లక్నో/సంభాల్/న్యూఢిల్లీ: భారతీయ ఆహార ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా డైనింగ్ టేబుళ్లపై ఉండాలన్నదే మనందరి ఉమ్మడి లక్ష్యమని, ఆ దిశగా కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగాన్ని నూతన మార్గంలోకి తీసుకెళ్లడానికి మన ప్రభుత్వం రైతన్నలకు తోడ్పాటునందిస్తోందని చెప్పారు. వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నట్లు స్పష్టం చేశారు.
దేశంలో ప్రకృతి వ్యవసాయం, తృణధాన్యాల సాగును ప్రోత్సాహిస్తున్నట్లు చెప్పారు. సూపర్ ఫుడ్ అయిన తృణధాన్యాలపై పెట్టుబడులకు ఇదే సరైన సమయమని సూచించారు. ఉత్తరప్రదేశ్‌లో రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన 14,000 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌లో గంగా నది పరివాహక ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని పిలుపునిచ్చారు.
దీనివల్ల రైతులు లబ్ధి పొందడంతోపాటు నది సైతం కాలుష్యం నుంచి బయటపడుతుందని పేర్కొన్నారు. మన నదుల పవిత్రను కాపాడుకోవాలంటే ప్రకృతి వ్యవసాయం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ఆహార శుద్ధి రంగంలో లోపాలు అరికట్టాలని సంబంధిత పరిశ్రమ వర్గాలకు సూచించారు. స్వచ్ఛమైన ఉత్పత్తులు అందించాలని కోరారు. ‘జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్’ అనే విధానంతో పనిచేయాలన్నారు.
సిద్ధార్థనగర్ జిల్లాలో పండిస్తున్న కలానమాక్ బియ్యం, చందౌలీలో పండిస్తున్న బ్లాక్ రైస్ గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ రెండు రకాల బియ్యం విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నట్లు తెలిపారు. మన ఆహార ఉత్పత్తులను ప్రపంచం నలుమూలలకూ చేర్చే సమ్మిళిత ప్రయత్నంలో ఇదొక భాగమని అన్నారు. వ్యవసాయ రంగంలో రైతులతో కలిసి పనిచేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేవారు. యూపీలో ప్రభుత్వ అలసత్వానికి చరమగీతం పాడి పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నామన్నారు. సంభాల్ జిల్లాలో శ్రీకల్కీ ధామ్ ఆలయ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళుర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment