ఒంగోలు టూటౌన్, అద్దంకి: షేడ్ నెట్ల కింద కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాల మొక్కలు, ఔషధ మొక్కలు పండించవచ్చు. శాశ్వత పద్ధతిలో ఇనుము, అల్యూమినియం పైపులపై పరారుణ కిరణాలను తట్టుకునే పాలిథీన్ షీట్ కప్పి తుంపర, బిందు సేద్యం ద్వారా పైర్లు సాగు చేయవచ్చు.
కర్రలపై షేడ్ నెట్లు పరిచి వాటి కింద మిరప, క్యారెట్ తదితర కూరగాయలు, ఆకు కూరలు పండి ంచవచ్చు. షేడ్ నెట్లలో మొక్కలకు బయట కన్నా తక్కువ నీరు సరిపోతుంది. బిందు సేద్యం పద్ధతిలో మొక్కలకు నీటి ద్వారా పోషకాలు, ఎరువులు అందించవచ్చు. తద్వారా నీటిని పొదుపు చేయడంతో పాటు ఎరువుల వృథా తగ్గుతుంది.
షేడ్ నెట్‌లో ఏడాదంతా సాగు..
ఎకరా లేదా రెండు ఎకరాల(రైతు ఎంతైనా ఎంచుకోవచ్చు) భూమి పైభాగాన్ని పూర్తిగా నెట్(వల)తో కప్పుతారు. షేడ్ నెట్‌లో మట్టిని మొక్కలు మొలిచి నిలబడానికి కావాల్సిన ఆధారం ఇవ్వగలిగేలా చేయాలి. మట్టి మిశ్రమంలో శిలీంద్రాలు, బ్యాక్టీరియా, కీటకాలు, వాటి గుడ్లు ఉంటాయి. అందు వల్ల మట్టిని నీటి ఆవిరితో శుద్ధి చేయాలి. మట్టి మిశ్రమంలో తగినంత తేమ ఉండగానే 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల నీటిని ముందుగా తయారు చే సుకున్న బెడ్లపై పొసి ఆరబెట్టాలి.
మిథైల్ బ్రోమైడ్ లేదా క్లోరోఫిన్ రసాయనంతో కూడా బె డ్లను శుద్ధి చేయవచ్చు. 2 శాతం ఫార్మాల్డిహైడ్ ద్రావణంతో మట్టి మిశ్రమాన్ని లేదా మడులను తడిపి వెంటనే పాలిథీన్ షీటును కప్పాలి. ఫార్మాల్డిహైడ్ నుంచి వెలువడే విషవాయువుల దెబ్బకు అన్ని రకాల క్రిమికీటకాలు నశిస్తాయి. ఆ తర్వాత సుగంధ, ఔషధ మొక్కలు, పూలు, కారగాయలను ఏడాదంతా పండించి లాభాలను ఆర్జించవచ్చు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు స్రింక్లర్ల ద్వారా మధ్నాహ్నం వేళ నీటిని వెదజల్లాలి.
నారు పెంపకం ఇలా..
షేడ్ నెట్ కింద రెండు అడుగుల వెడల్పున్న పొడవాటి దిబ్బలు తయారు చేయాలి. ప్లాస్టిక్ ట్రేల్లో సేంద్రియ ఎరువులు, కోక్ పిట్ ఫార్ములా ఎరువులను నింపాలి. తర్వాత వాటిలో ఏ నారు పెంచాలో ఆ నారు మేలి రకం విత్తనాలు వేయాలి. తర్వాత ఆ ట్రేలను షేడ్ నెట్‌లోని దిబ్బలపై వరుసగా పెట్టి డ్రిప్ పద్ధతి ద్వారా మొక్కలపై నీటిని వెదజల్లాలి. బోదెల ద్వారా నీటిని వరుస కాలువల్లో పెట్టాలి. తద్వారా మొక్కల పైభాగం, కింది భాగాలకు సమృద్ధిగా నీరందుతుంది. నారు మడి ఆరోగ్యంగా ఉంటుంది.
వేర్ల పెరుగుదలకు కోక్ పిట్’
షేడ్ నెట్లలో మొక్కలకు సేంద్రియ ఎరువులతో పాటు కోక్ పిట్ వాడతారు. ఇది మొక్కల వేర్ల పెరుగులదలకు దోహదపడుతుంది. అదే విధంగా భూమిలో తేమ శాతాన్ని తగ్గకుండా చేసి మొక్కలు ఎండిపోకుండా కాపాడుతుంది.
రాయితీ వివరాలు
జిల్లాలో గిద్దలూరు, బేస్తవారిపేట, త్రిపురాంతకం, వైపాలెం, పెద్దదోర్నాల, మార్టూరు, అద్దంకి మండలాల్లో షేడ్ నెట్ల కింద కూరగాయలు, నారు పెంచుతున్నారు. ఉద్యాన శాఖ ద్వారా రైతులకు 50 శాతం రాయితీపై షేడ్ నెట్లు మంజూరు చేస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఉద్యానశాఖ-1,2 పరిధిలో ఒక్కో రైతుకు అర ఎకరాకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. రాయితీ నిధులు రూ.6 లక్షల వరకు కేటాయించారు.
షేడ్ నెట్‌లో సాగు.. బహు బాగు
Published Thu, Aug 21 2014 3:31 AM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM
Advertisement
Advertisement