polly house
-
పాలీ హౌస్‌ల కోసం క్యూలో మంత్రి కుమారుడు !
కోలారు : ఓ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కుమారుడు సాధారణ వ్యక్తి తరహాలో దరఖాస్తుల కోసం క్యూలో నిలబడి అందరికి ఆదర్శంగా నిలిచారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి రమేష్ కుమార్ కుమారుడు హర్ష పాలీ హౌస్‌ల కోసం శుక్రవారం అందరితో పాటు క్యూలో నిలబడి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. పాలీ హౌస్‌ల కోసం మొదట వచ్చిన 200 దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా అధికారులు ప్రకటించడంతో రైతులు దరఖాస్తుల కోసం జిల్లా పంచాయతీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో విచ్చేశారు. దీంతో హర్ష సైతం ఉదయమే డీపీఓ కార్యాలయానికి చేరుకుని వరుసులో నిలుచున్నారు. పాలీ హౌస్‌లకు సంబంధించి ఎక్కడా కూడా అవినీతి ఆరోపణలు రాకూడదని మంత్రి రమేష్‌కుమార్ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు సైతం బాధ్యతయుతంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కుమారుడు హర్షం సైతం సామాన్య రైతు మాదిరిగా వరుసలో నిలబడి దరఖాస్తు కోసం వేచి ఉండటం అక్కడి వారిని ఆకట్టుకుంది. దీంతో పలువురు హర్ష నిరాడంబరతను అభినందించారు. -
వంద శాతం సబ్సిడీ
పాలీహౌస్‌లపై వంద శాతం సబ్సిడీ ఎస్సీ, ఎస్టీ రైతులకు మంత్రి పోచారం హామీ రైతులకు ఉచితంగా వెయ్యి టన్నుల గడ్డి పంపిణీ రామాయంపేట: హార్టికల్చర్ పథకం కింద పాలీహౌస్‌ల ఏర్పాటు కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం సబ్సిడీ ఇస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం చల్మెడ గ్రామంలో రైతులు చేపట్టిన పాలీహౌస్లో కూరగాయల పెంపకాన్ని ఆయన పరిశీ లించారు. అనంతరం మాట్లాడుతూ పదేళ్లలో 129 ఎకరాల్లో మాత్రమే పాలీహౌస్ ఏర్పాటు చేయగా, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ ైరె తులకు వం ద, బీసీలకు 90, ఇతరులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. ఈ నెల 25 నుంచి మే 5 వరకు వ్యవసాయ అధికారులు ‘మన తెలంగాణ- మన వ్యవసాయం’ పేరుతో గ్రామాల్లో పర్యటించి రైతులను చైతన్యపరుస్తారన్నారు. రైతులకు ఉచితంగా వెయ్యి టన్నుల గడ్డి పంపిణీ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లాకు 750 టన్నులు, మెదక్ జిల్లాకు 250 టన్నులు కేటాయించామన్నారు. -
‘గ్రీన్హౌస్’లోకి మరో 17 కంపెనీలు
జాబితాకు ప్రభుత్వం ఆమోద ముద్ర సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో గ్రీన్హౌస్ (పాలీహౌస్) నిర్మించేందుకు మరి కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి. కొత్తగా 17 కంపెనీలతో తయారైన జాబితాకు ఆమోదం తెలుపుతూ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 847 ఎకరాల్లో గ్రీన్హౌస్ నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్లో రూ. 250 కోట్లు కేటాయించారు. కానీ బడ్జెట్ సొమ్ము విడుదలైనా కంపెనీల నుంచి, రైతుల నుంచి పెద్దగా స్పందన రాలే దు. ఇప్పటివరకు 5 కంపెనీలు జాబితాలో ఉండగా... వాటిల్లో ఒకట్రెండు మాత్రమే నిర్మాణాలు చే స్తున్నాయి. ఇప్పటివరకు 20 ఎకరాల్లోనే గ్రీన్హౌస్ నిర్మాణాలు జరిగాయి. దీంతో ఈ పథకం మూలన పడింది. ఈ పరిస్థితుల్లో అధికారుల్లో ఆలోచన మొదలైంది. నిబంధనల ను కాస్తంత సడలించి కొత్త కంపెనీలను ఆహ్వానించారు. కంపెనీలు రూ.50 లక్షలు బ్యాంకు సెక్యూరిటీ డిపాజిట్ చూపించాల్సి వచ్చేది. దీన్ని తాజాగా సర్కారు రూ.2 లక్షలకు కుదిం చింది. డిపాజిట్ భారీగా తగ్గించడంతో దేశవ్యాప్తంగా అనేక కంపెనీలు ముందుకు వచ్చినట్లు ఉద్యానశాఖ వర్గాలు తెలిపాయి. దరఖాస్తు చేసుకున్న వాటిలో 17 కంపెనీలతో జాబితా రూపొందించారు. అంతేకాకుండా గ్రీన్హౌస్ నిర్మాణానికి సంబంధించి సాంకేతికంగా అనేక మార్పులు చేశారు. కంపెనీలకు సంబంధం లేకుండా సబ్సిడీ సొమ్మును నేరుగా రైతులకే చెల్లించేలా సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిం దే. జాబితాలో ఉన్న కంపెనీల్లో ఇష్టమైన వాటిని ఎంచుకునే స్వేచ్ఛ రైతులకు కల్పిం చారు. గ్రీన్హౌస్ నిర్మాణ వ్యయంలో సర్కారు మూడు విడతలుగా సబ్సిడీ సొమ్మును రైతు ఖాతాలో వేస్తుంది. గ్రీన్‌హౌస్‌కు పునాది వేసి, కంపెనీ నుంచి మెటీరియల్ సరఫరా అయ్యాక 35 శాతం సొమ్ము రైతు ఖాతాలో వేస్తారు. గ్రీన్హౌస్ నిర్మాణం పూర్తయి తనిఖీ చేశాక రెండో విడతలో 50 శాతం సొమ్మును రైతుకు చెల్లిస్తారు. థర్డ్ పార్టీ విచారణ అనంతరం మిగిలిన 15 శాతం సొమ్మును రైతుకు అందజేస్తారు. -
స్వల్ప ఖర్చుతో పాలీహౌస్లో ప్రకృతి సేద్యం!
పాలీహౌస్‌లను కేవలం 20% ఖర్చుతోనే నిర్మించుకోవటం.. ఇందులో అరుదైన దేశవాళీ సేంద్రియ వంగడాలను ప్రకృతి సేద్య పద్ధతుల్లో సాగు చేయడంపై తెలుగు రైతులకు శిక్షణ ఇవ్వడానికి శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రస్టు సన్నద్ధమైంది. తొలిదశలో రంగారెడ్డి జిల్లాలో వెయ్యి మంది కూరగాయ రైతులకు, ‘ఇంటిపంట’లు పండిస్తున్న హైదరాబాద్ నగరవాసులకు ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇవ్వడానికి, సేంద్రియ విత్తనాలు ఇవ్వడానికి వీలుగా ట్రస్టు తెలంగాణ ఉద్యాన శాఖతో ఇటీవల అవగాహన కుదుర్చుకుంది. ట్రస్టుకు చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణుడు డా. బండి ప్రభాకరరావు ఇటీవల హైద్రాబాద్ వచ్చినప్పుడు ‘సాక్షి’కి అందించిన సమాచారం ఆయన మాటల్లోనే.. మీ కోసం.. పంచాంగం ప్రకారం ఇప్పుడు వర్షాలు రావటం లేదు. వాతావరణంలో చాలా మార్పులొచ్చాయి. వర్షాకాలంలో వర్షం సరిగ్గా కురవటం లేదు. అకాల వర్షాలు దెబ్బతీస్తున్నాయి. రైతులు చాలా కష్టపడుతున్నారు, నష్టపడుతున్నారు. గ్రీన్‌హౌస్‌ల ద్వారా వాతావరణంపై నియంత్రణ సాధించి, పంటలు పండించుకోవచ్చు. గ్రీన్హౌస్లను స్వల్ప ఖర్చుతోనే ఏర్పాటు చేసుకోవచ్చు. స్థానికంగా లభించే బాదులతోనే దీన్ని నిర్మించుకొని, ప్లాస్టిక్ షీట్ వేసుకోవచ్చు. పొలాల్లో రైతులు.. నగరాలు, పట్టణాల్లో ‘ఇంటిపంట’ల సాగుదారులు స్వయంగానే నిర్మించుకోవచ్చు. కంపెనీల కొటేషన్ల ధరలో 20% ఖర్చుతోనే నిర్మించుకోవచ్చు. ఇంటిపంటల సాగు కోసం వెయ్యి నుంచి 40 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాలీహౌస్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. వెయ్యి చదరపు అడుగుల పాలీహౌస్‌కు కొటేషన్ అడిగితే రూ.2.25 లక్షలని కంపెనీల వాళ్లు చెప్పారు. నేను నా ఫామ్‌లో రూ. 25,000 ఖర్చుతో ఏర్పాటు చేసుకున్నాను. ప్లాస్టిక్ షీట్, నెట్ల ఖర్చే రూ. 18,000 వరకు ఉంటుంది. మిగతాది వెదురు, యూకలిప్టస్, సర్వి వంటి బాదులు, కూలీల ఖర్చు. మేం నిర్మించిన పాలీహౌస్‌లు 120 కి. మీ. వేగంతో వీచే గాలులను సైతం తట్టుకుంటాయి. పాలీహౌస్లో దేశీ ఆవు పేడ, మూత్రంతో నిశ్చింతగా ప్రకృతి సేద్యం చేయవచ్చు. 1/3 మట్టి, 1/3 శుద్ధిచేసిన కొబ్బరిపొట్టు, 1/3 సేంద్రియ పదార్థం (పశువుల ఎరువు లేదా ఎండుగడ్డి లేదా రంపపు పొట్టు) కలిపి.. బెడ్స్ తయారు చేసుకోవాలి. 15 రోజులకోసారి జీవామృతం ఇవ్వాలి. చీడపీడల నివారణకు నీమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వాడొచ్చు. తిరిగి వాడుకోవడానికి వీలయ్యే 560 రకాల దేశీ వంగడాలను ట్రస్టు సేకరించి పండించింది. ఇందులో 140 రకాల కూరగాయలు, ఆకుకూరల వంగడాలున్నాయి. ప్రతి ఒక్కరూ భోజనంలో 5% పచ్చి కూరగాయలు, ఆకుకూరలు తినాలన్నది రవిశంకర్ గురూజీ అభిప్రాయం. రంగు, ఆకృతి, వాసన, రుచి విభిన్నంగా ఉండే వంగడాలు ఇందుకు అనువుగా ఉంటాయి. వీటిని అందుబాటులోకి తెస్తున్నాం. ప్రకృతి సేద్య పద్ధతుల్లో సాగు చేయడం సులభం. ఈ వంగడాలు రసాయనాల్లేకుండా వాటికవే పెరుగుతాయి. చీడపీడలు అంతగా సోకవు. రైతులకు, నగరవాసులకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పద్ధతులపై రైతులకు, నగరవాసులకు సాంకేతిక శిక్షణనివ్వడానికి ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి. ట్రస్టు సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ తొలుత కొందరు మాస్టర్ ట్రయినర్లకు శిక్షణనిచ్చి, వారి ద్వారా మిగతా వారికి శిక్షణ ఇస్తాం. హైదరాబాద్‌లో రైతులు వినియోగదారులకునేరుగా సేంద్రియ ఉత్పత్తులను విక్రయించే మార్కెట్లను వారానికి రెండు రోజులు ఏర్పాటు చేస్తాం. రైతులు పండించే పంటలను ఎండబెట్టి అమ్మే సాంకేతికతలను కూడా అందిస్తాం. వివరాలకు: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుడు పి. రామకృష్ణారెడ్డి 98490 57599, email: rakripulireddy@gmail.com, ఉమామహేశ్వరి 90004 08907 uma6408@gmail.com. డా. బండి ప్రభాకరరావు -
పాలీహౌస్‌కు ప్రాధాన్యం: పోచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పాలీహౌస్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గుజరాత్లో జరుగుతోన్న ‘గుజరాత్ వైబ్రంట్’ ఎక్స్‌పోలో ఆయన సోమవారం వ్యవసాయ రంగంపై మాట్లాడారు. ఆ విశేషాలను మంత్రి ‘సాక్షి’కి తెలిపారు. వ్యవసాయం, సూక్ష్మసేద్యం, తుంపర్ల సేద్యం, పాలీహౌస్ తదితర అంశాలపై చర్చ జరిగినట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో 75 శాతం సబ్సిడీతో పాలీహౌస్ ప్రాజెక్టును చేపడుతుందన్నారు. దీనికి రూ. 250 కోట్లు కేటాయించామన్నారు. సూక్ష్మసేద్యం చేపట్టే ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ మంత్రులతో చర్చలు జరిపారు. -
పాలీహౌజ్‌లకు సబ్సిడీ 75 శాతం
సాక్షి, హైదరాబాద్: కూరగాయలు, పూల సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో పాలీ హౌజ్/ గ్రీన్ హౌజ్‌ల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించింది. హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల పరిధిలో ఉన్న రైతులకు ఈ పథకంలో అవకాశం కల్పించనుంది. సబ్సిడీ 75 శాతంతో అమలు కానున్న పాలీహౌజ్‌ల నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం గురువారం జారీ చేసింది. రక్షిత సాగు, అధిక ఉత్పత్తి సాధించడం, అన్ని కాలాల్లోనూ కూరగాయలు, పూలను ఉత్పత్తి చేయడం ద్వారా గ్రామీణ రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేలా ఈ పథకాన్ని రూపొందించారు. తక్షణం అమలులోకి వచ్చే ఈ పథకంలో నిబంధనలివీ... ప్రతీ రైతు 200 చదరపు మీటర్లు (కనీస విస్తీర్ణం) నుంచి 3 ఎకరాల విస్తీర్ణంలో పాలీహౌజ్‌ల నిర్మాణం చేపట్టొచ్చు. పత్రికా ప్రకటన వెలువడిన తర్వాత దరఖాస్తు చేసుకునే సీనియారిటీ జాబితా మేరకే మంజూరు ఉంటుంది. దీనికోసం గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులు పూర్తి వివరాలతో మరోసారి విధిగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకానికి రైతులందరూ అర్హులే. అయితే, పాలీహౌజ్ను నిర్మించే భూమి కచ్చితంగా రైతు పేరిటే ఉండాలి. ఇక్కడ నీటి వసతి, విద్యుత్ సౌకర్యం తప్పని సరి. కూరగాయలు, పూలు సాగుచేసే భూమిలో మట్టి, నీటి పరీక్షలు జరిపించి, ఆ నివేదికలు దరఖాస్తుతో జత చేయాలి. ఇక, పాలీహౌజ్ను 45 రోజుల్లో నిర్మించుకోవాలి. పథకం కింద ఎంపికైన రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు, ఇప్పటికే పాలీహౌజ్ సాగు చేస్తున్న ప్రాంతాలకు తీసుకెళ్లి, అవగాహన కల్పిస్తారు. ఎకరం విస్తీర్ణంలో చేపట్టే పాలీహౌజ్ నిర్మాణం, సాగు ఏర్పాట్లకు కలిపి మొత్తంగా ఎకరా యూనిట్‌కు రూ.33.60 లక్షల ఖర్చు అవుతుందని అంచనా. ఇందులో 75 శాతం అంటే రూ.25.20 లక్షల మేర రైతుకు సబ్సిడీగా చెల్లిస్తారు. ముందుగా తనిఖీ చేయించి, సబ్సిడీ మొత్తాన్ని ఆన్లైన్లో రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. పాలీహౌజ్ నిర్మాణంతో పాటు సాగుకవసరమైన మొక్కల కొనుగోలు, మల్చింగ్, సూక్ష్మ సేద్య యంత్రాల ఏర్పాటు, భూమిని సిద్ధం చేయడం వంటి వాటికీ ఇందులోనే చెల్లింపులుంటాయి. పాలీహౌజ్ నిర్మాణం, డ్రిప్ ఇరిగేషన్లకు ప్రత్యేకంగా ఖర్చు అంచనా వేస్తారు. దీనికోసమయ్యే ఖర్చు రూ.28 లక్షల్లో రూ.21 లక్షలు సబ్సిడీగా చెల్లిస్తారు. ప్లాంట్ మెటీరియల్కయ్యే రూ.5.60 లక్షల ఖర్చులో రూ.4.20 లక్షలు సబ్సిడీ ఉంటుంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునేలా పాలీహౌజ్‌ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
శ్రమ తక్కువ.. ఆదాయం ఎక్కువ
షాబాద్: మార్కెట్లో అలంకరణ పూలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. తక్కువ శ్రమతో అధిక లాభాలు వచ్చే జెర్బరా పూల సాగుపై దృష్టి సారిస్తున్నారు. మండలంలోని కక్కులూర్, కేసారం, షాబాద్, అప్పారెడ్డిగూడ, రేగడిదోస్వాడ, నాగరగూడ, తిమ్మారెడ్డిగూడ తదితర గ్రామాల రైతులు ఎక్కువగా జెర్బరా పూల సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ైెహ దరాబాద్ మార్కెట్లోకి వస్తున్న అలంకరణ పూలలో 90శాతం బెంగళూరు, మహారాష్ట్ర, పుణెల నుంచే దిగుమతి అవుతున్నాయి. డిమాండ్ ఉన్న ఈ పూలను ఇక్కడ ఎందుకు సాగు చేయకూడదని ఆలోచనతో కొందరు రైతులు అలంకరణ పూల సాగు చేపట్టారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో మండలంలో రైతులు జెర్బరా, కార్నేషన్, కట్ ఫ్లవర్స్ సాగు చేస్తున్నారు. పూలసాగుపై రైతులు ఏమంటున్నారంటే... ఐదేళ్లపాటు రాబడి.. ఎండల తీవ్రత, అధిక వర్షాలు వంటి ప్రకతి వైప్యరీత్యాలను తట్టుకునే పాలీహౌస్ విధానంతో పూలు, కూరగాయలను సాగు చేయవచ్చు. ఇందుకు ఖర్చు బాగానే అయిన రైతులకు ఎంతో లాభసాటిగా ఉంది. పాలీహౌస్ విధానంలో అలంకరణ పూలసాగు చేపట్టాలంటే ఎకరాకు రూ.52 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఇది పెద్ద రైతులకే సాధ్యమనే అపోహ ఉంది. కాని ప్రభుత్వం పాలీహౌస్ విధానంతో పూలు, కూరగాయల సాగు చేపట్టే రైతులకు తగు ప్రోత్సాహకాలు అందిస్తోంది. 30 శాతం రాయితీపై పాలీహౌస్ ఏర్పాటుకు కావాల్సిన పరికరాలు అందజేస్తోంది. రుణాలు అందజేసేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. చిన్న రైతులు 5 గుంటల విస్తీర్ణంలో పాలీహౌస్ ద్వారా పూలు, కూరగాయలు సాగు చేపట్టవచ్చు. దీనికి రూ.6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం 30 శాతం రాయితీ చెల్లిస్తుడండంతో రైతు వాటాగా 3.60 లక్షలు పెట్టుబడి పెడితే చాలు. ఐదేళ్ల వరకు లాభాలు పొందవచ్చు. రోజుకు రూ.2 వేల రాబడి.. ఐదు గుంటల స్థలంలో చేపట్టిన పూల సాగులో మొదటి రెండు నెలలకు రూ.10వేల ఖర్చు వస్తుంది. ఆ తర్వాత ఆదాయం మొదలవుతుంది. కాపు ఆరంభమైన తర్వాత నెలకు 10వేల వరకు ఖర్చు వస్తుంది. రోజుకు ఎంత లేదన్నా 500 పూలు వస్తాయి. సీజన్లో ఒక్కో పువ్వు రూ.7 నుంచి 10 రూపాయల వరకు ధర పలుకుతుంది. మిగతా రోజుల్లో రూ. 1.50 నుంచి 4 రూపాయల వరకు ధర పలుకుతాయి. సీజన్ లేని సమయంలో వ్యాపారులు పూలను కొనుగోలు చేసి తమిళనాడు, చైన్నైలకు పంపిస్తున్నారు. పూలసాగు ద్వారా రోజుకు రూ.2వేల చొప్పున నెలకు రూ.60వేల వరకు ఆదాయం వస్తుంది. అందులో 10 వేల నుంచి 15వేల ఖర్చులు పోను రూ. 40నుంచి 45వేల వరకు ఆదాయం వస్తుంది. పాలీహౌస్‌పై వేసే పాలిషీట్స్ ఐదేళ్ల వరకు ఉంటాయి. ఇనుప పైపులకు 20 నుంచి 25 ఏళ్ల వరకు ఎలాంటి ఢోకా ఉండదు. తెగుళ్ల బెడద ఎక్కువగా ఉండదు.. సాంప్రదాయ పంటలతో పోల్చితే వీటికి ఎరువుల వినియోగం తక్కువగానే ఉంటుంది. పూలమొక్కలు నాటే ముందు 25 ట్రాక్టర్ల పశువుల ఎరువుకు రూ.20 వేలు, ఉనకకు రూ.5వేలు అవుతాయి. మొక్కలకు పోషక పదార్థాలనందించే ఎరువులు బెడ్‌పైన వేసుకోవడానికి రూ.3వేల వరకు ఖర్చు వస్తుంది. నాటిన వారం రోజుల తర్వాత డ్రిప్ ద్వారా రసాయనిక ఎరువులు అందించాల్సి ఉంటుంది. ఈ విధమైన సాగులో చీడపీడలు, తెగుళ్ల బెడద ఉండదు. కలుపు సమస్య అసలే ఉండదు. కేవలం ఇద్దరు కూలీలు... రోజు రెండు గంటలు పని చేస్తే సరిపోతుందని అంటున్నారు రైతులు. -
మన గడ్డపై ‘చైనీస్ కాలె’
చేవెళ్ల: విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న సీడ్‌తో చేవెళ్లలో చైనీస్ కాలె ఆకుకూర పంటను సాగు చేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తన పాలీహౌస్లో ఈ పంటను పండిస్తున్నారు. అత్యంత పోషక విలువలున్న ఈ పంటను సుమారు 500 నుంచి 600 గజాల విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. పాలీహౌస్లో ఆరు బెడ్లలో (వరుస) సాగుచేస్తున్నారు. మొదటగా కొన్ని రోజుల క్రితం కొన్ని మొలకలను ఆరుబయట నాటిన ఈ పంటను ప్రస్తుతం పాలీహౌస్లో పండిస్తున్నారు. ఈ పంట సాగు విధానం, వండే పద్ధతి, వాటిలో ఉండే పోషక విలువలు పాలీహౌస్ పర్యవేక్షకులు మహిపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డిలు తెలియజేశారు. పంట సాగు పద్ధతి ఇలా.. ఈ పంటను చైనీస్ కాలె (కైలాన్) అని పిలుసా ్తరు. దీని శాస్త్రీయ నామం ఁబ్రాసికా ఒలెరేసియో ఆల్చోగ్లాబ్ఙ్రా. ముఖ్యంగా చైనా దేశం నుంచి విత్తనాలను తీసుకువచ్చి సాగు చేస్తారు. అమెరికా తదితర దేశాలలో కూడా ఈ పంటను పండిస్తారు. సాగు విధానమేమిటంటే... చైనీస్ కాలెవిత్తనం ఆవాల వలే చిన్నగా ఉంటాయి. వీటిని నర్సరీ ట్రేలలో పోసి నారును పెంచుతారు. 20 రోజుల వ్యవధిలో విత్తనం నారుదశకు మారుతుంది. ఈ నారును టమాటా నారు నాటినట్లుగానే పొలంలో నాటుతారు. మొక్క నాటిన 40 నుంచి 60 రోజులలోపు పంట చేతికి వస్తుంది. ఆ సమయం నుంచి పంటను తీసుకోవచ్చు. వండే విధానం.. చైనీస్ కాలె పంట ఆకుకూరవలే కాస్తుంది. ఇది దాదాపు పాలకూరను పోలి ఉంటుంది. భూమిలో నుంచి కాండం వచ్చి పైన ఆకులు కాస్తాయి. ఈ కాండాన్ని వండుకొని మునగ కాయలవలె భోజనంతో పాటు తీసుకోవచ్చు. వండే విధానం ఎలాగంటే.. ఈ పంటను కాండంతో పాటుగా మొదటికి కోస్తారు. కోసిన తర్వాత కాండాన్ని, ఆకులను వేరు చేస్తారు. కాండాన్ని నాలుగు ముక్కలుగా కోయాలి. మొదట నీటిలో ఉప్పువేసి ఉడకబెడతారు. ఉడికేటప్పుడు డార్క్ సోయాసెస్ వేస్తే పొంగుతుంది. అప్పుడు దానిని బయటకు తీసి నీటిని పారబోసి చల్లార్చాలి. తర్వాత వంట పాత్రలో ఆలివ్ ఆయిల్‌వేసి చైనీస్ కాలె కాండం ముక్కలు వేయాలి. వెల్లుల్లిపాయలు కూడా వేయాలి. నాలుగు స్పూన్ల చక్కరవేసి ఉడకబెట్టాలి. 7 నుంచి 8 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత పొయ్యిమీద నుంచి తీస్తే వంట పూర్తవుతుంది. కాండంనుంచి వేరుచేసిన ఆకులను కూడా వండుకోవచ్చు. విటమిన్లు ఎన్నో... చైనీస్ గైలాన్ అని కూడా పిలిచే ఈ వంటకంలో అనేక పోషక పదార్థాలున్నాయి. దీనిలో విటమిన్ ఇ, ఐరన్, క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ఉన్నాయి. ఈ వంటకం తిన్నవారికి శరీర పైభాగాన ఉన్న నల్లమచ్చలు తొలగిపోతాయి. -
పాలీహౌస్ రైతులకు త్వరలో సబ్సిడీ
చేవెళ్ల, న్యూస్‌లైన్: పాలీహౌస్(గ్రీన్ హౌస్) రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, వారికి త్వరలో సబ్సిడీ అందజేస్తామని ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ ఎం.పాపిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని సాగర్ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ స్కూల్లో పాలీహౌస్ రైతులకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో సాగర్ విద్యాసంస్థల సౌజన్యంతో ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన పాపిరెడ్డి మాట్లాడుతూ.. నాలుగైదేళ్లుగా పాలీహౌస్‌లు, షేడ్నెట్ల ద్వారా పూలు, కూరగాయల సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. ముఖ్యంగా రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని రైతులు ఉద్యాన పంటల సాగుపై విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. గత ఏడాది ఉద్యాన పంటల రైతులకు సబ్సిడీ కోసం ప్రభుత్వం రూ.150 కోట్లతో బడ్జెట్ రూపొందించిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ బడ్జెట్‌ను రెట్టింపు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. సబ్సిడీ కోసం పాలీహౌస్ రైతులు పెట్టుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడానికి కారణం నిధులు లేకపోవడమేనని ఆయన స్పష్టంచేశారు. ఈ ఫిబ్రవరి నెలాఖరులోగా సబ్సిడీ విడుదల కోసం అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రైతులకు పాలీహౌస్ సాగులో మరింత అవగాహన కల్పించడానికి దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటుగా విదేశాలకు కూడా తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నామని పాపిరెడ్డి పేర్కొన్నారు. కేవలం ఫ్లోరికల్చర్(పూలు) కాకుండా కూరగాయల సాగుపై కూడా రైతులు దృష్టిసారించాలని సూచించారు. గత సంవత్సరం కూరగాయల విత్తనాలకు సబ్సిడీ కోసం ఉద్యాన శాఖ ద్వారా రూ.12 కోట్లు కేటాయించామని తెలిపారు. కూరగాయలను మార్కెటింగ్ చేసుకోవడానికి ఆసక్తిగల రైతులకు, సొసైటీలకు 60 వాహనాలను రూ.2 లక్షల సబ్సిడీపై అందజేశామని, ఈ సంవత్సరం మరో 56 వాహనాలను ఇస్తున్నామని చెప్పారు. పూల రైతులకు గిట్టుబాటు ధర కోసం హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ మార్కెట్లో త్వరలో వేలం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయాన్ని ఎంటర్ప్రైజెస్, బిజినెస్‌గా మార్చాలి: రాంపుల్లారెడ్డి సంప్రదాయ వ్యవసాయంతో ప్రస్తుతం లాభాలు గడించలేమని, హైటెక్, ఆధునిక సాగు పద్ధతులను అవలంబించాలని కళాశాల కార్యదర్శి, కేంద్ర వ్యవసాయశాఖ మాజీ సంయుక్త కార్యదర్శి రాంపుల్లారెడ్డి సూచించారు. పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. వ్యవసాయాన్ని ఎంటర్‌ప్రైజెస్‌గా, వ్యాపార రంగంగా మారిస్తేనే పెరిగిన పెట్టుబడులను తట్టుకొని లాభాలను గడించే అవకాశం ఉంటుందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో స్థిరీకరణ ఉండాలన్నారు. రైతు నిపుణులను తయారుచేయడానికే సాగర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ స్కూల్‌ను స్థాపించామని పేర్కొన్నారు. సబ్సిడీ 80 శాతానికి పెంచాలి పాలీహౌస్‌లు వేసుకున్న, వేయాలనుకునే రైతుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించి సబ్సిడీని అందజేయాలని తెలంగాణ రీజియన్ పాలీ హౌస్ రైతుల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. సబ్సిడీని కూడా 50 శాతం నుంచి 80 శాతానికి పెంచాలన్నారు. సదస్సులో ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఉద్యాన శాఖ రంగారెడ్డి జిల్లా ఏడీ ఉమాదేవి, డివిజన్ ఏడీ సంజయ్‌కుమార్, విస్తరణాధికారి రాఘవేందర్, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, డెరైక్టర్ ఆగిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, పలు జిల్లాల రైతులు పాల్గొన్నారు. -
పాలీహౌస్ రైతులను ప్రోత్సహిస్తాం
చేవెళ్ల, న్యూస్‌లైన్: పాలీహౌస్ (గ్రీన్హౌస్) రైతులకు సాధ్యమైనంత త్వరగా సబ్సిడీ అందిస్తామని, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్యానశాఖ రంగారెడ్డి జిల్లా ఏడీ ఉమాదేవి అన్నారు. చేవెళ్ల మండలం చనువల్లిలో మంగళవారం రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల పా లీహౌస్ రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉద్యానశాఖ జిల్లా ఏడీ ఉమాదేవి మాట్లాడుతూ పా లీహౌస్ ఏర్పాటు చేసుకున్న అర్హులైన ప్రతి రైతుకూ సబ్సిడీ అందజేస్తామన్నారు. పాలీహౌస్‌లను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. పాలీహౌస్‌పై అవగాహన కల్పించేం దుకు 29న చేవెళ్ల మండలంలోని సాగర్ ఫుడ్ అండ్ అగ్రిబిజినెస్ స్కూల్లో సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలో 40 మందికే మంజూరు.. తెలంగాణ రీజియన్ పాలీహౌస్ రైతుల సం ఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడుతూ జి ల్లాలో సుమారు 220 మంది రైతులు పాలీ హౌస్ కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 40 మందికే మంజూరు ఇచ్చారని అన్నారు. కోశాధికారి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పాలీహౌస్ రైతులంతా సంఘం లో చేరి పోరాటానికి సిద్ధపడాలన్నారు. చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, డెరైక్టర్ ఆగిరెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా పాలీహౌస్ రైతుల సంఘం ఇన్చార్జి సత్యనారాయణ, నల్లగొండ జిల్లా ఇన్చార్జి శ్రీని వా స్, సంఘం ప్రతినిధులు ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, చంద్రకాంత్ మాట్లాడుతూ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని వివరించారు. సమావేశం లో చేవెళ్ల డివిజన్ ఉద్యాన అధికారి సంజయ్‌కుమార్, ఏఈఓ రాఘవేందర్, సంఘం ఉపాధ్యక్షురాలు ప్రమోద, సర్పంచ్ ఎన్ను జంగారెడ్డి, పలు జిల్లాల రైతు సంఘం ప్రతినిధులు ఎం.విజయభాస్కర్‌రెడ్డి, జి.ప్రభాకర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.