షాబాద్: మార్కెట్లో అలంకరణ పూలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. తక్కువ శ్రమతో అధిక లాభాలు వచ్చే జెర్బరా పూల సాగుపై దృష్టి సారిస్తున్నారు. మండలంలోని కక్కులూర్, కేసారం, షాబాద్, అప్పారెడ్డిగూడ, రేగడిదోస్వాడ, నాగరగూడ, తిమ్మారెడ్డిగూడ తదితర గ్రామాల రైతులు ఎక్కువగా జెర్బరా పూల సాగు చేస్తున్నారు.
ప్రస్తుతం ైెహ దరాబాద్ మార్కెట్‌లోకి వస్తున్న అలంకరణ పూలలో 90శాతం బెంగళూరు, మహారాష్ట్ర, పుణెల నుంచే దిగుమతి అవుతున్నాయి. డిమాండ్ ఉన్న ఈ పూలను ఇక్కడ ఎందుకు సాగు చేయకూడదని ఆలోచనతో కొందరు రైతులు అలంకరణ పూల సాగు చేపట్టారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో మండలంలో రైతులు జెర్బరా, కార్నేషన్, కట్ ఫ్లవర్స్ సాగు చేస్తున్నారు.
పూలసాగుపై రైతులు ఏమంటున్నారంటే...
ఐదేళ్లపాటు రాబడి..
ఎండల తీవ్రత, అధిక వర్షాలు వంటి ప్రకతి వైప్యరీత్యాలను తట్టుకునే పాలీహౌస్ విధానంతో పూలు, కూరగాయలను సాగు చేయవచ్చు. ఇందుకు ఖర్చు బాగానే అయిన రైతులకు ఎంతో లాభసాటిగా ఉంది. పాలీహౌస్ విధానంలో అలంకరణ పూలసాగు చేపట్టాలంటే ఎకరాకు రూ.52 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఇది పెద్ద రైతులకే సాధ్యమనే అపోహ ఉంది.
కాని ప్రభుత్వం పాలీహౌస్ విధానంతో పూలు, కూరగాయల సాగు చేపట్టే రైతులకు తగు ప్రోత్సాహకాలు అందిస్తోంది. 30 శాతం రాయితీపై పాలీహౌస్ ఏర్పాటుకు కావాల్సిన పరికరాలు అందజేస్తోంది. రుణాలు అందజేసేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. చిన్న రైతులు 5 గుంటల విస్తీర్ణంలో పాలీహౌస్ ద్వారా పూలు, కూరగాయలు సాగు చేపట్టవచ్చు. దీనికి రూ.6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం 30 శాతం రాయితీ చెల్లిస్తుడండంతో రైతు వాటాగా 3.60 లక్షలు పెట్టుబడి పెడితే చాలు. ఐదేళ్ల వరకు లాభాలు పొందవచ్చు.
రోజుకు రూ.2 వేల రాబడి..
ఐదు గుంటల స్థలంలో చేపట్టిన పూల సాగులో మొదటి రెండు నెలలకు రూ.10వేల ఖర్చు వస్తుంది. ఆ తర్వాత ఆదాయం మొదలవుతుంది. కాపు ఆరంభమైన తర్వాత నెలకు 10వేల వరకు ఖర్చు వస్తుంది. రోజుకు ఎంత లేదన్నా 500 పూలు వస్తాయి. సీజన్లో ఒక్కో పువ్వు రూ.7 నుంచి 10 రూపాయల వరకు ధర పలుకుతుంది. మిగతా రోజుల్లో రూ. 1.50 నుంచి 4 రూపాయల వరకు ధర పలుకుతాయి.
సీజన్ లేని సమయంలో వ్యాపారులు పూలను కొనుగోలు చేసి తమిళనాడు, చైన్నైలకు పంపిస్తున్నారు. పూలసాగు ద్వారా రోజుకు రూ.2వేల చొప్పున నెలకు రూ.60వేల వరకు ఆదాయం వస్తుంది. అందులో 10 వేల నుంచి 15వేల ఖర్చులు పోను రూ. 40నుంచి 45వేల వరకు ఆదాయం వస్తుంది. పాలీహౌస్‌పై వేసే పాలిషీట్స్ ఐదేళ్ల వరకు ఉంటాయి. ఇనుప పైపులకు 20 నుంచి 25 ఏళ్ల వరకు ఎలాంటి ఢోకా ఉండదు.
తెగుళ్ల బెడద ఎక్కువగా ఉండదు..
సాంప్రదాయ పంటలతో పోల్చితే వీటికి ఎరువుల వినియోగం తక్కువగానే ఉంటుంది. పూలమొక్కలు నాటే ముందు 25 ట్రాక్టర్ల పశువుల ఎరువుకు రూ.20 వేలు, ఉనకకు రూ.5వేలు అవుతాయి. మొక్కలకు పోషక పదార్థాలనందించే ఎరువులు బెడ్‌పైన వేసుకోవడానికి రూ.3వేల వరకు ఖర్చు వస్తుంది. నాటిన వారం రోజుల తర్వాత డ్రిప్ ద్వారా రసాయనిక ఎరువులు అందించాల్సి ఉంటుంది. ఈ విధమైన సాగులో చీడపీడలు, తెగుళ్ల బెడద ఉండదు. కలుపు సమస్య అసలే ఉండదు. కేవలం ఇద్దరు కూలీలు... రోజు రెండు గంటలు పని చేస్తే సరిపోతుందని అంటున్నారు రైతులు.