ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో వన్నూరమ్మ
మారుమూల కుగ్రామంలో ఉండే అతి సాధారణ దళిత మహిళా రైతు వన్నూరమ్మ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి దేశ ప్రజల దృష్టిలో పడింది. ఎడారి నేలలోనూ ఏడాది పొడవునా ఆమె విజయవంతంగా చేస్తున్న ప్రకృతి వ్యవసాయానిదే ఈ ఘనత! బంజరు భూమిని బాగు చేసుకొని.. వర్షాధారంగా ఏడాదిలో మూడు పంటలను రసాయనాల్లేకుండా పండించటం మాత్రమే కాదు.. ఎడారిని తలపించే చోట ఒక ఎకరంలో రూ. లక్షకు పైగా నికరాదాయం పొందటం వన్నూరమ్మ సాధించిన ఘన విజయం. ప్రకృతి వ్యవసాయం తమ కుటుంబాన్నే కాకుండా తండావాసుల జీవితాల్లోనూ వెలుగులు విరబూయిస్తున్న తీరును ఆమె నిస్సంకోచంగా చకచకా వివరించడంతో.. ఆమె కృషి దేశానికే ఆదర్శమని ప్రధాని ప్రశంసించారు. ఇంతకీ.. వన్నూరమ్మ తన బంజరు భూమిలో నీటి వసతి లేకుండానే బంగారు పంటలు ఎలా పండిస్తోంది..? చూసొద్దాం పదండి..!
అసలే కరువు నేల.. వర్షపాతం తక్కువగా నమోదయ్యే ప్రాంతం. బోర్లు వేసినా భూగర్భ జలాలు లేక నీరు పడని దుస్థితి. ఇలాంటి నేలలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది దళిత మహిళా రైతు వన్నూరమ్మ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన వన్నూరమ్మ 11 ఏళ్ల క్రితమే భర్తను కోల్ఫోయింది. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. చదువుతోనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్న లక్ష్యంతో నలుగురు పిల్లలను చదివిస్తోంది.
ప్రభుత్వం తమ కుటుంబానికి ఇచ్చిన 4.5 ఎకరాల భూమి భర్త మరణం తర్వాత బీడు పడిపోయింది. ఈ నేపథ్యంలో పంటలకు రసాయన ఎరువులు వాడకుండా ఏపీ ప్రభుత్వ సహకార ప్రకృతి సేద్య విభాగం డీపీఎం లక్ష్మీ నాయక్, సిబ్బంది సహకారంతో బీడు భూమిని తిరిగి సాగులోకి తెచ్చింది. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో వన్నూరమ్మ భూమి తల్లిని నమ్ముకుంది. ప్రకృతి సేద్యం నేర్చుకుంది. మూడేళ్ల క్రితం శిక్షణ పొందింది. ట్రాక్టర్‌తో దున్నించిన తర్వాత ఎత్తుమడులు చేసింది. కట్టెలు, వేరుశనగ కట్టె, పొట్టు పొలాన్ని ఆచ్ఛాదనగా వేస్తూ సాగుయోగ్యంగా మార్చుకుంది.
మొదట అరెకరంలో చిరుధాన్యాలు సాగు చేసింది. ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహకరంగా ఉందని భావించి, రెండు ఎకరాలకు ప్రకృతి సేద్యాన్ని విస్తరించింది. ఏడాదంతా 365 రోజులూ పొలంలో పంటలు ఉండేలా ప్రణాళికతో సాగు చేస్తోంది. దీన్నే ప్రీమాన్‌సూన్ డ్రై సోయింగ్ (పిఎండిఎస్) పద్ధతి అంటారు. తొలుత వర్షాలకు ముందే నవధాన్యాలను మిశ్రమ పంటగా విత్తింది. ఆ తర్వాత సజ్జ, టమాటా, వంగ, మిరప పంటలను సాగు చేసింది. ప్రస్తుతం టమాటో పంట ఉంది.
స్వయంగా తయారు చేసుకున్న ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, బ్రహ్మాస్త్రం లాంటి సహజ ఎరువులు, కషాయాలను తయారు చేసుకుని వాడుతూ పంటలను కాపాడుకుంటున్నది. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకం ద్వారా వచ్చే పంట దిగుబడి కంటే తన పంట అధికం గానూ, నాణ్యం గానూ ఉంటుందని వన్నూరమ్మ స్పష్టం చేస్తోంది. ప్రకృతి వ్యవసాయం చేసిన ఒక ఎకరంలో నవధాన్యాలు, వేరుశనగ, కూరగాయలు సాగు చేసేందుకు రూ.27 వేలు పెట్టుబడి కాగా, నికర లాభం రూ.1.07 లక్ష వచ్చినట్లు తెలిపింది.
మహిళలను ప్రకృతి సేద్యం వైపు మళ్లిస్తూ..
భాగ్యలక్ష్మి మహిళా స్వయం సహాయక బృందానికి నేతృత్వం వహిస్తున్న వన్నూరమ్మ ప్రకృతి వ్యవసాయంలో పట్టు సాధించడంతో ఆ బృందంలో నలుగురు మహిళా రైతులు మొత్తం 12.5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌గా బాధ్యతలు తీసుకున్న వన్నూరమ్మ.. బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లివంక తండాకు చెందిన 170 మంది గిరిజన డ్వాక్రా గ్రూపు మహిళలకు తన అనుభవాన్ని, ఆశావహ దృక్పథాన్ని రంగరించి శిక్షణ ఇస్తున్నారు. వీరిలో 106 మంది రైతులు మొత్తం 138 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయనారంభించారు. తాను తయారు చేసిన జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలను అందిస్తూ ఆమె రైతులను ప్రోత్సహిస్తుండటం విశేషం.
ప్రధానితో మాట్లాడినందుకు గర్వంగా ఉంది!
భర్త చనిపోయిన తర్వాత భూమి బీడుపడింది. రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి సేద్యం నేర్చుకున్నాను. నవధాన్యాల సాగు మొదలుకొని కూరగాయల సాగు కూడా చేశాను. వ్యవసాయంలో మహిళలు కూడా రాణించాలనేది నా కోరిక. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడుతానని కలలో కూడా అనుకోలేదు. దేశ ప్రధానితో మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు ఎంతో గర్వంగా ఉంది. నాతో పాటు మహిళలు అధిక సంఖ్యలో ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి. నా వంతుగా ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను.
– వన్నూరమ్మ (63042 78582),
దళిత మహిళా రైతు,
దురదకుంట , అనంతపురం జిల్లా
పీఎండీఎస్ ప్రకృతి సేద్యం ఓ వరం
మన్నూరమ్మ బంజరు భూమిలో 365 రోజులూ వర్షాధారంగానే వరుస పంటలు సాగు చేసి చూపింది. ప్రకృతి వ్యవసాయంలో పీఎండీఎస్ (ప్రీ మాన్‌సూన్ డ్రై సోయింగ్) అనే ప్రత్యేక పద్ధతిని శ్రద్ధగా పాటిస్తూ.. ఎకరానికి ఏడాదిలో రూ. లక్షకు పైగా నికరాదాయం పొందారు. వర్షపు నీటితోపాటు, అంతకన్నా ఎక్కువ మొత్తంలో నీటిని గాలిలో తేమ నుంచి గ్రహించే విశిష్ట విధానంలో పంటలను సాగు చేయటం వల్లనే ఇది సాధ్యమైంది. ఎఫ్.ఎ.ఓ. నిపుణుడు డా. వాల్టర్ యన సలహా మేరకు ఈ శాస్త్రీయ పద్ధతిని ప్రపంచంలోనే మొట్టమొదటిగా అమలు చేçస్తున్నాం. అనంతపురం జిల్లాలో 110 మంది రైతులు, కోస్తాలో 3 లక్షల మంది రైతులు (43% నీరు/విద్యుత్తు ఆదా చేశారు) ప్రకృతి సేద్యంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. నీటి సంక్షోభాన్ని, భూతాపాన్ని రూపుమాపే ఈ సాగు పద్ధతి ప్రపంచానికే ఓ వరం.
– టి. విజయకుమార్,
ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ,
ఎక్స్‌అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రకృతి సేద్య విభాగం, ఏపీ వ్యవసాయ శాఖ
vjthallam@gmail.com
– ఈదుల శ్రీనివాసులు,
సాక్షి, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment