స్వల్ప ఖర్చుతో పాలీహౌస్‌లో ప్రకృతి సేద్యం!
పాలీహౌస్‌లను కేవలం 20% ఖర్చుతోనే నిర్మించుకోవటం.. ఇందులో అరుదైన దేశవాళీ సేంద్రియ వంగడాలను ప్రకృతి సేద్య పద్ధతుల్లో సాగు చేయడంపై తెలుగు రైతులకు శిక్షణ ఇవ్వడానికి శ్రీశ్రీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రస్టు సన్నద్ధమైంది. తొలిదశలో రంగారెడ్డి జిల్లాలో వెయ్యి మంది కూరగాయ రైతులకు, ‘ఇంటిపంట’లు పండిస్తున్న హైదరాబాద్ నగరవాసులకు ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇవ్వడానికి, సేంద్రియ విత్తనాలు ఇవ్వడానికి వీలుగా ట్రస్టు తెలంగాణ ఉద్యాన శాఖతో ఇటీవల అవగాహన కుదుర్చుకుంది. ట్రస్టుకు చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణుడు డా. బండి ప్రభాకరరావు ఇటీవల హైద్రాబాద్ వచ్చినప్పుడు ‘సాక్షి’కి అందించిన సమాచారం ఆయన మాటల్లోనే.. మీ కోసం..
పంచాంగం ప్రకారం ఇప్పుడు వర్షాలు రావటం లేదు. వాతావరణంలో చాలా మార్పులొచ్చాయి. వర్షాకాలంలో వర్షం సరిగ్గా కురవటం లేదు. అకాల వర్షాలు దెబ్బతీస్తున్నాయి. రైతులు చాలా కష్టపడుతున్నారు, నష్టపడుతున్నారు. గ్రీన్‌హౌస్‌ల ద్వారా వాతావరణంపై నియంత్రణ సాధించి, పంటలు పండించుకోవచ్చు. గ్రీన్‌హౌస్‌లను స్వల్ప ఖర్చుతోనే ఏర్పాటు చేసుకోవచ్చు. స్థానికంగా లభించే బాదులతోనే దీన్ని నిర్మించుకొని, ప్లాస్టిక్ షీట్ వేసుకోవచ్చు. పొలాల్లో రైతులు.. నగరాలు, పట్టణాల్లో ‘ఇంటిపంట’ల సాగుదారులు స్వయంగానే నిర్మించుకోవచ్చు. కంపెనీల కొటేషన్ల ధరలో 20% ఖర్చుతోనే నిర్మించుకోవచ్చు.
ఇంటిపంటల సాగు కోసం వెయ్యి నుంచి 40 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాలీహౌస్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. వెయ్యి చదరపు అడుగుల పాలీహౌస్‌కు కొటేషన్ అడిగితే రూ.2.25 లక్షలని కంపెనీల వాళ్లు చెప్పారు. నేను నా ఫామ్‌లో రూ. 25,000 ఖర్చుతో ఏర్పాటు చేసుకున్నాను. ప్లాస్టిక్ షీట్, నెట్ల ఖర్చే రూ. 18,000 వరకు ఉంటుంది. మిగతాది వెదురు, యూకలిప్టస్, సర్వి వంటి బాదులు, కూలీల ఖర్చు. మేం నిర్మించిన పాలీహౌస్‌లు 120 కి. మీ. వేగంతో వీచే గాలులను సైతం తట్టుకుంటాయి.
పాలీహౌస్‌లో దేశీ ఆవు పేడ, మూత్రంతో నిశ్చింతగా ప్రకృతి సేద్యం చేయవచ్చు. 1/3 మట్టి, 1/3 శుద్ధిచేసిన కొబ్బరిపొట్టు, 1/3 సేంద్రియ పదార్థం (పశువుల ఎరువు లేదా ఎండుగడ్డి లేదా రంపపు పొట్టు) కలిపి.. బెడ్స్ తయారు చేసుకోవాలి. 15 రోజులకోసారి జీవామృతం ఇవ్వాలి. చీడపీడల నివారణకు నీమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వాడొచ్చు.
తిరిగి వాడుకోవడానికి వీలయ్యే 560 రకాల దేశీ వంగడాలను ట్రస్టు సేకరించి పండించింది. ఇందులో 140 రకాల కూరగాయలు, ఆకుకూరల వంగడాలున్నాయి. ప్రతి ఒక్కరూ భోజనంలో 5% పచ్చి కూరగాయలు, ఆకుకూరలు తినాలన్నది రవిశంకర్ గురూజీ అభిప్రాయం. రంగు, ఆకృతి, వాసన, రుచి విభిన్నంగా ఉండే వంగడాలు ఇందుకు అనువుగా ఉంటాయి. వీటిని అందుబాటులోకి తెస్తున్నాం. ప్రకృతి సేద్య పద్ధతుల్లో సాగు చేయడం సులభం. ఈ వంగడాలు రసాయనాల్లేకుండా వాటికవే పెరుగుతాయి. చీడపీడలు అంతగా సోకవు. రైతులకు, నగరవాసులకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం.
ఈ పద్ధతులపై రైతులకు, నగరవాసులకు సాంకేతిక శిక్షణనివ్వడానికి ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి. ట్రస్టు సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ తొలుత కొందరు మాస్టర్ ట్రయినర్లకు శిక్షణనిచ్చి, వారి ద్వారా మిగతా వారికి శిక్షణ ఇస్తాం.
హైదరాబాద్‌లో రైతులు వినియోగదారులకునేరుగా సేంద్రియ ఉత్పత్తులను విక్రయించే మార్కెట్లను వారానికి రెండు రోజులు ఏర్పాటు చేస్తాం. రైతులు పండించే పంటలను ఎండబెట్టి అమ్మే సాంకేతికతలను కూడా అందిస్తాం. వివరాలకు: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుడు పి. రామకృష్ణారెడ్డి 98490 57599, email: rakripulireddy@gmail.com, ఉమామహేశ్వరి 90004 08907 uma6408@gmail.com.
డా. బండి ప్రభాకరరావు