సచివాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు
సాక్షి, అమరావతి: వారసత్వంగా వచ్చిన కొన్ని సమస్యలతో రాష్ట్రం బాధపడుతోందని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు తగ్గకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఓటాన్ అకౌంట్ అయినప్పటికీ గత ప్రభుత్వం రూ. 2.27 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిందని, తాము అధికారంలోకి వచ్చాక బడ్జెట్‌ను అంతే ఉంచి అంతర్గతంగా కొన్ని మార్పులు చేశామని ముఖ్యమంత్రి వివరించారు. నాలుగు రకాలుగా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, రాష్ట్ర రెవెన్యూ నుంచి వచ్చే ఆదాయం ఒకటైతే కేంద్రం పన్నుల నుంచి వచ్చే వాటా మరొకటన్నారు. ఒక విధానం ప్రకారం కేంద్ర పన్నుల నుంచి వాటా వస్తుందని, రుణాల విషయంలో కూడా ద్రవ్యజవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితులున్నాయని, ఈ నేపథ్యంలో కేంద్ర నుంచి గ్రాంట్లు తగ్గకుండా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. శుక్రవారం సచివాలయంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందంతో ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర అధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రంగాల వారీగా రాష్ట్రం పరిస్థితిని అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
44,000కిపైగా స్కూళ్లను మెరుగుపరుస్తున్నాం
ఏపీలో నిరక్షరాస్యతను అధిగమించేందుకు బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ నీతి ఆయోగ్ బృందానికి తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 44 వేలకు పైగా స్కూళ్లను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని, మొదటి దశలో 15 వేల స్కూళ్లలో తొమ్మిది రకాల కనీస సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నామని, ఆపై వచ్చే సంవత్సరం 9, 10వ తరగతుల్లో ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెడుతున్నామని సీఎం తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజుల వల్ల చాలామంది పేదలు పిల్లలను స్కూళ్లకు పంపించలేకపోతున్నారని, ఈ నేపథ్యంలో చక్కటి సౌకర్యాలతో నాణ్యమైన విద్యను ప్రభుత్వ స్కూళ్లలో అందించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టామని చెప్పారు.
పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించేందుకు ఏటా రూ.15 వేల చొప్పున ఇవ్వనున్నామని, జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకం ద్వారా దీన్ని అమలు చేయనున్నట్లు వివరించారు. మొదట పేదల కడుపు నింపితే పిల్లలను స్కూళ్లకు పంపటంపై దృష్టి పెడతారని, నిరక్షరాస్యతను సున్నా స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ ‘‘అమ్మ ఒడి’’ పథకాన్ని స్పాన్సర్ చేస్తే దేశానికి మోడల్‌గా నిలుస్తుందని నీతి ఆయోగ్‌కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇంటింటికీ తాగునీటి కోసం వాటర్ గ్రిడ్
పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. ఆహార లోపం ఒకటైతే పారిశుధ్యం, తాగునీరు, అనారోగ్య వాతావరణం మరో కారణమని, వీటిని నివారించడానికి అన్ని చర్యలూ చేపడుతున్నామన్నారు. పరిశుభ్రమైన తాగునీటిని ప్రతి ఇంటికీ అందించడానికి వాటర్‌గ్రిడ్ తెస్తున్నామని సీఎం తెలిపారు. గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో రక్తహీనత అధికంగా ఉందని, అంగన్‌వాడీల ద్వారా మధ్యాహ్న భోజనం కింద ఇస్తున్న ఆహారం నాణ్యతను బాగా పెంచుతున్నామని, ఇప్పటికే పంపిణీ చేస్తున్న బియ్యంలో నాణ్యత పెంచామని సీఎం పేర్కొన్నారు.
ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు
ఆరోగ్య రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ఆరోగ్యంపై ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని జబ్బులను చేరుస్తున్నామని, దీన్ని డిసెంబర్‌లో పశ్చిమ గోదావరి జిల్లాలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నామని సీఎం చెప్పారు. డెంగీ, మలేరియాను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రులన్నీ జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని, స్కూళ్లు, ఆస్పత్రులు విషయంలో శరవేగంగా ముందుకు వెళ్తున్నామని సీఎం స్పష్టం చేశారు. నాడు – నేడు కింద వీటిని అభివృద్ధి చేస్తున్నామని సీఎం చెప్పారు.
రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేలా వీటిని తయారు చేస్తున్నామని, తద్వారా ప్రజలకు వైద్య చికిత్స ఖర్చులు తగ్గిస్తున్నామని సీఎం వివరించారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా పది చొప్పున ఉద్యోగాలు కల్పించామన్నారు. ఆక్వా కల్చర్‌లో నాణ్యమైన ఉత్పాదనల కోసం అత్యుత్తమ విధానాలను అనుసరించే ప్రయత్నాలు చేస్తున్నామని, కొత్తగా ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, మేకపాటి గౌతమ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాములుతోపాటు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment