protected cultivation
-
ఉద్యాన తోటల పెంపకంలో రక్షిత సేద్యం లాభదాయకం
డీడీ సుబ్బరాయుడు, ఏడీ సత్యనారాయణ, ఇంజనీరు శృతి అనంతపురం అగ్రికల్చర్: ఉద్యాన తోటల పెంపకంలో రక్షిత సేద్యపు పద్ధతులు అవలంభిస్తే అధిక దిగుబడితోపాటు అదనపు ఆదాయం పొందొచ్చని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) బీఎస్ సుబ్బరాయుడు, అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) సీహెచ్ శివసత్యనారాయణ, ఇంజనీరు శృతి తెలిపారు. ప్రభుత్వం పండ్లతోటల రైతులకు ప్రాధాన్యత ఇస్తూ వివిధ రకాల పథకాలు అమలు చేస్తున్నందున రైతులు వినియోగించుకోవాలని వారు సూచించారు. రక్షిత సేద్యం ప్రాధాన్యత : ఉద్యాన తోటల్లో ఇటీవల కాలంలో రక్షిత సేద్యం (ప్రొటెక్ట్డ్ కల్టివేషన్) వి«ధానాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఉద్యాన రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, అత్యాధునిక యాజమాన్య పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుండటంతో ఆ దిశగా రైతులు కూడా దృష్టి సారిస్తే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుంది. పాలీహౌస్‌లు, షేడ్‌నెట్స్, గ్రీన్ హౌస్, ప్యాక్ హౌస్, ఫారంపాండ్స్, మల్చింగ్, కోల్డ్ స్టోరేజీలు, రైపనింగ్ ఛాంబర్లు తదితర పథకాలకు 50 శాతం రాయితీ వర్తిస్తుంది. వీటిలో వివిధ రకాల వాణిజ్య పంటలు సాగు చేయడం వల్ల తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన సుస్థిరమైన దిగుబడి వస్తుంది. పంట కాలంలోనూ, పంట కోత తర్వాత జరిగే నష్టాలను సైతం బాగా తగ్గించుకోవచ్చు. పంటలకు ఆశించే చీడపీడలు, తెగుళ్లను కూడా అరికట్టొచ్చు. కూరగాయలు, క్యాప్సికం, కీరదోస, జర్బేరా పూలు, గులాబీ, చామంతి లాంటి పంటలు వేసుకుంటే మామూలు పద్ధతిలో కన్నా రెండింతలు దిగుబడి వస్తుందని పరిశోధనలు, ప్రయోగాల ద్వారా నిరూపణ అయ్యింది. రైతుకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నందున వినియోగించుకోవాలి. రాయితీలు : ఒక ఎకరా పాలీహౌస్ నిర్మాణంలో భాగంగా ఒక చదరపు మీటరుకు రూ.844 ఖర్చు అవుతుంది. ఒక ఎకరా పాలీహౌస్ నిర్మాణానికి రూ.40 లక్షలు ఖర్చు అవుతుండగా అందులో ప్రభుత్వం రూ.16.88 లక్షలు భరిస్తుండగా మిగతాది రైతులు చెల్లించాల్సి ఉంటుంది. షేడ్‌నెట్స్ విషయానికొస్తే ఒక చదరపు మీటర్‌కు రూ.460 ఖర్చు అవుతుండగా ఇందులో 50 శాతం రాయితీ వర్తిస్తుంది. షేడ్‌నెట్స్ ఒక ఎకరాలో నిర్మించుకోవాలంటే రూ.18 లక్షలు ఖర్చు కానుండగా అందులో రూ.9 లక్షలు ప్రభుత్వం భరిస్తుంది. ఫారంపాండ్ల విషయానికి వస్తే 20 “ 20 “ 3 మీటర్ల కొలతల నిర్మాణానికి రూ.75 వేలు సబ్సిడీ, ప్యాక్ హౌస్‌లకు రూ.2 లక్షలు సబ్సిడీ వర్తిస్తుంది. ఇక కోల్డ్ స్టోరేజీలు, రైపనింగ్ ఛాంబర్లకు 35 శాతం రాయితీ వర్తిస్తుంది. ఉద్యానశాఖ అధికారులను సంప్రదించి మరిన్ని వివరాలు, దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం 79950 86792, 79950 86790, 95151 63080 సంప్రదించాలి. -
పాలీహౌజ్‌లకు సబ్సిడీ 75 శాతం
సాక్షి, హైదరాబాద్: కూరగాయలు, పూల సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో పాలీ హౌజ్/ గ్రీన్ హౌజ్‌ల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించింది. హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల పరిధిలో ఉన్న రైతులకు ఈ పథకంలో అవకాశం కల్పించనుంది. సబ్సిడీ 75 శాతంతో అమలు కానున్న పాలీహౌజ్‌ల నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం గురువారం జారీ చేసింది. రక్షిత సాగు, అధిక ఉత్పత్తి సాధించడం, అన్ని కాలాల్లోనూ కూరగాయలు, పూలను ఉత్పత్తి చేయడం ద్వారా గ్రామీణ రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేలా ఈ పథకాన్ని రూపొందించారు. తక్షణం అమలులోకి వచ్చే ఈ పథకంలో నిబంధనలివీ... ప్రతీ రైతు 200 చదరపు మీటర్లు (కనీస విస్తీర్ణం) నుంచి 3 ఎకరాల విస్తీర్ణంలో పాలీహౌజ్‌ల నిర్మాణం చేపట్టొచ్చు. పత్రికా ప్రకటన వెలువడిన తర్వాత దరఖాస్తు చేసుకునే సీనియారిటీ జాబితా మేరకే మంజూరు ఉంటుంది. దీనికోసం గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులు పూర్తి వివరాలతో మరోసారి విధిగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకానికి రైతులందరూ అర్హులే. అయితే, పాలీహౌజ్ను నిర్మించే భూమి కచ్చితంగా రైతు పేరిటే ఉండాలి. ఇక్కడ నీటి వసతి, విద్యుత్ సౌకర్యం తప్పని సరి. కూరగాయలు, పూలు సాగుచేసే భూమిలో మట్టి, నీటి పరీక్షలు జరిపించి, ఆ నివేదికలు దరఖాస్తుతో జత చేయాలి. ఇక, పాలీహౌజ్ను 45 రోజుల్లో నిర్మించుకోవాలి. పథకం కింద ఎంపికైన రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు, ఇప్పటికే పాలీహౌజ్ సాగు చేస్తున్న ప్రాంతాలకు తీసుకెళ్లి, అవగాహన కల్పిస్తారు. ఎకరం విస్తీర్ణంలో చేపట్టే పాలీహౌజ్ నిర్మాణం, సాగు ఏర్పాట్లకు కలిపి మొత్తంగా ఎకరా యూనిట్‌కు రూ.33.60 లక్షల ఖర్చు అవుతుందని అంచనా. ఇందులో 75 శాతం అంటే రూ.25.20 లక్షల మేర రైతుకు సబ్సిడీగా చెల్లిస్తారు. ముందుగా తనిఖీ చేయించి, సబ్సిడీ మొత్తాన్ని ఆన్లైన్లో రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. పాలీహౌజ్ నిర్మాణంతో పాటు సాగుకవసరమైన మొక్కల కొనుగోలు, మల్చింగ్, సూక్ష్మ సేద్య యంత్రాల ఏర్పాటు, భూమిని సిద్ధం చేయడం వంటి వాటికీ ఇందులోనే చెల్లింపులుంటాయి. పాలీహౌజ్ నిర్మాణం, డ్రిప్ ఇరిగేషన్లకు ప్రత్యేకంగా ఖర్చు అంచనా వేస్తారు. దీనికోసమయ్యే ఖర్చు రూ.28 లక్షల్లో రూ.21 లక్షలు సబ్సిడీగా చెల్లిస్తారు. ప్లాంట్ మెటీరియల్కయ్యే రూ.5.60 లక్షల ఖర్చులో రూ.4.20 లక్షలు సబ్సిడీ ఉంటుంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునేలా పాలీహౌజ్‌ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.