో కోతకు వస్తాయి. 12–15 రోజుల వ్యవధిలో విత్తనాలు వేస్తూఉండటం వల్ల ఆకుకూరలు, కూరగాయలు సంవత్సరం పొడవునా లోటు లేకుండా చేతికి అందివస్తున్నాయని జీవన్‌రెడ్డి తెలిపారు. ఉదాహరణకు.. గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు టమాటా నారు 3 దఫాలుగా పోసి, మొక్కలు నాటుకున్నారు. డ్రమ్ముల్లో ప్రతి సారీ ఆకుకూర పంటల మార్పిడి పాటించడం వల్ల చక్కని పంట దిగుబడులు వస్తున్నాయన్నారు. మట్టిలో రసాయనిక అవశేషాలతో తిప్పలు.. హైబ్రిడ్ విత్తనాల కన్నా సేంద్రియ సాగులో దేశీ విత్తనాలే మంచి దిగుబడినిస్తున్నాయన్నారు. రెండు ట్రాక్టర్ల ఎర్రమట్టి తెప్పించి.. సగం మట్టి, సగం వర్మీకంపోస్టు, కొబ్బరిపొట్టు, పెరిలైట్ కలిపి తయారు చేసుకున్న మట్టిమిశ్రమంలో జీవన్‌రెడ్డి ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడిన పొలాల్లో మట్టి తేవడం వల్ల తొలి ఏడాది ఇంటిపంటలు సక్రమంగా రాక నీరసం వచ్చిందన్నారు. మట్టి ఆరోగ్యం బాగుపడిన తర్వాత రెండో ఏడాది పంటలు బాగా వస్తున్నాయని ఉత్సాహంగా చెప్పారు. రాలిన ఆకులు, వంటింటి వ్యర్థాలతో తయారు చేసుకునే కంపోస్టు, వేపపిండిని నెలకోసారి కొంచెం కొంచెంగా వేస్తున్నారు. 10–12 రోజులకోసారి వేపనూనె పిచికారీ చేస్తున్నారు. మొక్కలు నాటిన లేదా మొలిచిన 2–3 రోజుల్లోనే వేపనూనె చల్లితే చీడపీడల బెడద అంతగా ఉండదన్నది తన అనుభవమని తెలిపారు. మొదట్లోనే ఆకులు తెంపెయ్యాలి.. జీవన్‌రెడ్డి మొక్కలకు రోజూ ఉదయం వేళలో స్వయంగా నీరు పోస్తుంటారు. డ్రిప్ ద్వారా నీరిస్తే ఐదు నిమిషాల్లో పని పూర్తవుతుందని, అయితే ఏ మొక్క ఎలా ఉందో మనకు తెలియదన్నారు. గోరుముద్దలు తినిపించే తల్లికి, బిడ్డకు మధ్య పెరిగే అనుబంధం, ఆనందం వంటిదే ఇది కూడానని జీవన్‌రెడ్డి మురిపెంగా చెప్పారు. ఉదయపు నీరెండలో అదే వ్యాయామంగా భావిస్తున్నారు.పురుగూ పుట్రా కనిపిస్తే ఏరోజుకారోజు చేతులతో ఏరేయడమే ఇంటిపంటలకు ఉత్తమ మార్గమని ఆయన అంటున్నారు. టమాటాకు ఆకుమచ్చ(లీఫ్‌మైనర్) సమస్య కనిపించిన తొలిదశలోనే ఆకులను తెంపి, నాశనం చేయడం ఉత్తమం. బెండలో పేనుబంకను గమనించిన వెంటనే వేళ్లతో తీసి నేలమీద వేయాలి. గట్టి వత్తిడితో నీటిని పిచికారీ చేసినా పేనుబంక పోతుంది. అంతగా అయితే వేపనూనె పిచికారీ చేయాలన్నారు. పాలకూరను ఆశించే గొంగళిపురుగులు సాయంత్రం 5 గంటల తర్వాత మట్టిలో నుంచి బయటకు వస్తాయని, ఆ వేళలో కాచుకొని చూస్తూ పురుగులను ఏరేయాలని సూచిస్తున్నారు. హన్మకొండలో జీవన్‌రెడ్డి ఇంటిపైకనువిందు చేస్తున్న ఇంటిపంటలు ప్రతి ఆదివారం ఉచిత శిక్షణ ఇస్తా.. బెంగళూరుకు చెందిన సేంద్రియ ఇంటిపంటల నిపుణుడు డా. విశ్వనాథ్ స్ఫూర్తితో నేను ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టాను. నాకు ఇంటిపంటల పనులు, కాలనీ అభివృద్ధి తప్ప మరే వ్యాపకమూ లేదు. గాఢమైన ఆసక్తి ఉంటే ఇంటిపంటల సాగు కష్టమనిపించదు. నాలా అందరూ ఇంత ఖర్చు పెట్టనక్కరలేదు. తక్కువ ఖర్చుతోనూ ప్రారంభించవచ్చు. మా కాలనీవాళ్లకు కూడా ఇదే చెప్తున్నాను. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మా ఇంటితోటలోనే ఉచితంగా శిక్షణ ఇవ్వదలచాను. ఆసక్తి ఉన్న వారెవరైనా ముందు నాకు ఫోన్ చేసి రావచ్చు. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడానికి వాట్సాప్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేశాను. – గుడిపాటి జీవన్‌రెడ్డి (99630 99830), బ్యాంక్ కాలనీ, హన్మకొండ పాడితోనే బాగుపడ్డాం.. క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే కుటుంబ నికరాదాయాన్ని పెంచుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని మహిళా రైతు నాగిరెడ్డి విజయగౌరి అనుభవపూర్వకంగా చెబుతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్ మండలం రాజుపేట గ్రామానికి చెందిన విజయగౌరి పెద్దగా చదువుకోకపోయినా.. పాడి పశువుల పోషణకు సంబంధించి తెలుసుకున్న ప్రతి విషయాన్నీ ఆసక్తిగా నోట్స్ తయారు చేసుకుంటూ.. ఆ పనిని ప్రణాళికాయుతంగా చేపడుతూ ఉత్తమ పాడి రైతుగా పలు అవార్డులు, రివార్డులను అందుకున్నారు. 18 పాడి çపశువులను పెంచుతూ రోజూ విశాఖడైరీ పాలకేంద్రానికి 80 నుంచి 100 లీటర్ల పాలు పోస్తున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి కుటుంబాన్ని ఆర్థికాభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. ఆమె మాటల్లోనే విందాం. ‘ఎనిమిదేళ్ల క్రితం కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంతో పశువుల పెంపకంపై దృష్టిసారించాను. అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పశుక్రాంతి పథకం ద్వారా మూడు ఆవులతో డైరీ పెట్టాను. నా భర్త రామారావు సహకారంతో ప్రస్తుతం మొత్తం 15 ఆవులు 5 దూడలు పెంచుతూ పాల ఉత్పత్తి చేస్తున్నాను. రోజుకు సాధారణ స్థితిలో అయితే 80 నుంచి 100 లీటర్ల పాలు విశాఖ డైరీ పాలకేంద్రానికి అందిస్తున్నాం. పశువుల పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకొని వాడుకుంటున్నాం. భర్తతో కలసి ఉదయం 3.30 గంటలకు నిద్ర లేచి రాత్రి 10 గంటల వరకు పనులు చేసుకుంటున్నాం. డైరీలో లీటరుకు రూ. 23, బయట రూ. 30 వస్తున్నది. పశువుల పెంపకం వలన మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. నా కుమారుడు నాగేంద్రకుమార్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కుమార్తె యశోద ఇంజనీరింగ్ చదువుతున్నది’ అన్నారామె. – రంపా రాజమోహనరావు, సాక్షి, బొబ్బిలి రూరల్ నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ – కొల్ల కృష్ణకుమార్, సాక్షి, హన్మకొండ -
ఏటా 18 కోట్ల టన్నుల ఇంటిపంటల దిగుబడి!
నగరాలు, పట్టణాల్లో ఇళ్ల మధ్య, ఇళ్లపైన ఖాళీ స్థలాల్లో సేంద్రియ ఇంటిపంటలు సాగు చేయటం ప్రపంచమంతటా విస్తరిస్తున్నది. ఇంతకీ పట్టణ, నగర ప్రాంతాల్లో సేంద్రియ ఇంటిపంటల ద్వారా ఏటా ఎంత పంట పండించవచ్చు? దాని విలువ ఎంత?? 10 నుంచి 18 కోట్ల టన్నుల ఆహారాన్ని ఉత్పత్తి చేయొచ్చని ఈ ఆహారం విలువ ఏకంగా 8,000 కోట్ల నుంచి 16,000 కోట్ల డాలర్లని అమెరికాకు చెందిన అరిజోనా స్టేట్ యూనివర్సిటీ తాజాగా లెక్క తేల్చింది. ఈ అంశంపై ఇదే తొట్టతొలి సమగ్ర అధ్యయనంగా భావిస్తున్నారు. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఆర్థిక తోడ్పాటుతో.. ఆహార, వ్యవసాయ సంస్థ గణాంకాలు.. గూగుల్ ఎర్త్ ఇంజిన్ సాంకేతిక సహకారంతో ఈ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం వివరాలను అమెరికన్ జియోఫిజికల్ యూనియన్‌కు చెందిన ‘ఎర్త్ ఫ్యూచర్’ జర్నల్ ఇటీవల ప్రచురించింది. సేంద్రియ ఇంటిపంటల వల్ల ప్రయోజనం చక్కని ఆహారం మాత్రమే కాదండోయ్.. పర్యావరణ సేవలు కూడా భారీగానే అందుతున్నాయి. అంతేకాక, పట్టణాల్లో ఇంటిపంటల చల్లదనం వల్ల ఏటా 1,400–1,500 కోట్ల కిలోవాట్ అవర్స్ మేరకు విద్యుత్తు ఆదా అవుతుంది. లక్ష నుంచి లక్షా 70 వేల టన్నుల నత్రజనిని ప్రతి ఏటా ఇంటిపంటలు మట్టిలో స్థిరీకరిస్తాయి. 4,500–5,700 కోట్ల క్యూబిక్ మీటర్ల మేరకు వర్షపు నీరు వృథాగా కొట్టుకుపోకుండా ఇంటిపంటలు ఒడిసిపట్టగలుగుతాయని అంచనా. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ పర్యావరణ సేవలన్నిటి విలువ ఏకంగా 3,300 కోట్ల డాలర్లట! -
డాబాలపైన సామూహిక ఇంటిపంటలు!
నగరహరితం నగరాల్లో విస్తరిస్తున్న ఇంటిపంటల సంస్కృతి కొత్త పోకడలను సంతరించుకుంటోంది. ఇంటి పంటల సాగులో ముంబైవాసులు మరో అడుగు ముందుకేశారు. ఎవరింటిపై వారే సేంద్రియ ఇంటిపంటలను సాగు చేసే ధోరణికి భిన్నంగా.. ముంబై వాసులు తోటి వారితో కలిసి సామూహిక ఇంటిపంటలను సాగు చేస్తున్నారు. ముంబైలోని అర్బన్ లీవ్స్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ నగరంలోని అనేక ప్రాంతాల్లో పాఠశాలలు, సేవా సంస్థల భవనాలపైన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కొందరు ఔత్సాహికులు మాతుంగాలోని డాన్‌బాస్కో స్కూల్ భవనంపై గత రెండేళ్లుగా సామూహికంగా ఇంటిపంటలను సాగు చేస్తున్నారు. వివిధ రకాల పండ్లు, కూరగాయ మొక్కలు, ఔషధ మూలికలను సాగు చేస్తున్నారు. ప్రతి ఆదివారం సామూహిక ఇంటిపంటల క్షేత్రాల్లో అందరూ కూడి పనులు చేస్తారు. పిల్లలు, పెద్దలు వారాంతపు సెలవును ప్రకృతితో మమేకం అయ్యేందుకు ఉపయోగిస్తున్నారు. వంటింటి వ్యర్థాలతో ఇంటిపంటలకు అవసరమైన సేంద్రియ ఎరువు అమృత్‌మట్టిని భవనాలపైన మడుల్లోనే తయారు చేసుకుంటారు. ఆ తర్వాత అదే మడుల్లో నవధాన్యాలతో పచ్చిరొట్ట పెంచి.. మొక్కలను కత్తిరించి తిరిగి మట్టిలో కలిపేస్తారు. తదనంతరం పంటల సాగు ప్రారంభిస్తారు. ఈ క్రమంలో చెరకు పిప్పిని విరివిగా వినియోగిస్తారు. ఇటుకలను అందమైన వివిధ ఆకృతుల్లో పేర్చి సమృద్ధంగా ఇంటిపంటలు పండిస్తారు. కేవలం కూరగాయలు, పండ్ల సాగు కోసమే కాక.. సామూహిక ఇంటిపంటలు పక్షులకూ ఆవాసాన్ని కల్పిస్తుండడం విశేషం. సామూహిక ఇంటిపంటల సాగు ద్వారా రసాయన రహిత ఆహారాన్ని పండిస్తున్న అర్బన్ లీవ్స్ ఇండియా బృందం ముంబైని ఇతర నగరాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతోంది. www.urbanleaves.org www.facebook.com/UrbanLeavesIndia/ -
చదువుల తల్లి ఒడిలో ఇంటిపంటల కొలువు!
ఏడాది పొడవునా ఇంటిపంటలతోనే కూరలు... వెయ్యి చదరపు గజాల కిచెన్ గార్డెన్తో 3 కుటుంబాలకు పూర్తిస్థాయిలో కూరగాయలు ఇంటి నుంచి బడికి పాకిన ఇంటిపంటలు.. స్కూలు విద్యార్థులకూ శిక్షణ పచ్చని ఆకుకూరలు, కూరగాయ మొక్కలు నిండుగా కొలువుదీరిన ఇంటిపంటల దర్బారు ఆ రెండంతస్తుల మేడ పైకప్పు. ఆకుపచ్చని జీవన శైలిని నెత్తికెత్తుకున్న ఆ కుటుంబం ఏడాది పొడవునా స్వచ్ఛమైన, తాజా ఇంటిపంట దిగుబడులపైనే ఆధారపడుతూ నగరవాసులకు ఆదర్శంగా నిలుస్తోంది. ముచ్చటగొలిపే ఇంటిపంటల సాగును స్కూలు విద్యార్థులకూ నేర్పిస్తుండడం విశేషం. ‘రసాయనాలతో విషతుల్యం కాని సహజ ఇంటిపంటలను ఇక మీరూ పండించుకోండ’ంటూ వారి కిచెన్ గార్డెన్ చూపరుల మదిలో ఆకుపచ్చని ఆలోచనను మొలకెత్తిస్తున్నాయి! ఆరోగ్యదాయకమైన జీవనశైలికి సేంద్రియ ఇంటిపంటల సాగును జోడించినప్పుడే పరిపూర్ణత చేకూరుతుందని ఆచరణాత్మకంగా చాటి చెబుతోంది హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌కు చెందిన దుబ్బాక దయాకర్‌రెడ్డి కుటుంబం. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరెడలో పుట్టిన దయాకర్‌రెడ్డి నగరానికి వచ్చిన కొత్తల్లో ఆల్విన్‌లో కొంతకాలం పనిచేశారు. ప్రగతినగర్ రూపశిల్పుల్లో ఒకరైన ఆయన స్థానిక ఎంపీటీసీగా, ప్రగతి సెంట్రల్ స్కూల్‌కు కరస్పాండెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. దృఢమైన సంకల్పం, ఆరోగ్యంపై శ్రద్ధ మెండుగా ఉంటే.. మహానగరంలో నివాసం ఉంటూ కూడా.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలను ఏడాది పొడవునా ఇంటిపట్టునే పండించుకోవచ్చని దయాకర్‌రెడ్డి కుటుంబం రుజువు చేస్తోంది. మేడపైన వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇంటిపంటలు పండిస్తున్నారు. ఇటుకలతో నిర్మించిన 8 బెడ్స్, గుండ్రటి సిల్పాలిన్ బెడ్లు పది, వందకుపైగా పెయింట్ డబ్బాలూ వాడుతున్నారు. 8 రకాల ఆకుకూరలు, 6 రకాల కూరగాయలు, బీర, సొర, కీరతోపాటు బీట్రూట్, క్యారట్ కూడా పండిస్తున్నారు. టై మొత్తానికీ 8 అడుగుల ఎత్తులో అమర్చిన ఇనుప ఫ్రేమ్‌కు సొర, బీర తీగలను పాకిస్తున్నారు. ఎండాకాలంలో షేడ్‌నెట్ వేయడానికి, కోతుల నుంచి రక్షణకు ఇది ఉపయోగపడుతోంది. ఎర్రమట్టి 40% + కొబ్బరి పొట్టు 40% + పశువుల ఎరువు 20% కలిపిన మట్టిమిశ్రమాన్ని వాడుతున్నారు. తగినంత నీరు పోయడం తప్ప వేటినీ పిచికారీ చేయడం లేదని, జీవామృతం వాడదామని అనుకుంటున్నామని దయాకర్‌రెడ్డి తెలిపారు. దయాకర్‌రెడ్డి భార్య అరుణ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కుమారుడు డా. రాహుల్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్నారు. తీరిక వేళల్లో ఇంటిపంటల పనులతో రిలాక్స్ అవడం కుటుంబ సభ్యులందరికీ ఎంతిష్టమో మొక్కల పచ్చదనమే చాటిచెబుతోంది. - పంతంగి రాంబాబు ఫొటోలు: మిరియాల వీరాంజనేయులు ఏడాది పొడవునా ఇంటి కూరలే! మా టై కిచెన్ గార్డెన్లో అన్ని కాలాల్లోనూ పూర్తిగా ఆధారపడదగిన రీతిలో ఇంటిపంటలు సాగు చేస్తున్నాం. 3 చిన్న కుటుంబాలకు పూర్తిస్థాయిలో, మరో కుటుంబానికి పాక్షికంగా సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు అందుతున్నాయి. ఎండాకాలంలోనూ 2 కుటుంబాలకు అందాయి. చాలా మంది బంధుమిత్రులు చూసి వెళ్తున్నారు. నలుగురైదుగురు తమ ఇళ్లపైన సాగు చేస్తున్నారు. ఇటుకలతో పక్కా బెడ్స్ నిర్మించటం కన్నా.. అటూ ఇటూ మార్చుకోవడానికి వీలయ్యే సిల్పాలిన్ బెడ్సే ఉపయోగకరం. ఆరోగ్యదాయకమైన ఇంటిపంటల సాగును మా స్కూల్ విద్యార్థులకూ నేర్పిస్తున్నాం. - దుబ్బాక దయాకర్‌రెడ్డి (93910 08248), ప్రగతినగర్, హైదరాబాద్