వర్చువల్ సదస్సులో మాట్లాడుతున్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్. చిత్రంలో సీఎం జగన్ తదితరులు
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయ విధానాల వైపు మళ్లిన రైతన్నను దేశానికి గొప్ప సేవకుడిగా భావించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సేంద్రీయ సేద్యంపై రైతులను ప్రోత్సహిస్తూ ఒక విధానాన్ని తేవాలని నీతి ఆయోగ్‌ను కోరారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల వల్ల రసాయన ఎరువుల సబ్సిడీ భారం తగ్గుతుందన్నారు. ఇలాంటి విధానాలను అనుసరించే అన్నదాతలకు రివార్డులు అందచేసే విధానం తేవాలని సూచించారు. సహజ, ప్రకృతి వ్యవసాయ విధానాలపై నీతి ఆయోగ్ సోమవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వర్చువల్ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై జాతీయ స్థాయిలో దృష్టి పెట్టాల్సిన పలు కీలక అంశాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తావించారు. ఆ వివరాలివీ..
ఆర్థిక సంఘం సిఫార్సుల్లో వెయిటేజీ
ప్రకృతి వ్యవసాయంపై నీతి ఆయోగ్ జాతీయ స్థాయి సదస్సు నిర్వహించడం ప్రశంసనీయం. హరిత విప్లవం వల్ల వ్యవసాయ రంగంలో భారీ దిగుబడులు సాధించాం. రసాయన ఎరువులు, విషపూరిత పురుగు మందులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజానికి నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించాలి. పెద్ద మొత్తం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సిఫార్సుల్లో వెయిటేజీ ఇవ్వాలి. కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పుల నివారణ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ రాష్ట్రాలు దేశానికి సహాయకారిగా నిలుస్తున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయ ధృవీకరణ పద్ధతులు స్నేహపూర్వకంగా ఉండాలి. ప్రతి రైతుకు అందుబాటులో ఉండాలి.
90 శాతం నిధులివ్వాలి
ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లే రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం ఉదారంగా వ్యవహరించాలి. నిధుల కేటాయింపులో భిన్నమైన విధానాలు ఉండాలి. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు ప్రస్తుతం 60 శాతం నిధులిస్తుండగా భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రకృతి సేద్యాన్ని అనుసరించే రాష్ట్రాలకు 90 శాతం నిధులివ్వాలి. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించే ఖర్చుతో పోలిస్తే రసాయన ఎరువుల సబ్సిడీ కోసం వెచ్చించే ఖర్చు చాలా ఎక్కువ.
వ్యవసాయ వర్శిటీల్లో పాఠ్యాంశాలు
ప్రకృతి సాగు విధానాలపై వ్యవసాయ యూనివర్సిటీ కోర్సుల్లో పాఠ్యాంశాలను పొందుపరచి వ్యవస్థీకృత పరిశోధనలు కొనసాగాలి. సహజ ఉత్పత్తులు, రసాయనాల ద్వారా పండించిన పంటల మధ్య వ్యత్యాసం, ఆరోగ్యంపై ప్రభావాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి.
రసాయన ఉత్పత్తులను విడనాడాలి
రసాయన ఎరువులు, పురుగు మందుల ప్రభావం ఉన్న ఆహారాన్ని ఉత్పత్తులను విడనాడి ప్రజలందరికీ ఆహార భద్రత, పౌష్టికాహారాన్ని అందించాలి. ప్రకృతి వ్యవసాయ విధానాల్లో నేల పునరుత్పత్తి ప్రక్రియ అన్నిటికంటే ముఖ్యం. నీటి పరిరక్షణ, పర్యావరణ హితం మనం లక్ష్యం కావాలి. భవిష్యత్తు తరాలకు కూడా ఆరోగ్యకరమైన జీవితం, చక్కటి జీవనోపాధి అందించేలా ‘సతత హరిత విప్లవం’ (ఎవర్‌గ్రీన్ రివల్యూషన్) దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.
సమున్నత లక్ష్యాలు
2021–22లో ఆంధ్రప్రదేశ్‌లో 6.3 లక్షల మంది రైతులు 2.9 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించారు. 3,009 రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఈ కార్యక్రమం అమలవుతోంది. రాష్ట్రంలోని సాగు భూమిలో దాదాపు 5 శాతం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం జరుగుతోంది. రైతులు తాము సాగు చేస్తున్న భూమిలో ఇప్పటికిప్పుడే రసాయన ఎరువులు, పురుగు మందులను పూర్తిగా వదిలేయమని చెప్పడం లేదు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి క్రమంగా, సజావుగా ప్రకృతి వ్యవసాయం దిశగా మళ్లేగా ప్రభుత్వం సహకారం అందిస్తోంది. పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాలను అమలు చేసేందుకు రైతుకు కనీసం 3 నుంచి 5 ఏళ్లు పడుతుంది కాబట్టి సుస్థిర విధానాల ద్వారా జీవనోపాధి మెరుగుపరిచేలా ప్రభుత్వం అండగా నిలుస్తోంది.
ఇష్టపూర్వకంగా... స్వచ్ఛందంగా
రసాయన ఎరువులు, పురుగు మందులతో గత 30–50 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న రైతన్నలు వాటిని విడనాడి పూర్తిగా ప్రకృతి పద్ధతుల్లో సేద్యం చేయడం అంత సులభమైన పనికాదు. ఇప్పటికిప్పుడు అలా చేయాలని కూడా మనం కోరలేం. కానీ ప్రకృతి సాగు విధానాల వైపు మళ్లడం అత్యంత ఆవశక్యం. సాంకేతిక సంస్థలు, శాస్త్రవేత్తల సహకారంతో దశలవారీగా అడుగులు వేయాలి. ఈ ప్రక్రియ మొత్తం ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా జరగాలి.
ప్రకృతి సాగుకు జర్మనీ సహకారం
మన రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని భారీ ఎత్తున చేపట్టేందుకు, ప్రకృతి సాగు విధానాలను మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం నిధులు ఇచ్చేందుకు జర్మనీ ముందుకు వచ్చిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. ఈ ప్రాజెక్టుకు అనుమతులు చివరి దశలో ఉన్నాయి. ఐదేళ్లలో 20 మిలియన్ యూరోల ఆర్థిక సాయం అందించేందుకు జర్మనీ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ నిధులతో ఇండో–జర్మనీ గ్లోబల్ అకాడమీ ఆన్ ఆగ్రో ఇకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ (ఐజీజీఏఏఆర్‌ఎల్) సంస్థను ఏపీలో ఏర్పాటు చేయనుంది. ప్రకృతి వ్యవసాయంలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అనుసరించేలా ఐజీజీఏఏఆర్‌ఎల్ కృషి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దీని కోసం భూములు, భవనాలను సమకూరుస్తుంది. మా ప్రయత్నాలకు సహకరిస్తున్నందుకు నీతిఆయోగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎఫ్‌ఏఓ, యు.ఎన్.ఇ.పి, ఐసీఆర్‌ఏఎఫ్, యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్, యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బరో, సీఐఆర్‌ఏడీ (ఫ్రాన్స్), జీఐజెడ్, కె ఎఫ్ డబ్ల్యూ లాంటి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం, ఆర్బీకేల స్థాయిలో ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ప్రకృతి వ్యవసాయాన్ని నిర్మాణాత్మంగా విస్తరించడంలో ఎంతో కీలకం.
మూడేళ్లుగా సానుకూలత
గత మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్రంలో చాలా సానుకూల పరిస్థితి ఉందని వెల్లడవుతోంది. పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుత సగటు దిగుబడులతో సమానంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఉంటున్నాయి. వరదలు, కరువు, చీడపీడలను సమర్థంగా తట్టుకుంటున్నట్లు స్వతంత్ర పరిశోధనల ద్వారా వెల్లడవుతోంది. జీవ వైవిధ్యంతోపాటు మంచి పౌష్టికాహారం లభిస్తోందని, ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
– సీఎం జగన్
ఆర్బీకేలు.. అద్భుతం
ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా కేంద్రాల సేవలు బాగున్నాయి. వాటి పనితీరును స్వయంగా పరిశీలించి చెబుతున్నాను. ప్రకృతి వ్యవసాయ విధానాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆచరణలోకి తెచ్చింది. సీఎం జగన్ అద్భుతమైన చర్యలు తీసుకున్నారు.
– డాక్టర్ రాజీవ్ కుమార్,నీతి ఆయోగ్ వైస్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment