ఇల్లే హరివిల్లు
గృహానికి ఎల్‌ఈడీ లైట్ల వెలుగులు
ఆకాశంలో విరిసే ఇంద్రధనుస్సు మీ ఇంట్లోనే ఉంటే.. అంతకు మించి ఆనందం, ఆహ్లాదం ఇంకేముంటుంది? సప్తవర్ణ కాంతులీనుతూ గృహం ఔరా! అని విస్తుపోయేలా ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంటిని ఎల్‌ఈడీ లైట్ల కాంతులు విరజిమ్మేలా నిర్మించుకోవడం ఓ ఫ్యాషన్. అవును.. ఇల్లంతా పరచుకున్న వె లుతురులో.. ఫర్నిచర్ లుక్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. అదే ఫర్నిచర్ వెలుగులు పంచితే ఎలా ఉంటుందో ఊహించండి. చీకట్లో ఆ సామగ్రి వెలుగులు అద్భుతం అనిపిస్తుంది.రాత్రయిందంటే చాలు మీ ఇంటిని ఇంద్రధనుస్సు పరచుకున్నట్లు రంగులమయం చేసుకోవచ్చు.
ఎల్‌ఈడీ లైట్లతో మిరుమిట్లు గొలిపే ఫర్నిచర్ ఇప్పుడు మార్కెట్‌లో వెలిగిపోతోంది. ఎల్‌ఈడీ సొగసులు అద్దుకున్న హంసతూలికా తల్పం మీ పడక గదిలో కనువిందు చేస్తుంది. లివింగ్ హాల్లో ఉన్న సోఫాసెట్ సంధ్యాకాంతులు పంచుతుంది. అంతేనా మెరిసే టైల్స్ నింగిలో మెరిసే తారకలను భువికి దించుతాయి.
ఒకప్పుడు పండుగలు, పబ్బాలాకే ఇంటిని రంగు రంగుల బల్బులతో అలంకరించుకునే వారు. అలా చిన్న చిన్న బల్బులకే పరిమితమైన ఈ రంగుల కాంతులను ఇప్పుడు సోఫాలు, కుర్చీలు, డైనింగ్ టేబుల్స్, మంచం, మెట్లు, ప్లేట్లూ, గ్లాసులు, గిన్నెలు ఇలా అన్నింటిలో చొప్పించేస్తున్నారు డిజైనర్లు. ఫర్నిచర్ చాలావరకు పారదర్శకంగా ఉండే గట్టి ప్లాస్టిక్‌తో చేసినవే కాబట్టి వాటి లోపల రీచార్జబుల్ బ్యాటరీలతో వెలిగే ఎల్‌ఈడీ లైట్లను అమరుస్తారు. రకరకాల డిజైన్లు ప్రకాశవంతమైన రంగులతో పగటిపూట ఒక రకంగా రాత్రి పూట మరో రకంగా వెలుగులు విరజిమ్మటమే ఈ లైట్ల ప్రత్యేకత. ఇలాంటి ఎల్‌ఈడీ లైట్లు ఉంటే ప్రతి రోజూ పండగే. ఇంట్లో జరిగే శుభాకార్యాలకు ప్రత్యేకమైన ఏర్పాట్ల అవసరం ఉండదు.
మూడ్‌కు తగ్గ కలర్స్
కలర్స్ మన మూడ్‌ని మారుస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదంటున్నారు నిపుణులు. తెలుపు రంగు మెదడును ఉత్తేజపరుస్తుంది. నీలం ప్రశాంతతను ఇస్తుంది. ఇలా ఒక్కో రంగుది ఒక్కో ప్రత్యేకత. ఫర్నిచర్‌లో వినియోగించే రంగులు కేవలం అందం కోసమే కాదు మన మూడ్‌కు తగ్గట్టు రిమోట్ సహాయంతో కలర్స్‌ని మార్చుకునే సౌలభ్యం కూడా కల్పించాయి వాటి కంపెనీలు.ఇక గచ్చుకు ఎల్‌ఈడీలను అమర్చేటప్పుడే కస్టమర్ల టేస్ట్‌కు తగ్గట్లు లైట్లను అమరుస్తారు. నచ్చిన కలర్‌ను ఎంచుకుని ఆనందం పొందవచ్చు. మెట్ల విషయానికి వస్తే గట్టి గాజుతో చేసిన టైల్స్, వాటి అడుగున ఎల్‌ఈడీ లైట్లను అమరుస్తారు. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే.. మనం వేసే అడుగులను బట్టి లైట్స్ కూడా అంతే లయబద్ధంగా రంగులు పంచుతాయి. అడుగు తీయగానే వెలుగులు ఆగిపోతాయి.
సోలార్ వెలుగులు
ఇంటి ఆవరణలో సోలార్ ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకుంటే కరెంట్ ఆదా అవడమే కాకుండా ఇంటిని రంగులతో నింపేయొచ్చు. వీటిలో సెన్సర్ల సాయంతో పనిచేసేవి కూడా ఉన్నాయి. చీకట్లో మనం ఆ చుట్టుపక్కలకు రాగానే వాటంతట అవే వెలిగి దారి చూపిస్తాయివి. ఆరు బయట పెట్టే పూల కుండీలు, టైల్స్‌లో అమర్చిన లైట్లు పగలు సూర్యకాంతిని గ్రహించి రాత్రి పూట వెలుగులు పంచుతాయి. బాత్‌టబ్‌లు, ప్యాన్లు.. ఇలా ఒక్కటేమిటి ఇంట్లోని ప్రతి వస్తువులకు ఎల్‌ఈడీ లైట్లను అమరుస్తున్నారు డిజైనర్లు. మీ రిక్వైర్‌మెంట్‌ను బట్టి చార్జెస్ ఉంటాయి. ఈ వెలుగులు మీకు కావాలంటే జంట నగరాల్లోని లెడ్ లైట్స్ షోరూమ్స్‌ని లేదా ఇంటీరియర్ డిజైనర్స్‌ని సంప్రదిస్తే మీ గృహసీమని రంగులమయం చేసుకోవచ్చు. చీకటికి వన్నెలద్దుతున్న ఈ కొత్త ట్రెండ్ భలేగా ఉంది కదూ.
..:: విజయారెడ్డి
ఫర్నిచర్‌లో ఎల్‌ఈడీ లైట్లను అమర్చుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఒక ట్రెండ్‌గా మారింది. వీటిని అమర్చుకోవడానికి చదరపు అడుగుకు కనీసం 1200 రూపాయలు ఖర్చవుతుంది. విద్యుత్ గురించి భయపడాల్సిన పని లేదు. కరెంట్‌ను ఆదా చేసే చాలా రకాలు మార్కెట్లో ఉన్నాయి. ఒక్కసారి ఖర్చు చేస్తే చాలు జీవితాంతం మన్నికగా ఉంటాయి.
- మాధురి, ఇంటీరియర్ డిజై నర్, లకోటియా ఇన్‌స్టిట్యూట్