సాక్షి, హైదరాబాద్: కూరగాయలు, పూల సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో పాలీ హౌజ్/ గ్రీన్ హౌజ్‌ల నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల పరిధిలో ఉన్న రైతులకు ఈ పథకంలో అవకాశం కల్పించనుంది. సబ్సిడీ 75 శాతంతో అమలు కానున్న పాలీహౌజ్‌ల నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం గురువారం జారీ చేసింది.
రక్షిత సాగు, అధిక ఉత్పత్తి సాధించడం, అన్ని కాలాల్లోనూ కూరగాయలు, పూలను ఉత్పత్తి చేయడం ద్వారా గ్రామీణ రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేలా ఈ పథకాన్ని రూపొందించారు. తక్షణం అమలులోకి వచ్చే ఈ పథకంలో నిబంధనలివీ... ప్రతీ రైతు 200 చదరపు మీటర్లు (కనీస విస్తీర్ణం) నుంచి 3 ఎకరాల విస్తీర్ణంలో పాలీహౌజ్‌ల నిర్మాణం చేపట్టొచ్చు.
పత్రికా ప్రకటన వెలువడిన తర్వాత దరఖాస్తు చేసుకునే సీనియారిటీ జాబితా మేరకే మంజూరు ఉంటుంది. దీనికోసం గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులు పూర్తి వివరాలతో మరోసారి విధిగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకానికి రైతులందరూ అర్హులే. అయితే, పాలీహౌజ్‌ను నిర్మించే భూమి కచ్చితంగా రైతు పేరిటే ఉండాలి. ఇక్కడ నీటి వసతి, విద్యుత్ సౌకర్యం తప్పని సరి. కూరగాయలు, పూలు సాగుచేసే భూమిలో మట్టి, నీటి పరీక్షలు జరిపించి, ఆ నివేదికలు దరఖాస్తుతో జత చేయాలి. ఇక, పాలీహౌజ్‌ను 45 రోజుల్లో నిర్మించుకోవాలి.
పథకం కింద ఎంపికైన రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు, ఇప్పటికే పాలీహౌజ్ సాగు చేస్తున్న ప్రాంతాలకు తీసుకెళ్లి, అవగాహన కల్పిస్తారు. ఎకరం విస్తీర్ణంలో చేపట్టే పాలీహౌజ్ నిర్మాణం, సాగు ఏర్పాట్లకు కలిపి మొత్తంగా ఎకరా యూనిట్‌కు రూ.33.60 లక్షల ఖర్చు అవుతుందని అంచనా. ఇందులో 75 శాతం అంటే రూ.25.20 లక్షల మేర రైతుకు సబ్సిడీగా చెల్లిస్తారు. ముందుగా తనిఖీ చేయించి, సబ్సిడీ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
పాలీహౌజ్ నిర్మాణంతో పాటు సాగుకవసరమైన మొక్కల కొనుగోలు, మల్చింగ్, సూక్ష్మ సేద్య యంత్రాల ఏర్పాటు, భూమిని సిద్ధం చేయడం వంటి వాటికీ ఇందులోనే చెల్లింపులుంటాయి. పాలీహౌజ్ నిర్మాణం, డ్రిప్ ఇరిగేషన్‌లకు ప్రత్యేకంగా ఖర్చు అంచనా వేస్తారు. దీనికోసమయ్యే ఖర్చు రూ.28 లక్షల్లో రూ.21 లక్షలు సబ్సిడీగా చెల్లిస్తారు. ప్లాంట్ మెటీరియల్‌కయ్యే రూ.5.60 లక్షల ఖర్చులో రూ.4.20 లక్షలు సబ్సిడీ ఉంటుంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునేలా పాలీహౌజ్‌ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
పాలీహౌజ్‌లకు సబ్సిడీ 75 శాతం
Published Fri, Dec 19 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM
Advertisement