వ్యవసాయ రంగానికి కొత్త దిశానిర్దేశం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. రసాయన పరిశోధనా లయాల నుంచి వ్యవసాయాన్ని ప్రకృతి ఒడిలోకి నడపమని దేశ రైతాంగాన్ని వినమ్రంగా కోరారు. రైతును కష్టాల కాష్టంలోకి నెడుతూ... తప్పుగా నడుస్తున్న సాగుబడిని సహజ వ్యవసాయంగా మార్చుకొని, ‘తిరిగి మూలాల్లోకి’ వెళదామని హితవు పలికారు. దేశీయ సంప్రదాయిక తెలివికి ఆధునిక శాస్త్ర సాంకేతికత జోడించి, వాతావరణ మార్పు సంక్షోభంలో అలమటిస్తున్న ప్రపంచానికి కొత్త టానిక్ ఇద్దామన్నారు. భారత్‌ని ప్రపంచ శీర్షభాగాన నిలుపుదామని పిలుపిచ్చారు.
వ్యవ సాయం–భూసార పరిరక్షణ–ఆహారోత్పత్తి–పంపిణి... ఇలా ఒకటికొకటి ముడివడి ఉన్న పలు విష యాల్లో పరివర్తన చివరకు మనిషి జీవనశైలి మార్పు వరకూ వెళ్లాలని అభిలషించారు. ఆర్తితో ప్రధాని చేసిన ప్రతిపాదన బాగుంది. స్వాగతించదగ్గ గొప్ప మలుపు. పెట్టుబడి వ్యయాన్ని రమా రమి తగ్గించి దిగుబడిని పెంచే శాస్త్రీయ విజయసూత్రమూ ఇదేనని ఆయన నొక్కి చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై గుజరాత్‌లో జరిగిన ఓ సదస్సు వేదిక నుంచి, అక్కడి సభికులనే కాక, ఈ–పద్ధతి ద్వారా దేశం నలుమూలలా దాదాపు 8 కోట్ల మంది రైతుల్ని ఉద్దేశించి ఆయనీ ప్రసంగం చేశారు.
‘నీరు రావడానికి ముందే వంతెన నిర్మించాలి’ అని అర్థం వచ్చే గుజరాతీ సామెతనూ ఆయన ఉటంకించారు. సామెతలో చెప్పినట్టే, ప్రకృతి వ్యవసాయం వైపు దేశ రైతాంగాన్ని మళ్లించడమే కేంద్ర ప్రభుత్వ విధానమయితే... తగినంత ముందుగానే చేయాల్సింది చాలా ఉంది. విధానపర మైన పూర్వరంగం, ఆర్థిక నిర్ణయాలు, ఆచరణాత్మక చిత్తశుద్ధి ఇందుకు ఎంతో అవసరం. కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో కంపెనీ లాబీలకు వశపడి, ప్రకృతి వ్యవసాయంపై వికృత వ్యాఖ్యలు చేసే శాస్త్రవేత్తల మూక ఆలోచనల్ని సమూలంగా మార్చాలి. మొత్తం వ్యవసాయ రంగమే దిశ మార్చుకునే సంధి కాలంలో... రైతులకు ప్రోత్సాహకాలివ్వాలి. కొత్త పద్ధతికి సానుకూలంగా ఆహారోత్పత్తి– పంపిణి–మార్కెట్ వ్యవస్థల్ని పటిష్టపరచాలి. అవేవీ లేకుండా, దేశ జనాభాలో సింహ భాగమైన రైతాంగాన్ని ఆకట్టుకునేందుకు ఇది ఉత్తుత్తి ప్రసంగమే అయితే, సమీక్షే అవసరం లేదు. ఉద్యమిం చిన రైతాంగం దీక్షకు లొంగి మూడు వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకున్న అక్కసుతోనో, పాలక బీజేపీ సిద్ధాంత పునాది ఆరెస్సెస్ అభిమానించే దేశీ ఆవుకు ప్రాధాన్యత ఉందనో... ప్రకృతి వ్యవ సాయంపై కేవలం సానుభూతితో మాట్లాడితే ఒరిగేదేమీ ఉండదు. నిజమైన కార్యాచరణ కావాలి. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో గాని, అంతకు ముందే అయినా ఇందుకవసరమైన విధాన–ఆర్థిక ప్రక టన వెలువడాలి. వ్యూహరచన జరగాలి. జన్యుమార్పిడి విత్తనాలు, విష రసాయన ఎరువులు, క్రిమి సంహారకాల పీడ వదిలించుకొని వ్యవసాయం క్రమంగా సహజసిద్ధ సాగువైపు మళ్ళాలి.
సుభాష్ పాలేకర్ వంటి వ్యవసాయ నిపుణులు చాన్నాళ్లుగా ప్రకృతి వ్యవసాయం గురించి చెబుతున్నారు. పాలకులెవరూ పట్టించుకోలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ చేపట్టలేదు. నీతి ఆయోగ్ ఇటీవలి కాలంలో ఈ విధానాన్ని నెత్తికెత్తుకుంది. రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కాని ప్రస్తుత విధానం నుంచి మార్పు అనివార్యమని కేంద్రం గ్రహించడమూ దీనికి కారణమేమో? పైగా ఎరువులు–క్రిమిసంహారకాల దిగుమతి ఆర్థిక భారం మోయలేకుండా ఉంది. ఇది కాక... ఆహారో త్పత్తి–పంపిణి, వ్యావసాయిక–జీవవైవిధ్యం నుంచి మార్కెట్ వరకు మొత్తం వ్యవస్థను గుప్పిట్లో ఉంచుకునే క్రమంలో విధిగా ప్రత్యామ్నాయాల్ని ప్రతిపాదించాల్సిన స్థితి వచ్చింది. రైతుకు రెట్టింపు ఆదాయం చూపుతామన్న పాలకపక్ష హామీ, సమీప భవిష్యత్తులో నిజమయ్యే సూచనలు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయమే రక్షగా కనిపించి ఉండవచ్చు! పైగా, ఈ పద్ధతితో పెట్టుబడి వ్యయం సగానికి తగ్గించగలిగితే, దాని మీద 1.5 రెట్లు అధికంగా కనీస మద్దతు ధర ప్రకటించడ మైనా, కాలక్రమంలో రెట్టింపు ఆదాయం చూపడమైనా సాధ్యపడవచ్చు! గతంతో పోలిస్తే, ప్రకృతి వ్యవసాయం స్థిరపడే సూచనలు ఇటీవల కనిపిస్తున్నాయి.
ప్రధాని చెప్పినట్టు దేశంలోని చాలా ప్రాంతాల్లో లక్షలాది రైతులు నెమ్మదిగా ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం’ సత్ఫలితాలనిస్తోంది. దాని వెనుక ఎంతో కృషి ఉంది. అజిత్ ప్రేమ్‌జీ వంటి ట్రస్టుల ఆర్థిక ప్రోద్బలంతో మౌలిక సదుపాయాలు, శిక్షణ, అవగాహన, సాంకేతి కత–సమన్వయాల చేదోడు రైతాంగానికి లభిస్తోంది. ఇప్పుడు సహజ వ్యవసాయం చేస్తున్న వారి కష్టనష్టాల్ని పరిశీలించి, ఇంకా ఎక్కడెక్కడ, ఏయే రూపాల్లో సహకారం అందిస్తే అది స్థిరపడటానికి ఆస్కారం ఉంటుందో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు అధ్యయనం చేయాలి. ‘ఇదింకా ధ్రువపడలేదు, శాస్త్రీయ ఆధారాల్లేవు, గణాంకాల్లేవు...’ అనే తర్కం వీడి శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, ప్రభుత్వ విభాగాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు తమ ఆలోచనా దోరణి మార్చు కోవాలి. వారిని దారిలోకి తీసుకురావడం ఇప్పుడు కేంద్రం ముందున్న సవాల్!
కార్పొరేట్ పెత్తనం నుంచి విత్తనం తిరిగి రైతు చేతికి రావాలి. పెట్టుబడి వ్యయం తగ్గి రైతుకు ఆత్మహత్యల దుస్థితి తప్పాలి. రసాయనాల పీడ వీడి భూసారం తిరిగి పుంజుకోవాలి. గాంధీజీ కలలు కన్న సహజ వ్యవసాయ స్వావలంబన ద్వారా గ్రామ స్వరాజ్యం పరిఢవిల్లాలి. వాతావరణ మార్పు సంక్షోభానికి సమాధానంగా ‘తిరిగి మూలాలకు’ మళ్లే ప్రక్రియ, మరేదేశం కన్నా కూడ మనమే వేగంగా సాధించగలమని ప్రపంచానికి చాటి చెప్పాలి. అందుకు ఇదే మంచి తరుణం!
Comments
Please login to add a commentAdd a comment