నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌ను సత్కరించి జ్ఞాపిక బహూకరిస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని రీతిలో వినూత్న ఆలోచనలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ చర్యలు తీసుకున్నారని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు అభినందనీయం, ఆదర్శప్రాయమన్నారు. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఈ విషయంలో తనకు బాగా నమ్మకం ఉందని చెప్పారు. అన్ని రంగాలలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని, ఇందుకు అవసరమైన సామర్ధ్యం, శక్తి రాష్ట్రానికి ఉందని తెలిపారు. డాక్టర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన నీతి ఆయోగ్ బృందం బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్, ఉన్నతాధికారులతో సమావేశమైంది. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ కె.రాజేశ్వరరావు (స్పెషల్ సెక్రటరీ), డాక్టర్ నీలం పటేల్ (సీనియర్ అడ్వైజర్), సీహెచ్.పి.సారధి రెడ్డి (అడ్వైజర్), అవినాష్‌మిశ్రా (అడ్వైజర్) తదితరులు ఇందులో పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో పర్యటించి చెబుతున్నా..
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేపట్టారని, డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ అభినందించారు. అభివృద్ధి కార్యక్రమాలు, వినూత్న చర్యలను క్షేత్రస్థాయి పర్యటనలో తాను స్వయంగా చూడటమే కాకుండా గణాంకాలను కూడా సేకరించానని వివరించారు. ప్రజా సంక్షేమం కోసం పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశంసించారు. సమాఖ్య స్ఫూర్తిలో భాగంగా తాము అన్ని రాష్ట్రాలకు వెళ్లి విజన్, అభివృద్ధిపై పరస్పరం ఆలోచనలు పంచుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టే ప్రతి పనిలోనూ నీతి ఆయోగ్ అండగా నిలుస్తుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాయని హామీ ఇచ్చారు. రాజీవ్‌కుమార్ ఇంకా ఏమన్నారంటే..
ఇతర రాష్ట్రాలూ అనుసరించాలి...
► గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు, వ్యవసాయానికి తోడ్పాటు, రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ, వికేంద్రీకరణ చర్యలు బాగున్నాయి.
► రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఎల్లవేళలా తోడుగా నిలుస్తోంది. వారి రక్షణ కోసం దిశ యాప్ రూపొందించడం అభినందనీయం. దీన్ని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచిస్తున్నాం.
► కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేయడం ఎంతో ఉదాత్త నిర్ణయం. దీన్ని కూడా ఇతర రాష్ట్రాలు అమలు చేయాలని కోరతాం.
► సీఎం జగన్ ప్రజా సంక్షేమం కోసం పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఫలాలను అందజేస్తున్నారు. ఇది అభినందనీయం.
► రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే చేపట్టారు. దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంది. దీర్ఘకాలిక భూ వివాదాలన్నీ పరిష్కారమవుతాయి.
► ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభతర వాణిజ్యం)లో కూడా మీరు ముందున్నారు. ఇది ప్రశంసనీయం.
► కోస్టల్ ఎకనామిక్ జోన్స్, ఎగుమతులు తదితర రంగాల్లో ఏపీ వృద్ధికి సహాయపడతాం. మౌలిక సదుపాయాలు కల్పన తదితర అంశాల్లో రాష్ట్రానికి చేయూతనిస్తాం.
► సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాగా చేస్తోంది.
► వ్యవసాయ రంగంలో రాష్ట్రం బాగా రాణిస్తోంది. ముఖ్యంగా ప్రకృతి సేద్యం, ఉద్యాన పంటల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.
► రెవెన్యూ లోటు పూడ్చడం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం.. వీటన్నింటి కోసం ప్రయత్నిస్తాం. విభజన వల్ల హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడంతో ఆంధ్రప్రదేశ్ ఆదాయం తగ్గిందన్న విషయం మాకు తెలుసు.
► పోలవరం ఎత్తుకు సంబంధించి మరోసారి సమగ్ర అధ్యయనం చేస్తే బాగుంటుంది. తద్వారా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో మార్పులు వస్తాయి.
► మీకు విశాల తీర ప్రాంతం ఉంది. వాటిలో ఎకనామిక్ జోన్లు, పారిశ్రామిక జోన్ల ఏర్పాటు ముఖ్యం.
► పర్యాటక రంగం వల్ల కూడా ఆదాయం వస్తుంది.
► అంగన్‌వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం ఇస్తున్నారు. ఇది ప్రశంసనీయం. దీనివల్ల పిల్లల్లో పౌష్టికాహార లోపం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment