లాల్బాష ప్లాన్‌ | Funday new story of the week | Sakshi
Sakshi News home page

లాల్బాష ప్లాన్‌

Published Sun, Oct 21 2018 2:13 AM | Last Updated on Sun, Oct 21 2018 2:13 AM

Funday new  story of the week - Sakshi

నేను వలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్న తర్వాత మాఊరు చూడ్డానికి సరదాగా వచ్చాము. అదికూడా ఎన్నో ఏళ్ళ తర్వాత. పొద్దున్నే రమీజాబీవచ్చి మాఇల్లు శుభ్రంచేసి, మాకు టిఫిన్స్‌ , వడ్డించి రాత్రి మిగిలినకొన్ని తిండిపదార్థాలు ఇంటికితీసుకెళ్ళింది.టిఫిన్‌ తిన్నాక అందరం డైనింగ్‌ టేబుల్‌ చుట్టూ కూర్చునే ఉన్నాం బద్ధకంగా. మా ఊరు కథలు వినాలంటే నాభార్యకు చాలా ఆసక్తి. మా ఇరవైఏదేళ్ళ అబ్బాయికికూడ. నా పెళ్ళయినప్పటి నుండి ముప్పైఏళ్ళుగా హైదరాబాదులో సెటిల్‌ అయిఉన్నాము. మా అత్తమామ తరుపువాళ్ళు బీచ్‌సిటీ విశాఖపట్నంలో పెరిగినవాళ్ళు. కర్నూలు దగ్గర ఒక చిన్నప్రాంతంలోఎలాంటి కథలు, ఎలాంటి ఉద్వేగాలు, ఎలాంటి మనస్తత్వాలు, ఎలాంటి వ్యక్తిత్వాలు ఉంటాయో తెలుసుకుని ఇద్దరూ కొత్తలోకంలోకెళ్ళినటు ్టఫీలవుతారు. మధ్యలో నాప్రాంతీయభాష విని మురిసిపోతుంటారు. కథ విన్నంతసేపు వాళ్ళకు యమ్నూరు అంటే యమ్మిగనూరు నుండి తెచ్చుకున్నభర్త, నాన్నకొత్తగాఉంటాడు. అలానే కూర్చున్నాంకదా అని మాఆవిడ కథ చెప్పమని అడిగింది. 

ముప్పైసంవత్సరాలపైచిలుకు మాట ఇది! చనిపోయిన లాల్బాష మళ్ళీ బతికొచ్చాడని చూడ్డానికి జనాలు రౌండ్‌కట్ట వేపు వెళ్ళి చూసివచ్చేవాళ్ళు చూసివస్తున్నారు. రంధ్రాలఎర్రబనీను వేసుకున్న బాడీ మాఊరు పెద్దకాల్వలో కొట్టుకుపోతుంటే ఎవరోచూసారు. రక్షించడానికి ప్రయత్నించారుగాని, ఆ ప్రవాహంలో తుంగభద్రలో కొట్టుకువెళ్ళిపోయింది. ఆరోజునుండి ఇప్పటివరకు కనిపించని లాల్బాష, నెలరోజులతర్వాత హఠాత్తుగా బతికిఉన్నట్టు తెలవడంతోఅందరికి సంభ్రమం కలిగింది. లాల్బాష అంటే అందరికీ అభిమానమే. రౌండ్‌కట్టను  ఆనుకునే లాల్బాష అంగడి ఉంటుంది.  లాల్బాష అంగడి ఊరికి మధ్యలో రౌండ్‌కట్ట దగ్గర ఉండడంతో, సంతమార్కెటుకు దగ్గరగా ఉంటుంది. ఆ రౌండ్‌ కట్ట దగ్గర ఎప్పుడూ జనాలు బాగా జమకూడేవాళ్ళు. ఊరిలో విషయాలన్నీఅక్కడే తేలేవి. ఎలక్షన్ల దగ్గర నుండి, బుడ్డలపంటల పరిస్థితినుండి, సీడువ్యాపారం మొదలుకుని అన్ని విషయాలు అక్కడే జమ కట్టబడేవి. ఎవరన్నా టీ అడిగితే లాల్బాష డబ్బులు కూడా అడిగేవాడు కాదు. ఇస్తేమాత్రం నవ్వుతూ తీసుకునేవాడు. చిన్నభార్య అంగట్లోఉంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు తీసుకునేది. లాల్బాష నెమ్మదితనానికి అందరికీ లాల్బాష అంటే ఇష్టమే. మాఊర్లో చిన్నపిల్లలకు పొదుపు నేర్పింది లాల్బాషనే.బడిపిల్లలకు ఒక చిన్నకార్ద్‌ ఇచ్చేవాడు. దానిలో నిలువువరుసల్లో  5,10, 25 పైసల సంఖ్యలుండెవి. అడ్డువరసల్లో 1,2,3 వరుస సంఖ్యలుండేవి.మేము ఐదుపదిపైసలు లాల్బాష వద్ద  పొదుపు  చేసినప్పుడల్లా ఒక్కో అంకెనుపెన్నుతో కొట్టేస్తూ వెళ్ళేవాడు. ఒకనెల తర్వాతో రెన్నెల్ల తర్వాతో ఎన్ని అంకెలు కొట్టేసాడొ అన్నిపైసల మొత్తం ఒకేసారి చేతిలోపెట్టేవాడు. లేదా తన అంగడిలో ఏవన్న బిస్కెట్పేకెట్లు, చాక్లెట్లు పొదుపు విలువకు తగ్గవస్తువులు ఇచ్చేవాడు. అప్పట్లో బేంకులు పెద్దోల్లకే అందుబాటులోఉండేవికావు. ఆరకంగా మాఊర్లోఉండే మా బడిపిల్లలందరికీ పొదుపులోఉండే ఒక ఎగ్జాయిట్‌మెంట్‌ క్రియేట్‌ చేశాడు.
 
లాల్బాష  అంగడికి మాఊరవతల ఉండే నపుంసకులు ఒకేసారిగుంపుగా ఊర్లోఉండే షాపులన్నితిరిగి డబ్బులు కలెక్టే్చసుకునేవాళ్ళు. ఇంచుమించు అన్నిపెద్దషాపుల వాళ్లు వాళ్ళని తిరస్కరించేవాళ్ళు. కాని లాల్బాష అంగడి దగ్గర మాత్రం వాళ్ళకు దానమే కాదు కాఫీటీలుకూడా దొరికేవి. ఊర్లోవాళ్ళు రౌండ్‌కట్ట దగ్గర ఈ విషయమై విసుక్కుంటే అల్లా ఎవర్నీ శపించడు అందర్నీ దీవిస్తాడు అని సర్దిచెప్పేవాడు.లాల్బాష ఎందుకు చనిపోయాడోఎవరికీతెలీదు. ఒక్కొక్కరిది ఒక్కో ఊహాగానం. ఒకరు పెద్దభార్యతమ్ముడు అంటే బామ్మర్ది డబ్బుల కోసంపెట్టే సతాయింపు భరించలేకఅని, కొంతమంది వారమొడ్డిఆంజనేయులు తన వడ్డీగురించి పెట్టే సతాయింపువల్లఅని, కొంతమంది లాల్బాష చిట్టీలడబ్బులు తిరిగికట్టలేక పడే ఇబ్బందులవల్ల చనిపోయాడని అనుకున్నారు ఇన్నాళ్ళు. వారమొడ్డిఆంజనేయులు దగ్గర లాల్బాష ఎంతోఅప్పుచేసాడు. మాఊరికంత ఎన్‌ఫీల్డ్‌ కలిగిన ఒకేఒక వ్యక్తి వారమొడ్డిఆంజనేయులు. బైకులో ’భడ్‌ భడ్‌’మని తిరుగుతూ  అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గర వారంవారం రుపాయి లెక్కన వడ్డీ వసూలు చేసుకుంటూ తిరుగుతుంటాడు. మొహమాటంలేకుండా, ఒక్కరోజువృథా పోనీకుండా వడ్డీ వసూలుచేస్తాడు. లాల్బాష చిన్నచిన్న చిట్టీలు కూడా నడుపుతాడు. ఆవి సరిగ ్గనడపలేక, కొంతమంది కట్టాల్సినౖ టెములో కట్టకపోవడంతో ఇబ్బందుల్లో పడ్డాడు.పెద్ద భార్య గయ్యాళి అని జనాలు అనేవాళ్ళు. ఆమెతో పడక, ఆమెను వదిలేసి రెండో భార్యను కట్టుకుని అక్కడే దగ్గర్లో ఉండేవాడు. పెద్దభార్య తమ్ముడు అల్లరిచిల్లరివేషాలేసే ్తభరించలేకపోయేవాడు.  అయితే పెద్దభార్యతమ్ముడు అప్పటికీ లాల్బాష దగ్గర ఏదోలా డబ్బులు పిండుకుని వెళ్ళిపోయేవాడు. చిన్నభార్య కుటుంబం కూడా తన మీద ఆధారపడ్డంతో, చిట్టీడబ్బులుకట్టలేక, వారమొడ్డీ తీర్చలేక బాగా సతమతమయ్యేవాడు. 

అయితే అందరు ఇన్నాళ్ళు అనుకున్నట్టు లాల్బాష చనిపోలేదు. నెలరోజులుగా హైదరాబాదులో ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలీదు. కానీ ఒక మేలైన పని చేసాడు మాఊరికి. అదిమాత్రం తెలిసింది అందరికి. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయినరోజులుఅవి. నెలరోజులు హైదరాబాదులోనే తిష్ట వేసి ముఖ్యమంత్రిని కలిసాడట. కలవడమేకాక మాఊరి ప్రయోజనాల గురించి మంకుపట్టుపట్టి తనప్రతిపాదనను వివరించాడట.
మాఊరిబయట పెద్దకాలువ ఉంది. అదివెళ్ళి తుంగభద్రలో కలిసే ఒకపాయ. సంవత్సరంలో రెండునెలలో మూడునెలలు మాత్రమే ప్రవహిస్తుంది అది. అది సరిగ్గా రెండుకొండల మధ్య నుండి ప్రవహిస్తుంది. ఒకేఒకపక్క మాత్రమే ఆనకట్టలాంటి గోడకడితేచాలు ఒకరిజర్వాయర్‌ తయారౌతుంది. ఆ రిజర్వాయర్‌ వల్ల కొన్నివేలఎకరాలు సాగు చేయబడేంత సామర్థ్యం వస్తుంది. మొత్తం రిజర్వాయర్‌ కట్టవలసిన పనిలేదు కాబట్టి ఖర్చు కూడ సాధారణ రిజర్వాయర్‌ కన్నా మూడోవంతులోపు అయిపోతుంది. అంతేకాక మంత్రాలయం చుట్టుపక్కల్లో ఒక్కసారి అయిన వసతిసదుపాయం కలిగిన హోటల్లేదు కాబట్టి పదహైదుకిలోమీటర్లు మాత్రమే దూరమున్న పెద్దకాలువపైన కట్టే రిజర్వాయర్‌ ఒడ్డున ఒక హోటల్‌ కడితే పుణ్యయాత్రలకు వచ్చిన వాళ్ళకు సదుపాయంగా ఉంటుంది. రిజర్వాయిర్‌ చుట్టూ హోటల్‌ కడితే కొండపైన నీళ్ళ పక్కన వ్యూ అహ్లాదకరంగా ఉండడండవల్ల్ల ఎంతోమంది టూరిస్టులు పక్కనే ఉన్న కర్ణాటక నుండి కూడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందువలన ఆచుట్టుపక్కల గ్రామాలలో చిన్నచిన్న వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. నీళ్ళు ఉండడం వల్ల ఒకపక్కసేద్యం పుంజుకుంటే సీడువ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది.  ఎరువుల వ్యాపారం కూడా పెరుగుతుంది. అప్పటిదాకా ఆయిల్‌ కంపనీ మీద మాత్రమే ఆధారపడ్డ ప్రజలకు ఒక ప్రత్యమ్నాయం దొరకడం వలన, సన్‌పవర్‌ రైతులకు కూడా మంచిధర పలికేలా కంపనీ ప్రవర్తిస్తుంది. అప్పుడే రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ పెట్టాలనుకున్న ప్రభుత్వం ఆపెద్దకాలువ పక్కనేపెడితే పిల్లలకు ఆహ్లాదకరైమైన వాతావరణంలో చదువుకునే అవకాశం ఉంటుంది. జిల్లాకలెక్టరు లాల్బాషకు ఇరవైఐదువేలు పారితోషికం ఇవ్వమని, ఆప్రతిపాదనకు సంబంధించిన మొత్తం ప్లాను లాల్బాష నుండి సేకరించమని ఎన్టీఆర్‌ ఆజ్ఞా జారీ చేసినట్టు అందరికి తెలిసింది.

ఒక్కసారిగా లాల్బాష గురించి రౌండ్‌కట్ట దగ్గర ఒకటే చెప్పుకున్నారు జనాలు. ఊరంతా పాకిపోయింది  ఈవిషయం. వారమొడ్డిఆంజనేయులుగాని, చిట్టీవాళ్ళుగాని ఎవరూ లాల్బాషను సతాయించడం ఆపేసారు. లాల్బాషకెలాగూ ఇంకొన్నిరోజుల్లో ఇరవైఐదువేలు ప్రభుత్వం నుండి అందుతుంది. దానితో అందరి అప్పులు కూడా తీరుతాయి. లాల్బాష పెద్దభార్య తమ్ముడి దౌర్జన్యం కూడా కొంతవరకు ఆగింది..లాల్బాష వల్ల రౌండుకట్టకే ఒక వెలుగు వచ్చినట్టు అయ్యింది. లాల్బాష ఈద్‌ రోజులు కావడంతో ‘రోజా’ చేస్తూ రోజూ గడిపేస్తున్నాడు. ప్రభుత్వంకు ఇవ్వాల్సిన ప్రతిపాదనల మొత్తం వివరాలు లాల్బాష రాసి పెట్టుకున్నాడు. జనాలు వాకబు చేసినప్పుడల్లా బాగాశ్రద్ధగా వివరించేవాడు. తనదగ్గర చిన్నచిన్న వివరాలతోసహాఎన్నోరీములపేపర్లలో ప్లాన్రాస్తున్నాడని చెప్పేవాడు.  కలెక్టర్నుండి వార్తకోసం వెయిట్‌ చేస్తున్నాడు. ఒక పదహైదురోజులకు కలెక్టర్నుండి ఫోన్‌ వచ్చిందనే వార్త రౌండ్‌కట్ట నుండి ఊరంతాపాకింది.  మాఊరు రౌండ్‌కట్ట దగ్గిర మళ్ళీ ఎంతో సంబరంగా మాటలు మాట్లాడుకునేవాళ్ళు. ఇక రంజాన్‌ అయిన వెంటనే లాల్బాష ప్లాన్‌ ప్రభుత్వానికి చేరిపోతుందని ఊరు ఇక ఒకవెలుగు వెలిగిపోతుందని అందరూ చెప్పుకున్నారు. వారమొడ్డిఆంజనేయులు, చీటి వేసినవాళ్ళు ఇకత్వరలో వాళ్ళ అప్పులు తీర్చేస్తాడని, పెద్దభార్యతమ్ముడు కూడా ఇక లాల్బాష జీవితంలో లేనిపోని జోక్యం చేసుకోడని కూడా జనాలకు తెలిసిపోయింది. ఒకపక్క లాల్బాష బాగుపడ్డమే కాక ఊరంతా బాగుపడేలా ప్లాన్వేసాడని లాల్బాష గురించి అందరు తెగమెచ్చుకునేవాళ్ళు. పదిమందిబాగులోనే తనబాగును కూడా కలిపేసుకున్న లాల్బాష మాఊర్లోమంచితెలివైనవాడికి ఉదాహరణగాచెప్పుకునేవాళ్ళు.రంజాన్‌ రానే వచ్చింది.

ఆరోజు పొద్దున లాల్బాష చనిపోయాడు. ఈసారి నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడు!ఆరోజు ఊరిపెద్దకాలువ యమ్మిగనూర్‌ చెక్కిళ్లపైన పారే కన్నీటిధారలాఉంది.జనమంతా లాల్బాష అంగడి దగ్గర పోగయ్యారు. జనాలు చూడ్డం కోసం బాడీని రౌండ్‌కట్ట దగ్గర తీసుకొచ్చిపెట్టారు. ఎంతోమంది వచ్చి చూసివెళ్ళారు. చాలామంది  లాల్బాష మంచితనం తల్చుకుని కంటతడిపెట్టారు. మరికొంతమంది రంజాన్‌రోజు చనిపోవడం వల్ల జన్నత్‌ కెల్తాడు అని అనుకుంటూ బాధపడ్డారు.అతని బాడీ మీద పడి హృదయవిదారకంగా ఏడుస్తున్న అతని చిన్నభార్యను ఎలాఓదార్చాలో తెలీక సతమతమయ్యారు. బాడీని పాతిపెట్టడానికి తీసుకెల్తుండగా చిన్నభార్య తనభర్త తయారు చేసిన పేపర్లను కూడా లాల్బాషతో పాటేపూడ్చిపెట్టేసేయమనిపెద్దల్ని బ్రతిమాలి చిన్నట్రంకుపెట్టెను అతని శవపేటిక మీద పెట్టేసింది. ఆమె భోరుమని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే ఆరోజు లాల్బాషతో పాటూ లాల్బాష ప్లాన్కూడా సమాధిలో కప్పివేయబడ్డది. అయితే ప్రపంచం మనమనుకున్నంత మంచిగాఉండదు. మరుసటి రోజే వారమొడ్డిఆంజనేయులు చిన్నభార్య ఇంటిమీద జనాలనేసుకునిపడ్డాడు. అసలు లాల్బాష ప్లాన్పేపర్లు ఎందుకు కప్పేసారని గొడవచేసాడు. సెంటిమెంట్లు అవ్వన్నీ చెల్లవని తెగేసి గొడవచేసాడు.చిట్టీకట్టినవాళ్ళు కూడా ఆయన చుట్టూచేరడంతో పెద్దరసాభసఅయ్యింది. చిన్నభార్యకు ఏమిపాలుపోక ఒక్కతేమౌనంగా కళ్ళు నేలకేసిపెట్టుకుంది. ఆమె కళ్ళ నిండా నీళ్ళు మాత్రం కారిపోతూనే ఉన్నాయి. జుట్టుచెదిరిపోయిఉంది. మాఊరి తేరులా ఒంటరిగా చలనం లేనట్టు గోడకానుకుని ఉంది.   

పెద్దభార్యతమ్ముడు వచ్చినాయకత్వం మీద వేసుకుని అయ్యిందేదో అయిపోయింది ఆపేపర్లట్రంకుపెట్టేబయటకు తీస్తే తానువారమొడ్డిఆంజనేయులుతోకలిసి ఎలాగోలా ప్రభుత్వం నుండి కొంచెమన్నడబ్బు అందేలా కర్నూలుకెళ్ళిట్రైచేస్తామని, కర్నూలులోతిష్టవేసిపని అయ్యేంత వరకు తనదేబాధ్యత అనిగట్టిగా అరిచిగీపెట్టడంతో అక్కడుండేవాళ్ళు సమాధి తవ్వి ట్రంకు పెట్టె బయటకు తీద్దామని నిర్ణయించుకున్నారు. సమాధి తవ్వడం కోసం మాఊరు పాలెంవాల్లను కబురుపెటి ్టపిలిచారు. చివరికి సమాధి తవ్వాలని వాల్లందరూ నిర్ణయించుకున్నట్టు తెలపడంతో ఇకలాల్బాష చిన్నభార్య ఏదో సముద్ర ఉప్పెనలా రోదించింది. వద్దనిబతిమాలింది. పరిగెత్తికెళ్ళి లాల్బాష పెద్దభార్య కాళ్ళ మీద పడింది. అక్కడ మెజారిటీజనాలు డబ్బులు రాబట్టుకోవడం కోసమే ఉన్నారు కాబట్టి ఆమె రోదనకు తగిన మద్దతు లేకుండాపోయింది. పాలేంవాళ్ళువచ్చారు. అందరూ స్మశానానికివెళ్ళారు.వాళ్ళు సమాధి తవ్వి ట్రంకుపెట్టె బయటకుతీసారు. ఎవరో ఆత్రంగా ట్రంకు పెట్టె ఓపెన్చేసి చూస్తే ఒక కట్టపేపర్లు కనిపించాయి.లాల్బాష ప్లాన్దొరకడంతో గబాల్న పేపర్కట్ట విప్పిచూసారు. అన్నీ తెల్లకాగితాలే !లాల్బాష చిన్నభార్య ఒక్కఉదుటునవెళ్ళి ఆపేపర్కట్టవిప్పిన వాడిచొక్కాపట్టుకుని ‘ఒరేయ్‌! నాబట్ట! సచ్చిన కూడ ఇడ్సలె కద్రామీరు?! సచ్చేముందు రెండునెల్లనుండి ఇంతకూడబెట్టుకున్న మనశ్శాంతి కూడా వాయనకి లేకుండ లాక్కుంట్రికదరా..ఓయప్పో సచ్చినోన్ని కూడా మల్ల సంపితిరికద్రామీరు !’’   అని కుప్పకూలిపోయింది.ఆరోజు రౌండ్‌కట్ట దగ్గర అందరు లాల్బాషప్లాను గురించే మాట్లాడుకున్నారు. అతని అసలు ప్లాన్తెలిసిన ఒకేఒక్కవ్యక్తి ఆరాత్రి రౌండ్‌కట్ట బల్బువెలుగులోజీవచ్చవంలాఉంది. మరుసటిరోజుపొద్దున వరకు మాఇంట్లో మాఆవిడ, మాఅబ్బాయి ఇద్దరు ఇంచుమించు మౌనంగానేఉన్నారు. మరుసటిరోజు బ్రేక్‌ఫాస్ట్‌ టేబుల్‌ దగ్గర మాఆవిడ అడిగింది‘కథ మొత్తానికి ఒకే ఒక్క డైలాగ్‌. అదికూడా ఆవిధంగా ముగిస్తు పెట్టడంలో రైటర్‌గా నీ శాడిజం కనిపిస్తుందని నాకనిపిస్తుంది’ అని బలవంతంగా విసుక్కుంది.ఇంట్లోపొద్దున్నే పనిచేసివెళ్ళిన రమీజాబీని గమనించి ఉంటే వాళ్ళిద్దరికి  అందరం కలిసున్నామనే ఈ సమాజం బతికే అవగాహనలో ఉండే శాడిజం ఏంటోతెలిసేది !
పి. విక్టర్‌ విజయ్‌కుమార్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement