Shade net
-
ఇంటిపంటలకు బలవర్థకం
సేంద్రియ ఇంటిపంటలను మనసు పెట్టి సాగు చేసే అనుభవజ్ఞులు కొత్త ఆలోచిస్తూ, కొత్త కొత్త ద్రావణాలు తయారు చేసి వాడుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ కోవలోని వారే పినాక పద్మ శ్రీనివాస్ దంపతులు. హైదరాబాద్ మియాపూర్‌లో 850 చదరపు అడుగుల మేడ మీద దగ్గర దగ్గరగా పేర్చిన 500 కుండీలు, టబ్‌లు, గ్రోబాగ్స్‌లో దట్టమైన ఇంటిపంటల అడవినే సృష్టించారు. మండు వేసవిలోనూ షేడ్‌నెట్ అవసరం లేకుండా ఇంటిపంటలను చల్లగా సాగు చేసుకుంటున్నారు. పోషక లోపం రాకుండా చూసుకోవడం విజయవంతంగా ఇంటిపంటల సాగుకు ఒకానొక కీలకాంశం. ఇందుకోసం పద్మ శ్రీనివాస్ కోడిగుడ్లు+నూనెల ద్రావణాన్ని వాడుతున్నారు. ఆమె మాటల్లోనే.. ‘‘వేపనూనె + కొబ్బరి నూనె + రైస్ బ్రాన్ (బియ్యం తవుడు) ఆయిల్.. ఈ నూనెలన్నీ కలిపి 150 ఎం.ఎల్. తీసుకోవాలి. ఈ నూనెలను తొలుత మిక్సీ జార్లో పోసి గ్రైండ్ చెయ్యాలి. ఆ తర్వాత రెండు కోడిగుడ్లు పగులగొట్టి జార్లో పోసి.. మళ్లీ గ్రైండ్ చెయ్యాలి. తర్వాత ఒక గ్లాస్ నీటిని పోసి మళ్లీ గ్రైండ్ చెయ్యాలి. అంతే.. కోడుగుడ్లు + నూనెల ద్రావణం రెడీ. ఈ ద్రావణాన్ని డ్రమ్ములోని వంద లీటర్ల నీటిలో కలిపి.. ఆ నీటిని మొక్కలకు మట్టిలో ఉదయం వేళలో పోయాలి. సాయంత్రం పోస్తే ఆ వాసనకు పందికొక్కులు మట్టి తవ్వేస్తాయి. సాధారణంగా రోజూ పోసే నీటికి బదులు, అదే మోతాదులో, ఈ ద్రావణాన్ని పోయాలి. నేను 15 రోజులకు ఒకసారి మొక్కల మొదళ్లలో ఈ ద్రావణం పోస్తున్నాను. అప్పుడప్పుడూ లీటరు నీటికి 5 ఎం.ఎల్. కోడిగుడ్డు+నూనెల ద్రావణాన్ని కలిపి మొక్కలపై పిచికారీ కూడా చేస్తాను. అవే నూనెలు ప్రతిసారీ వాడకూడదు. మార్చుకోవాలి. ఆవ నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూ¯ð ల్లో ఏదో ఒక నూనెను మార్చి మార్చి కలుపుకోవాలి. ఈ ద్రావణం వల్ల మొక్కలు దృఢంగా, గ్రీన్‌గా, కాయలు కూడా పెద్దగా పెరుగుతాయి. చీడపీడలు కూడా ఆశించవు. కోడిగుడ్లు, రకరకాల నూనెల్లోని పోషకాలతో కూడి ఉన్నందువల్ల ఈ ద్రావణం మొక్కలు, చెట్లకు ఒకవిధంగా బూస్ట్ లాగా పనిచేస్తుంది. దీన్ని తయారు చేసుకున్న రోజునే వాడాలి. మరో రకం ద్రావణం కూడా వాడుతుంటాను. వేరుశనగ చెక్క అర కేజీ, ఆవాల చెక్క అర కేజీ, బెల్లం 200 గ్రాములు వేసి కలిపి 20 లీటర్ల నీటిలో కలిపి.. ఆ ద్రావణాన్ని 3 రోజులు పులియబెడతాను. 5 లీటర్ల ద్రావణాన్ని వంద లీటర్ల నీటిలో కలిపి మొక్కలకు పోస్తుంటాను.’’ – పినాక పద్మ శ్రీనివాస్ (94406 43065), మియాపూర్, హైదరాబాద్ -
ఇంటిపంటలకు షేడ్‌నెట్ అవసరమే లేదు!
కాంక్రీటు జంగిల్లా మారిన మహానగరంలో నివాసం ఉంటూ రసాయనిక అవశేషాల్లేని సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తమ మేడ మీదే పండించుకోవడానికి మించిన సేఫ్ ఫుడ్ ఉద్యమం మరొకటి ఉండదు. ఎందుకంటే.. ఆహారంతో పాటు కడుపులోకి వెళ్లే రసాయనాలు ఎన్నో జబ్బులకు కారణమవుతూ జీవితానందాన్ని ఏ విధంగా హరించివేస్తున్నాయో తెలియజెప్పే నివేదికలు రోజుకొకటి వెలువడుతూనే ఉన్నాయి కదా..! అటువంటి ఉత్తమాభిరుచి కలిగిన అరుదైన సేంద్రియ ఇంటిపంటల సాగుదారులే ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాసరెడ్డి, లత దంపతులు. హైదరాబాద్ బీరంగూడ రాఘవేంద్ర కాలనీ (బీహెచ్ఈఎల్ దగ్గర)లో తమ స్వగృహంపై నాలుగేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలను మక్కువతో సాగు చేస్తూ.. మొక్కలతో ఆత్మీయస్నేహం చేస్తూ, ప్రకృతితో మమేకం అవుతున్నారు! 1800 చదరపు గజాల టెర్రస్‌ను పూర్తిగా కూరగాయ మొక్కలు, పూలమొక్కలతో నింపేశారు. ప్రేమతో పండించుకునే సేంద్రియ కూరగాయలను ఆరగించడంలోనే కాదు ఇతరులతో పంచుకోవడంలోనూ అమితానందాన్ని పొందుతున్నారు లత. తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లెలు ఇతర బంధువుల కుటుంబాలకు పండిన పంటలో సగం మేరకు పంచుతుండటం విశేషం. టెర్రస్ పైన పిట్టగోడలకు అనుక్ముని 3 వైపులా హాలో బ్రిక్స్‌ను ఏర్పాటు చేసుకుని మట్టి మిశ్రమం పోసి మొక్కలు పెట్టారు. 300కు పైగా కుండీలు, మూడు సిమెంటు రింగ్స్‌లో రకరకాల మొక్కలు పెంచుతుండటంతో జీవవైవిధ్యం ఉట్టిపడుతోంది. చిక్కుడు కాయలు, వంకాయలు, టమాటోలు, మిరపకాయలు, సొర, నేతిబీర, బీర, కాకరకాయలు ఇప్పుడు పుష్కలంగా వస్తున్నాయి. చేమ మొక్కలను దుంపల కోసమే కాకుండా ఆకుకూరగా కూడా వాడుతున్నారు. పాలకూర, చుక్కకూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీన వంటి ఆకుకూరలకు కొదవ లేదు. అంజీర, సపోట, జామ, నిమ్మ (5 రకాలు), బత్తాయి, ఆరెంజ్, దానిమ్మ, స్టార్ ఫ్రూట్, మామిడి (4 రకాలు) వంటి పండ్ల మొక్కలు చక్కగా పెరుగుతూ దిగుబడినిస్తున్నాయి. నాలుగేళ్లుగా ఇంటిపంటలు సాగు చేస్తున్న లత ఎండాకాలంలోనూ చాలా జాగ్రత్త తీసుకుంటుంటారు. షేడ్‌నెట్ వేయకుండానే ఇంటిపంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటుండటం విశేషం. ఈ ఏడాది ఎండలు ఎక్కువగానే ఉంటాయని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో చాలా మంది ఇంటిపంటల సాగుదారులు ఇప్పటికే షేడ్నెట్లు వేసుకున్నారు. అయితే, ఈ ఏడాదీ షేడ్‌నెట్ వేయకుండానే పంటలను జాగ్రత్తగా కాపాడుకుంటానని లత అంటున్నారు. సమ్మర్లో రెండుపూటలా మొక్కలకు నీరు ఇస్తానని, అది కూడా తగుమాత్రంగా కొద్ది కొద్దిగానేనని ఆమె అంటున్నారు. కుండీలు, మడుల్లో మట్టి బీటలు వారకుండా చూసుకుంటూ తగుమాత్రంగా రెండు పూటలా నీరు అందించాలని ఆమె సూచిస్తున్నారు. పోషకాలు తగ్గకుండా అప్పుడప్పుడూ వర్మీ కంపోస్టును/ సొంతంగా తయారు చేసుకున్న కంపోస్టును మొక్కలకు అందిస్తూ.. జీవామృతాన్ని వాడుతూ ఉంటే ఎండలకు భయపడాల్సిందేమీ లేదని లత చెబుతున్నారు. ఇంటిపంటలను జీవనశైలిలో భాగంగా మార్చుకున్న ఆదర్శ గృహిణి లత (96032 32114) గారికి జేజేలు! -
ఇంటిపంటల కోసమే సిటీకి దూరంగా సొంతిల్లు!
వరంగల్‌లో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రేగూరి సింధూజ ఇంజనీరింగ్ చదువుకొని హైదరాబాద్ టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. రసాయనిక అవశేషాలు లేని ప్రకృతిసిద్ధమైన ఆహారం విలువ గుర్తెరిగిన ఆమె.. సిటీలో ఫ్లాట్‌కు బదులు (బీహెచ్ఈఎల్ దగ్గర) నగర శివారు ప్రాంతం అమీన్పూర్ నరేంద్ర నగర్ కాలనీలో ఇండిపెండెంట్ హౌస్ నిర్మించుకున్నారు. 200 గజాల టెర్రస్‌లో సగభాగంలో వందకు పైగా గ్రోబాగ్స్, కుండీలలో గత ఏడాదిగా ఇంటిపంటలు పండించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యాన శాఖ నుంచి 4 పెద్ద వృత్తాకారపు గ్రీన్ గ్రోబాగ్స్తో కూడిన సబ్సిడీ కిట్‌ను తీసుకున్నారు. శిక్షణా శిబిరాలకు హాజరై అవగాహన పెంచుకున్నారు. వీటితోపాటు తెల్లని గ్రోబాగ్స్‌ను, కొబ్బరిపొట్టు తదితర పరికరాలను సేకరించుకున్నారు. 30%మట్టి, 30%పశువుల ఎరువు, 30% శుద్ధి చేసిన కొబ్బరిపొట్టు, వంటింటి వ్యర్థాలతో తయారు చేసిన ఇంటి కంపోస్టు+వేపపిండితో కలిపిన మట్టి మిశ్రమాన్ని గ్రోబాగ్స్, కుండీలలో నింపారు. వేసవి ఎండ తీవ్రత నుంచి ఇంటిపంటలను కాపాడుకోవడానికి ఇనుప ఫ్రేమ్‌తో షేడ్‌నెట్ వేసుకున్నారు. సింధూజ కుటుంబంలో నలుగురు పెద్దవారు ఉంటారు. పాలకూర, చుక్కకూర, గోంగూర, తోటకూర, కొత్తిమీర, బచ్చలి కూర పెంచుకొని తింటున్నారు. గత ఏడాదిగా ఆకుకూరలను బయట కొనటం లేదు. తీగజాతి కూరగాయలను పాకించడానికి కొబ్బరి తాళ్లతో పందిరి అల్లారు. బెండ, బీర, గోరుచిక్కుడు, కాప్సికం, సొర తదితర కూరగాయలు సాగులో ఉన్నాయి. ప్రస్తుతం వారంలో 2,3 రోజులు ఈ కూరగాయలు తింటున్నామని, కొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో ఇంటి కూరగాయలే తమకు సరిపోతాయని సింధూజ(98857 61707) సంతోషంగా చెప్పారు. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా నిపుణుల సలహాలను తెలుసుకుంటున్నానన్నారు. -
‘షేడ్‌నెట్’తో.. కాలం కలిసొస్తుంది!
భాస్కర్‌రెడ్డి సాధారణ పద్ధతిలో నారు పెంచితే... సాధారణ పద్ధతిలో పెంచే నారును పశువులు, గొర్రెలు, మేకలు మేసే ప్రమాదం ఉంటుంది. దీనికి రైతు కాపలా ఉండాల్సి వస్తుంది. ఏ తెగులు ఎలా వస్తుందో తెలుసుకోవడం కష్టం. మురుగు నీరు పారే వసతి (నీరు ఇంకిపోయే గుణం) నారుమడుల్లో ఉండకపోవడం వల్ల నారు కుళ్లు సోకే ప్రమాదం ఉంటుంది. విత్తనాలు దగ్గర దగ్గరగా వేయడం వల్ల నారు ఒత్తుగా పెరిగి బలంగా ఉండదు. దీన్ని పొలంలో నాటిటే మొక్కలు వంగిపోయి చనిపోతాయి. నారును బహిరంగ ప్రదేశాల్లో పెంచడం వల్ల తామర, పేనుబంక, తెల్లదోమ వంటి రసం పీల్చే పురుగు ఆశించి పాడవుతుంది. నారును పొలం నుంచి పీకినప్పుడు పీచువేర్లు తెగిపోయి వేర్లతో సహా మట్టి తక్కువగా ఉండడం లేదా పూర్తిగా లేక పోవడంవల్ల నాటిన తర్వాత మొక్కలు చనిపోయి పొలంలో ఖాళీలు ఏర్పడుతాయి. మళ్లీ మొక్కలు నాటినా అవి పెరిగే వరకు చాలా సమయం పడుతుంది. పొలంలో నాటడానికి 30 రోజులు ముందే విత్తనాలు సేకరించుకుని నారు పోసి కనీసం 26 నుంచి 40రోజుల వరకు నారు మడులను సంరక్షించాల్సిన వస్తుంది. మధ్యకాలంలో అనువైన వర్షాలు కురిసి అదును ఉన్నా నారు సాగు చేయడానికి పనికిరాదు. షేడ్‌నెట్ హౌస్‌తో ఉపయోగాలు.. నర్సరీలలో నారును ట్రేలలో పెంచుతారు. ముందుగా కొబ్బరి పీచులో విత్తనాలను పూడ్చడం వల్ల తగు మేర తేమ ఉండి మొలకశాతం పెరుగుతుంది. తద్వారా విత్తన మోతాదు తగ్గి ఖర్చు తగ్గుతుంది. నారును ప్లాస్టిక్ ట్రేలలో పెంచడం వల్ల వేర్లు సమృద్ధిగా పెరిగి పక్క మొక్కకు సంబంధం లేకుండా ఎదుగుతాయి. మొక్కలు ట్రేల నుంచి పెరిగినప్పుడు వేరు వ్యవస్థ దెబ్బతినకుండా కొబ్బరి పీచుతో సహా పూర్తిగా ఊడివస్తుంది. ఈ మొక్కలను పొలంలో నాటినప్పుడు చనిపోయే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కో ట్రే గుంత రెండున్నర సెంటీమీటర్లు ఉండటం వల్ల ప్రతి మొక్కకు నలువైపులా కావాల్సినంతా ఖాళీ ఉండి మొ క్కలు ధృడంగా పెరుగుతాయి. ఇలాంటి మొక్కలు పొలంలో నాటిన వెంటనే పెరుగుదల ప్రారంభం అవుతుంది. మొక్కలు షేడ్నెట్హౌస్లలో పెరగడం వల్ల తగినంత వెలుతురు, గాలి, తేమ ఉండి మొక్కల పెరుగుదలతో అన్ని సమంగా ఉండి ప్రధాన పొలంలో త్వరగా నాటుకునే అవకాశం ఉంటుంది. షేడ్ నెట్ హౌస్‌ల చుట్టూ తెల్లటి ఇన్సెక్ట్ నెట్ ఏర్పాటు చేయడం వల్ల తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమ వంటి వైరస్ తెగుళ్ల వ్యాప్తికి సహాయపడే రసం పీల్చే పురుగులు ఆశించడానికి అవకాశం ఉండదు. ఫలితంగా నాణ్యమైన, ఆరోగ్యవంతమైన నారు లభిస్తుంది. ఈ షేడ్‌నెట్ మౌస్‌లలో పాముపొడ, చీడపీడలు నారు మొక్కలపై ఆశించే అవకాశం ఉండదు. పంట ఎప్పుడు సాగు చేసుకోవాలనుకున్నా నారు అప్పటికప్పుడు రెడీమేడ్‌గా అదును వచ్చిన వెంటనే సాగుకు అవకాశం ఉంటుంది. సాధారణ పద్ధతిలో ఖర్చు అధికం.. ఎకరం పొలంలో పంటసాగుకు ముందుగా నారు మళ్లు తయారు చేసుకోవాలి. ఎత్తుబెడ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఫ్రూడాన్ గుళికలు, వేప పిండి చల్లి విత్తనాలు చల్లుకోవాలి. రెండుమూడు సార్లు మందు పిచికారీ చేయాలి. ఈ సాధారణ పద్ధతికి గాను పెట్టుబడి మొత్తం రూ. 5వేలు అవుతుంది. ఎకరం కూరగాయల సాగుకు 12వేల మొక్కలు కావాలి. అయినా అందులో ఎన్ని చనిపోతాయో చెప్పలేని పరిస్థితి. షేడ్నెట్లలో.. నారును ట్రేలలో పెంచుతారు. ఎలాంటి రోగ లక్షణాలు ఉండవు. అన్ని రకాల పిచికారీ మందులు వాడతారు. ఎకరం కూరగాయల సాగుకు 8వేల మొక్కలు సరిపోతాయి. ఏ మొక్కా చనిపోదు. నారు ఖర్చు మొక్కకు 30 పైసలు అయితే పెట్టుబడి రూ.2,400, నారు 40పైసలు అయితే పెట్టుబడి రూ. 3,200 అవుతుంది. సాధారణంతో పోల్చితే షేడ్నెట్హౌస్ల ద్వారా తక్కువ ఖర్చవుతుంది. -
షేడ్ నెట్లో సాగు.. బహు బాగు
ఒంగోలు టూటౌన్, అద్దంకి: షేడ్ నెట్ల కింద కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాల మొక్కలు, ఔషధ మొక్కలు పండించవచ్చు. శాశ్వత పద్ధతిలో ఇనుము, అల్యూమినియం పైపులపై పరారుణ కిరణాలను తట్టుకునే పాలిథీన్ షీట్ కప్పి తుంపర, బిందు సేద్యం ద్వారా పైర్లు సాగు చేయవచ్చు. కర్రలపై షేడ్ నెట్లు పరిచి వాటి కింద మిరప, క్యారెట్ తదితర కూరగాయలు, ఆకు కూరలు పండి ంచవచ్చు. షేడ్ నెట్లలో మొక్కలకు బయట కన్నా తక్కువ నీరు సరిపోతుంది. బిందు సేద్యం పద్ధతిలో మొక్కలకు నీటి ద్వారా పోషకాలు, ఎరువులు అందించవచ్చు. తద్వారా నీటిని పొదుపు చేయడంతో పాటు ఎరువుల వృథా తగ్గుతుంది. షేడ్ నెట్లో ఏడాదంతా సాగు.. ఎకరా లేదా రెండు ఎకరాల(రైతు ఎంతైనా ఎంచుకోవచ్చు) భూమి పైభాగాన్ని పూర్తిగా నెట్(వల)తో కప్పుతారు. షేడ్ నెట్లో మట్టిని మొక్కలు మొలిచి నిలబడానికి కావాల్సిన ఆధారం ఇవ్వగలిగేలా చేయాలి. మట్టి మిశ్రమంలో శిలీంద్రాలు, బ్యాక్టీరియా, కీటకాలు, వాటి గుడ్లు ఉంటాయి. అందు వల్ల మట్టిని నీటి ఆవిరితో శుద్ధి చేయాలి. మట్టి మిశ్రమంలో తగినంత తేమ ఉండగానే 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల నీటిని ముందుగా తయారు చే సుకున్న బెడ్లపై పొసి ఆరబెట్టాలి. మిథైల్ బ్రోమైడ్ లేదా క్లోరోఫిన్ రసాయనంతో కూడా బె డ్లను శుద్ధి చేయవచ్చు. 2 శాతం ఫార్మాల్డిహైడ్ ద్రావణంతో మట్టి మిశ్రమాన్ని లేదా మడులను తడిపి వెంటనే పాలిథీన్ షీటును కప్పాలి. ఫార్మాల్డిహైడ్ నుంచి వెలువడే విషవాయువుల దెబ్బకు అన్ని రకాల క్రిమికీటకాలు నశిస్తాయి. ఆ తర్వాత సుగంధ, ఔషధ మొక్కలు, పూలు, కారగాయలను ఏడాదంతా పండించి లాభాలను ఆర్జించవచ్చు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు స్రింక్లర్ల ద్వారా మధ్నాహ్నం వేళ నీటిని వెదజల్లాలి. నారు పెంపకం ఇలా.. షేడ్ నెట్ కింద రెండు అడుగుల వెడల్పున్న పొడవాటి దిబ్బలు తయారు చేయాలి. ప్లాస్టిక్ ట్రేల్లో సేంద్రియ ఎరువులు, కోక్ పిట్ ఫార్ములా ఎరువులను నింపాలి. తర్వాత వాటిలో ఏ నారు పెంచాలో ఆ నారు మేలి రకం విత్తనాలు వేయాలి. తర్వాత ఆ ట్రేలను షేడ్ నెట్‌లోని దిబ్బలపై వరుసగా పెట్టి డ్రిప్ పద్ధతి ద్వారా మొక్కలపై నీటిని వెదజల్లాలి. బోదెల ద్వారా నీటిని వరుస కాలువల్లో పెట్టాలి. తద్వారా మొక్కల పైభాగం, కింది భాగాలకు సమృద్ధిగా నీరందుతుంది. నారు మడి ఆరోగ్యంగా ఉంటుంది. వేర్ల పెరుగుదలకు కోక్ పిట్’ షేడ్ నెట్లలో మొక్కలకు సేంద్రియ ఎరువులతో పాటు కోక్ పిట్ వాడతారు. ఇది మొక్కల వేర్ల పెరుగులదలకు దోహదపడుతుంది. అదే విధంగా భూమిలో తేమ శాతాన్ని తగ్గకుండా చేసి మొక్కలు ఎండిపోకుండా కాపాడుతుంది. రాయితీ వివరాలు జిల్లాలో గిద్దలూరు, బేస్తవారిపేట, త్రిపురాంతకం, వైపాలెం, పెద్దదోర్నాల, మార్టూరు, అద్దంకి మండలాల్లో షేడ్ నెట్ల కింద కూరగాయలు, నారు పెంచుతున్నారు. ఉద్యాన శాఖ ద్వారా రైతులకు 50 శాతం రాయితీపై షేడ్ నెట్లు మంజూరు చేస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఉద్యానశాఖ-1,2 పరిధిలో ఒక్కో రైతుకు అర ఎకరాకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. రాయితీ నిధులు రూ.6 లక్షల వరకు కేటాయించారు.