Natural farming methods
-
ప్రకృతి సేద్యంతో తగ్గనున్న నిరుద్యోగం, రైతులకు అధికంగా ఆదాయం
రసాయనిక సేద్యం భూముల్ని బీళ్లుగా మార్చుతుంటే.. ప్రకృతి సేద్యం బీళ్లను సాగులోకి తెస్తుంది. ప్రకృతి సేద్యంతో 2050 నాటికి నిరుద్యోగం రేటు 31 నుంచి 7 శాతానికి తగ్గుతుంది. ప్రకృతి విపత్తులను దీటుగా తట్టుకోవడం ప్రకృతి సేద్యంతోనే సాధ్యం. దీనివల్ల రైతుల ఆదాయం అధికం అవుతుంది. జనాభా పెరుగుదల– ఉపాధి అవకాశాలు, ఆర్థిక పురోగతి– అసమానతలు, నేల వినియోగం, దిగుబడి – ఆహార ఉత్పత్తి తదితర కోణాల్లో రెండు విభిన్న సాగు పద్ధతుల్లో పొందే ఫలితాల్లో వ్యత్యాసాలను అధ్యయనం చేసి ఈ నివేదికలో పొందుపరిచారు. ►రసాయనాలతో కూడిన పారిశ్రామిక వ్యవసాయం ఇలాగే కొనసాగితే 2050 నాటికి రైతుల సంఖ్య సగానికి తగ్గుతుంది. నిరుద్యోగం రేటు 31 శాతం నుంచి 30 శాతానికి తగ్గుతుంది. అయితే, పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేపడితే రైతుల సంఖ్య కోటికి పెరుగుతుంది. నిరుద్యోగం రేటు 7 శాతానికి తగ్గుతుంది. ► ప్రకృతి వ్యవసాయం ద్వారా బంజరు భూములు కూడా సాగులోకి వస్తాయి. అధిక విస్తీర్ణం సాగులోకి వచ్చి అత్యధిక మంది రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు. తక్కువ పెట్టుబడితో ఏడాది పొడవునా రసాయన రహిత సురక్షిత పంటలు పండిస్తారు. అందువల్ల అధిక మార్కెట్ ధర పొందుతారు. ► ప్రకృతి వ్యవసాయ విధానంలో విత్తనాలు, నీటి వినియోగం, రసాయనాలు, ఇంధనం, అప్పులు, భారీ యంత్ర సామగ్రి తదితర ఖర్చుల విషయంలో రైతులకు ఎంతో డబ్బు ఆదా అవుతుంది. ఈ రైతులు పంట ఉత్పత్తులను విలువ జోడించి అమ్ముతారు కాబట్టి అధికాదాయం వస్తుంది. ► ప్రకృతి వ్యవసాయంలో నిరుద్యోగం తగ్గి, వ్యవసాయ–వ్యవసాయేతర వేతనాల్లో అంతరం తగ్గటం కారణంగా ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. ఆర్థిక వృద్ధి 6.5%కి చేరుకుంటుంది. ► రసాయనిక వ్యవసాయం కొనసాగిస్తే 2050 నాటికి ఇది 6.1 పైసలు మాత్రమే ఉంటుంది. ప్రకృతి వ్యవసాయంలో ప్రతి రైతు ఉత్పత్తి చేసిన ప్రతి కిలో కేలరీల ఆహారానికి 10.3 పైసల ఆదాయం పొందుతారు. ► రసాయనిక వ్యవసాయం కొనసాగిస్తే 2019లో 62 లక్షల హెక్టార్లున్న సాగు భూమి విస్తీర్ణం 2050 నాటికి 55 లక్షల హెక్టార్లకు తగ్గుతుంది. కొన్ని పంటలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించే పారిశ్రామిక వ్యవసాయ విధానంలో బీడు భూముల విస్తీర్ణం 2019లో 24 లక్షల హెక్టార్ల నుంచి 2050 నాటికి 30 లక్షల హెక్టార్లకు పెరిగే ప్రమాదం ఉంది. ► ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో బీడు భూములు కూడా సాగులోకి వచ్చి 2019లో 62 లక్షల హెక్టార్లున్న సాగు భూమి 2050 నాటికి 80 లక్షల హెక్టార్లకు పెరుగుతుంది. పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగి ప్రస్తుత సవాళ్లను అధిగమించవచ్చు. ► రసాయన సేద్యంలో మొత్తం మీద తక్కువ భూమి, తక్కువ మంది రైతులు, అధిక సాగు ఖర్చులు, అధిక నిరుద్యోగ రేటుతో కలిపి వ్యవసాయ జివిఎ పెరుగుదల రేటు సగటున సంవత్సరానికి 4% నుంచి 3.5%కి తగ్గుతుంది. ► ప్రకృతి వ్యవసాయం నేల ఆరోగ్యాన్ని పెంపొందించి సారవంతమైన భూములను అందిస్తుంది. అనేక రకాల పంటలతో అధిక పంట సాంద్రత ఏర్పడుతుంది. ► ప్రకృతి వ్యవసాయం అనుసరిస్తున్న రైతులు దిగుబడిలో ఎలాంటి తగ్గుదల లేకపోవడమే కాకుండా, అధిక దిగుబడిని కూడా సాధిస్తున్నారు. వర్షాధార వ్యవసాయ భూముల్లోనూ పలు రకాల పంటల సాంద్రత వల్ల మరింత దిగుబడిని సాధిస్తున్నారు. మొత్తానికి ప్రకృతి వ్యవసాయంలో రైతులు 2019లో హెక్టారుకు రోజుకు 31,000 కిలో కేలరీల ఆహారాన్ని ఉత్పత్తి చేశారు. 2050 నాటికి అది 36,000 కిలో కేలరీలకు పెరుగుతుంది. ► రసాయనిక వ్యవసాయంలో 2050 నాటికి రైతులు రోజుకు హెక్టార్‌కు దాదాపు 44,000 కిలో కేలరీలు ఉత్పత్తి చేసినా.. ప్రకృతి సేద్యంలో పండే పంట ఉత్పత్తులు స్థూల,సూక్ష్మ పోషకాలు, పీచు పదార్ధంతో కూడిన బలవర్ధకమైన, సమతుల్యమైన ఆహారాన్ని అందిస్తాయి. ► రెండు విభిన్న పద్ధతుల్లో ఆహారోత్పత్తి, సాగు విస్తీర్ణం, వార్షిక దిగుబడులను అంచనా వేసి చూస్తే.. 2050లో ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే ఆహారం రసాయనిక వ్యవసాయం (4050 కిలో కేలరీలు/తలసరి/రోజు)లో కంటే ప్రకృతి వ్యవసాయం (5000 కిలో కేలరీలు/తలసరి/రోజు)లో గణనీయంగా పెరుగుతుంది. అంతేగాక ప్రకృతి సేద్యంలో పండించిన పంట ఉత్పత్తులు రసాయనిక ఉత్పత్తుల కంటే మరింత సమతుల్యంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ► ప్రతికూల వాతావరణ పరిస్థితులకు తట్టుకొనే విధంగా వ్యవసాయ పంటల జీవ వైవిధ్యం పెరుగుతుంది. సేంద్రియ కర్బనం నేలల్లో వృద్ధి చెందుతుంది. తద్వారా వాతావరణ మార్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ► అధిక ఉష్ణోగ్రతలు, కరువు, తుపాన్లు, వరదలు వంటి వాతావరణ విపత్తులను తట్టుకోవడం రసాయనిక సేద్యంతో సాధ్యం కాదని నివేదిక స్పష్టం చేస్తోంది. పెట్టుబడి తగ్గటం, సురక్షిత నీటితో పాటు విస్తృత స్థాయిలో ΄ûష్టికాహారం అందించడం, పర్యావరణ పరిరక్షణ వల్ల రాష్ట్రం ‘రైతు అభివృద్ధి’కి దిక్సూచిగా మారుతుంది. -
మూడేళ్ల పాటు రీసెర్చ్.. ప్రకృతి వ్యవసాయంతోనే అది సాధ్యమవుతుంది
జలమే జీవం జలమే ఆహారం.. అనే నినాదంతో ఎఫ్ఎఓ ప్రపంచ ఆహార దినోత్సవం సోమవారం నిర్వహించింది. ఈ సందర్భంగా వెలువడిన ఓ తాజా నివేదిక ఆసక్తిని కలిగిస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం అమలవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2031 నాటికి పొలాలన్నిటినీ పూర్తిగా ప్రకృతి సేద్యంలోకి మార్చాలన్నది సంకల్పం. అయితే, ప్రకృతి వ్యవసాయ ప్రభావం 2050 నాటికి ఎలా ఉంటుంది? రసాయనిక వ్యవసాయంలో కొనసాగితే ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఇవి ఆసక్తికరమైన ప్రశ్నలు. ఈ అంశాలను లోతుగా శోధిస్తూ క్షేత్రస్థాయి ప్రకృతి సేద్య ఫలితాల ఆధారంగా ‘ఆగ్రోఎకో 2050 ఫోర్‌సైట్ ప్రాజెక్టు’లో భాగంగా మూడేళ్ల పాటు విస్తృతంగా అధ్యయనం చేశారు. ఫ్రెంచ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (సిఐఆర్ఎడి)కు చెందిన సీనియర్ ఆర్థికవేత్త బ్రూనో డోరిన్, ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) వ్యవసాయ శాస్త్రవేత్త అన్నే సోఫి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖకు చెందిన రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్) ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ టి. విజయకుమార్ పలువురు శాస్త్రవేత్తలు, రైతులతో కలిసి 2019 నుంచి 2022 వరకు అధ్యయనం చేశారు. అంతర్జాతీయ శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ నివేదికను రూపొందించటం విశేషం. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల ఉన్నతాధికారులతో చర్చించిన తదనంతరం ‘ఆగ్రోఎకో 2050: ఆంధ్రప్రదేశ్‌లో ఆహార వ్యవస్థలపై పునరాలోచన– ప్రకృతి వ్యవసాయం భవిష్యత్తులో ఆహార సమృద్ధిని ఎలా సాధిస్తుంది’ అనే శీర్షికన అధ్యయన నివేదిక సిద్ధమైంది. నీతి అయోగ్ సభ్యులు (వ్యవసాయం) ప్రొఫెసర్ రమేశ్ చంద్ దీన్ని న్యూఢిల్లీలో ఇటీవల విడుదల చేశారు. పారిశ్రామిక (రసాయనిక) వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని పోల్చుతూ రెండు విభిన్న పరిస్థితుల్లో 2050 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయం, ఆహారం, పర్యావరణం, ఉపాధి, సంక్షేమం తదితర రంగాల్లో ఎలా ఉండబోతోంది అనే విషయంపై విశ్లేషణను ఈ నివేదిక వెల్లడిస్తోంది. రాష్ట్రంలో విస్తృతంగా అమలవుతున్న ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం సరికొత్త ఆహార వ్యవస్థల స్థాపనలో ఎలాంటి అవకాశాలను కలిగిస్తుంది అనే కోణంలో శోధించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2020–21 నాటికి 7 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 2031 నాటికి ఈ రైతుల సంఖ్య 60 లక్షలకు చేరుకోవాలన్నది లక్ష్యం. ఆర్థిక, పర్యావరణ, పోషకాహార, సామాజిక సవాళ్లను సమీకృత పద్ధతిలో పరిష్కరించే హరిత వ్యవసాయానికి ఏపీ రాష్ట్రం నాయకత్వం వహిస్తుందనేది అధ్యయన బృందం అభిప్రాయం. ‘ప్రకృతి’ నేర్పుతున్న అసాధారణ నీటి పాఠాలు! ప్రకృతి వ్యవసాయం సాగు నీటి వినియోగ పద్ధతిని సమూలంగా మార్చివేస్తుంది. ప్రకృతి సేద్యంలో సాగయ్యే పంటలు నీటిని వినియోగించుకోవటం మాత్రమే కాదు, నీటిని ఉత్పత్తి చేసుకుంటాయి కూడా! నదుల్లో ఉండే నీటికి పది రెట్లు నీరు గాలిలో ఉంది. గాలి నుంచి నీటిని సంగ్రహించి ఉపయోగించుకోవడం ప్రకృతి వ్యవసాయంలోనే సాధ్యమవుతుంది. 365 రోజులు ఆకుపచ్చగా పంటలతో పొలాన్ని కప్పి ఉంచటం, అవశేషాలతో ఆచ్ఛాదన కల్పించటం వల్ల నేలలో నుంచి తేమ ఆవిరి కావటం తగ్గుతుంది. నేలలో సేంద్రియ పదార్థం, సేంద్రియ కర్బనం పెరుగుతుంది కాబట్టి నీటిని గాలి నుంచి గ్రహించి పట్టి ఉంచుకునే శక్తి ఈ పంటలకు సమకూరుతోంది. కురిసిన 100 చుక్కల్లో 50 చుక్కలు వాగుల్లోకి పోతున్నాయి లేదా ఆవిరవుతున్నాయి. ప్రకృతి సేద్యంలో ఈ నష్టం బాగా తగ్గి, భూమిలోకి నీరు ఎక్కువగా ఇంకుతుంది.నీటిని భౌతికశాస్త్ర కోణం నుంచి అర్థం చేసుకోవటమే ఇప్పటి వరకు చేశాం. ప్రకృతి వ్యవసాయం జీవశాస్త్ర కోణం నుంచి నీటిని చూడటం నేర్పుతోంది. ఈ అసాధారణ పాఠాలు మేం నేర్చుకుంటూ సరికొత్త పద్ధతులను అమల్లోకి తెస్తున్నాం. వర్షం కురవక ముందే విత్తనాలను గుళికలుగా మార్చి విత్తుతున్నాం. నెల తర్వాత కొద్దిపాటి జల్లులు పడినా పంటలు మొలకెత్తుతున్నాయి. ఒకటికి పది పంటలు వత్తుగా వేయటం వల్ల రైతులకు చాలా లాభాలు చేకూరుతున్నాయి. బంజరు భూములను దున్నే పని లేకుండా సాగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పాదులు చేస్తూ ఒక్కో పాదులో ఐదారు రకాల విత్తనాలు వేస్తూ బంజరు భూములను సైతం రైతులు సాగులోకి తెస్తున్నారు. మన రైతుల అనుభవాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. – టి. విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఏపీ రైతు సాధికార సంస్థ -
పిల్లలకు మాటలు త్వరగా వచ్చేందుకు ఔషధంగా వస
-
పెట్టుబడి ఖర్చు తగ్గించుకుంటే రైతన్నకు లాభాలు
-
ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన పంటలు ఎంతో ఆరోగ్యకరమైనది
-
రెండెకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగి
-
పెద్ద విస్తీర్ణంలో ప్రకృతి సేద్యం ఎలా చేయాలంటే..!
సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ద్రావణాలు, కషాయాలను చిన్న, సన్నకారు రైతులు తయారు చేసుకొని వాడగలుగుతున్నారు. అయితే, ఎక్కువ విస్తీర్ణంలో సేంద్రియ/ప్రకృతి సేద్యం చేసే పెద్ద రైతులకు వీటి తయారీ కష్టం కావటంతో జీవన ఎరువులు, జీవన పురుగుమందులను విరివిగా వినియోగిస్తున్నారు. రైతు శాస్త్రవేత్త, తునికిలోని ఏకలవ్య కేవీకే సలహాదారు, హార్ట్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఎం.ఎస్.సుబ్రహ్మణ్యం రాజు గత కొన్ని సంవత్సరాలుగా చిన్న, పెద్ద కమతాల్లో సాగు చేసే రైతులతో కలసి పనిచేస్తున్నారు. ఖరీఫ్/లేటు ఖరీఫ్ వరి సాగులో చిన్న కమతాల రైతులు, పెద్ద కమతాల రైతులు ఏయే ఉత్పాదకాలను, ఎంతెంత మోతాదులో వాడితే మంచి ఫలితాలు వస్తున్నాయన్న అంశాలను ఆయన ‘సాక్షి సాగుబడి’కి ఇలా వివరించారు. వరి నారుమడిని నీరు నిలవని విధంగా తయారు చేసుకోవాలి. విత్తనాన్ని ఒక రోజు ముందు ఎండబెట్టి మరునాడు విత్తన శుద్ధి చేయాలి. నిద్రావస్థ ఉన్న విత్తనాలను, నిద్రావస్థ తొలగించడానికి గోరువెచ్చని నీటిలో నానబెట్టి, అనంతరం విత్తనాలను నారుమడిపై వెదజల్లాలి. 2వ రోజు నీరు బయటకు తీయాలి. 5వ రోజు నీరు పెట్టాలి. తర్వాత తగినంత నీరు ఇస్తుండాలి. చాలా ప్రాంతాల్లో నారు 6 అంగుళాల సైజు నుంచి 10 అంగుళాల సైజు వచ్చినప్పుడు మాత్రమే ఊడ్పు/నాట్లు వేస్తుంటారు. నాట్లు వేసిన 7 రోజులకు.. చనిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ నాట్లు వేయాలి. ప్రధాన పొలాన్ని ఊడ్పుకు ముందు 20 రోజుల నుంచి దఫ దఫాలుగా వారానికి ఒకసారి దుక్కి దున్ని, చదును చేసుకోవాలి. ఎకరాకు 3 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు వెయ్యాలి. నాట్లతో పాటుగా వివిధ రకాల జీవన ఎరువుల (బ్యాక్టీరియాల) ను ఇవ్వాలి. మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం ఉండేలా వరి నాట్లు వేయాలి. మధ్యలో కాలి బాటలు తీయాలి. గట్లపై నువ్వుల విత్తనాలను చల్లుకుంటే నువ్వుల పువ్వులు ఎనాగరస్ అనే కీటకాన్ని ఆకర్షించటం ద్వారా తెల్లదోమ నివారణ జరుగుతుంది. సేంద్రియ వరి సాగులో చిన్న, పెద్ద రైతులకు అనువైన ఉత్పాదకాల పట్టిక! మోతాదు ఎంత? ఎకరం పంటకు సగటున 100–120 లీ. నీటిని పిచికారీ చేయాలి మీనామృతాన్ని నారుమడిపై లీ. నీటికి 5 ఎం.ఎల్., పైరు ఎదిగిన దశలో లీ. నీటికి / 10ఎం.ఎల్. చొప్పున కలిపి పిచికారీ చేయాలి బవేరియాను లీ. నీటికి /10 గ్రా. కలిపి పిచికారీ చేయాలి ∙మెటారైజమ్ లీ. నీటికి/ 10 గ్రా. వాడాలి ∙హ్యూమిక్ యాసిడ్ కిలో విత్తనాలకు/ 10 గ్రా. వాడాలి. ∙కిలో నేలవేము పొడిని 100 లీ. నీటిలో కలిపి కషాయం తయారు చేయాలి 1500 గ్రా. వావిలాకు పొడిని కషాయం చేసుకొని 100 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి ∙ఎకరానికి రకానికి ఒక కిలో చొప్పున జీవన ఎరువులు వాడాలి ∙లీ. నీటికి 10 ఎం.ఎల్. కొబ్బరి నీరు కలపాలి పంచగవ్య నారుమడిలో పిచికారీకి లీ. నీటికి 5 ఎం.ఎల్. కలపాలి. పైరు ఎదిగే దశలో పిచికారీకి లీ. నీటికి 20 ఎం.ఎల్. కలపాలి ∙అర కేజీ ఇంగువతో ద్రావణం చేసుకొని వంద లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి 200 గ్రా. పసుపును కషాయం చేసుకొని వంద లీ. నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి ∙2 కిలోల మొలకలతో ద్రావణం చేసుకొని వంద లీ. నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి ∙6 లీ. పుల్ల మజ్జిగను వంద లీ. నీటితో కలిపి పిచికారీ చేయాలి. ఆగ్నేయ అస్త్రం తయారీలో మిర్చి, అల్లం, వెల్లుల్లిలను అర కిలో చొప్పున తీసుకొని నూరి కషాయం తయారు చేసి వంద లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. (ఇతర వివరాలకు.. సుబ్రహ్మణ్యం రాజు మొబైల్: 76598 55588) బయోచార్‌తో సేంద్రియ ఇంటిపంటల సాగుపై శిక్షణ సేంద్రియ ఇంటిపంటల సాగుపై పట్టణ/నగర వాసులపై ఆసక్తి పెరుగుతోంది. బయోచార్ (బొగ్గుపొడి) కలిపిన మట్టి మిశ్రమంతో టెర్రస్ గార్డెన్లు, పెరటి తోటలు, బాల్కనీలలో కూరగాయల పెంపకంపై ఈ నెల 24, 25 తేదీల్లో హైదరాబాద్ మలక్‌పేటలోని న్యూలైఫ్ ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనుంది. మిగులు పంట దిగుబడులను సోలార్ డ్రయ్యర్‌తో ఎండబెట్టే విధానం కూడా వివరిస్తామని న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివ షిండే తెలిపారు. వివరాలకు.. 81210 08002. 17న అమలాపురంలో ప్రకృతి సేద్యంపై శిక్షణ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 17న కోనసీమ జిల్లా అమలాపురంలోని (ముక్తేశ్వరం– కొత్తపేట రోడ్డు) శ్రీసత్యనారాయణ గార్డెన్స్‌లో ప్రకృతి వ్యవసాయంపై నిపుణులు విజయరామ్ రైతులకు అవగాహన కల్పిస్తారని నిర్వాహకులు నిమ్మకాయల సత్యనారాయణ తెలిపారు. ప్రవేశం ఉచితం. ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. వివరాలకు.. 64091 11427 (సా. 3 గం. నుంచి 6 గం. వరకు మాత్రమే). పతంగి రాంబాబు, సాగుబడి డెస్క్. (చదవండి: ఢిల్లీకి.. మా ఊరి బొప్పాయి! ప్యాకింగ్ మరింత స్పెషల్!) -
ప్రకృతి వ్యవసాయ విధానాలు భేష్
సాక్షి, అమరావతి: ఏపీలో అమలవుతోన్న ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆదర్శంగా ఉన్నాయని, ఈ విధానంలో పండించే ఆహార ఉత్పత్తులు రుచి, నాణ్యతతో పాటు సురక్షితమైనవిగా గుర్తించామని అంతర్జాతీయ ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థ మెక్కెయిన్ ఫుడ్స్ గ్లోబల్ డైరెక్టర్ వైవ్స్ నోయెల్ లెక్లెర్క్ చెప్పారు. 160 దేశాల్లో బంగాళదుంప ఆధారిత ఆహార ఉత్పత్తులను విక్రయిస్తూ అంతర్జాతీయంగా గుర్తింపుపొందిన ఈ సంస్థ బృందం మంగళవారం రాష్ట్రంలో పర్యటించింది. ‘ఫ్రెంచ్ ప్రైస్’ వంటి బహుళజాతి సంస్థతో అంతర్జాతీయంగా 27 శాతం మార్కెట్‌ను సొంతం చేసుకున్న ఈ సంస్థ ఏపీతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. 2030 నాటికి ప్రపంచంలో తాము సేకరించే బంగాళదుంప వ్యవసాయ క్షేత్రాలన్నింటిలోను సుస్థిర వ్యవసాయ విధానాలను అమలుచేయాలనే లక్ష్యంతో ఈ సంస్థ అడుగులేస్తోంది. ఇండియాలో ఈ సంస్థతో కలిసి పనిచేస్తున్న బావిక్ కుమార్ బ్రహంభట్‌తో కలిసి నోయల్ లెక్లెర్క్ బృందం గుంటూరు జిల్లాలో నూతక్కి, కొత్తపాలెం, రేవెంద్రపాడు గ్రామాల్లో పర్యటించింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో బంగాళదుంప సాగుచేస్తున్న రైతుక్షేత్రాలతో పాటు ఇతర పంటలను బృందం సభ్యులు పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, పాటిస్తున్న యాజమాన్య పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం గురించి ఆరా తీశారు. మల్చింగ్ (నేలను కప్పి ఉంచడం) వల్ల కలిగే ఉపయోగాలు.. తదితర అంశాలపై అధ్యయనం చేశారు. ఏపీలో అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆయా దేశాల్లో అమలుచేసేలా కృషిచేస్తామని చెప్పారు. -
‘ప్రకృతి’ సాగుకు జైకొడదాం
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయ విధానాల వైపు మళ్లిన రైతన్నను దేశానికి గొప్ప సేవకుడిగా భావించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సేంద్రీయ సేద్యంపై రైతులను ప్రోత్సహిస్తూ ఒక విధానాన్ని తేవాలని నీతి ఆయోగ్‌ను కోరారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల వల్ల రసాయన ఎరువుల సబ్సిడీ భారం తగ్గుతుందన్నారు. ఇలాంటి విధానాలను అనుసరించే అన్నదాతలకు రివార్డులు అందచేసే విధానం తేవాలని సూచించారు. సహజ, ప్రకృతి వ్యవసాయ విధానాలపై నీతి ఆయోగ్ సోమవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వర్చువల్ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై జాతీయ స్థాయిలో దృష్టి పెట్టాల్సిన పలు కీలక అంశాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తావించారు. ఆ వివరాలివీ.. ఆర్థిక సంఘం సిఫార్సుల్లో వెయిటేజీ ప్రకృతి వ్యవసాయంపై నీతి ఆయోగ్ జాతీయ స్థాయి సదస్సు నిర్వహించడం ప్రశంసనీయం. హరిత విప్లవం వల్ల వ్యవసాయ రంగంలో భారీ దిగుబడులు సాధించాం. రసాయన ఎరువులు, విషపూరిత పురుగు మందులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజానికి నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించాలి. పెద్ద మొత్తం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సిఫార్సుల్లో వెయిటేజీ ఇవ్వాలి. కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పుల నివారణ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ రాష్ట్రాలు దేశానికి సహాయకారిగా నిలుస్తున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయ ధృవీకరణ పద్ధతులు స్నేహపూర్వకంగా ఉండాలి. ప్రతి రైతుకు అందుబాటులో ఉండాలి. 90 శాతం నిధులివ్వాలి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లే రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం ఉదారంగా వ్యవహరించాలి. నిధుల కేటాయింపులో భిన్నమైన విధానాలు ఉండాలి. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు ప్రస్తుతం 60 శాతం నిధులిస్తుండగా భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రకృతి సేద్యాన్ని అనుసరించే రాష్ట్రాలకు 90 శాతం నిధులివ్వాలి. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించే ఖర్చుతో పోలిస్తే రసాయన ఎరువుల సబ్సిడీ కోసం వెచ్చించే ఖర్చు చాలా ఎక్కువ. వ్యవసాయ వర్శిటీల్లో పాఠ్యాంశాలు ప్రకృతి సాగు విధానాలపై వ్యవసాయ యూనివర్సిటీ కోర్సుల్లో పాఠ్యాంశాలను పొందుపరచి వ్యవస్థీకృత పరిశోధనలు కొనసాగాలి. సహజ ఉత్పత్తులు, రసాయనాల ద్వారా పండించిన పంటల మధ్య వ్యత్యాసం, ఆరోగ్యంపై ప్రభావాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. రసాయన ఉత్పత్తులను విడనాడాలి రసాయన ఎరువులు, పురుగు మందుల ప్రభావం ఉన్న ఆహారాన్ని ఉత్పత్తులను విడనాడి ప్రజలందరికీ ఆహార భద్రత, పౌష్టికాహారాన్ని అందించాలి. ప్రకృతి వ్యవసాయ విధానాల్లో నేల పునరుత్పత్తి ప్రక్రియ అన్నిటికంటే ముఖ్యం. నీటి పరిరక్షణ, పర్యావరణ హితం మనం లక్ష్యం కావాలి. భవిష్యత్తు తరాలకు కూడా ఆరోగ్యకరమైన జీవితం, చక్కటి జీవనోపాధి అందించేలా ‘సతత హరిత విప్లవం’ (ఎవర్గ్రీన్ రివల్యూషన్) దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. సమున్నత లక్ష్యాలు 2021–22లో ఆంధ్రప్రదేశ్‌లో 6.3 లక్షల మంది రైతులు 2.9 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించారు. 3,009 రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఈ కార్యక్రమం అమలవుతోంది. రాష్ట్రంలోని సాగు భూమిలో దాదాపు 5 శాతం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం జరుగుతోంది. రైతులు తాము సాగు చేస్తున్న భూమిలో ఇప్పటికిప్పుడే రసాయన ఎరువులు, పురుగు మందులను పూర్తిగా వదిలేయమని చెప్పడం లేదు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి క్రమంగా, సజావుగా ప్రకృతి వ్యవసాయం దిశగా మళ్లేగా ప్రభుత్వం సహకారం అందిస్తోంది. పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాలను అమలు చేసేందుకు రైతుకు కనీసం 3 నుంచి 5 ఏళ్లు పడుతుంది కాబట్టి సుస్థిర విధానాల ద్వారా జీవనోపాధి మెరుగుపరిచేలా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇష్టపూర్వకంగా... స్వచ్ఛందంగా రసాయన ఎరువులు, పురుగు మందులతో గత 30–50 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న రైతన్నలు వాటిని విడనాడి పూర్తిగా ప్రకృతి పద్ధతుల్లో సేద్యం చేయడం అంత సులభమైన పనికాదు. ఇప్పటికిప్పుడు అలా చేయాలని కూడా మనం కోరలేం. కానీ ప్రకృతి సాగు విధానాల వైపు మళ్లడం అత్యంత ఆవశక్యం. సాంకేతిక సంస్థలు, శాస్త్రవేత్తల సహకారంతో దశలవారీగా అడుగులు వేయాలి. ఈ ప్రక్రియ మొత్తం ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా జరగాలి. ప్రకృతి సాగుకు జర్మనీ సహకారం మన రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని భారీ ఎత్తున చేపట్టేందుకు, ప్రకృతి సాగు విధానాలను మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం నిధులు ఇచ్చేందుకు జర్మనీ ముందుకు వచ్చిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. ఈ ప్రాజెక్టుకు అనుమతులు చివరి దశలో ఉన్నాయి. ఐదేళ్లలో 20 మిలియన్ యూరోల ఆర్థిక సాయం అందించేందుకు జర్మనీ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ నిధులతో ఇండో–జర్మనీ గ్లోబల్ అకాడమీ ఆన్ ఆగ్రో ఇకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ (ఐజీజీఏఏఆర్‌ఎల్) సంస్థను ఏపీలో ఏర్పాటు చేయనుంది. ప్రకృతి వ్యవసాయంలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అనుసరించేలా ఐజీజీఏఏఆర్‌ఎల్ కృషి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దీని కోసం భూములు, భవనాలను సమకూరుస్తుంది. మా ప్రయత్నాలకు సహకరిస్తున్నందుకు నీతిఆయోగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎఫ్ఏఓ, యు.ఎన్.ఇ.పి, ఐసీఆర్‌ఏఎఫ్, యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్, యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బరో, సీఐఆర్‌ఏడీ (ఫ్రాన్స్), జీఐజెడ్, కె ఎఫ్ డబ్ల్యూ లాంటి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం, ఆర్బీకేల స్థాయిలో ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ప్రకృతి వ్యవసాయాన్ని నిర్మాణాత్మంగా విస్తరించడంలో ఎంతో కీలకం. మూడేళ్లుగా సానుకూలత గత మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్రంలో చాలా సానుకూల పరిస్థితి ఉందని వెల్లడవుతోంది. పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుత సగటు దిగుబడులతో సమానంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఉంటున్నాయి. వరదలు, కరువు, చీడపీడలను సమర్థంగా తట్టుకుంటున్నట్లు స్వతంత్ర పరిశోధనల ద్వారా వెల్లడవుతోంది. జీవ వైవిధ్యంతోపాటు మంచి పౌష్టికాహారం లభిస్తోందని, ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. – సీఎం జగన్ ఆర్బీకేలు.. అద్భుతం ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా కేంద్రాల సేవలు బాగున్నాయి. వాటి పనితీరును స్వయంగా పరిశీలించి చెబుతున్నాను. ప్రకృతి వ్యవసాయ విధానాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆచరణలోకి తెచ్చింది. సీఎం జగన్ అద్భుతమైన చర్యలు తీసుకున్నారు. – డాక్టర్ రాజీవ్ కుమార్,నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ -
ప్రకృతి సాగుకు పందిరేయాలి
వ్యవసాయ రంగానికి కొత్త దిశానిర్దేశం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. రసాయన పరిశోధనా లయాల నుంచి వ్యవసాయాన్ని ప్రకృతి ఒడిలోకి నడపమని దేశ రైతాంగాన్ని వినమ్రంగా కోరారు. రైతును కష్టాల కాష్టంలోకి నెడుతూ... తప్పుగా నడుస్తున్న సాగుబడిని సహజ వ్యవసాయంగా మార్చుకొని, ‘తిరిగి మూలాల్లోకి’ వెళదామని హితవు పలికారు. దేశీయ సంప్రదాయిక తెలివికి ఆధునిక శాస్త్ర సాంకేతికత జోడించి, వాతావరణ మార్పు సంక్షోభంలో అలమటిస్తున్న ప్రపంచానికి కొత్త టానిక్ ఇద్దామన్నారు. భారత్‌ని ప్రపంచ శీర్షభాగాన నిలుపుదామని పిలుపిచ్చారు. వ్యవ సాయం–భూసార పరిరక్షణ–ఆహారోత్పత్తి–పంపిణి... ఇలా ఒకటికొకటి ముడివడి ఉన్న పలు విష యాల్లో పరివర్తన చివరకు మనిషి జీవనశైలి మార్పు వరకూ వెళ్లాలని అభిలషించారు. ఆర్తితో ప్రధాని చేసిన ప్రతిపాదన బాగుంది. స్వాగతించదగ్గ గొప్ప మలుపు. పెట్టుబడి వ్యయాన్ని రమా రమి తగ్గించి దిగుబడిని పెంచే శాస్త్రీయ విజయసూత్రమూ ఇదేనని ఆయన నొక్కి చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై గుజరాత్లో జరిగిన ఓ సదస్సు వేదిక నుంచి, అక్కడి సభికులనే కాక, ఈ–పద్ధతి ద్వారా దేశం నలుమూలలా దాదాపు 8 కోట్ల మంది రైతుల్ని ఉద్దేశించి ఆయనీ ప్రసంగం చేశారు. ‘నీరు రావడానికి ముందే వంతెన నిర్మించాలి’ అని అర్థం వచ్చే గుజరాతీ సామెతనూ ఆయన ఉటంకించారు. సామెతలో చెప్పినట్టే, ప్రకృతి వ్యవసాయం వైపు దేశ రైతాంగాన్ని మళ్లించడమే కేంద్ర ప్రభుత్వ విధానమయితే... తగినంత ముందుగానే చేయాల్సింది చాలా ఉంది. విధానపర మైన పూర్వరంగం, ఆర్థిక నిర్ణయాలు, ఆచరణాత్మక చిత్తశుద్ధి ఇందుకు ఎంతో అవసరం. కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో కంపెనీ లాబీలకు వశపడి, ప్రకృతి వ్యవసాయంపై వికృత వ్యాఖ్యలు చేసే శాస్త్రవేత్తల మూక ఆలోచనల్ని సమూలంగా మార్చాలి. మొత్తం వ్యవసాయ రంగమే దిశ మార్చుకునే సంధి కాలంలో... రైతులకు ప్రోత్సాహకాలివ్వాలి. కొత్త పద్ధతికి సానుకూలంగా ఆహారోత్పత్తి– పంపిణి–మార్కెట్ వ్యవస్థల్ని పటిష్టపరచాలి. అవేవీ లేకుండా, దేశ జనాభాలో సింహ భాగమైన రైతాంగాన్ని ఆకట్టుకునేందుకు ఇది ఉత్తుత్తి ప్రసంగమే అయితే, సమీక్షే అవసరం లేదు. ఉద్యమిం చిన రైతాంగం దీక్షకు లొంగి మూడు వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకున్న అక్కసుతోనో, పాలక బీజేపీ సిద్ధాంత పునాది ఆరెస్సెస్ అభిమానించే దేశీ ఆవుకు ప్రాధాన్యత ఉందనో... ప్రకృతి వ్యవ సాయంపై కేవలం సానుభూతితో మాట్లాడితే ఒరిగేదేమీ ఉండదు. నిజమైన కార్యాచరణ కావాలి. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో గాని, అంతకు ముందే అయినా ఇందుకవసరమైన విధాన–ఆర్థిక ప్రక టన వెలువడాలి. వ్యూహరచన జరగాలి. జన్యుమార్పిడి విత్తనాలు, విష రసాయన ఎరువులు, క్రిమి సంహారకాల పీడ వదిలించుకొని వ్యవసాయం క్రమంగా సహజసిద్ధ సాగువైపు మళ్ళాలి. సుభాష్ పాలేకర్ వంటి వ్యవసాయ నిపుణులు చాన్నాళ్లుగా ప్రకృతి వ్యవసాయం గురించి చెబుతున్నారు. పాలకులెవరూ పట్టించుకోలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ చేపట్టలేదు. నీతి ఆయోగ్ ఇటీవలి కాలంలో ఈ విధానాన్ని నెత్తికెత్తుకుంది. రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కాని ప్రస్తుత విధానం నుంచి మార్పు అనివార్యమని కేంద్రం గ్రహించడమూ దీనికి కారణమేమో? పైగా ఎరువులు–క్రిమిసంహారకాల దిగుమతి ఆర్థిక భారం మోయలేకుండా ఉంది. ఇది కాక... ఆహారో త్పత్తి–పంపిణి, వ్యావసాయిక–జీవవైవిధ్యం నుంచి మార్కెట్ వరకు మొత్తం వ్యవస్థను గుప్పిట్లో ఉంచుకునే క్రమంలో విధిగా ప్రత్యామ్నాయాల్ని ప్రతిపాదించాల్సిన స్థితి వచ్చింది. రైతుకు రెట్టింపు ఆదాయం చూపుతామన్న పాలకపక్ష హామీ, సమీప భవిష్యత్తులో నిజమయ్యే సూచనలు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయమే రక్షగా కనిపించి ఉండవచ్చు! పైగా, ఈ పద్ధతితో పెట్టుబడి వ్యయం సగానికి తగ్గించగలిగితే, దాని మీద 1.5 రెట్లు అధికంగా కనీస మద్దతు ధర ప్రకటించడ మైనా, కాలక్రమంలో రెట్టింపు ఆదాయం చూపడమైనా సాధ్యపడవచ్చు! గతంతో పోలిస్తే, ప్రకృతి వ్యవసాయం స్థిరపడే సూచనలు ఇటీవల కనిపిస్తున్నాయి. ప్రధాని చెప్పినట్టు దేశంలోని చాలా ప్రాంతాల్లో లక్షలాది రైతులు నెమ్మదిగా ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం’ సత్ఫలితాలనిస్తోంది. దాని వెనుక ఎంతో కృషి ఉంది. అజిత్ ప్రేమ్‌జీ వంటి ట్రస్టుల ఆర్థిక ప్రోద్బలంతో మౌలిక సదుపాయాలు, శిక్షణ, అవగాహన, సాంకేతి కత–సమన్వయాల చేదోడు రైతాంగానికి లభిస్తోంది. ఇప్పుడు సహజ వ్యవసాయం చేస్తున్న వారి కష్టనష్టాల్ని పరిశీలించి, ఇంకా ఎక్కడెక్కడ, ఏయే రూపాల్లో సహకారం అందిస్తే అది స్థిరపడటానికి ఆస్కారం ఉంటుందో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు అధ్యయనం చేయాలి. ‘ఇదింకా ధ్రువపడలేదు, శాస్త్రీయ ఆధారాల్లేవు, గణాంకాల్లేవు...’ అనే తర్కం వీడి శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, ప్రభుత్వ విభాగాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు తమ ఆలోచనా దోరణి మార్చు కోవాలి. వారిని దారిలోకి తీసుకురావడం ఇప్పుడు కేంద్రం ముందున్న సవాల్! కార్పొరేట్ పెత్తనం నుంచి విత్తనం తిరిగి రైతు చేతికి రావాలి. పెట్టుబడి వ్యయం తగ్గి రైతుకు ఆత్మహత్యల దుస్థితి తప్పాలి. రసాయనాల పీడ వీడి భూసారం తిరిగి పుంజుకోవాలి. గాంధీజీ కలలు కన్న సహజ వ్యవసాయ స్వావలంబన ద్వారా గ్రామ స్వరాజ్యం పరిఢవిల్లాలి. వాతావరణ మార్పు సంక్షోభానికి సమాధానంగా ‘తిరిగి మూలాలకు’ మళ్లే ప్రక్రియ, మరేదేశం కన్నా కూడ మనమే వేగంగా సాధించగలమని ప్రపంచానికి చాటి చెప్పాలి. అందుకు ఇదే మంచి తరుణం! -
ఎమ్మెల్యే ప్రకృతి సేద్యం
రసాయనిక అవశేషాల్లేకుండా ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసుకోవడానికి రోజువారీ పనుల వల్ల తీరిక దొరకటం లేదనుకుంటూ ఉంటారు. అయితే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇందుకు శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి నిదర్శంగా నిలుస్తూ ఇంటిపంటలను ఇష్టంగా సాగు చేస్తున్నారు. ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ఉండే ఆమె ప్రకృతి వ్యవసాయ ప్రేమికురాలు కావడం విశేషం. స్వగ్రామం వండువలో ఇంటి పక్కనే ఉన్న 50 సెంట్ల స్థలాన్ని ఉద్యాన పంటల వనంలా మార్చారు. ఆకుకూరలు, పందిరి కూరగాయ పంటలు ఆనప, బీర, బెండ, గుమ్మడి కాయల దిగుబడి బాగుంది. ఒక్కో ఆనపకాయ 10 నుంచి 20 కిలోల బరువు పెరుగుతున్నాయి. కంది, చెరకు, పెండలం, కంద ఇలా అనేక పంటలను సాగు చేస్తున్నారు. వంటకు బయోగ్యాస్‌ను వినియోగిస్తున్నారు. పంటలకు సొంతంగా తయారు చేసుకున్న సేంద్రియ ఎరువును, జీవామృతాన్ని, కషాయాలను వాడుతూ మంచి దిగుబడి సాధిస్తుండటం విశేషం. పెరటి పంటల పనులను కళావతి ప్రతి రోజూ ఉదయం గంట సేపు స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. పెరటి తోటలో కలియ దిరుగుతూ సిబ్బందికి తగిన సూచనలిస్తారు. పురుగు గానీ, ఆకు ముడత కనపడినా వెంటనే వాటిని తీసేయడం ద్వారా చక్కని పంట దిగుబడులు పొందుతుండడం విశేషం. – సూరాబత్తుల గాంధీ, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా మహిళలు పెరటి తోటల సాగు చేపట్టాలి శ్రద్ధగా చేస్తే ప్రకృతి/సేంద్రియ సాగు అసాధ్యమేమీ కాదు. సేంద్రియ ఎరువుతో భూమిని సారవంతం చేస్తే పంటల సాగుకు అనుకూలంగా మారుతుంది. బాల్యం నుంచీ పంటల సాగు అంటే బాగా ఇష్టం. ఇంటి దగ్గర కొద్ది స్థలంలో సరదాగా చేపట్టిన సాగు 50 సెంట్లకు విస్తరించింది. మహిళలంతా పెరటి తోటల సాగు చేపట్లేలా స్ఫూర్తినివ్వాలన్నది నా కోరిక. సేంద్రియ ఎరువులతో ఇంటి వద్దనే ఆరోగ్యదాయకమైన కూరగాయలు, పండ్లు సాగు చేసుకునేందుకు మహిళలు ముందుకు రావాలి. – విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా -
ప్రకృతి సేద్యమే ప్రాణం!
ఆరోగ్యానికి, ఆదాయానికి ప్రకృతి వ్యవసాయమే మేలని యువ రైతు జిన్న రాజు, మాధవి దంపతుల కుటుంబం అనుభవపూర్వకంగా చెబుతోంది. గత ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి, కూరగాయలు, పప్పుధాన్యాలు సాగు చేసుకుంటూ రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తాము తింటూ, పరిసర గ్రామాల ప్రజలకు కూడా అందుబాటులోకి తేవడం విశేషం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి గ్రామానికి చెందిన జిన్న బేతయ్య–లింగమ్మ దంపతుల సంతానం బాలయ్య, రాజు, కృష్ణ. రెండు బోరుబావులతో కూడిన ఐదు ఎకరాల సాగు భూమే వీరి జీవనాధారం. అందరిలాగే రసాయనిక ఎరువులు, పురుగు మందులతో వీరి వ్యవసాయం కొనసాగింది. ఆ క్రమంలో ఎంసీఏ చదువుకున్న బాలయ్య సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ గ్రామభారతి ద్వారా ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని తన కుటుంబానికి పరిచయం చేశారు. పంట పొలాన్నే ప్రాణంగా నమ్ముకున్న భర్త రాజు, అతని భార్య మాధవి ప్రకృతి వ్యవసాయంపై పాలేకర్ పుస్తకం చదివి.. ఆ ప్రకారంగా ఐదేళ్ల క్రితం వరి, కూరగాయలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయనారంభించారు. టేక్మాల్ మండలం శేరిపల్లి గ్రామంలో విఠల్–బూదెమ్మ దంపతుల కుమార్తె అయిన మాధవి తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. రాజును పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పొలం పనుల్లో తన భర్తకు చేదోడు వాదోడుగా ఉంటోంది. రాజు, మాధవి సహా ఇంటిల్లపాదీ పొలానికి వెళ్లి పనులన్నీ చేసుకుంటారు. ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం మాచవరంలో ప్రకృతి వ్యవసాయదారుడు కోటపాటి మురహరి రావు, హైదరాబాద్‌లో విజయరామ్ ఆధ్వర్యంలో జరిగిన సభల్లో పాల్గొన్న రాజు ప్రకృతి వ్యవసాయంలో పాటించాల్సిన ముఖ్య సూత్రాలు, ఎరువులు, కషాయాలు తయారీ పద్ధతులపై అవగాహన పెంచుకున్నాడు. అతని భార్య మాధవి పాలేకర్ పుస్తకాన్ని చదివి ప్రకృతి వ్యవసాయ పరిజ్ఞానం పెంచుకున్నారు. దంపతులు శ్రద్ధగా ఆచరణలో పెట్టారు. ఘనజీవామృతం, జీవామృతం, కషాయాలను సొంతంగానే తయారు చేసుకొని వాడుతున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులకు స్వస్తి చెప్పడంతో వరి సాగులో ఎకరానికి రూ. 4 వేల నుంచి 5 వేల వరకు ఖర్చు తగ్గిపోయిందని, ఐదెకరాలకు సరిపోను ఘనజీవామృతం, జీవామృతం తయారీకి రూ. రెండు వేల ఖరీదైన బెల్లం కొంటే సరిపోతున్నదని రాజు చెప్పాడు. వరిలో ఎకరానికి దుక్కిలో 200 కిలోలు, కలుపు తీసిన తర్వాత మరో 200 కిలోల చొప్పున ఘన జీవామృతం వాడుతున్నారు. ప్రతి 15 రోజులకోసారి ద్రవ జీవామృతం నీటితోపాటు క్రమం తప్పకుండా అందిస్తున్నారు. వరి దిగుబడి ఎకరానికి 30 బస్తాలు(20 క్వింటాళ్ల) వరకు వస్తున్నదని రాజు వివరించారు. వరితోపాటు ఇంట్లోకి అవసరమైన ఇతర పంటలన్నీ కొద్ది విస్తీర్ణంలో పండించుకుంటుండడం ఈ రైతు కుటుంబం ప్రత్యేకత. కూరగాయలు, ఆకుకూరలు, ఉల్లి, వెల్లుల్లి, పప్పులు.. తమ కుటుంబానికి సరిపడా ఏడాది పొడవునా సాగు చేసుకొని తింటుండడం విశేషం. దేశీ వంగడం మైసూరు మల్లిగ గతంలో సాధారణ వరి రకాలు సాగు చేసిన రాజు, మాధవి గత ఏడాది నుంచి దేశీ వంగడాలను సాగు చేస్తున్నారు. హైదరాబాద్ సేవ్ సంస్థ దేశీ విత్తనోత్సవంలో పాల్గొని తెచ్చుకున్న ఐదు రకాల దేశీ వరి వంగడాలను ఒక్కో ఎకరంలో గత ఏడాది సాగు చేశారు. అందులో దిగుబడి మెరుగ్గా ఉన్న సన్న రకం దేశీ వంగడం మైసూరు మల్లిగను ఈ ఏడాది మూడున్నర ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దూదేశ్వర్ అనే మరో దేశీ రకాన్ని అరెకరంలో సాగు చేస్తున్నారు. పండించిన ధాన్యాన్ని నిల్వ పెట్టుకొని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారికి బియ్యం క్వింటాలు రూ. 6,500 చొప్పున అమ్ముతూ మంచి ఆదాయం గడిస్తున్నామని, రసాయనాల్లేని ఆహారం తింటూ ఆరోగ్యంగా ఉన్నామని రాజు(99634 49223) అన్నారు. – కిషోర్ పెరుమాండ్ల, సాక్షి, మెదక్ -
ఖర్చు లేని సాగుకు రూ.వేల కోట్ల అప్పు!
సాక్షి, అమరావతి : పెట్టుబడి లేని వ్యవసాయం (జీరో బడ్జెట్ ప్రకృతి సాగు) ముసుగులో అప్పులు చేస్తూ రైతులకు శిక్షణలు, సదస్సులు, ఈవెంట్ల పేరుతో ప్రభుత్వ పెద్దలు భారీగా కమీషన్లు కాజేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ప్రకృతి సాగు కోసం శిక్షణలు, భోజనాలు, సామర్థ్యం పెంపు పేరుతో కేంద్రం నుంచి వివిధ పథకాల కింద అందే రూ.100 కోట్లను వ్యయం చేసినా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని వ్యవసాయ శాఖ అధికారులు పెదవి విరుస్తున్నారు. కేంద్రం అనుమతి కోసం ప్రతిపాదనలు రాష్ట్రంలో వచ్చే ఆరేళ్లలో పెట్టుబడి లేని ప్రకృతి సాగు కోసం రూ.16,000 కోట్లు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అంచనా వేశారు. వివిధ సంస్థల నుంచి ఈమేరకు అప్పులు చేయనున్నారు. చంద్రబాబు గతంలో అమెరికాలో పర్యటించిన సందర్భంగా ప్రకృతి సాగు కోసం కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి అప్పు చేసేందుకు అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా తొలిదశలో రూ.2,046 కోట్ల అప్పు కోసం వ్యవసాయశాఖ ప్రతిపాదనలు పంపడంపై ఆర్థికశాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం అంటూ శిక్షణలు, సదస్సుల కోసం రూ.వేల కోట్ల అప్పులు చేయడం తగదని సూచించింది. ఈ అప్పుల వల్ల ఎలాంటి ఉత్పాదకత, సంపద సమకూరడం లేదని పేర్కొంది. ప్రాజెక్టులో దేనికి ఎంత వ్యయం చేస్తారు? ఎన్ని ఎకరాల్లో ప్రకృతి సాగు చేపడతారు? తదితర వివరాలను పేర్కొనక పోవడంపై అభ్యంతరం తెలిపింది. అసలు ఈ కార్యక్రమం అమలుకు ఏదైనా వ్యవస్థ ఉందా? లేక అదనపు పోస్టులు కావాలంటారా? అని ఆర్థిక శాఖ ప్రశ్నించింది. అయితే బ్యాంకు నుంచి అప్పు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఒత్తిడి తేవడంతో గత్యంతరం లేక తొలిదశలో రూ.2,046 కోట్ల రుణానికి అనుమతిస్తూ గత బుధవారం జీవో జారీ చేసింది. అప్పు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని జీవోలో పేర్కొన్నారు. మొత్తం రూ.2,046 కోట్ల విలువైన ప్రాజెక్టులో కేఎఫ్‌డబ్ల్యూ రూ.1,650 కోట్లను రుణంగా ఇవ్వనుంది. రూ.85 కోట్లను గ్రాంటుగా మంజూరు చేయనుంది. మిగతా రూ. 311 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద భరించనుంది. ఈ ప్రాజెక్టు కాల వ్యవధిని 2024 వరకు ప్రతిపాదించారు. మరి రసాయన ఎరువుల అవసరం ఏముంది? ఏపీలో లక్షల ఎకరాల్లో జీరో బడ్జెట్‌తో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నామని, రైతులు పెద్ద ఎత్తున ఈ పథకంలో చేరుతున్నారంటూ ప్రతిపాదనలను పంపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎరువులు, పురుగుమందుల కోటాను తగ్గించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యవసాయశాఖ అధికారుల్లో వ్యక్తమవుతోంది. లక్షల ఎకరాలను ప్రకృతి వ్యవసాయంలోకి మారిస్తే రసాయన ఎరువులు అవసరం ఏముందని కేంద్రం ప్రశ్నిస్తే ఏం చేయాలని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం పేరుతో రైతులను బస్సుల్లో తరలిస్తూ శిక్షణ కింద రూ.వందల కోట్లను స్వచ్చంధ సంస్థలకు దోచి పెడుతూ కమీషన్లు కాజేస్తున్నారని వ్యవసాయ శాఖ ఉద్యోగులే వ్యాఖ్యానించడం గమనార్హం. -
21న సమీకృత సహజ సేద్యంపై నారాయణరెడ్డి శిక్షణ
గోఆధారిత సమీకృత సహజ సేద్య నిపుణులు, దొడ్డబళ్లాపూర్ (కర్ణాటక)కు చెందిన ప్రముఖ రైతు ఎల్. నారాయణ రెడ్డి (84) అక్టోబర్ 21 (ఆదివారం)న హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ కేఎల్ఎన్ ప్రసాద్ ఆడిటోరియం, రెడ్ హిల్స్, లక్డికపూల్లో ౖరైతులకు తెలుగులో శిక్షణ ఇస్తారు. భాగ్యనగర్ గోపాలాస్, రైతునేస్తం, నేచర్స్‌వాయిస్ సంయుక్త ఆధ్వర్యం లో ఉ. 9 గం. నుంచి సా. 6 గం. వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో గోఆధారిత సమీకృత సహజ వ్యవసాయం, ఆహారం, జీవన విధా నంపై వివిధ అంశాలలో శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 70939 73999, 70608 43007 నంబర్లలో సంప్రదించవచ్చు. 21న సిరిధాన్యాల సాగుపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ఈ నెల 21(ఆదివారం)న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు ప్రకృతి వ్యవసాయ విధానంలో రబీలో సిరిధాన్యాల సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. కడప జిల్లాకు చెందిన సీనియర్ రైతు విజయ్‌కుమార్ రైతులకు శిక్షణ ఇస్తారు. రైతులకు ఉచితంగా వేస్ట్ డీ కంపోజర్‌ను పంపిణీ చేస్తారు. వివరాలకు.. 83675 35439, 97053 83666. -
సమీకృత సహజ సేద్యంపై నారాయణరెడ్డి శిక్షణ
గోఆధారిత సమీకృత సహజ సేద్య నిపుణులు, దొడ్డబళ్లాపూర్ (కర్ణాటక)కు చెందిన ప్రముఖ రైతు ఎల్. నారాయణ రెడ్డి (84) అక్టోబర్ 21 (ఆదివారం)న హైదరాబాద్‌లోని కేశవ మెమోరి యల్ ఎడ్యుకేషనల్ సొసైటీ(నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర) ఆడిటోరియంలో రైతులకు తెలుగులో శిక్షణ ఇస్తారు. భాగ్యనగర్ గోపాలాస్, రైతునేస్తం, నేచర్స్‌వాయిస్ సంయుక్త ఆధ్వర్యం లో ఉ. 9 గం. నుంచి సా. 6 గం. వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో గోఆధారిత సమీకృత సహజ వ్యవసాయం, ఆహారం, జీవన విధా నంపై వివిధ అంశాలలో శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 70939 73999, 70608 43007 నంబర్లలో సంప్రదించవచ్చు. -
భూసారాన్ని బట్టే చీడపీడల బెడద!
రసాయనిక అవశేషాల్లేని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగు చేసుకోవాలన్న ఆసక్తి గాఢంగా ఉండాలే గాని సొంతిల్లే అవసరం లేదు. క్వార్టర్లో నివాసం ఉంటున్నప్పటికీ ఎంచక్కా సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవచ్చని రుజువు చేస్తున్నారు డా. వి. శ్రీనివాసరావు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన తన కుటుంబంతో క్యాంపస్ క్వార్టర్లో నివాసం ఉంటూ.. పెరటి స్థలంలో ఇంటిపంటలు పండించుకుంటున్నారు. గతంలో క్వార్టర్ పై అంతస్తులో ఉండగా టెర్రస్ మీద ఐదేళ్లపాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సొంతంగా తయారు చేసుకున్న జీవామృతం, ఘన జీవామృతంతో ఇంటిపంటలు సాగు చేసిన అనుభవం ఉంది. గత ఏడాది నుంచి పెరట్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం నాటావుల మాగిన పేడ ఎరువు, మేకల ఎరువు సమపాళ్లలో కలిపి మొక్కలకు వేస్తున్నారు. వేసవిలోనే దగ్గర్లోని గ్రామానికి వెళ్లి రైతు నుంచే కొనుగోలు చేసి తెచ్చుకొని వాడుతున్నారు. అరటి గెల ఆయన పెరటి తోటకు దీపస్థంభంలా భాసిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆయన పెరటి తోటలో దొండ/బీర పాదులతోపాటు బెండ మొక్కలు, వంగ మొక్కలు, పుదీన ఉన్నాయి. వంగ మొక్కలకు వేసవికి ముందు 4–5 అంగుళాల ఎత్తున ప్రూనింగ్ చేశారు. కొత్త కొమ్మలకు ఇప్పుడు కాయలు వచ్చాయి. పుదీన, తోటకూర ఉంది. మృగశిర కార్తెతో పాటే రుతుపవనాలు పలుకరించిన తర్వాత వారం క్రితమే అనేక ఆకుకూరలు విత్తుకున్నారు.కూరగాయ మొక్కల విత్తనాల నారు పోసుకున్నారు. టెర్రస్ గార్డెన్లో కన్నా పెరటి తోటలో పంటలకు చీడపీడల బెడద తక్కువగా ఉన్నట్లు గమనించానని డా. శ్రీనివాసరావు తెలిపారు. భూమిలో సారం బాగుంటే చీడపీడల బెడద తక్కువగా ఉంటుందన్నారు. కట్టెల బొగ్గు పొడిని అప్పుడప్పుడూ మొక్కలపై చల్లుతుంటానన్నారు. వారానికోసారి లీటరు నీటికి 10–15 ఎం.ఎల్. నాటావు మూత్రాన్ని కలిపి పెరటి తోటలో పిచికారీ చేస్తున్నానని తెలిపారు. వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో తమ పెరటి తోట కూరగాయలు, ఆకుకూరలనే తింటామని డా. శ్రీనివాసరావు(94922 93299) సంతోషంగా చెప్పారు. కొత్తిమీర, ఎరువును చూపుతున్న డా. శ్రీనివాసరావు -
స్వల్ప ఖర్చుతో పాలీహౌస్లో ప్రకృతి సేద్యం!
పాలీహౌస్‌లను కేవలం 20% ఖర్చుతోనే నిర్మించుకోవటం.. ఇందులో అరుదైన దేశవాళీ సేంద్రియ వంగడాలను ప్రకృతి సేద్య పద్ధతుల్లో సాగు చేయడంపై తెలుగు రైతులకు శిక్షణ ఇవ్వడానికి శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రస్టు సన్నద్ధమైంది. తొలిదశలో రంగారెడ్డి జిల్లాలో వెయ్యి మంది కూరగాయ రైతులకు, ‘ఇంటిపంట’లు పండిస్తున్న హైదరాబాద్ నగరవాసులకు ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇవ్వడానికి, సేంద్రియ విత్తనాలు ఇవ్వడానికి వీలుగా ట్రస్టు తెలంగాణ ఉద్యాన శాఖతో ఇటీవల అవగాహన కుదుర్చుకుంది. ట్రస్టుకు చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణుడు డా. బండి ప్రభాకరరావు ఇటీవల హైద్రాబాద్ వచ్చినప్పుడు ‘సాక్షి’కి అందించిన సమాచారం ఆయన మాటల్లోనే.. మీ కోసం.. పంచాంగం ప్రకారం ఇప్పుడు వర్షాలు రావటం లేదు. వాతావరణంలో చాలా మార్పులొచ్చాయి. వర్షాకాలంలో వర్షం సరిగ్గా కురవటం లేదు. అకాల వర్షాలు దెబ్బతీస్తున్నాయి. రైతులు చాలా కష్టపడుతున్నారు, నష్టపడుతున్నారు. గ్రీన్‌హౌస్‌ల ద్వారా వాతావరణంపై నియంత్రణ సాధించి, పంటలు పండించుకోవచ్చు. గ్రీన్హౌస్లను స్వల్ప ఖర్చుతోనే ఏర్పాటు చేసుకోవచ్చు. స్థానికంగా లభించే బాదులతోనే దీన్ని నిర్మించుకొని, ప్లాస్టిక్ షీట్ వేసుకోవచ్చు. పొలాల్లో రైతులు.. నగరాలు, పట్టణాల్లో ‘ఇంటిపంట’ల సాగుదారులు స్వయంగానే నిర్మించుకోవచ్చు. కంపెనీల కొటేషన్ల ధరలో 20% ఖర్చుతోనే నిర్మించుకోవచ్చు. ఇంటిపంటల సాగు కోసం వెయ్యి నుంచి 40 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాలీహౌస్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. వెయ్యి చదరపు అడుగుల పాలీహౌస్‌కు కొటేషన్ అడిగితే రూ.2.25 లక్షలని కంపెనీల వాళ్లు చెప్పారు. నేను నా ఫామ్‌లో రూ. 25,000 ఖర్చుతో ఏర్పాటు చేసుకున్నాను. ప్లాస్టిక్ షీట్, నెట్ల ఖర్చే రూ. 18,000 వరకు ఉంటుంది. మిగతాది వెదురు, యూకలిప్టస్, సర్వి వంటి బాదులు, కూలీల ఖర్చు. మేం నిర్మించిన పాలీహౌస్‌లు 120 కి. మీ. వేగంతో వీచే గాలులను సైతం తట్టుకుంటాయి. పాలీహౌస్లో దేశీ ఆవు పేడ, మూత్రంతో నిశ్చింతగా ప్రకృతి సేద్యం చేయవచ్చు. 1/3 మట్టి, 1/3 శుద్ధిచేసిన కొబ్బరిపొట్టు, 1/3 సేంద్రియ పదార్థం (పశువుల ఎరువు లేదా ఎండుగడ్డి లేదా రంపపు పొట్టు) కలిపి.. బెడ్స్ తయారు చేసుకోవాలి. 15 రోజులకోసారి జీవామృతం ఇవ్వాలి. చీడపీడల నివారణకు నీమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వాడొచ్చు. తిరిగి వాడుకోవడానికి వీలయ్యే 560 రకాల దేశీ వంగడాలను ట్రస్టు సేకరించి పండించింది. ఇందులో 140 రకాల కూరగాయలు, ఆకుకూరల వంగడాలున్నాయి. ప్రతి ఒక్కరూ భోజనంలో 5% పచ్చి కూరగాయలు, ఆకుకూరలు తినాలన్నది రవిశంకర్ గురూజీ అభిప్రాయం. రంగు, ఆకృతి, వాసన, రుచి విభిన్నంగా ఉండే వంగడాలు ఇందుకు అనువుగా ఉంటాయి. వీటిని అందుబాటులోకి తెస్తున్నాం. ప్రకృతి సేద్య పద్ధతుల్లో సాగు చేయడం సులభం. ఈ వంగడాలు రసాయనాల్లేకుండా వాటికవే పెరుగుతాయి. చీడపీడలు అంతగా సోకవు. రైతులకు, నగరవాసులకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పద్ధతులపై రైతులకు, నగరవాసులకు సాంకేతిక శిక్షణనివ్వడానికి ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి. ట్రస్టు సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ తొలుత కొందరు మాస్టర్ ట్రయినర్లకు శిక్షణనిచ్చి, వారి ద్వారా మిగతా వారికి శిక్షణ ఇస్తాం. హైదరాబాద్‌లో రైతులు వినియోగదారులకునేరుగా సేంద్రియ ఉత్పత్తులను విక్రయించే మార్కెట్లను వారానికి రెండు రోజులు ఏర్పాటు చేస్తాం. రైతులు పండించే పంటలను ఎండబెట్టి అమ్మే సాంకేతికతలను కూడా అందిస్తాం. వివరాలకు: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుడు పి. రామకృష్ణారెడ్డి 98490 57599, email: rakripulireddy@gmail.com, ఉమామహేశ్వరి 90004 08907 uma6408@gmail.com. డా. బండి ప్రభాకరరావు