dining tables
-
మాది రైతు ప్రభుత్వం
లక్నో/సంభాల్/న్యూఢిల్లీ: భారతీయ ఆహార ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా డైనింగ్ టేబుళ్లపై ఉండాలన్నదే మనందరి ఉమ్మడి లక్ష్యమని, ఆ దిశగా కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగాన్ని నూతన మార్గంలోకి తీసుకెళ్లడానికి మన ప్రభుత్వం రైతన్నలకు తోడ్పాటునందిస్తోందని చెప్పారు. వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నట్లు స్పష్టం చేశారు. దేశంలో ప్రకృతి వ్యవసాయం, తృణధాన్యాల సాగును ప్రోత్సాహిస్తున్నట్లు చెప్పారు. సూపర్ ఫుడ్ అయిన తృణధాన్యాలపై పెట్టుబడులకు ఇదే సరైన సమయమని సూచించారు. ఉత్తరప్రదేశ్‌లో రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన 14,000 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌లో గంగా నది పరివాహక ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. దీనివల్ల రైతులు లబ్ధి పొందడంతోపాటు నది సైతం కాలుష్యం నుంచి బయటపడుతుందని పేర్కొన్నారు. మన నదుల పవిత్రను కాపాడుకోవాలంటే ప్రకృతి వ్యవసాయం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ఆహార శుద్ధి రంగంలో లోపాలు అరికట్టాలని సంబంధిత పరిశ్రమ వర్గాలకు సూచించారు. స్వచ్ఛమైన ఉత్పత్తులు అందించాలని కోరారు. ‘జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్’ అనే విధానంతో పనిచేయాలన్నారు. సిద్ధార్థనగర్ జిల్లాలో పండిస్తున్న కలానమాక్ బియ్యం, చందౌలీలో పండిస్తున్న బ్లాక్ రైస్ గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ రెండు రకాల బియ్యం విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నట్లు తెలిపారు. మన ఆహార ఉత్పత్తులను ప్రపంచం నలుమూలలకూ చేర్చే సమ్మిళిత ప్రయత్నంలో ఇదొక భాగమని అన్నారు. వ్యవసాయ రంగంలో రైతులతో కలిసి పనిచేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేవారు. యూపీలో ప్రభుత్వ అలసత్వానికి చరమగీతం పాడి పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నామన్నారు. సంభాల్ జిల్లాలో శ్రీకల్కీ ధామ్ ఆలయ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళుర్పించారు. -
ఇలా చేస్తే ఇల్లంతా శుభ్రమే!
ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ సోఫా, మ్యాట్రెసెస్, టేబుల్స్, చైర్స్ ఇలా చాలా రకాల ఫర్నీచర్ ఉంటుంది. వీటిని శుభ్రం చేయకపోతే దుమ్ము, ధూళీ పేరుకుని పోయి చాలా అపరిశుభ్రంగా కనిపిస్తాయి. అంతేకాదు, వీటివల్ల డస్ట్ అలర్జీ ఉన్న వారికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. వీటిలో దాగి ఉండే సూక్ష్మక్రిముల వల్ల రకరకాల అనారోగ్యాలు వస్తుంటాయి. వీటిని క్లీన్ చేసేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. దీనివల్ల ఫర్నీచర్ శుభ్రంగా కనిపించడంతోపాటు ఎక్కువకాలం మన్నుతుంది కూడా. ఫర్నీచర్‌ను శుభ్రం చేసేందుకు ఏం చేయాలో చూద్దాం. సోఫా: ఆరు టీస్పూన్ల బాత్ సోప్ పౌడర్ తీసుకోండి. ఈ పొడికి కప్పు వేడి నీరు కలపండి. సబ్బు నురగ వచ్చిన తర్వాత దానికి రెండు టీస్పూన్ల అమ్మోనియా లేదా తేనె జోడించండి. ఈ ద్రావణం చల్లబడిన తర్వాత దానిని బాగా కలపండి. దీంతో నురగ వస్తుంది. ఒక క్లాత్ లేదా స్పాంజ్ సహాయంతో ఈ నురగతో సోఫా పై భాగంలో శుభ్రం చేయండి. దీని తరువాత సోఫాను ఫ్యాన్ కింద ఆరనివ్వండి. దీంతో ఫ్యాబ్రిక్ సోఫా కొత్తగా కనిపిస్తుంది. లెదర్ సోఫా: లెదర్ సోఫాను క్లీన్ చేసే ఏకైక మార్గం మైల్డ్ క్లీనర్‌తో శుభ్రం చేయడమే. ఇందు కోసం ఎప్పుడూ మృదువైన బ్రష్.. వాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించాలి. శుభ్రం చేయడానికి నీటితో కలిపిన వెనిగర్ ద్రావణాన్ని ఉపయోగించవచ్చు. డైనింగ్ టేబుళ్లు, చెక్క కుర్చీలు తదితర ఉడెన్ ఫర్నీచర్‌ని తుడిచేందుకు పొడి వస్త్రాన్ని వాడండి. వీటిని మరింతగా మెరిసేలా చేయాలంటే వ్యాక్స్, పాలిష్ కూడా చేయొచ్చు. అదే విధంగా దుమ్ముని క్లీన్ చేయాలంటే డిష్ వాష్‌ని నీటిలో కలిపి అందులో మెత్తటి బట్టను ముంచి బయటికి తీసి పిండి దానితో ఫర్నీచర్‌ని రుద్దాలి. తర్వాత పొడిబట్టతో చక్కగా తుడవండి. ఇలా క్లీన్ అయిన ఫర్నీచర్‌ని పూర్తిగా ఆరబెట్టండి. కొన్ని వస్తువులు పాత పాలిష్‌తో చూడ్డానికి అంత బాగుండవు. వీటిని క్లీన్ చేయాలంటే.. ముందుగా కొద్దిగా టీ బ్యాగ్స్ తీసుకుని వేడినీటిలో వేసి డికాషన్ చేయాలి. ఇది గోరువెచ్చగా అయ్యే వరకూ ఉంచి గుడ్డపై దీనిని పోస్తూ కొద్దికొద్దిగా తుడవాలి. టీ డికాక్షన్లోని యాసిడ్ ఉడ్ని క్లీన్ చేస్తుంది. మరకలు దూరమవ్వాలంటే.. కొన్నిసార్లు డైనింగ్ టేబుల్‌పై ఫుడ్ ఐటెమ్స్ మూలాన మరకలు పడుతుంటాయి. వాటిని తొలగించాలంటే... మరకలు పడ్డ చోట కాస్తంత టూత్‌పేస్ట్ అప్లై చేసి దానితో రుద్దాలి. ఆరిన తర్వాత ఒక తడిబట్టతో శుభ్రంగా తుడిచెయ్యండి. మరకలు మొండిగా ఉంటే బేకింగ్ సోడా, టూత్‌పేస్ట్‌లను సమానంగా కలిపి వాటితో రుద్దండి. కాసేపయ్యాక తడిగుడ్డతో తుడిచి ఆరబెట్టండి. గోడలపై ఇంక్ మరకలు, పెన్ను గీతలు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ని మరకలపై పట్టించి రుద్ది తడిగుడ్డతో తుడిచెయ్యాలి.దీనికి మరో పద్ధతి ఉంది. అదేంటంటే... గిన్నెలో కాసిన వేడినీళ్లు తీసుకోవాలి. అందులో కొన్ని చుక్కల షాంపూ వేసి బాగా కలపాలి. గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీటిలో ఒక క్లాత్‌ను ముంచి మరకలు పడ్డ చోట రుద్దండి. ఆరిన తర్వాత తడిబట్టతో తుడవండి. మరకలు పలచబడతాయి. కొద్దిరోజుల తర్వాత మరోసారి ఇలాగే చేయాలి. ఇలా ఒకటి రెండుసార్లు చేయడం మంచిది. ఉడెన్ ఫర్నిచర్: చెక్కతో చేసిన గృహోపకరణాలు పాడు కాకుండా ఉండాలంటే టీ డికాషన్‌లో మెత్తటి క్లాత్‌ను నానబెట్టి పిండి దాంతో తుడవండి. ఇలా చేస్తే రంగు వెలిసిన ఫర్నీచర్‌కు కూడా తిరిగి మెరుపు వస్తుంది. చెక్కపై నీటి మరకలు దాని అందాన్ని పాడు చేస్తాయి. నీటి మరకలు పడినచోట వైట్ టూత్ పేస్ట్ (జెల్ పేస్ట్ కాదు) రాయండి. తర్వాత మెత్తని బట్టతో రుద్దాలి. అప్పుడు టూత్‌పేస్ట్‌ను తీసివేసి.. తడిబట్టతో తుడిచేయాలి. చెక్క ఫర్నిచర్‌పై మసి ఉంటే.. టీస్పూన్ బేకింగ్ సోడాను నీటిలో వేసి కరిగించండి. మసి ఉన్న ప్రాంతంపై దీన్ని అప్లై చేయండి. తర్వాత మెత్తని పొడిబట్టతో తుడవండి. సీలింగ్ ఫ్యాన్లు సాధారణంగా సీలింగ్ ఫ్యాన్లు ఎక్కువ ఎత్తులో అమర్చుతారు. అందువల్ల ముందుగా మీరు టేబుల్ పైకి ఎక్కి ఫ్యాన్‌ను తీసేయండి. ఆ తర్వాత ఫ్యాన్ బ్లేడ్‌ని తీసి విడిగా శుభ్రం చేయండి. రెక్కలను కూడా సబ్బుతో రుద్ది శుభ్రంగా కడిగిన తర్వాత పొడి వస్త్రంతో తుడవాలి. రెండో విధానం.. పాత పిల్లో కవర్ తీసుకుని టేబుల్ మీద ఎక్కి సీలింగ్ ఫ్యాన్ రెక్కలలో ఒకదానిని కవర్ చేయాలి. ఇప్పుడు కవర్ పైనుంచి చేతులతో రుద్దాలి. అదేవిధంగా మూడు రెక్కలను శుభ్రం చేయాలి. రెక్కలపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, బూజు అంతా కవర్ లోపల పడిపోతుంది. తర్వాత దాన్ని పారవేసి పిల్లో కవర్‌ను ఉతుక్కుంటే సరిపోతుంది. గుర్తుంచుకోవాల్సింది.. ఫ్యాన్‌ను క్లీన్ చేసినప్పుడల్లా కింద ఒక షీట్ లేదా వస్త్రాన్ని పరవాలి. దీంతో ఫ్యాన్ క్లీన్ అయిన తర్వాత మీకు పని పెరగదు. ఫ్యాన్ మురికి షీట్లో పడిపోతుంది. ఫ్యాన్ శుభ్రం చేసేటప్పుడు కళ్లకి ప్లెయిన్ గ్లాసెస్ లేదా సన్ గ్లాసెస్ ధరిస్తే కంట్లో దుమ్ము పడకుండా ఉంటుంది. అలాగే ముక్కుకు మాస్క్ లేదా రుమాలు కట్టుకోవాలి లేదంటే డస్ట్ అలర్జీ వచ్చే ప్రమాదం ఉంది. ఫ్యాన్‌ని క్లీన్ చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం మరచిపోవద్దు. -
పనిమనషి
తిన్న కంచం నుంచి వేసుకునే బట్టల దాకా శుభ్రం చేయాలి. వంట గది నుంచి తోట పని దాకా మనకు తోడవ్వాలి. రోజంతా ఇంటి బాధ్యతలతో పాటు మన బాగోగులూ చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో సమానంగా అంతకు మించీ మనతో ఉంటున్న తననెందుకు పనిమనిషి అంటున్నాం? మనమనిషి అనుకోలేమా? ఈ ప్రశ్నలకు సమాధానం అందరి దగ్గరా లేకపోవచ్చు కానీ కొందరి దగ్గర ఉంది. ఆ కొందరిలో ఒకరి గురించి తెలుసుకుందాం. అందరికీ ఆ సమాధానాన్ని చేరువ చేద్దాం. ‘‘దీదీ... కుక్కర్ ఏదీ... తోమడానికి వేయలేదు?’’‘‘పాచి వాసన పోవట్లేదని నేను కడిగేశాలే’’ఆ సమాధానంతో అపరాధభావానికి లోనైంది రాధ. మిగిలిన గిన్నెలు కడిగేసి.. ఇల్లు ఊడ్చి.. తుడవడానికి సన్నద్ధమైంది. తుడిచే గుడ్డ కనిపించలేదు. అంతా వెదికింది. ఎక్కడా లేదు.‘‘దీదీ.. తుడిచే గుడ్డ కనిపించడం లేదు?’’‘‘ఇవ్వాళ్టి నుంచి దీంతో తుడువు...’’ అంటూ మాప్ కర్రను తెచ్చిచ్చింది.‘‘దీంతోనా?’’ చూపుల్లో ఆశ్చర్యం... స్వరంలో కుతూహలంతో రాధ.ఈలోపు ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడు లేచి ఏడుపు అందుకున్నాడు. చేతిలో పని పడేసి గబగబా వచ్చి ఉయ్యాల్లోంచి పిల్లాడిని తీసి ఎత్తుకుంది రాధ.. పంటి బిగువున పాపాయి బరువును భరిస్తూ!గబగబా వచ్చిన యజమానురాలు..‘‘నేను ఎత్తుకుంటాలే’’ అంటూ బిడ్డను తీసుకుంది రాధ చేతుల్లోంచి!యజమానురాలి ఊహించని చర్యకు విస్తుపోతూ.. ‘‘దీదీ.. బాబుకి నా చేతుల్లో నిద్రపడుతుంది.. నేను పడుకోబెడ్తాలే’’ అంది.‘‘నేను చూసుకుంటానన్నాను కదా...’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది యజమానురాలు. ఆమె కొత్తగా ఉండడంతో దిగులు పడుతూనేబాల్కనీలోకి వెళ్లింది రాధ. బట్టలు ఉతకడానికి. నల్లా కింద బకెట్ పెట్టి... నల్లా విప్పింది. ఆ చప్పుడికి మళ్లీ లోపలి నుంచి పరిగెత్తుకొచ్చింది యజమానురాలు.‘‘ఏం చేస్తున్నావ్?’’‘‘బట్టలుతుకుదామని నల్లా తిప్పాను దీదీ...’’ అమాయకంగా రాధ.‘‘నల్లా కట్టేసి.. బట్టల్ని వాషింగ్ మెషీన్లో వెయ్’’ యజమానురాలి ఆర్డర్. ‘‘అదేంటి దీదీ? మీరే చెప్తారు కదా ఎప్పుడూ..వాషింగ్ మెషీన్లో బట్టలేస్తే సరిగ్గా మురికి వదలదని?’’ అడుగుతుంది అదే అమాయకత్వంతో.‘‘ఇప్పుడు చెప్తున్నా కదా.. వెయ్! వాడకుండా దాన్నలా మూలన పెట్టి పాత సామాన్లకుఅమ్మేయడానికా?’’ అంటూ లోపలకు వెళ్లిపోతుంది యజమానురాలు.దీదీ వింతగా కనపడ్తోంది ఆ రోజెందుకో మరి రాధకు.పనైపోయాక అటూ ఇటూ తచ్చాడుతుంటుంది రాధ.. ‘‘యే.. ఇంకా ఇంటికెళ్లవా?’’ అడుగుతుంది యజమానురాలు.‘‘వెళ్తా దీదీ..’’‘‘వెళ్లేప్పుడు ఈ పళ్లు తీసుకెళ్లు.. ఎప్పటి నుంచో పడున్నాయిక్కడ’’ డైనింగ్ టేబుల్ మీదున్న పళ్లబుట్టను చూపిస్తూ యజమానురాలు.‘‘అయ్యో... దీదీ.. ఇవి ఈరోజు పొద్దున తీసుకున్నవే... తాజా పళ్లు’’ అంటుంది చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ రాధ.‘‘చెప్పింది చెయ్... తీసుకెళ్లమన్నా కదా.. తీసుకెళ్లు అంతే.. ఆ.. రేపు రానక్కర్లేదు.. సెలవ్ తీసుకో’’ అంది యజమానురాలు.రాధ మనసు కీడు శంకించి ఏదో అనబోతుండగా.. కాలింగ్ బెల్ మోగింది. గబగబా వెళ్లి తలుపు తీసింది రాధ. ఎదురుగా ఓ అమ్మాయి.‘‘ఎవరు కావాలి?’’ అంది రాధ.‘‘నన్ను రమ్మన్నారు’’ అని ఆ అపరిచితురాలు సమాధానం చెప్తూండగానే... ‘‘ఆ.. ఆ.. నేనే రమ్మంది... లోపలికి రా..’’ అంటూ పిలుస్తుంది యజమానురాలు.‘‘రేపట్నుంచి పనిలోకి వస్తావా?’’ అడుగుతుంది యజమానురాలు లోపలికి వచ్చిన ఆ అమ్మాయితో.‘‘దీదీ.. నేనేమై పోవాలి?’’.. ఆందోళనతో రాధ. ‘‘నీతో కాదులే రాధా.. నువ్వాగు’’ అని రాధను వారిస్తూ కొత్త అమ్మాయితో ‘‘పాచి వాసన రాకుండా గిన్నెలు తోమాలి, ఇల్లు ఊడ్చి, తుడవాలి, బట్టలు.. అన్నీ చేయాలి. రేపటి నుంచి వచ్చేయ్’’ బాధ్యత అప్పజెప్పేస్తుంది యజమానురాలు. ‘‘మరి వంట? ఎంతమందికి వండాలి?’’ కొత్త అమ్మాయి ప్రశ్న. ‘‘వంట పని నేను, రాధ చూసుకుంటాంలే..’’ అని ఆమెతో చెప్పి.. ‘‘యే... రాధా.. నాకు హెల్ప్ చేస్తావ్ కదా?’’ అడుగుతుంది నవ్వుతూ యజమానురాలు. రాధా కళ్లల్లో చెమ్మ... ఆనందంతో!‘‘రాధా.. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నన్నెంత శ్రద్ధగా చూసుకున్నావ్? మరి నువ్ గర్భిణిగా ఉంటే నేనూ అంతే శ్రద్ధగా నిన్ను చూసుకోవాలా లేదా?’’ రాధను దగ్గరకు తీసుకుంటూ చెప్తుంది యజమానురాలు! ఇది ఒక యాడ్. విమెన్స్ డే సందర్భంగా విడుదలైంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ని.. ముఖ్యంగా ఇంటి పనుల్లో సహాయపడ్తున్న మహిళలను గౌరవించమని... మనుషులుగా చూడమని చెప్తున్న యాడ్. బాగుంది.. యాడ్.. అలా ఉండాలన్న ఊహా.. చాలా బాగుంటుంది. కానీ ప్రాక్టికల్‌గా అలా ఉండ దు. ఎన్ని ఇళ్లల్లో పనమ్మలకు వేరు టీ కప్పు.. సప రేట్ టిఫిన్ ప్లేట్లుండవ్? నిజంగా జరిగే పని కాదు.అలా ఎందుకు అనుకోవడం? నిజంగా జరిగిన సంఘటనల ప్రేరణతోనే ఆ యాడ్ పుట్టి ఉండొచ్చు కదా! అలాంటి రియల్ లైఫ్ యజమానురాలిని ఇక్కడ పరిచయం చేసుకుందాం.ఆమె పేరు... నిహారికా రెడ్డి. హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడ, ఇంజనీర్స్ కాలనీలో నివాసం. బొటిక్ నడిపిస్తుంది. కొన్నాళ్ల కిందట నాగమ్మ అనే అమ్మాయి నిహారిక వాళ్లింట్లో డొమెస్టిక్ హెల్పర్‌గా చేరింది. పెళ్లికాని పిల్ల. స్వస్థలం.. కరీంనగర్ జిల్లాలోని సబ్బితం అనే పల్లె. నిహారికను అక్కా... అని ఆప్యాయంగా పిలుస్తూ ఇంటి పనుల్లో సహాయంగా ఉండేది. నిహారికా ఆ అమ్మాయిని బుజ్జీ అంటూ అంతే ప్రేమగా చూసుకునేది. నిహారిక దగ్గర చేరిన ఆర్నెల్లకు నాగమ్మ అస్వస్థతకు గురైంది. నిహారికే ఆసుపత్రిలో చూపించింది. కిడ్నీ సమస్య అని తేలింది. వయసుతోపాటు కిడ్నీలు పెరగక రెండు కిడ్నీలు పాడైపోయాయని చెప్పారు వైద్యులు.కిడ్నీ మార్పిడి ఒక్కటే పరిష్కారమని, అప్పటివరకు డయాలసిస్ చేయించాలని సూచించారు. ఈ విషయాన్ని గ్రామంలో ఉన్న నాగమ్మ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది నిహారిక. అప్పటికే నాగమ్మ తండ్రి పక్షవాతంతో, తల్లి డయాబెటీస్‌తో బాధపడ్తున్నారు. నాగమ్మ ఇద్దరు అక్కల పెళ్లిళ్లయిపోయి అత్తగారిళ్లల్లో ఉన్నారు. అన్నదమ్ములు చదువుకుంటున్నారు. తమ బిడ్డ ఆరోగ్యం కోసం రూపాయి ఖర్చు పెట్టలేమని నిస్సహాయతను వ్యక్తం చేశారు నాగమ్మ తల్లిదండ్రులు. దాంతో ఆమె బాధ్యతను నిహారికే తీసుకుంది. దక్కన్ ఆసుపత్రిలో చేర్పించింది. నాగమ్మ కోసం తను స్వయంగా ఆరు లక్షల రూపాయలను వెచ్చించింది. కిడ్నీ మార్పిడి ప్రయత్నం కోసం ఫండింగ్కూ వెళ్లింది. దురదృష్టం.. నాగమ్మ బతకలేదు. ఆర్థికంగా అండగానే కాదు.. రాత్రింబవళ్లు కంటికి రెప్పలా.. కన్నబిడ్డలా నాగమ్మను చూసుకుంది నిహారిక. అప్పటికే ఆమెకు ఇద్దరు చిన్నపిల్లలు. అర్ధరాత్రి ఆసుపత్రికి పరుగెత్తాల్సి వచ్చేది. తెలిసిన వాళ్లను ఇంట్లో పిల్లలకు తోడుగా ఉంచి నాగమ్మను తీసుకుని హాస్పిటల్ వెళ్లేది. ‘‘ఇంత చేసినా ఆ అమ్మాయిని కాపాడుకోలేకపోయాననే బాధ. బుజ్జీ గురించి నేను పడిన ఆరాటమంతా గొప్పకోసం కాదు. ఓ మనిషిగా నా బాధ్యత అది. డొమెస్టిక్ హెల్పర్స్ మనకు స్లేవ్స్ కారు. మనం ఇంకో చోట వర్క్ చేయడానికి ఎలా వెళ్తామో... వాళ్లు మన ఇంట్లో వర్క్ చేయడానికి వస్తారు. మన బాస్ మనల్ని ఇల్ ట్రీట్ చేస్తే మనమెంత హర్ట్ అవుతామో.. సేమ్ మనం ఇల్ ట్రీట్ చేస్తే డొమెస్టెక్ హెల్పర్స్ కూడా అంతే హర్ట్ అవుతారు. సొసైటీలో ఒకరి మీద ఒకరం ఆధారపడి ఉంటాం. పనులూ అంతే. మనమెక్కడో కంట్రిబ్యూట్ చేయాలంటే మన సొంత పనుల్లో ఎవరో ఒకరు మనకు సహాయపడాల్సిందే. పరస్పర సహాయ సహకారాలతోనే సమాజం.. దాని అభివృద్ధి. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే మనుషుల మధ్య తేడాలుండవ్. అందరినీ గౌరవించగలుగుతాం’’ అంటుంది నిహారికా రెడ్డి. ప్రస్తుతం నీహారిక దగ్గర లక్ష్మి అనే హెల్పర్ పదేళ్ల నుంచి పనిచేస్తోంది. ‘‘లక్ష్మీ అక్కా’’ అని పిలుస్తుంది ఆమెను. లక్ష్మీ తన యజమానురాలు నిహారిక గురించి ఏం అంటుందంటే.. ‘‘ఆమె పెద్దబ్బాయి పుట్టినప్పటి నుంచి ఆమె దగ్గరే పనిచేస్తున్నా. అక్కా.. అనే పిలుస్తది. ఎందుకమ్మా అక్కా అంటావ్... అంటే ‘నాకు అక్క లాంటిదానివే లక్ష్మక్కా నువ్వు’ అంటుంది. వాళ్లింట్లో మనిషిలాగే చూస్తుంది. ఒంట్లో బాగాలేకపోయినా.. డబ్బు అవసరం ఉన్నా అన్నిటికీ అమ్మలా ఆదుకుంటుంది’’ అని చెప్తుంది. ఇదొక్క ఉదాహరణే కాదు.. డొమెస్టిక్ హెల్పర్స్‌కు జీవిత బీమా చేసి, పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్న యజమానులూ ఉన్నారు. వీళ్లంతా యాడ్ ఫిల్మ్స్‌కే కాదు.. రియల్ లైవ్స్కీ స్ఫూర్తే. – సరస్వతి రమ -
మడతపెట్టే డైనింగ్ టేబుల్
సాక్షి, హైదరాబాద్: డైనింగ్ టేబుల్ ఆకారం, నాణ్యతలో కాలానుగుణంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సౌకర్యంతో పాటూ ఇంటి అందాన్ని రెట్టింపు చేసే డైనింగ్ టేబుల్ డిజైన్స్‌కు వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో డిజైనర్లు ఆ తరహా టేబుల్స్‌ను రూపొందిస్తున్నారు. బాదంకాయ ఆకారంలో, వృత్తాకారంలో, దీర్ఘచతురస్రాకారంలో టేబుల్స్‌ను డిజైన్ చేస్తున్నారు. ప్రీమియం రకం డైనింగ్ టేబుల్స్ అయితే అవసరమైనప్పుడు డైనింగ్ టేబుల్లా వాడుకొని మిగిలిన సందర్భంలో మడతపెట్టి పక్కన పెట్టే విధంగా రూపొందిస్తున్నారు. మరికొన్ని రకాల టేబుల్స్ కింద పాత్రలు, ప్లేట్స్ పెట్టుకునే విధంగా అరలు కూడా ఉంటున్నాయి. ఎవరి కుటుంబ అవసరాలకు, అభిరుచులకు తగ్గట్టుగా వివిధ రకాల డైనింగ్ టేబుల్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ►ఓపెన్ కిచెన్ ఉన్నప్పుడు హాల్లోనే ఒక పక్కన డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసుకోవచ్చు. హాల్ సైజ్‌కు అనుగుణంగా టేబుల్ సైజ్ ఉండేలా చూసుకుంటే మంచిది. ► టేబుల్ మరీ పెద్దగా ఉండటం వల్ల హాల్ లేదా వంటగది చిన్నగా లేదా ఇరుగ్గా కనిపిస్తుంది. ►పిల్లలు ఉన్న ఇంట్లో గ్లాస్ డైనింగ్ టేబుల్‌కు బదులుగా స్టోన్ ఫినిష్ ఉన్న టేబుల్‌ను లేదా ఉడెన్ టేబుల్‌ను ఎంచుకోవటం మంచిది. ►కిచెన్‌లో ఏమాత్రం అవకాశం ఉన్నా ఇద్దరు లేదా ఒక్కరు కూర్చొని తినేందుకు వీలుగా ఉండే పోర్టబుల్ బ్రేక్‌ఫాస్ట్ టేబుల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ►గ్లాస్ డైనింగ్ టేబుల్ ఉంటే.. దానికి ఉపయోగించిన వుడ్ మెటీరియల్స్ గోడల రంగులకు మ్యాచ్ అయ్యేలా చూసుకుంటే ఇంటి అందం రెట్టింపు అవుతుంది. -
లాల్బాష ప్లాన్
నేను వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మాఊరు చూడ్డానికి సరదాగా వచ్చాము. అదికూడా ఎన్నో ఏళ్ళ తర్వాత. పొద్దున్నే రమీజాబీవచ్చి మాఇల్లు శుభ్రంచేసి, మాకు టిఫిన్స్ , వడ్డించి రాత్రి మిగిలినకొన్ని తిండిపదార్థాలు ఇంటికితీసుకెళ్ళింది.టిఫిన్ తిన్నాక అందరం డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చునే ఉన్నాం బద్ధకంగా. మా ఊరు కథలు వినాలంటే నాభార్యకు చాలా ఆసక్తి. మా ఇరవైఏదేళ్ళ అబ్బాయికికూడ. నా పెళ్ళయినప్పటి నుండి ముప్పైఏళ్ళుగా హైదరాబాదులో సెటిల్ అయిఉన్నాము. మా అత్తమామ తరుపువాళ్ళు బీచ్సిటీ విశాఖపట్నంలో పెరిగినవాళ్ళు. కర్నూలు దగ్గర ఒక చిన్నప్రాంతంలోఎలాంటి కథలు, ఎలాంటి ఉద్వేగాలు, ఎలాంటి మనస్తత్వాలు, ఎలాంటి వ్యక్తిత్వాలు ఉంటాయో తెలుసుకుని ఇద్దరూ కొత్తలోకంలోకెళ్ళినటు ్టఫీలవుతారు. మధ్యలో నాప్రాంతీయభాష విని మురిసిపోతుంటారు. కథ విన్నంతసేపు వాళ్ళకు యమ్నూరు అంటే యమ్మిగనూరు నుండి తెచ్చుకున్నభర్త, నాన్నకొత్తగాఉంటాడు. అలానే కూర్చున్నాంకదా అని మాఆవిడ కథ చెప్పమని అడిగింది. ముప్పైసంవత్సరాలపైచిలుకు మాట ఇది! చనిపోయిన లాల్బాష మళ్ళీ బతికొచ్చాడని చూడ్డానికి జనాలు రౌండ్‌కట్ట వేపు వెళ్ళి చూసివచ్చేవాళ్ళు చూసివస్తున్నారు. రంధ్రాలఎర్రబనీను వేసుకున్న బాడీ మాఊరు పెద్దకాల్వలో కొట్టుకుపోతుంటే ఎవరోచూసారు. రక్షించడానికి ప్రయత్నించారుగాని, ఆ ప్రవాహంలో తుంగభద్రలో కొట్టుకువెళ్ళిపోయింది. ఆరోజునుండి ఇప్పటివరకు కనిపించని లాల్బాష, నెలరోజులతర్వాత హఠాత్తుగా బతికిఉన్నట్టు తెలవడంతోఅందరికి సంభ్రమం కలిగింది. లాల్బాష అంటే అందరికీ అభిమానమే. రౌండ్కట్టను ఆనుకునే లాల్బాష అంగడి ఉంటుంది. లాల్బాష అంగడి ఊరికి మధ్యలో రౌండ్‌కట్ట దగ్గర ఉండడంతో, సంతమార్కెటుకు దగ్గరగా ఉంటుంది. ఆ రౌండ్ కట్ట దగ్గర ఎప్పుడూ జనాలు బాగా జమకూడేవాళ్ళు. ఊరిలో విషయాలన్నీఅక్కడే తేలేవి. ఎలక్షన్ల దగ్గర నుండి, బుడ్డలపంటల పరిస్థితినుండి, సీడువ్యాపారం మొదలుకుని అన్ని విషయాలు అక్కడే జమ కట్టబడేవి. ఎవరన్నా టీ అడిగితే లాల్బాష డబ్బులు కూడా అడిగేవాడు కాదు. ఇస్తేమాత్రం నవ్వుతూ తీసుకునేవాడు. చిన్నభార్య అంగట్లోఉంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు తీసుకునేది. లాల్బాష నెమ్మదితనానికి అందరికీ లాల్బాష అంటే ఇష్టమే. మాఊర్లో చిన్నపిల్లలకు పొదుపు నేర్పింది లాల్బాషనే.బడిపిల్లలకు ఒక చిన్నకార్ద్ ఇచ్చేవాడు. దానిలో నిలువువరుసల్లో 5,10, 25 పైసల సంఖ్యలుండెవి. అడ్డువరసల్లో 1,2,3 వరుస సంఖ్యలుండేవి.మేము ఐదుపదిపైసలు లాల్బాష వద్ద పొదుపు చేసినప్పుడల్లా ఒక్కో అంకెనుపెన్నుతో కొట్టేస్తూ వెళ్ళేవాడు. ఒకనెల తర్వాతో రెన్నెల్ల తర్వాతో ఎన్ని అంకెలు కొట్టేసాడొ అన్నిపైసల మొత్తం ఒకేసారి చేతిలోపెట్టేవాడు. లేదా తన అంగడిలో ఏవన్న బిస్కెట్పేకెట్లు, చాక్లెట్లు పొదుపు విలువకు తగ్గవస్తువులు ఇచ్చేవాడు. అప్పట్లో బేంకులు పెద్దోల్లకే అందుబాటులోఉండేవికావు. ఆరకంగా మాఊర్లోఉండే మా బడిపిల్లలందరికీ పొదుపులోఉండే ఒక ఎగ్జాయిట్మెంట్ క్రియేట్ చేశాడు. లాల్బాష అంగడికి మాఊరవతల ఉండే నపుంసకులు ఒకేసారిగుంపుగా ఊర్లోఉండే షాపులన్నితిరిగి డబ్బులు కలెక్టే్చసుకునేవాళ్ళు. ఇంచుమించు అన్నిపెద్దషాపుల వాళ్లు వాళ్ళని తిరస్కరించేవాళ్ళు. కాని లాల్బాష అంగడి దగ్గర మాత్రం వాళ్ళకు దానమే కాదు కాఫీటీలుకూడా దొరికేవి. ఊర్లోవాళ్ళు రౌండ్‌కట్ట దగ్గర ఈ విషయమై విసుక్కుంటే అల్లా ఎవర్నీ శపించడు అందర్నీ దీవిస్తాడు అని సర్దిచెప్పేవాడు.లాల్బాష ఎందుకు చనిపోయాడోఎవరికీతెలీదు. ఒక్కొక్కరిది ఒక్కో ఊహాగానం. ఒకరు పెద్దభార్యతమ్ముడు అంటే బామ్మర్ది డబ్బుల కోసంపెట్టే సతాయింపు భరించలేకఅని, కొంతమంది వారమొడ్డిఆంజనేయులు తన వడ్డీగురించి పెట్టే సతాయింపువల్లఅని, కొంతమంది లాల్బాష చిట్టీలడబ్బులు తిరిగికట్టలేక పడే ఇబ్బందులవల్ల చనిపోయాడని అనుకున్నారు ఇన్నాళ్ళు. వారమొడ్డిఆంజనేయులు దగ్గర లాల్బాష ఎంతోఅప్పుచేసాడు. మాఊరికంత ఎన్ఫీల్డ్ కలిగిన ఒకేఒక వ్యక్తి వారమొడ్డిఆంజనేయులు. బైకులో ’భడ్ భడ్’మని తిరుగుతూ అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గర వారంవారం రుపాయి లెక్కన వడ్డీ వసూలు చేసుకుంటూ తిరుగుతుంటాడు. మొహమాటంలేకుండా, ఒక్కరోజువృథా పోనీకుండా వడ్డీ వసూలుచేస్తాడు. లాల్బాష చిన్నచిన్న చిట్టీలు కూడా నడుపుతాడు. ఆవి సరిగ ్గనడపలేక, కొంతమంది కట్టాల్సినౖ టెములో కట్టకపోవడంతో ఇబ్బందుల్లో పడ్డాడు.పెద్ద భార్య గయ్యాళి అని జనాలు అనేవాళ్ళు. ఆమెతో పడక, ఆమెను వదిలేసి రెండో భార్యను కట్టుకుని అక్కడే దగ్గర్లో ఉండేవాడు. పెద్దభార్య తమ్ముడు అల్లరిచిల్లరివేషాలేసే ్తభరించలేకపోయేవాడు. అయితే పెద్దభార్యతమ్ముడు అప్పటికీ లాల్బాష దగ్గర ఏదోలా డబ్బులు పిండుకుని వెళ్ళిపోయేవాడు. చిన్నభార్య కుటుంబం కూడా తన మీద ఆధారపడ్డంతో, చిట్టీడబ్బులుకట్టలేక, వారమొడ్డీ తీర్చలేక బాగా సతమతమయ్యేవాడు. అయితే అందరు ఇన్నాళ్ళు అనుకున్నట్టు లాల్బాష చనిపోలేదు. నెలరోజులుగా హైదరాబాదులో ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలీదు. కానీ ఒక మేలైన పని చేసాడు మాఊరికి. అదిమాత్రం తెలిసింది అందరికి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినరోజులుఅవి. నెలరోజులు హైదరాబాదులోనే తిష్ట వేసి ముఖ్యమంత్రిని కలిసాడట. కలవడమేకాక మాఊరి ప్రయోజనాల గురించి మంకుపట్టుపట్టి తనప్రతిపాదనను వివరించాడట. మాఊరిబయట పెద్దకాలువ ఉంది. అదివెళ్ళి తుంగభద్రలో కలిసే ఒకపాయ. సంవత్సరంలో రెండునెలలో మూడునెలలు మాత్రమే ప్రవహిస్తుంది అది. అది సరిగ్గా రెండుకొండల మధ్య నుండి ప్రవహిస్తుంది. ఒకేఒకపక్క మాత్రమే ఆనకట్టలాంటి గోడకడితేచాలు ఒకరిజర్వాయర్ తయారౌతుంది. ఆ రిజర్వాయర్ వల్ల కొన్నివేలఎకరాలు సాగు చేయబడేంత సామర్థ్యం వస్తుంది. మొత్తం రిజర్వాయర్ కట్టవలసిన పనిలేదు కాబట్టి ఖర్చు కూడ సాధారణ రిజర్వాయర్ కన్నా మూడోవంతులోపు అయిపోతుంది. అంతేకాక మంత్రాలయం చుట్టుపక్కల్లో ఒక్కసారి అయిన వసతిసదుపాయం కలిగిన హోటల్లేదు కాబట్టి పదహైదుకిలోమీటర్లు మాత్రమే దూరమున్న పెద్దకాలువపైన కట్టే రిజర్వాయర్ ఒడ్డున ఒక హోటల్ కడితే పుణ్యయాత్రలకు వచ్చిన వాళ్ళకు సదుపాయంగా ఉంటుంది. రిజర్వాయిర్ చుట్టూ హోటల్ కడితే కొండపైన నీళ్ళ పక్కన వ్యూ అహ్లాదకరంగా ఉండడండవల్ల్ల ఎంతోమంది టూరిస్టులు పక్కనే ఉన్న కర్ణాటక నుండి కూడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందువలన ఆచుట్టుపక్కల గ్రామాలలో చిన్నచిన్న వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. నీళ్ళు ఉండడం వల్ల ఒకపక్కసేద్యం పుంజుకుంటే సీడువ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఎరువుల వ్యాపారం కూడా పెరుగుతుంది. అప్పటిదాకా ఆయిల్ కంపనీ మీద మాత్రమే ఆధారపడ్డ ప్రజలకు ఒక ప్రత్యమ్నాయం దొరకడం వలన, సన్‌పవర్ రైతులకు కూడా మంచిధర పలికేలా కంపనీ ప్రవర్తిస్తుంది. అప్పుడే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలనుకున్న ప్రభుత్వం ఆపెద్దకాలువ పక్కనేపెడితే పిల్లలకు ఆహ్లాదకరైమైన వాతావరణంలో చదువుకునే అవకాశం ఉంటుంది. జిల్లాకలెక్టరు లాల్బాషకు ఇరవైఐదువేలు పారితోషికం ఇవ్వమని, ఆప్రతిపాదనకు సంబంధించిన మొత్తం ప్లాను లాల్బాష నుండి సేకరించమని ఎన్టీఆర్ ఆజ్ఞా జారీ చేసినట్టు అందరికి తెలిసింది. ఒక్కసారిగా లాల్బాష గురించి రౌండ్‌కట్ట దగ్గర ఒకటే చెప్పుకున్నారు జనాలు. ఊరంతా పాకిపోయింది ఈవిషయం. వారమొడ్డిఆంజనేయులుగాని, చిట్టీవాళ్ళుగాని ఎవరూ లాల్బాషను సతాయించడం ఆపేసారు. లాల్బాషకెలాగూ ఇంకొన్నిరోజుల్లో ఇరవైఐదువేలు ప్రభుత్వం నుండి అందుతుంది. దానితో అందరి అప్పులు కూడా తీరుతాయి. లాల్బాష పెద్దభార్య తమ్ముడి దౌర్జన్యం కూడా కొంతవరకు ఆగింది..లాల్బాష వల్ల రౌండుకట్టకే ఒక వెలుగు వచ్చినట్టు అయ్యింది. లాల్బాష ఈద్ రోజులు కావడంతో ‘రోజా’ చేస్తూ రోజూ గడిపేస్తున్నాడు. ప్రభుత్వంకు ఇవ్వాల్సిన ప్రతిపాదనల మొత్తం వివరాలు లాల్బాష రాసి పెట్టుకున్నాడు. జనాలు వాకబు చేసినప్పుడల్లా బాగాశ్రద్ధగా వివరించేవాడు. తనదగ్గర చిన్నచిన్న వివరాలతోసహాఎన్నోరీములపేపర్లలో ప్లాన్రాస్తున్నాడని చెప్పేవాడు. కలెక్టర్నుండి వార్తకోసం వెయిట్ చేస్తున్నాడు. ఒక పదహైదురోజులకు కలెక్టర్నుండి ఫోన్ వచ్చిందనే వార్త రౌండ్‌కట్ట నుండి ఊరంతాపాకింది. మాఊరు రౌండ్‌కట్ట దగ్గిర మళ్ళీ ఎంతో సంబరంగా మాటలు మాట్లాడుకునేవాళ్ళు. ఇక రంజాన్ అయిన వెంటనే లాల్బాష ప్లాన్ ప్రభుత్వానికి చేరిపోతుందని ఊరు ఇక ఒకవెలుగు వెలిగిపోతుందని అందరూ చెప్పుకున్నారు. వారమొడ్డిఆంజనేయులు, చీటి వేసినవాళ్ళు ఇకత్వరలో వాళ్ళ అప్పులు తీర్చేస్తాడని, పెద్దభార్యతమ్ముడు కూడా ఇక లాల్బాష జీవితంలో లేనిపోని జోక్యం చేసుకోడని కూడా జనాలకు తెలిసిపోయింది. ఒకపక్క లాల్బాష బాగుపడ్డమే కాక ఊరంతా బాగుపడేలా ప్లాన్వేసాడని లాల్బాష గురించి అందరు తెగమెచ్చుకునేవాళ్ళు. పదిమందిబాగులోనే తనబాగును కూడా కలిపేసుకున్న లాల్బాష మాఊర్లోమంచితెలివైనవాడికి ఉదాహరణగాచెప్పుకునేవాళ్ళు.రంజాన్ రానే వచ్చింది. ఆరోజు పొద్దున లాల్బాష చనిపోయాడు. ఈసారి నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడు!ఆరోజు ఊరిపెద్దకాలువ యమ్మిగనూర్ చెక్కిళ్లపైన పారే కన్నీటిధారలాఉంది.జనమంతా లాల్బాష అంగడి దగ్గర పోగయ్యారు. జనాలు చూడ్డం కోసం బాడీని రౌండ్‌కట్ట దగ్గర తీసుకొచ్చిపెట్టారు. ఎంతోమంది వచ్చి చూసివెళ్ళారు. చాలామంది లాల్బాష మంచితనం తల్చుకుని కంటతడిపెట్టారు. మరికొంతమంది రంజాన్రోజు చనిపోవడం వల్ల జన్నత్ కెల్తాడు అని అనుకుంటూ బాధపడ్డారు.అతని బాడీ మీద పడి హృదయవిదారకంగా ఏడుస్తున్న అతని చిన్నభార్యను ఎలాఓదార్చాలో తెలీక సతమతమయ్యారు. బాడీని పాతిపెట్టడానికి తీసుకెల్తుండగా చిన్నభార్య తనభర్త తయారు చేసిన పేపర్లను కూడా లాల్బాషతో పాటేపూడ్చిపెట్టేసేయమనిపెద్దల్ని బ్రతిమాలి చిన్నట్రంకుపెట్టెను అతని శవపేటిక మీద పెట్టేసింది. ఆమె భోరుమని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే ఆరోజు లాల్బాషతో పాటూ లాల్బాష ప్లాన్కూడా సమాధిలో కప్పివేయబడ్డది. అయితే ప్రపంచం మనమనుకున్నంత మంచిగాఉండదు. మరుసటి రోజే వారమొడ్డిఆంజనేయులు చిన్నభార్య ఇంటిమీద జనాలనేసుకునిపడ్డాడు. అసలు లాల్బాష ప్లాన్పేపర్లు ఎందుకు కప్పేసారని గొడవచేసాడు. సెంటిమెంట్లు అవ్వన్నీ చెల్లవని తెగేసి గొడవచేసాడు.చిట్టీకట్టినవాళ్ళు కూడా ఆయన చుట్టూచేరడంతో పెద్దరసాభసఅయ్యింది. చిన్నభార్యకు ఏమిపాలుపోక ఒక్కతేమౌనంగా కళ్ళు నేలకేసిపెట్టుకుంది. ఆమె కళ్ళ నిండా నీళ్ళు మాత్రం కారిపోతూనే ఉన్నాయి. జుట్టుచెదిరిపోయిఉంది. మాఊరి తేరులా ఒంటరిగా చలనం లేనట్టు గోడకానుకుని ఉంది. పెద్దభార్యతమ్ముడు వచ్చినాయకత్వం మీద వేసుకుని అయ్యిందేదో అయిపోయింది ఆపేపర్లట్రంకుపెట్టేబయటకు తీస్తే తానువారమొడ్డిఆంజనేయులుతోకలిసి ఎలాగోలా ప్రభుత్వం నుండి కొంచెమన్నడబ్బు అందేలా కర్నూలుకెళ్ళిట్రైచేస్తామని, కర్నూలులోతిష్టవేసిపని అయ్యేంత వరకు తనదేబాధ్యత అనిగట్టిగా అరిచిగీపెట్టడంతో అక్కడుండేవాళ్ళు సమాధి తవ్వి ట్రంకు పెట్టె బయటకు తీద్దామని నిర్ణయించుకున్నారు. సమాధి తవ్వడం కోసం మాఊరు పాలెంవాల్లను కబురుపెటి ్టపిలిచారు. చివరికి సమాధి తవ్వాలని వాల్లందరూ నిర్ణయించుకున్నట్టు తెలపడంతో ఇకలాల్బాష చిన్నభార్య ఏదో సముద్ర ఉప్పెనలా రోదించింది. వద్దనిబతిమాలింది. పరిగెత్తికెళ్ళి లాల్బాష పెద్దభార్య కాళ్ళ మీద పడింది. అక్కడ మెజారిటీజనాలు డబ్బులు రాబట్టుకోవడం కోసమే ఉన్నారు కాబట్టి ఆమె రోదనకు తగిన మద్దతు లేకుండాపోయింది. పాలేంవాళ్ళువచ్చారు. అందరూ స్మశానానికివెళ్ళారు.వాళ్ళు సమాధి తవ్వి ట్రంకుపెట్టె బయటకుతీసారు. ఎవరో ఆత్రంగా ట్రంకు పెట్టె ఓపెన్‌చేసి చూస్తే ఒక కట్టపేపర్లు కనిపించాయి.లాల్బాష ప్లాన్దొరకడంతో గబాల్న పేపర్కట్ట విప్పిచూసారు. అన్నీ తెల్లకాగితాలే !లాల్బాష చిన్నభార్య ఒక్కఉదుటునవెళ్ళి ఆపేపర్కట్టవిప్పిన వాడిచొక్కాపట్టుకుని ‘ఒరేయ్! నాబట్ట! సచ్చిన కూడ ఇడ్సలె కద్రామీరు?! సచ్చేముందు రెండునెల్లనుండి ఇంతకూడబెట్టుకున్న మనశ్శాంతి కూడా వాయనకి లేకుండ లాక్కుంట్రికదరా..ఓయప్పో సచ్చినోన్ని కూడా మల్ల సంపితిరికద్రామీరు !’’ అని కుప్పకూలిపోయింది.ఆరోజు రౌండ్‌కట్ట దగ్గర అందరు లాల్బాషప్లాను గురించే మాట్లాడుకున్నారు. అతని అసలు ప్లాన్తెలిసిన ఒకేఒక్కవ్యక్తి ఆరాత్రి రౌండ్‌కట్ట బల్బువెలుగులోజీవచ్చవంలాఉంది. మరుసటిరోజుపొద్దున వరకు మాఇంట్లో మాఆవిడ, మాఅబ్బాయి ఇద్దరు ఇంచుమించు మౌనంగానేఉన్నారు. మరుసటిరోజు బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ దగ్గర మాఆవిడ అడిగింది‘కథ మొత్తానికి ఒకే ఒక్క డైలాగ్. అదికూడా ఆవిధంగా ముగిస్తు పెట్టడంలో రైటర్‌గా నీ శాడిజం కనిపిస్తుందని నాకనిపిస్తుంది’ అని బలవంతంగా విసుక్కుంది.ఇంట్లోపొద్దున్నే పనిచేసివెళ్ళిన రమీజాబీని గమనించి ఉంటే వాళ్ళిద్దరికి అందరం కలిసున్నామనే ఈ సమాజం బతికే అవగాహనలో ఉండే శాడిజం ఏంటోతెలిసేది ! పి. విక్టర్ విజయ్‌కుమార్ -
ఇల్లే హరివిల్లు
గృహానికి ఎల్ఈడీ లైట్ల వెలుగులు ఆకాశంలో విరిసే ఇంద్రధనుస్సు మీ ఇంట్లోనే ఉంటే.. అంతకు మించి ఆనందం, ఆహ్లాదం ఇంకేముంటుంది? సప్తవర్ణ కాంతులీనుతూ గృహం ఔరా! అని విస్తుపోయేలా ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంటిని ఎల్ఈడీ లైట్ల కాంతులు విరజిమ్మేలా నిర్మించుకోవడం ఓ ఫ్యాషన్. అవును.. ఇల్లంతా పరచుకున్న వె లుతురులో.. ఫర్నిచర్ లుక్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. అదే ఫర్నిచర్ వెలుగులు పంచితే ఎలా ఉంటుందో ఊహించండి. చీకట్లో ఆ సామగ్రి వెలుగులు అద్భుతం అనిపిస్తుంది.రాత్రయిందంటే చాలు మీ ఇంటిని ఇంద్రధనుస్సు పరచుకున్నట్లు రంగులమయం చేసుకోవచ్చు. ఎల్ఈడీ లైట్లతో మిరుమిట్లు గొలిపే ఫర్నిచర్ ఇప్పుడు మార్కెట్లో వెలిగిపోతోంది. ఎల్ఈడీ సొగసులు అద్దుకున్న హంసతూలికా తల్పం మీ పడక గదిలో కనువిందు చేస్తుంది. లివింగ్ హాల్లో ఉన్న సోఫాసెట్ సంధ్యాకాంతులు పంచుతుంది. అంతేనా మెరిసే టైల్స్ నింగిలో మెరిసే తారకలను భువికి దించుతాయి. ఒకప్పుడు పండుగలు, పబ్బాలాకే ఇంటిని రంగు రంగుల బల్బులతో అలంకరించుకునే వారు. అలా చిన్న చిన్న బల్బులకే పరిమితమైన ఈ రంగుల కాంతులను ఇప్పుడు సోఫాలు, కుర్చీలు, డైనింగ్ టేబుల్స్, మంచం, మెట్లు, ప్లేట్లూ, గ్లాసులు, గిన్నెలు ఇలా అన్నింటిలో చొప్పించేస్తున్నారు డిజైనర్లు. ఫర్నిచర్ చాలావరకు పారదర్శకంగా ఉండే గట్టి ప్లాస్టిక్‌తో చేసినవే కాబట్టి వాటి లోపల రీచార్జబుల్ బ్యాటరీలతో వెలిగే ఎల్ఈడీ లైట్లను అమరుస్తారు. రకరకాల డిజైన్లు ప్రకాశవంతమైన రంగులతో పగటిపూట ఒక రకంగా రాత్రి పూట మరో రకంగా వెలుగులు విరజిమ్మటమే ఈ లైట్ల ప్రత్యేకత. ఇలాంటి ఎల్ఈడీ లైట్లు ఉంటే ప్రతి రోజూ పండగే. ఇంట్లో జరిగే శుభాకార్యాలకు ప్రత్యేకమైన ఏర్పాట్ల అవసరం ఉండదు. మూడ్‌కు తగ్గ కలర్స్ కలర్స్ మన మూడ్‌ని మారుస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదంటున్నారు నిపుణులు. తెలుపు రంగు మెదడును ఉత్తేజపరుస్తుంది. నీలం ప్రశాంతతను ఇస్తుంది. ఇలా ఒక్కో రంగుది ఒక్కో ప్రత్యేకత. ఫర్నిచర్లో వినియోగించే రంగులు కేవలం అందం కోసమే కాదు మన మూడ్‌కు తగ్గట్టు రిమోట్ సహాయంతో కలర్స్‌ని మార్చుకునే సౌలభ్యం కూడా కల్పించాయి వాటి కంపెనీలు.ఇక గచ్చుకు ఎల్ఈడీలను అమర్చేటప్పుడే కస్టమర్ల టేస్ట్‌కు తగ్గట్లు లైట్లను అమరుస్తారు. నచ్చిన కలర్‌ను ఎంచుకుని ఆనందం పొందవచ్చు. మెట్ల విషయానికి వస్తే గట్టి గాజుతో చేసిన టైల్స్, వాటి అడుగున ఎల్ఈడీ లైట్లను అమరుస్తారు. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే.. మనం వేసే అడుగులను బట్టి లైట్స్ కూడా అంతే లయబద్ధంగా రంగులు పంచుతాయి. అడుగు తీయగానే వెలుగులు ఆగిపోతాయి. సోలార్ వెలుగులు ఇంటి ఆవరణలో సోలార్ ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకుంటే కరెంట్ ఆదా అవడమే కాకుండా ఇంటిని రంగులతో నింపేయొచ్చు. వీటిలో సెన్సర్ల సాయంతో పనిచేసేవి కూడా ఉన్నాయి. చీకట్లో మనం ఆ చుట్టుపక్కలకు రాగానే వాటంతట అవే వెలిగి దారి చూపిస్తాయివి. ఆరు బయట పెట్టే పూల కుండీలు, టైల్స్‌లో అమర్చిన లైట్లు పగలు సూర్యకాంతిని గ్రహించి రాత్రి పూట వెలుగులు పంచుతాయి. బాత్‌టబ్‌లు, ప్యాన్లు.. ఇలా ఒక్కటేమిటి ఇంట్లోని ప్రతి వస్తువులకు ఎల్ఈడీ లైట్లను అమరుస్తున్నారు డిజైనర్లు. మీ రిక్వైర్మెంట్ను బట్టి చార్జెస్ ఉంటాయి. ఈ వెలుగులు మీకు కావాలంటే జంట నగరాల్లోని లెడ్ లైట్స్ షోరూమ్స్ని లేదా ఇంటీరియర్ డిజైనర్స్‌ని సంప్రదిస్తే మీ గృహసీమని రంగులమయం చేసుకోవచ్చు. చీకటికి వన్నెలద్దుతున్న ఈ కొత్త ట్రెండ్ భలేగా ఉంది కదూ. ..:: విజయారెడ్డి ఫర్నిచర్లో ఎల్ఈడీ లైట్లను అమర్చుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఒక ట్రెండ్‌గా మారింది. వీటిని అమర్చుకోవడానికి చదరపు అడుగుకు కనీసం 1200 రూపాయలు ఖర్చవుతుంది. విద్యుత్ గురించి భయపడాల్సిన పని లేదు. కరెంట్‌ను ఆదా చేసే చాలా రకాలు మార్కెట్లో ఉన్నాయి. ఒక్కసారి ఖర్చు చేస్తే చాలు జీవితాంతం మన్నికగా ఉంటాయి. - మాధురి, ఇంటీరియర్ డిజై నర్, లకోటియా ఇన్స్టిట్యూట్