సొరకాయను చూస్తున్న కళావతి
రసాయనిక అవశేషాల్లేకుండా ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసుకోవడానికి రోజువారీ పనుల వల్ల తీరిక దొరకటం లేదనుకుంటూ ఉంటారు. అయితే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇందుకు శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి నిదర్శంగా నిలుస్తూ ఇంటిపంటలను ఇష్టంగా సాగు చేస్తున్నారు. ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ఉండే ఆమె ప్రకృతి వ్యవసాయ ప్రేమికురాలు కావడం విశేషం. స్వగ్రామం వండువలో ఇంటి పక్కనే ఉన్న 50 సెంట్ల స్థలాన్ని ఉద్యాన పంటల వనంలా మార్చారు. ఆకుకూరలు, పందిరి కూరగాయ పంటలు ఆనప, బీర, బెండ, గుమ్మడి కాయల దిగుబడి బాగుంది. ఒక్కో ఆనపకాయ 10 నుంచి 20 కిలోల బరువు పెరుగుతున్నాయి. కంది, చెరకు, పెండలం, కంద ఇలా అనేక పంటలను సాగు చేస్తున్నారు.
వంటకు బయోగ్యాస్‌ను వినియోగిస్తున్నారు. పంటలకు సొంతంగా తయారు చేసుకున్న సేంద్రియ ఎరువును, జీవామృతాన్ని, కషాయాలను వాడుతూ మంచి దిగుబడి సాధిస్తుండటం విశేషం. పెరటి పంటల పనులను కళావతి ప్రతి రోజూ ఉదయం గంట సేపు స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. పెరటి తోటలో కలియ దిరుగుతూ సిబ్బందికి తగిన సూచనలిస్తారు. పురుగు గానీ, ఆకు ముడత కనపడినా వెంటనే వాటిని తీసేయడం ద్వారా చక్కని పంట దిగుబడులు పొందుతుండడం విశేషం.
– సూరాబత్తుల గాంధీ, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా
మహిళలు పెరటి తోటల సాగు చేపట్టాలి
శ్రద్ధగా చేస్తే ప్రకృతి/సేంద్రియ సాగు అసాధ్యమేమీ కాదు. సేంద్రియ ఎరువుతో భూమిని సారవంతం చేస్తే పంటల సాగుకు అనుకూలంగా మారుతుంది. బాల్యం నుంచీ పంటల సాగు అంటే బాగా ఇష్టం. ఇంటి దగ్గర కొద్ది స్థలంలో సరదాగా చేపట్టిన సాగు 50 సెంట్లకు విస్తరించింది. మహిళలంతా పెరటి తోటల సాగు చేపట్లేలా స్ఫూర్తినివ్వాలన్నది నా కోరిక. సేంద్రియ ఎరువులతో ఇంటి వద్దనే ఆరోగ్యదాయకమైన కూరగాయలు, పండ్లు సాగు చేసుకునేందుకు మహిళలు ముందుకు రావాలి.
– విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment