ప్లాస్టిక్ మగ్గుకు అడుగున జల్లెడలా చిన్న బెజ్జాలు పెట్టి మొక్కలకు నీళ్లు పోస్తున్న మణిరత్నం
మచిలీపట్నం రాజుపేటకు చెందిన యువకుడు అన్నా మణిరత్నం తమ ఇంటిపైన ఔషధ, ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కల వనాన్ని సృష్టించారు. మేడపైన కుండీలు, టబ్‌లలో జీవామృతంతో సేంద్రియ ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. మేడపైకి అడుగుపెడితే సువాసనలు వెదజల్లుతాయి. నాటిన ప్రతీ మొక్క ఆయర్వేద వైద్యంలో ఉపయోగపడేదే. అక్కడ ఉన్న మొక్కలతో తయారు చేసే మందులతో చాలా రకాలైన వ్యాధులను నయం చేయవచ్చని చెబుతున్నారు మణిరత్నం. అక్కడ కనిపించే ప్రతీ మొక్కలోనూ ఓ పరమార్థం కనిపిస్తోంది. వాయు కాలుష్యాన్ని పారదోలి ఆరోగ్యదాయకమైన గాలిని పొందడంతోపాటు ఔషధ మొక్కల ఆకులతో ఇంటిల్లి్లపాదీ రోజుకో రకం కషాయం సేవిస్తూ ఆరోగ్యంగా ఉన్నామని మణిరత్నం అన్నారు. రసాయనిక అవశేషాల్లేని ఆకుకూరలు, కూరగాయలతోపాటు పండ్లను సైతం 2017 నవంబర్ నుంచి సాగు చేస్తున్నారు. సీఏ చదివిన మణిరత్నం ఆరోగ్యపరిరక్షణకు అవసరమయ్యే వివిధ రకాల ఆయుర్వేద మొక్కలను పెంచుతుండడంతో అమ్మ కృష్ణవేణి, నాన్న ఆంజనేయులు ప్రోత్సహించారు. వారూ మొక్కల పెంపకంలో భాగస్వాములు కావటంతో వారి ఇంటి పరిసరాలు ఔషధ మొక్కల సువాసనలతో నిండిపోతోంది. ప్లాస్టిక్ డబ్బాలు, మట్టి కుండలు, బక్కెట్లలో మట్టి, సేంద్రియ ఎరువు నింపి మొక్కలు పెంచుతున్నారు.
675 చదరపు అడుగుల డాబాపైన సుమారుగా 70కు పైగానే వివిధ రకాల ఆయుర్వేద మొక్కలను పెంచుతున్నారు. అడ్డసరం, మల్టీవిటమిన్‌ప్లాంట్, ఇన్సులిన్ ప్లాంట్, పొడపత్రి, గుగ్గులు, గలిజేరు, అవిశ, రణపాల, కొండపిండి ఆకు, కాడ జెముడు, నిమ్మగడ్డి, సిట్రోనెల్ల, నేల ఉసిరి, తుర్కవేప, వాము ఆకు, వావిలి ఆకు, గుంటగలకరాకు, వెన్న ముద్దాకు, నేలవేము, కలబంద, నల్లేరు, తుంగమస్తులు, సిందూరం, కుందేటి చెవి వంటి ఆయుర్వేద మొక్కలే కాకుండా పండ్ల మొక్కలు, సుగంధాలను వెదజల్లే మొక్కలను అక్కడ పెంచుతున్నారు. వీటì తో తయారు చేసే ఔషధాలతో దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేయవచ్చని, అవగాహన కోసం అధ్యయనం చేస్తున్నానని మణిరత్నం అంటున్నారు. జీవామృతం ప్రతి 15 రోజులకోసారి పిచికారీ చేయడం, నీటిలో కలిపి కుండీల్లో పోయడం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. రాలిన ఆకులు, చెత్తను డ్రమ్ములో వేసి ఎరువు తయారు చేస్తున్నారు.
– కోవెల కాశీ విశ్వనాథం, సాక్షి, మచిలీపట్నం
ఆరోగ్యం.. ఆహ్లాదం..
మొక్కలంటే ఇష్టం. వాటిని ప్రేమతో చూసుకుంటున్నాను. ఉదయపు నీరెండకు మిద్దె తోట పనులు చేసుకుంటే చాలు. వాకింగ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. రసాయనిక అవశేషాల్లేకుండా ఇంటిపట్టున పెంచుకునే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతోపాటు ఔష«ధాలు, కషాయాలు ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేస్తాయి. ఇంటిల్లపాదికీ ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందించే ఇంటిపంటల సాగుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని ఆచరించాలి.
– మణిరత్నం (88853 82341), రాజుపేట, మచిలీపట్నం
రణపాల మొక్కతో...
Comments
Please login to add a commentAdd a comment