కోడిగుడ్లు, నూనెల మిశ్రమం, డ్రమ్ములో సిద్ధంగా ఉన్న ద్రావణం
సేంద్రియ ఇంటిపంటలను మనసు పెట్టి సాగు చేసే అనుభవజ్ఞులు కొత్త ఆలోచిస్తూ, కొత్త కొత్త ద్రావణాలు తయారు చేసి వాడుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ కోవలోని వారే పినాక పద్మ శ్రీనివాస్ దంపతులు. హైదరాబాద్ మియాపూర్‌లో 850 చదరపు అడుగుల మేడ మీద దగ్గర దగ్గరగా పేర్చిన 500 కుండీలు, టబ్‌లు, గ్రోబాగ్స్‌లో దట్టమైన ఇంటిపంటల అడవినే సృష్టించారు. మండు వేసవిలోనూ షేడ్‌నెట్ అవసరం లేకుండా ఇంటిపంటలను చల్లగా సాగు చేసుకుంటున్నారు. పోషక లోపం రాకుండా చూసుకోవడం విజయవంతంగా ఇంటిపంటల సాగుకు ఒకానొక కీలకాంశం. ఇందుకోసం పద్మ శ్రీనివాస్ కోడిగుడ్లు+నూనెల ద్రావణాన్ని వాడుతున్నారు. ఆమె మాటల్లోనే..
‘‘వేపనూనె + కొబ్బరి నూనె + రైస్ బ్రాన్ (బియ్యం తవుడు) ఆయిల్.. ఈ నూనెలన్నీ కలిపి 150 ఎం.ఎల్. తీసుకోవాలి. ఈ నూనెలను తొలుత మిక్సీ జార్‌లో పోసి గ్రైండ్ చెయ్యాలి. ఆ తర్వాత రెండు కోడిగుడ్లు పగులగొట్టి జార్‌లో పోసి.. మళ్లీ గ్రైండ్ చెయ్యాలి. తర్వాత ఒక గ్లాస్ నీటిని పోసి మళ్లీ గ్రైండ్ చెయ్యాలి. అంతే.. కోడుగుడ్లు + నూనెల ద్రావణం రెడీ. ఈ ద్రావణాన్ని డ్రమ్ములోని వంద లీటర్ల నీటిలో కలిపి.. ఆ నీటిని మొక్కలకు మట్టిలో ఉదయం వేళలో పోయాలి. సాయంత్రం పోస్తే ఆ వాసనకు పందికొక్కులు మట్టి తవ్వేస్తాయి. సాధారణంగా రోజూ పోసే నీటికి బదులు, అదే మోతాదులో, ఈ ద్రావణాన్ని పోయాలి.
నేను 15 రోజులకు ఒకసారి మొక్కల మొదళ్లలో ఈ ద్రావణం పోస్తున్నాను. అప్పుడప్పుడూ లీటరు నీటికి 5 ఎం.ఎల్. కోడిగుడ్డు+నూనెల ద్రావణాన్ని కలిపి మొక్కలపై పిచికారీ కూడా చేస్తాను. అవే నూనెలు ప్రతిసారీ వాడకూడదు. మార్చుకోవాలి. ఆవ నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూ¯ð ల్లో ఏదో ఒక నూనెను మార్చి మార్చి కలుపుకోవాలి. ఈ ద్రావణం వల్ల మొక్కలు దృఢంగా, గ్రీన్‌గా, కాయలు కూడా పెద్దగా పెరుగుతాయి. చీడపీడలు కూడా ఆశించవు. కోడిగుడ్లు, రకరకాల నూనెల్లోని పోషకాలతో కూడి ఉన్నందువల్ల ఈ ద్రావణం మొక్కలు, చెట్లకు ఒకవిధంగా బూస్ట్ లాగా పనిచేస్తుంది. దీన్ని తయారు చేసుకున్న
రోజునే వాడాలి.
మరో రకం ద్రావణం కూడా వాడుతుంటాను. వేరుశనగ చెక్క అర కేజీ, ఆవాల చెక్క అర కేజీ, బెల్లం 200 గ్రాములు వేసి కలిపి 20 లీటర్ల నీటిలో కలిపి.. ఆ ద్రావణాన్ని 3 రోజులు పులియబెడతాను. 5 లీటర్ల ద్రావణాన్ని వంద లీటర్ల నీటిలో కలిపి మొక్కలకు పోస్తుంటాను.’’
– పినాక పద్మ శ్రీనివాస్ (94406 43065), మియాపూర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment